నేపాల్: విమానం కూలిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకోవడం ఎలా

కూలిన విమానం

ఫొటో సోర్స్, CHARLES MWEBEYA TBC

    • రచయిత, మయాంక్ భగవత్
    • హోదా, బీబీసీ మరాఠీ

నేపాల్‌లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 70 మృతదేహాలు లభ్యమయ్యాయి.

విమానంలో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు సహా మొత్తం 72 మంది ఉన్నారు. ఈ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.

ఈ నెల 15న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు విమానంలోని బ్లాక్ బాక్స్‌ను అధికారులు విశ్లేషిస్తున్నారు.

బ్లాక్ బాక్స్

ఫొటో సోర్స్, Getty Images

బ్లాక్‌బాక్స్ అంటే ఏమిటి?

డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లను వాడుక భాషలో 'బ్లాక్‌ బాక్స్‌' అంటారు.

విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు మొత్తం ప్రయాణంలో సాంకేతిక సమాచారం, పైలట్ల మధ్య సంభాషణల డేటా ఇందులో రికార్డ్ అవుతుంది.

ముంబైకి చెందిన పైలట్ అమోల్ యాదవ్ బీబీసీతో మాట్లాడుతూ "విమానంలోని ప్రతి పరికరం సమాచారం డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్‌లో నిక్షిప్తం అవుతుంది" అన్నారు.

విమానం లేదా హెలికాప్టర్ పడిపోతే బ్లాక్‌బాక్స్ సాయంతో దర్యాప్తు అధికారులు విమాణ ప్రయాణంలో జరిగిన ఘటనలు తెలుసుకుంటారు. ప్రమాదానికి ఏదైనా సాంకేతిక కారణం ఉందా? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

సరిగ్గా ఏం జరిగిందనే దాని గురించి ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. బ్లాక్‌బాక్స్ అనేది ఎలక్ట్రానిక్ పరికరం. విమానం క్రాష్ అయితే వెనుకభాగం తక్కువ డ్యామేజ్ అవుతుంది. అందుకే బ్లాక్‌బాక్స్ వెనుకభాగంలో బిగిస్తారని నిపుణులు చెబుతున్నారు.

బ్లాక్ బాక్స్

ఫొటో సోర్స్, Getty Images

బ్లాక్‌బాక్స్ నల్లగా ఉంటుందా?

బ్లాక్‌బాక్స్ నిజానికి నలుపు కాదు. నారింజ రంగులో ఉంటుంది. దీంతో విమాన ప్రమాదం జరిగిన తర్వాత దర్యాప్తు అధికారులు సులభంగా గుర్తించవచ్చు.

రిటైర్డ్ ఫైటర్ పైలట్, ఏవియేషన్ నిపుణుడు విపూల్ సక్సేనా మాట్లాడుతూ " వాతావరణం సరిగా లేకున్నా లేదా ఇతర పరిస్థితులలో ఆరెంజ్ రంగును సులభంగా చూడవచ్చు. అందుకే బ్లాక్‌బాక్స్ రంగును నారింజ రంగులో ఉంచుతారు" అని స్పష్టంచేశారు.

''బ్లాక్‌బాక్స్ షూ బాక్స్ పరిమాణంలో ఉంటుంది. దాని లోపలి భాగంలో థర్మల్ బ్లాక్ ఉంటుంది. అందులో మెమొరీ బోర్డులను ఉంచుతారు''అని నిపుణులు చెబుతున్నారు.

విమానం గురించిన మొత్తం సమాచారాన్ని బ్లాక్‌బాక్స్ నిల్వ చేస్తుంది.

ఇది రెండు ముఖ్యమైన భాగాలను కలిగి ఉంటుంది.

1.ఫ్లైట్ డేటా రికార్డర్

2. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్

విమానం సాంకేతిక సమాచారం ఫ్లైట్ డేటా రికార్డర్‌లో నిల్వ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

వాతావరణం, విమానం వేగం, ఇంధన స్థాయి, ఆటో-పైలట్ స్థితి, విమానం ఎత్తు, దిశ వంటి సమాచారాన్ని ఇది నిల్వ చేస్తుంది.

బ్లాక్‌బాక్స్ 25 గంటల రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

విపూల్ సక్సేనా మాట్లాడుతూ " ఏదైనా పరికరం అకస్మాత్తుగా పనిచేయకపోతే ఫ్లైట్ రికార్డర్ అక్కడి వాతావరణం, ఒత్తిడి, విమానం వేగాన్ని రికార్డ్ చేస్తుంది" అని తెలిపారు.

కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ విమానం ధ్వనిని రికార్డ్ చేస్తుంది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో పైలట్ సంభాషణ రికార్డ్ అవుతుంది. ఇది రెండు గంటలపాటు నమోదవుతుంది.

సాంకేతిక లోపం, మానవ తప్పిదం లేదా ఇతర కారణాల వల్ల విమానం కూలిపోయిందా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులకు ఇది ఉపయోగపడుతుంది.

నేపాల్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

బ్లాక్‌బాక్స్ సురక్షితంగా ఉంటుందా?

బ్లాక్‌బాక్స్ భద్రత చాలా ముఖ్యం. ఎందుకంటే విమాన ప్రమాదం తర్వాత బాక్స్ సాయంతో మాత్రమే ఘటన గురించి సమాచారాన్ని పొందవచ్చు.

దీని గురించి పైలట్ అమోల్ యాదవ్ మాట్లాడుతూ "బ్లాక్ బాక్స్‌లోని రికార్డింగ్ టేపులు దెబ్బతినకుండా లేదా కాలిపోకుండా బాక్స్ కవర్ చాలా బలంగా ఉంటుంది" అన్నారు బ్లాక్‌బాక్స్ సురక్షితంగా ఉండటానికి దాన్ని స్టీల్ లేదా టైటానియంతో తయారు చేస్తారు. బ్లాక్‌బాక్స్ 1,000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఒక గంట వరకు సురక్షితంగా ఉంటుంది.

ఇది సముద్రపు ఉప్పు నీటిలో లేదా 6,000 మీటర్ల లోతు వరకు ఉన్న ఇతర ప్రదేశాలలోనూ చెడిపోదు.

విమానం సముద్రంలో కూలినా దానిని గుర్తించడానికి సిగ్నల్ ఇచ్చే ఏర్పాటు బ్లాక్ బాక్స్‌లో ఉంటుంది.

టెస్టింగ్ దశలోనే బ్లాక్ బాక్స్‌ను గంటకు 750 కి.మీ. వేగంతో కాంక్రీట్ గోడకు ఢీ కొట్టిస్తారు. 2.5 టన్నుల బరువును 5 నిమిషాల పాటు బాక్స్ మీద ఉంచుతారు.

బ్లాక్ బాక్స్

ఫొటో సోర్స్, Getty Images

బ్లాక్‌బాక్స్ నుంచి సమాచారం ఎలా సేకరిస్తారు?

విమానం బ్లాక్‌బాక్స్ దొరికిన తర్వాత దానిని ముందుగా లేబొరేటరీకి పంపుతారు.

ఫ్లైట్ స్టోర్ డేటా, పైలట్‌ల మధ్య సంభాషణల నుంచి ప్రమాదానికి ముందు చివరి క్షణాల్లో విమానంలో సరిగ్గా ఏం జరిగింది? అనే దానిపై దర్యాప్తు అధికారులు సమాచారం సేకరిస్తారు.

రిటైర్డ్ ఫైటర్ పైలట్, ఏవియేషన్ నిపుణుడు విపూల్ సక్సేనా మాట్లాడుతూ "ప్రమాదం తరువాత, టెక్నికల్, ఆపరేషన్ బృందాలు దానిని అధ్యయనం చేస్తాయి.

బ్లాక్‌బాక్స్ డేటాను రీడర్ ద్వారా అనువదిస్తారు. సమాచారం అధ్యయనం చేసిన తర్వాత, విమానానికి ఏం జరిగిందనేది తెలుసుకుంటారు.

బ్లాక్‌బాక్స్ నుంచి లభించిన సమాచారం ఆధారంగా పరిశోధకులు విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందనేది సీన్ రీక్రియేట్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఏదైనా సమస్య గుర్తిస్తే చెక్ చేస్తారు’ అని తెలిపారు.

బ్లాక్‌బాక్స్‌ను ఎవరు కనిపెట్టారు?

డేవిడ్ వారెన్ అనే పరిశోధకుడు మొదటిసారిగా బ్లాక్‌బాక్స్‌ను కనిపెట్టారని ఆస్ట్రేలియన్ రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది.

ఆస్ట్రేలియాలోని ఏరోనాటికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో వారెన్ పరిశోధకుడు. 1950‌లో విమాన ప్రమాదం జరిగిన దర్యాప్తులో పాల్గొన్నారు వారెన్.

ఆ సమయంలో విమానంలో ప్రమాదానికి ముందు ఏం జరిగిందనేది దాని గురించి సమాచారం పొందితే బాగుంటుందనే కోణంలో వారెన్ పరిశోధన ప్రారంభించారు.

1960లో ఆస్ట్రేలియాలోని విమానానికి మొట్టమొదటి బ్లాక్‌బాక్స్‌ బిగించారు. ఇండియా 2005 నుంచి విమానాల్లో బ్లాక్‌బాక్స్‌లు ఉండటం తప్పనిసరి చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)