South China Sea: చైనా పైలట్ నిర్లక్ష్యం - పక్క విమానం ఇంజిన్‌లోకి చొచ్చుకెళ్లిన అల్యూమినియం ముక్కలు

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ చైనా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న తమ విమానానికి అతి సమీపంలో ప్రమాదకరమైన విన్యాసాన్ని ప్రదర్శించారని చైనా ఫైటర్ జెట్‌కు చెందిన ఒక పైలట్‌పై ఆస్ట్రేలియా ఆరోపణలు చేసింది.
చైనీస్ విమానం తమ నిఘా విమానం ముందు నుంచి వెళ్తూ ఒక్కసారి నిప్పులు వెదజల్లిందని ఆస్ట్రేలియా ఆరోపించింది.
ఈ విమానం 'చాఫ్' అనే యాంటీ రాడార్ డివైస్‌ను విడుదల చేయడం వల్ల వెలువడిన మంటలు, అందులో చిన్నచిన్న అల్యూమినియం ముక్కలు ఆస్ట్రేలియా విమానం ఇంజన్‌లోకి చొచ్చుకెళ్లాయని తెలిపింది.
''సముద్రతీరంలో నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా పహారా కాస్తున్న రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్ పీ-8 నిఘా విమానాన్ని మే 26న చైనాకు చెందిన జె-16 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ అడ్డుకుంది'' అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్ చెప్పారు.
''ఒక ప్రమాదకరమైన విన్యాసం కారణంగా ఇలా జరిగింది. ఇది పీ-8 విమానానికి, అందులోని సిబ్బంది భద్రతకు ముప్పు కలిగించింది'' అని ఆయన అన్నారు.
''చైనీస్ జెట్, ఆస్ట్రేలియా విమానం ముందు నుంచి అతి దగ్గరగా వెళ్లింది. అంతేకాకుండా అల్యూమినియం ముక్కలతో కూడిన చాఫ్‌ను విడుదల చేసింది. అవి ఆస్ట్రేలియా విమానం ఇంజిన్‌లోకి చొచ్చుకెళ్లాయి. ఇది చాలా ప్రమాదకరమైనది'' అని ఏబీసీ టెలివిజన్‌తో రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ తెలిపారు.
దీనిపై ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది.
" ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సముద్ర నిఘా కార్యకలాపాలను చేపట్టాం. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలాలు, గగనతలంలో నావిగేషన్ చేసే స్వేచ్ఛను ఉపయోగించుకునే హక్కు మాకు ఉంది'' అని ఒక ప్రకటనలో ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ ఘటనపై బీజింగ్ ఇంకా స్పందించలేదు. చైనా కొన్నేళ్లుగా అక్కడ సైనిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు, అగ్నికీలలు.. 40 మందికి పైగా మృతి, గాయపడినవారితో నిండిపోయిన ఆసుపత్రులు
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











