Vande Bharat Sleeper: పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. వేగం, ఛార్జీ, పూర్తి వివరాలివే..

వందే భారత్ స్లీపర్ రైలు

ఫొటో సోర్స్, IR

ఫొటో క్యాప్షన్, మొదటి వందే భారత్ స్లీపర్ రైలు కామఖ్య (గువాహటి), హౌరాల మధ్య నడుస్తోంది.
    • రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వందే భారత్ స్లీపర్ ట్రైన్ భారతీయ రైల్వేలో చేరింది. ఇది కామాఖ్య, హౌరాల మధ్య నడుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మొదటి వందే భారత్ స్లీపర్ రైలును మాల్డా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఈ రైలును పరిగణిస్తున్నారు. మునుపటి వందే భారత్ రైళ్లు సీటింగ్(కూర్చుని వెళ్లే) ప్రయాణాన్ని మాత్రమే అందించాయి.

వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసును 2020లోనే ప్రారంభించాలని అనుకున్నారు, దానికి అదే ఏడాదిని సూచించేలా T-20 అనే పేరు కూడా పెట్టారు. అయితే, ఆరేళ్ల తర్వాత ఈ రైలు పట్టాలపైకి వచ్చింది.

T-18, T-20 కాన్సెప్ట్, మోడల్స్‌ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) అభివృద్ధి చేసింది. ఈ రైళ్లలో ఒకటి 2019 ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (డే ట్రైన్, సీటింగ్)గా ప్రారంభమైంది.

మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కలుపుతోంది. యాదృచ్ఛికంగా, ఈ రెండు రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ రైలు గురించి నెటిజన్లు గూగుల్‌లో వెతికారు. వాటికి సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వందే భారత్ స్లీపర్ రైలు, కామఖ్య, హౌరా

ఫొటో సోర్స్, IR

ఫొటో క్యాప్షన్, పీఐబీ ప్రకారం, ఈ రైలు కేవలం 52 సెకన్లలో గంటకు సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఈ రైలు వేగం ఎంత?

హౌరా, కామఖ్య మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు దాదాపు 3 గంటల సమయం ఆదా చేస్తుంది.

రైలు గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. అయినప్పటికీ, ట్రాక్ సామర్థ్యానికి అనుగుణంగా వేగం ఉంటుంది. ఈ మార్గంలో రైలు వేగం దాని డిజైన్ స్పీడ్ కంటే తక్కువగా ఉంటుందని అంచనా.

పీఐబీ ప్రకారం, ఈ రైలు కేవలం 52 సెకన్లలో గంటకు సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఈ రైలు మొదటి ప్రయాణం గురించి నార్త్ ఫ్రాంటియర్ రైల్వే బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం, ఈ రైలు జనవరి 17న మధ్యాహ్నం 1:15 గంటలకు కామఖ్య నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:55 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఈ రైలు వేగం గంటకు 65 కిలోమీటర్లుగా ఉంటుంది.

వందే భారత్ స్లీపర్ రైలు, కామఖ్య, హౌరా

ఫొటో సోర్స్, IR

ఎంత దూరం?

గువాహటి, హౌరాల మధ్య రైలు మార్గం దాదాపు 1,000 కిలోమీటర్లు.

అయితే, వందే భారత్ రైలు గువాహటిలోని కామఖ్య స్టేషన్ నుంచి బయలుదేరి హౌరాకు దాదాపు 958 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ట్రైన్ వేళలు..

ఈ రైలు వారానికి ఆరు రోజులు రెండు దిశల(కామఖ్య, హౌరా)లో నడుస్తుంది. ఇది బుధవారం మినహా ప్రతిరోజూ సాయంత్రం 6:15 గంటలకు కామఖ్య నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:15 గంటలకు హౌరా చేరుకుంటుంది.

అదేవిధంగా, గురువారం మినహా ప్రతిరోజూ సాయంత్రం 6:20 గంటలకు హౌరా నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు కామాఖ్య చేరుకుంటుంది.

అయితే, రైలు రోజువారీ ప్రయాణానికి సంబంధించిన నోటిఫికేషన్ కొన్నిరోజుల్లో జారీ అవుతుంది. ఆ తర్వాత ఈ రైలు సాధారణ ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది.

వందే భారత్ స్లీపర్ రైలు, కామఖ్య, హౌరా

ఫొటో సోర్స్, IR

ఈ రైలు ఛార్జీలు ఎంత?

వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీలు సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఎక్కువగా ఉంటాయి.

కామఖ్య, హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలులో త్రీ టైర్ ఏసీ(థర్డ్ ఏసీ) ఛార్జీలు రూ. 2,999 (5 శాతం జీఎస్టీ అదనం) కాగా, ఇదే మార్గంలో ప్రయాణించే సరైఘాట్ ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీ దాదాపు రూ. 2,000గా ఉంది.

ఇక, వందే భారత్ స్లీపర్ టూ టైర్ ఏసీ (సెకండ్ ఏసీ) ఛార్జీలు రూ. 2,970 (5 శాతం జీఎస్టీ అదనం)గా ఉంటే, ఇతర సాధారణ సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ఈ ఛార్జీ సుమారు రూ. 2,970గా ఉంది.

అందులోనే ఆహారం కూడా అందజేస్తారు. ఈ రైలులో కనీసం 400 కిలోమీటర్ల దూరానికి మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.

వందే భారత్ స్లీపర్ రైలు, కామఖ్య, హౌరా

ఫొటో సోర్స్, IR

టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?

ఇతర రైళ్ల మాదిరిగానే, వందే భారత్ రైళ్లకు కూడా రైలు బయలుదేరడానికి 60 రోజుల ముందు నుంచి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

వందే భారత్ స్లీపర్ రైలులో 611 థర్డ్ ఏసీ బెర్తులు, 188 సెకండ్ ఏసీ బెర్తులు, ఫస్ట ఏసీ బెర్తులు 24 ఉంటాయి. రైలులో మొత్తం 823 మంది ప్రయాణీకులకు బెర్తులు ఉంటాయి. ఈ 16 కోచ్‌ల రైలులో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు, 4 సెకండ్ ఏసీ కోచ్‌లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటాయి.

వందే భారత్ స్లీపర్ రైలు, కామఖ్య, హౌరా

ఫొటో సోర్స్, IR

ఫొటో క్యాప్షన్, వందే భారత్ స్లీపర్ రైలులో 823 మంది ప్రయాణీకులకు బెర్తులు ఉంటాయి

దేశంలో ఎన్ని వందే భారత్ రైళ్లు ఉన్నాయి?

ప్రస్తుతం, దేశంలో 164 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లు స్లీపర్ క్లాస్ రైళ్లకు భిన్నంగా ఉంటాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే సీటింగ్ ఆప్షన్లు ఉంటాయి.

దేశంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2019 ఫిబ్రవరి 15న దిల్లీ, వారణాసి మధ్య నడిచింది.

2030 నాటికి దేశంలో మొత్తం 800 వందే భారత్ రైళ్లను, 2047 నాటికి 2,400 వందే భారత్ రైళ్లను నడపాలనే ప్రణాళికలున్నాయి.

ఈసీ, సీసీ, ఎన్‌సీ అంటే ఏమిటి?

రైళ్లలో ఈసీ క్లాస్ అంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఈ తరగతి సౌకర్యవంతంగా పరిగణించే సీట్లను అందిస్తుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల వంటి సీటింగ్ సౌకర్యాలు ఉంటాయి.

సీసీ – అంటే చైర్ కార్. ఇది కూడా ఒక సీటింగ్ అమరిక, అయితే సౌకర్యం, సౌలభ్యం పరంగా ఈసీ కంటే తక్కువ.

ఎన్‌సీ – అంటే 'నో ఛాయిస్.' ఉదాహరణకు, మీరు రైలు టికెట్ బుక్ చేసుకుంటుంటే, మీరు ఏ బెర్త్‌ను కావాలనుకుంటారో మిమ్మల్ని అడుగుతుంది. అలాంటి సందర్భంలో, మీకు ఎన్‌సీ ఆప్షన్ కూడా కనిపించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)