హనీఫ్ బ్లాగ్: 'అమెరికా అధ్యక్షుడు రేపు ఎక్కడ, ఎందుకు యుద్ధం చేస్తారో అమెరికన్లకే అర్థంకాని పరిస్థితి'

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనేక యుద్ధాలను ఆపినట్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఇప్పుడు ఇజ్రాయెల్ సహకారంతో ఇరాన్‌పై దాడి చేశారు.
    • రచయిత, మొహమ్మద్ హనీఫ్
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, రచయిత
  • చదివే సమయం: 3 నిమిషాలు

గతేడాది భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇవి మూడు, నాలుగు రోజుల పాటు కొనసాగాయి. క్షిపణులు దూసుకెళ్లాయి, డ్రోన్లు ఎగిరాయి, విమానాలు కూలిపోయాయి. ఆ తర్వాత, కాల్పుల విరమణ జరిగింది.

అప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఎప్పుడు కెమెరాల ముందుకొచ్చినా.. "భారత్, పాకిస్తాన్ ఒకదానికొకటి నాశనం చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. నేనే వారి యుద్ధాన్ని ఆపాను. లేకపోతే, ఎవరికి తెలుసు, వారు అణుబాంబులను ప్రయోగించి ఈ ప్రపంచాన్ని బూడిద చేసేవారేమో" అని చెబుతుంటారు.

పాకిస్తాన్ నాయకులు కూడా ముఖం కొంత ముభావంగా పెట్టినా, "ట్రంప్ వంటి శాంతి ప్రేమికులు ఈ భూమిపైనే పుట్టలేదు. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి" అంటున్నారు.

అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు కావడానికి ముందువరకూ ట్రంప్ మాట్లాడుతూ, "అమెరికా ఇప్పటికే ఎన్నో యుద్ధాలు చేసింది. ఇకపై మేం ఇంట్లోనే కూర్చుంటాం, మా ప్రజల కోసమే పనిచేస్తాం. ఈ ప్రపంచం మొత్తాన్ని కాపాడే బాధ్యతను మేం తీసుకోబోవడంలేదు" అంటుండేవారు.

ఇప్పుడు చూడండి, ఒకట్రెండు కాదు, ఎన్నో చిన్నచిన్న ప్రపంచ యుద్ధాలను మొదలుపెట్టారు ట్రంప్.

వెనెజ్వెలా అధ్యక్షుడిని కిడ్నాపర్ల మాదిరి ఎత్తుకొచ్చారు, క్యూబా నెత్తిన కూర్చున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ మీద దాడికి దిగారు. ఖమేనీని అంతమొందించడం ద్వారా ఇరాన్‌కు విముక్తి కలిగిస్తామని అంటున్నారు.

మరోవైపు, ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో అక్కడ క్షిపణులతో దాడులు చేస్తోంది ఇరాన్. ఖతార్, యూఏఈ, బహ్రెయిన్.. ఇలా ప్రతిచోటా మిసైళ్లు ఎగురుతున్నాయి. గాజాపై దాడుల ఘటన ఇంకా మర్చిపోకముందే ఇదంతా జరుగుతోంది.

ఇదీ నోబెల్ శాంతి బహుమతి ఆశించే వ్యక్తి శాంతి. రేపు తమ అధ్యక్షుడు ఎక్కడ, ఎందుకు యుద్ధం మొదలుపెడతారో అసలు అమెరికన్లకే అర్థంకాని పరిస్థితి నెలకొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

'ప్రజాస్వామ్యంలోనూ స్వేచ్ఛ లేదు, రాచరికంలోనూ శాంతి లేదు'

అమెరికా తనను తాను అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటుంది. కానీ, ఏదైనా కొత్త యుద్ధాన్ని మొదలుపెట్టే ముందు కాంగ్రెస్‌ను అడిగే సాహసం కానీ, ఇతరుల సలహా తీసుకునే తీరిక కానీ లేదు.

అమెరికా ప్రజాస్వామ్య వాదనలన్నీ ఉత్త డ్రామా అని, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలే నయమని గతంలో కొందరు భావించేవారు. ఈ దుబయ్, రియాద్, దోహా.. ఇక్కడ ఓట్ల గోల లేదు, పార్లమెంటరీ అబద్ధాలు లేవు. ఇవన్నీ ప్రత్యక్ష రాచరిక వ్యవస్థలని చెప్పేవారు.

అక్కడ యువరాజులే ముందుండి నడిపిస్తున్నారు, చూడండి ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత ప్రశాంతత ఉందో, ఎంత శాంతియుతమైన జీవితమో అని ప్రశంసించేవారు.

భారత్ - పాకిస్తాన్ వర్కర్లకు అక్కడ ఉపాధి దొరుకుతోంది. ఎక్కువ డబ్బు ఉండి, కరాచీ, ముంబయి రద్దీతో విసిగిపోయిన వారు 'గోల్డెన్ వీసా'లు తీసుకుని, ఆస్తులు కొనుగోలు చేసి ప్రశాంతంగా బతికేస్తున్నారు.

కానీ, ఇప్పుడు వారి ప్లాజాల పైనుంచి క్షిపణులు దూసుకెళ్తున్నాయి. అక్కడి నుంచి పారిపోవడానికి వారు ప్రైవేట్ విమానాల కోసం వెతుకుతున్నారు.

మానవాళికి అమెరికా ప్రజాస్వామ్యంలోనూ స్వేచ్ఛ లేదు, ఇటు రాజుల సామ్రాజ్యాల్లోనూ శాంతి లేదు.

ఇప్పుడు ఎటెళ్లాలి? ఎక్కడ తలదాచుకోవాలి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)