ఆంధ్రప్రదేశ్: వృద్ధుల రాష్ట్రంగా మారనుందా, జనాభా పెరుగుదల సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
'ముడో బిడ్డను కంటే పాతికవేలిస్తాం' అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆసక్తికర ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాదు, ముగ్గురు పిల్లల్ని కనేవారి కోసం ఎన్నో హామీలు ప్రకటించారాయన.
మరో అడుగు ముందుకేసి ఈ ప్రతిపాదనలను, ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరాన్ని చాటి చెబుతూ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు.
మార్చి 5వ తేదీన ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ' ప్రకటించారు.
''ప్రస్తుతం రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ సగటున కనే పిల్లల సంఖ్య) 1.5 గా ఉంది. 1993లో ఇది 3.0గా నమోదైంది. టీఎఫ్ఆర్ వేగంగా తగ్గిపోతే పని చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయి ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా 6.70 లక్షల జననాలు నమోదయ్యాయి. ఇలాగే కొనసాగితే 2047 నాటికి మన జనాభాలో 23 శాతం మంది వృద్ధులు ఉంటారు'' అన్నారు సీఎం.
క్రమంగా ఆంధ్ర వృద్ధుల రాష్ట్రంగా మారిపోతుందనే ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. దాని వల్ల వచ్చే సమస్యలను కూడా ఆయన వివరించారు.
''నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయి. ఇప్పుడు ఒక్కరు వద్దు, ఇద్దరు ఒకే, ముగ్గురు ముద్దు అనే నినాదం తీసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. పేదలు, గిరిజనులు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. కానీ, దారిద్య్ర రేఖకు ఎగువున ఉన్న కుటుంబాల్లో మాత్రం ఈ పరిస్థితి కనిపించటం లేదు. చైనా ఒక్క సంతానంతో ఇప్పుడు తీవ్ర సమస్యలు ఎదుర్కోంటోంది. ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 3గా నమోదు అవుతోంది. ఏపీ జనాభా 5 కోట్లకు తగ్గకుండా నిర్వహిస్తేనే తెలుగు జాతి శక్తిమంతమైనదిగా నిలుస్తుంది. ఇప్పుడు ప్రణాళికలు చేస్తేనే వచ్చే 30-40 ఏళ్లలో సమాజంలో సుస్థిరత, సంపద, సమృద్ధి సాధ్యం'' అన్నారు చంద్రబాబు.
అలా జననాల రేటు పెంచడానికి ఏపీ ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకోవాలనుకుంటుందో కూడా వివరించారు.


ఫొటో సోర్స్, I&PR
'పోషణ-శిక్షా-సురక్ష' ప్యాకేజ్
ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ ''ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వటం ద్వారా జనాభా నిర్వహణకు మద్ధతు ఇచ్చేలా చర్యలు ప్రారంభించాం. పిల్లలు లేక, ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి సబ్సిడీపై పీపీపీ మోడల్‌లో ఐవీఎఫ్ సేవలు అందించాలని యోచిస్తున్నాం’’ అన్నారు.
‘‘మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ - తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీలో భాగంగా చైల్డ్ కేర్ టేకర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం.’’ అని చెప్పారు చంద్రబాబు.
‘‘రాష్ట్రంలో 1.5గా ఉన్న టోటల్ ఫెర్టిలిటీ రేట్‌ను 2.1కు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడో సంతానానికి 'పోషణ-శిక్షా-సురక్ష' ప్యాకేజ్ పేరిట డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదన చేస్తున్నాం. మూడో సంతానానికి 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం'' అని చంద్రబాబు ప్రకటించారు .
దీనిపై ప్రజాభిప్రాయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ అంశంపై ఎమ్మెల్యేలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలనీ, మార్పులు చేర్పులుంటే చేసి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని సీఎం చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
చాలా దేశాలలో ఈ సమస్య ఉందా?
భారత్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా జనాభా పెంచాలనే వార్తలు వస్తున్నాయి. చైనా తన జనాభా నియంత్రణ విధానాలను బాగా సడలించింది. దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ అంశంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి. ఆ దేశంలో జననాల రేటు పెంచడం కోసం ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయగా, ఇక గ్రీస్ కూడా ఈ అంశంపై చర్యలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, ప్రపంచ సగటు జననాల రేటు ఒక మహిళకు 1963లో 5.3 ఉండగా 2023లో 2.2కి తగ్గింది.
అందుకే, నిన్న మొన్నటి వరకూ 'ఒకరే ముద్దు, ఇద్దరు వద్దు' అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు 'ఇద్దరు కాదు ముగ్గురు ముద్దు' అని చెబుతున్నాయి. దానికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి దక్షిణ భారత జనాభా తగ్గిపోతే పార్లమెంటులో ప్రాతినిధ్యం, కేంద్ర నిధుల్లో వాటా తగ్గిపోవడం. రెండోది, దేశంలో మొత్తంగా యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన సమాజాల్లో కనీసంగా జననాల రేటు 2.1 గా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతారు. అంటే దీన్నే రిప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటారు. ''మరణించే వారి సంఖ్యకు సమానంగా కొత్తగా పుట్టే వారి సంఖ్య ఉండి, జనాభా పెరగకుండా లేదా తగ్గకుండా స్థిరంగా ఉండే స్థాయి'' అని అర్థం.
సరిగ్గా ఇప్పుడు ఏపీలో ఆ జననాల రేటు ఉండాల్సిన దానికంటే తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ జననాల రేటు తగ్గుదల కనిపించిందంటున్నారు నిపుణులు.
''ఈ విషయంలో కేరళ ముందుంది. ఆ తరువాత తమిళనాడు, ఏపీ, ఒడిశా, కర్ణాటకల్లో ఈ జననాల రేటు బాగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్ అత్యంత కఠినంగా దీన్ని అమలు చేసింది. డ్వాక్రా వంటి పథకాలు ఇవ్వాలన్నా ఇద్దరు పిల్లలుండాలి, ఆపరేషన్ అయిందా అని ప్రశ్నించేవారు. ప్రభుత్వం 10-15 ఏళ్ల పాటు ఈ నియంత్రణ కొనసాగించడంతో ఇక్కడ జననాల రేటు తగ్గింది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో జననాల రేటు ఇంకా ఎక్కువగానే ఉంది. క్రమంగా తగ్గుతూ వస్తుంది'' అని రిటైర్డ్ ప్రొఫెసర్, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సి. రామచంద్రయ్య అన్నారు.
ఈయన సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్, హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఐక్యరాజ్యసమితి వారి ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వారి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధుల జనాభా శాతం 2021 నాటికి 12.3 ఉండగా, అది 2036 నాటికి 19కి చేరే అవకాశం ఉంది.
2036 నాటికి ఇండియా యావరేజ్ 15 శాతంగా అంచనా వేసింది ఆ నివేదిక.
ఇక సీఎం చంద్రబాబు ప్రకటన ప్రకారం, 2047 నాటికి 23 శాతం అంటే దాదాపు నాలుగో వంతు జనాభా వృద్ధులుగా ఉంటారు.

ఫొటో సోర్స్, https://www.iipsindia.ac.in/Screen grab
ప్రాక్టికల్ సమస్యలున్నాయి: నిపుణులు
ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలపై బీబీసీ పలువురు నిపుణులు, విశ్లేషకులతో మాట్లాడింది. స్థూలంగా జననాల రేటు పెంచాలన్న అంశాన్ని అంగీకరిస్తూనే దానికి ప్రాక్టికల్ సమస్యలు చాలా ఉన్నాయని వారు చెప్పారు.
''అంతర్జాతీయ పరిస్థితులను అధ్యయనం చేస్తే ఈ డబ్బు ఇవ్వడం వల్ల కానీ, స్కీముల వల్ల కానీ ఏమీ ప్రయోజనం ఉండదని తెలుస్తోంది. ఉదాహరణకు దక్షిణ కొరియా మహిళలకు 60 వేలు ఇస్తోంది. జర్మనీ కూడా డబ్బు ఇస్తోంది. కానీ, ఉపయోగం లేదు. ఏపీలో కూడా ప్రయోజనం ఉండదు. అయితే, ఆ డబ్బు విషయాన్ని పక్కన పెడితే మిగిలిన పాలసీలు ప్రతిపాదనల వరకూ చాలా బావున్నాయి. పాపులేషన్ మేనేజ్‌మెంట్ అనే అప్రోచ్ బావుంది, మిగతా ప్రభుత్వాలు కూడా ఈ పదజాలాన్ని తీసుకోవాలి. కానీ, సమస్య పరిష్కారానికి జరగాల్సింది వేరే ఉంది'' అని ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూ్ట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్)లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫర్టిలిటీ అండ్ సోషల్ డెమొగ్రఫీలో అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి బీబీసీతో అన్నారు.
'' పిల్లల్ని కనడం, పెంచడం అనేది మహిళలకు ఒక భారంలా, ఎదుగుదలకు అడ్డంకిలా కనిపించకూడదు. మగవారు కూడా భారాన్నీ, బాధ్యతలను, పనులను పంచుకోవాలి. మదర్ హుడ్ పెనాల్టీ (మాతృత్వమే శిక్ష) అనే పరిస్థితి తగ్గాలి. అదే కాదు, వాళ్లకు విద్య, ఇల్లు, వైద్యం.. ఇవన్నీ ఖర్చులే. మొత్తంగా ఆ ఖర్చుల భారం తగ్గాలి. ఇక్కడ భౌతికంగా ఎంత డబ్బు ఇస్తున్నాం అని కాదు, పిల్లల్ని కనేవారి ఆలోచనల్లో మార్పు రావాలి. మహిళలకు ఎవరైనా ఇచ్చే డబ్బు కంటే, తల్లి అయితే వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందే, తల్లి అయితే ఎదగలేమే, తల్లి అయితే స్వతంత్రత పోతుందనీ ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఆ విషయంగా మార్పు కోసం ప్రయత్నం జరగాలి'' అన్నారు శ్రీనివాస్ గోలి.

ఫొటో సోర్స్, https://x.com/PentapatiPullar
'ఖరీదైన వ్యవహారం'
''పిల్లల్ని కనీ, పెంచడం చాలా ఖరీదైన వ్యవహారం అయిపోయింది. తల్లిదండ్రులు తమకంటే పిల్లలు ఇంకాస్త మెరుగైన స్థితిలో ఉండాలనీ, తమ కష్టాలు పిల్లలు పడకూడదనీ అనుకుంటారు. ఆ క్రమంలో ఒకరితోనే సరిపెట్టుకునేవారు పెరిగారు. అసలు పెళ్లే వద్దనే వారు, విడాకులు తీసుకునేవారు, పిల్లలు వద్దనుకునే వారు, ఒకరే చాలనుకునే వారు, ఆలస్యంగా పెళ్లి చేసుకునే వారు.. వీరంతా పెరుగుతున్నారు'' అని రిటైర్డ్ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య అన్నారు.
''పోనీ పిల్లల్ని కంటే వారి భారం మొత్తం ప్రభుత్వాలు చూసుకుంటాయన్న భరోసా ఉంటుందా అంటే.. మన ప్రభుత్వాలపై జనానికి అంత విశ్వసనీయత లేదు. ఏ రంగంలోనూ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు జరగలేదు. ముందుగా ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం కలగాలి. అందుకోసం ప్రజారోగ్య వ్యవస్థ, ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థలు ముందుగా మెరుగుపడాలి. అంటే, మన పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో కాలేజీల్లో చదివించవచ్చు. జబ్బు చేస్తే గవర్నమెంటు ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందన్న భరోసా వస్తే అప్పుడు పిల్లల్ని కనడానికి జనం ధైర్యం చేస్తారు'' అన్నారు రామచంద్రయ్య.
చంద్రబాబు ఉద్దేశం సరైనదే అయినప్పటికీ, ఆచరణలో కొన్ని మార్పులు కావాలంటున్నారు విశ్లేషకులు.
''ఈ రోజుల్లో 25 వేల కోసం మూడో బిడ్డను ఎవరూ కనరు. దానికంటే ఫెర్టిలిటీ సెంటర్ల ముందు క్యూ కడుతోన్న జంటలకు, పిల్లలు పుట్టే నిమిత్తం వైద్యం కోసం సహాయం చేయాలి. రాష్ట్రంలోని ఫెర్టిలిటీ సెంటర్లన్నిటినీ నమోదు చేసి, వారికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, అందుకోసం ప్రభుత్వం అవసరమైతే ఒక కమిషనర్‌ను పెట్టి, చికిత్సకు డబ్బులివ్వాలి'' అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు అన్నారు.
ఆరోగ్యవంతమైన పౌరుల కోసం మేనరికాలు, కజిన్ల మధ్య పెళ్లిళ్లు ఆపాలనీ దాని వల్ల ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
'నైపుణ్యాలు నేర్పించాలి'
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల్లో వృద్ధుల గురించి విస్తృతంగా చర్చించిందని శ్రీనివాస్ గోలి చెప్పారు .
వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాల ముందున్న పెద్ద సమస్యల్లో ఇదొకటి.
అయితే, ఆ సమస్యను ఎదుర్కోవడానికి వారికి ఉన్న వసతులు, ఆర్థిక పరిస్థితి ఏపీ-భారత్‌కు ఉన్నాయా అన్నదే ప్రశ్న అని శ్రీనివాస్ గోలి అన్నారు.
''వృద్ధులకు అదనంగా నైపుణ్యాలు నేర్పించడం, వారిని ఆరోగ్యంగా ఉంచడం, ఎవరిపై ఆధారపడకుండా ఉండే పరిస్థితి తెప్పించడం మంచి ఆలోచన'' అన్నారు.
ఇప్పుడు ఈ వృద్ధుల సమస్యపై చర్చ ఎందుకు అంటే, ఆంధ్రాలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2047 నాటికి 23 శాతం వృద్ధులు ఉండే అవకాశం ఉందని అంచనా. అయితే అంతమంది వృద్ధులకు తగిన వనరులు, వసతులు, ఆర్థిక స్థితి ఆంధ్రప్రదేశ్ దగ్గర లేదని తెలుస్తోంది.
యూరోప్‌ను ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ అభివృద్ధి, ఆదాయం రెండూ క్రమంగా పెరిగాయి, అదే సమయంలో ఫెర్టిలిటీ నిదానంగా తగ్గింది.
ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరగడానికి సుమారు శతాబ్దం పడితే, ఏపీలో 30 ఏళ్లకే ఆ పరిస్థితి వస్తోంది. ఎందుకంటే, అక్కడి కంటే ఇక్కడ కఠినమైన కుటుంబ నియంత్రణ అమలైంది. అంటే, ఆంధ్రప్రదేశ్ ధనవంతమైన రాష్ట్రంగా మారేలోపు వృద్ధాప్య రాష్ట్రంగా మారబోతోంది. యూరోప్ కంటే మూడొంతుల ఎక్కువ వేగంతో ఇక్కడ ఫెర్టిలిటీ పడిపోయింది. అదేసమయంలో, యూరోప్ కంటే 30 రెట్ల తక్కువ తలసరి ఆదాయం ఇక్కడ నమోదైంది. సరిగ్గా ఆ సమస్యను ఏపీ అడ్రస్ చేయాల్సి ఉందని వివరించారు శ్రీనివాస్ గోలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












