జనగణన : 1951 నుంచి ఇప్పటి వరకు అడగని ఓ ప్రశ్న ఈసారి అడుగుతారు..

భారతదేశం, జనగణన, కేంద్రహోంమంత్రిత్వశాఖ, కులగణన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది.
    • రచయిత, ప్రియాంక
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలో జనగణన ప్రారంభం కానుంది. 16 ఏళ్ల తరువాత మొదలుకానున్న ఈ గణనకు 2027, మార్చి1వ తేదీని ప్రామాణికంగా తీసుకుంటామని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.

జనగణనను తొలిసారిడిజిటల్‌ రూపంలో చేయనున్నారు.

ఇందులో కుల గణన కూడా ఉంటుంది.

జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తొలి దశలో కేంద్ర పాలిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కశ్మీర్, మంచు కురిసే రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో జనగణన జరుగుతుంది. దీనికి 2026 అక్టోబర్1ను ప్రామాణికంగా ప్రకటించారు.

మైదాన ప్రాంత రాష్ట్రాల్లో జనగణన 2027 మార్చి 1 నుంచి మొదలవుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జనాభా లెక్కల సేకరణను ప్రారంభించే రోజునే ప్రామాణికంగా భావిస్తారు (రిఫరెన్స్ డేట్).జన గణన ఏ ప్రాంతాల్లో ఎప్పుడు మొదలవుతుందో ప్రకటించిన కేంద్రం, అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేదు.

భారతదేశం, జనగణన, కేంద్రహోంమంత్రిత్వశాఖ, కులగణన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది.

జన గణన అంటే?

దేశాభివృద్ధి, దేశంలో ప్రజల స్థితిగతులను మార్చాలంటే వారి పరిస్థితి ఏంటి? ఎవరెవరు ఎంత వరకు చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? ఎలాంటి ఇళ్లల్లో నివసిస్తున్నారు? అసలు ఎంత మందికి ఇళ్లున్నాయి? అనే వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. జన గణన ద్వారా ఈ లెక్కలన్నీ తేలనున్నాయి.

ఒక దేశం లేదా ఒక ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక సమాచారాన్ని సేకరించడం, సంకలనం చేయడం, విశ్లేషించడం, ఆ తర్వాత దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని జనగణన అని అంటారు.

జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల వయసు, లింగం, భాష, మతం, విద్య, వృత్తి, ఎక్కడ నివసిస్తున్నారనే వివరాలు సేకరించనున్నారు.

ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను రూపొందిస్తారు.

భారతదేశంలో 1872 నుంచి జనగణన చేస్తున్నారు.

ఈ ప్రక్రియ స్వతంత్ర భారతదేశంలోనూ కొనసాగుతూ వస్తోంది.

భారతదేశం, జనగణన, కేంద్రహోంమంత్రిత్వశాఖ, కులగణన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా ఉంటుంది

ఈసారి ఎందుకు ఆలస్యమైంది?

1948 జనాభా లెక్కల సేకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం జనగణన జరుగుతోంది. కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉన్న ‘ది ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ కమిషనర్’ జనాభా లెక్కల సేకరణ నిర్వహిస్తారు.

భారతదేశంలో ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలను సేకరిస్తారు. 2011లో చివరి సారిగా జనగణన జరిపారు. ఈ ప్రక్రియ అప్పుడు రెండు దశల్లో జరిగింది.

తర్వాతి జనగణన 2021లో జరగాల్సి ఉన్నా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అది ఆరేళ్ల తర్వాత త్వరలో జరగనుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో జనగణన కోసం 574.80 రూపాయలు కేటాయించారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో జనాభా లెక్కల సేకణ కోసం 3,768 కోట్ల రూపాయలు కేటాయించారు.

బడ్జెట్ కోతల గురించి కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమాచారం వెల్లడించింది.

‘‘2021లోనే జనగణన చేపట్టాల్సి ఉంది. అందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే కోవిడ్ కారణంగా దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. కోవిడ్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగింది’’

‘‘కోవిడ్ సంక్షోభం ముగిసిశాక, జనగణన జరిపిన దేశాల్లో, గణన సమాచార నాణ్యత, సమగ్రత విషయంలో సమస్యలను ఎదుర్కొన్నాయి. అందువల్ల జనగణన ప్రక్రియను సత్వరం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రక్రియ జనగణనకు ప్రామాణిక తేదీ అయిన 2027 మార్చి 1కల్లా పూర్తవుతుంది" అని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

"జనగణనకు బడ్జెట్ ఏన్నడూ అడ్డంకిగా లేదు. ఎందుకంటే దీనికి అవసరమైన నిధులు ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు మంజూరు చేస్తుంది" అని జనగణన పోర్టల్ తెలిపింది.

భారతదేశం, జనగణన, కేంద్రహోంమంత్రిత్వశాఖ, కులగణన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2023లో బిహార్‌లో కులగణన చేపట్టారు.

ఈసారి ప్రత్యేకత ఏంటి?

ఈ కార్యక్రమాన్ని వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తొలిసారిగా 2027 జనాభా లెక్కల సేకరణ డిజిటల్ ఫార్మాట్‌లో చేయనున్నారు. అయితే, జనాభా లెక్కల సేకరణలో భాగంగా అడిగే ప్రశ్నలు మాత్రం 1931 నుంచి అడుగుతున్నవే అడుగుతారు.

1951 నుంచి ఇప్పటి వరకు అడగని ఒక ప్రశ్న ఈసారి జనగణనలో అడుగుతారు. అది మీ కులం ఏంటి? అని.

ఇందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల గురించి సమాచారం ఇంతకు ముందే ఉంది.

అయితే ఈసారి జనగణనలో ప్రతి ఒక్కరికీ తమ కులం గురించి చెప్పే ఆప్షన్ ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో ఈసారి వస్తున్న పెద్ద మార్పు ఇదే. 1931 తర్వాత ఇప్పుడు జనగణన, కులగణనను ఒకేసారి చేపడుతున్నారు.

దేశంలో కులగణన చేపట్టాలని ప్రతిపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా కలిపి చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది.

భారతదేశం, జనగణన, కేంద్రహోంమంత్రిత్వశాఖ, కులగణన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2023లో భారత ప్రభుత్వం చట్టం చేసింది.

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు..

ఈసారి జరగనున్న జనగణన ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు ప్రక్రియ చేపడతారు.

మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల్లోని మొత్తం స్థానాల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.

జన గణన పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేస్తారు.

జనగణన తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. అయితే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరగాల్సి ఉంది.

"నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని, సమయానుకూలంగా అందరితోనూ చర్చిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు" అని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

జనాభా లెక్కల సేకరణ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని రాజ్యాంగం చెబుతోంది. 1951,1961,1971లో ఈ ప్రక్రియను అమలు చేశారు.

"1971 జనగణన ప్రకారం 1976లో నియోజకవర్గాలు పునర్విభజన చేపట్టినప్పుడు దేశంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య పెద్ద వివాదం చెలరేగింది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్‌లాల్ యాదవ్ చెప్పారు.

"దక్షిణ భారతదేశంలో జనాభా నెమ్మదిగా పెరుగుతుంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతోంది. జనాభాను నియంత్రించడం వల్ల డీలిమిటేషన్‌లో తమకు నష్టం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను నిర్ణయించడంలో జనాభా కీలక పాత్ర పోషిస్తోంది. దీని కారణంగా 1976లో నియోజకవర్గాల పునర్విభజన ఆపేశారు" అని శ్యాంలాల్ యాదవ్ అన్నారు.

"ఈసారి జనాభా లెక్కల సేకరణ డేటా చాలా కీలకం కానుంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఇదే పునాది. అయితే 2027లో జనగణన పూర్తైన తర్వాత తుది గణాంకాలు రావడానికి కాస్త సమయం పడుతుంది. అందువల్ల 2029 ఎన్నికల్లో ఈ జనగణన ప్రభావం ఏమీ ఉండదు. అయితే ఆ తర్వాత జరిగే ఎన్నికలు మాత్రం ఈ లెక్కల ఆధారంగానే జరుగుతాయి" అని శ్యాంలాల్ యాదవ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)