ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుతుందా? భారత్‌లో పెరుగుదల ఇంకా ఎన్నాళ్లు సాగుతుంది...

8వేళ్ళు చూపుతున్న చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ జనాభా 820 కోట్ల నుంచి దాదాపు 1003 కోట్లకు పెరుగుతుందని అంచనా

ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా 820 కోట్ల నుంచి దాదాపు 1003 కోట్లకు పెరుగుతుందని అంచనా.

ప్రపంచ జనాభా దినోత్సవం (జులై 11) నాడు విడుదలైన ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్’ ప్రకారం, ఈ భూమిపై మనుషుల సంఖ్య ‘2080ల మధ్యలో గరిష్ట స్థాయికి చేరుకుని, ఆపై క్రమంగా క్షీణించడం ప్రారంభిస్తుంది.’

ఇప్పుడు జన్మించే వ్యక్తులు సగటున 73.3 సంవత్సరాలు జీవిస్తారని, 1995 నుంచి సగటు జీవిత కాలం 8.4 సంవత్సరాలు పెరిగిందని ఈ నివేదిక అంచనా వేసింది.

అర్ధ శతాబ్దానికి పైగా, ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల జనగణన గణాంకాలు, జనన మరణాల రేట్లు, ఇతర డెమోగ్రఫిక్ సర్వేల సహాయంతో ప్రపంచ జనాభా అంచనాలను రూపొందిస్తున్నాయి. డెమోగ్రఫీ అనేది మానవ జనాభాలో మార్పులను సూచించే గణాంకాల అధ్యయనం.

అయితే ఈ సంఖ్యను మనం నమ్మవచ్చా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ప్రపంచ జనాభా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు జన్మించిన వ్యక్తులు సగటున 73.3 సంవత్సరాలు జీవిస్తారు.

‘‘కచ్చితమైన లెక్కింపు అసాధ్యం"

"ఈ భూగ్రహం మీద ఉన్న మనుషుల సంఖ్యను కచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదు," అని డెమోగ్రాఫర్ జాకబ్ బిజాక్ బీబీసీతో అన్నారు.

సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలో ఆర్థికవేత్త అయిన ప్రొఫెసర్ బిజాక్, ‘‘జనాభా సంఖ్యను అంచనా వేసేటప్పుడు మీకు కచ్చితంగా ఒక విషయం అర్ధమవుతుంది. అదే ఆ సంఖ్య అనిశ్చితి.’’ అన్నారు.

"కచ్చితమైన అంచనా వేయడానికి మా దగ్గర మంత్రాలు లేవు" అని వాషింగ్టన్ డీసీలోని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో పరిశోధనా సంస్థలోని జనాభా అంచనా నిపుణులు డాక్టర్ తోషికో కనెడా అన్నారు.

కానీ, జనాభా అంచనాలు, భవిష్యత్తు అంచనాల విషయానికి వస్తే జనాభా శాస్త్రవేత్తలు సంఖ్యలను గాలిలోంచి సృష్టిస్తారని దీని అర్థం కాదు.

“ఇది మన అనుభవం, జ్ఞానం. మనకు అందుబాటులో ఉన్న ప్రతి చిన్న సమాచారం ఆధారంగా కష్టపడి ఆలోచించడం. ఇది చాలా శ్రమతో కూడిన పని." అని డాక్టర్ కనెడా వివరించారు.

జనాభా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తమ అంచనాలను సరి చేస్తుంటారు. ఉదాహరణకు, ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2100 నాటికి మనుషుల సంఖ్య ఒక దశాబ్దం క్రితం ఊహించిన దానికంటే 6 శాతం తక్కువ ఉంటుంది.

ఇలా తరచుగా సరి చేస్తున్నా, భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వాలు, ఇతర విధాన రూపకర్తలకు ఈ జనాభా గణాంకాలు చాలా అవసరం.

మరి ఐక్యరాజ్య సమితి తాజా గణాంకాలు మనకు ఏం చెబుతున్నాయి?

తాజా ప్రపంచ జనాభా సరళి

ప్రపంచవ్యాప్తంగా నలుగురిలో ఒకరు, జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్న దేశంలో నివసిస్తున్నారని 2024 వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ చెబుతోంది.

126 దేశాలు, ప్రాంతాలలోని జనాభా మరో మూడు దశాబ్దాల పాటు పెరుగుతుంది. వీటిలో భారతదేశం, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు కొన్ని ఉన్నాయి.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో కొద్దిగా క్షీణించిన తర్వాత, అంతర్జాతీయ ఆయుర్దాయం మళ్లీ పెరుగుతోందని ఈ నివేదిక ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు జన్మించిన వ్యక్తులు సగటున 73.3 సంవత్సరాలు జీవిస్తారు. 1995తో పోలిస్తే, ఇది 8.4 సంవత్సరాలు పెరిగింది.

"మరణాల రేటులో మరింత తగ్గుదలతో, 2054లో ప్రపంచవ్యాప్తంగా సగటు జీవిత కాలం 77.4 సంవత్సరాలకు చేరుకుంటుంది." అని నివేదిక పేర్కొంది.

వలసలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్నిదేశాలు మాత్రమే వలసల సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

జనాభాను పెంచుతున్న వలసలు

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జనాభా పెరుగుదల భిన్నంగా ఉంది. అంగోలా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజర్, సోమాలియా వంటి కొన్ని దేశాలలో, రాబోయే 30 సంవత్సరాలలో జననాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. వాటి జనాభా రెట్టింపు అవుతుందని అంచనా.

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో, జనాభా పెరుగుదలకు వలసలే అతిపెద్ద కారణమని ఈ నివేదిక వెల్లడించింది.

జర్మనీ, జపాన్, ఇటలీ, రష్యా, థాయ్‌లాండ్‌ సహా - జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్న 19 దేశాలలో వలసలు లేకుంటే జనాభా ఇంతకు మునుపే గరిష్ట స్థాయికి చేరుకునేదని, అయితే అది కొంచెం తక్కువగా ఉండేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2054 తర్వాత జనాభా గరిష్ట స్థాయికి చేరుకునే అనేక దేశాలలో, వలసలు స్థిరమైన జనాభా పెరుగుదలకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. వాటిలో ఆస్ట్రేలియా, కెనడా, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

"భూగ్రహం మీద జనాభా పునఃపంపిణీ జరిగే విధానంగా వలసలు పెరుగుతున్నాయి," అని ప్రొఫెసర్ బిజాక్ చెప్పారు. "కానీ చాలా దేశాల వద్ద వలసదారులకు సంబంధించిన సమాచారం ఉండదు లేదా దశాబ్దానికి ఒకసారి జనగణన సమయంలో మాత్రమే, పరిమిత పరిధిలోనే ఈ పని చేస్తున్నారు.” అని అన్నారాయన.

కొన్ని దేశాలు ఇందుకోసం సర్వేలు లేదా జనాభా రిజిస్టర్‌లను ఉపయోగించుకుంటాయని ప్రొఫెసర్ బిజాక్ వెల్లడించారు. "అయితే ఇవి చాలా తక్కువ - ఎక్కువగా యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాలు." అన్నారు బిజాక్.

‘‘కొన్ని దేశాలు మొబైల్ ఫోన్ లొకేటర్ల వంటి ప్రత్యామ్నాయ విధానాలను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ అధికారికం కావడానికి ముందు ఇంకా అభివృద్ధి చెందాలి. మనం ఈ డేటాను బాగా అర్థం చేసుకోవాలి." అని ఆయన తెలిపారు.

వలసల సరళి, సంతానోత్పత్తి రేట్ల కంటే చాలా వేగంగా మారుతుంది కాబట్టి ఈ వలసలను ట్రాకింగ్ చేయడం చాలా అవసరమని డాక్టర్ కనెడా అన్నారు.

“ఈ రోజు అత్యల్ప సంతానోత్పత్తి ఉన్న దేశంలోనూ, జనాభా పెరుగుదల రేటు సున్నాకి తగ్గిపోతుందని నేను ఎప్పటికీ ఊహించను. అది అంత వేగంగా మారదు. కానీ ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధంలాంటి వాటి వల్ల సంభవించే వలసలతో అది రాత్రికి రాత్రే మారవచ్చు.’’ అన్నారు కనెడా.

కానీ అంతర్జాతీయ వలసలను అన్నిటికీ పరిష్కారంగా చూడకూడదని ఐక్యరాజ్య సమితిలో జనాభా సంఖ్యల సమీక్ష విభాగం చీఫ్ క్లేర్ మెనోజీ చెప్పారు.

"దీర్ఘకాలికంగా అదొక్కటే జనాభా క్షీణతను లేదా ప్రజల జీవిత కాలాన్ని నిర్ణయించలేదు. దీనినే జనాభాలో మార్పులకు సార్వత్రిక, తిరుగులేని 'పరిష్కారం'గా చూడకూడదు." అన్నారు మెనోజీ

జనగణన ఫామ్
ఫొటో క్యాప్షన్, జన గణన సందర్భంగా వయసు, నివాసానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

జనాభా లెక్కలు ఎందుకు ముఖ్యం?

జనగణనలో జనాభాను లెక్కించడం లేదా సర్వే చేయడం ద్వారా విధాన రూపకల్పనకు సహాయపడే సుదీర్ఘ చరిత్ర ఉంది.

క్రీస్తు పూర్వం 4,000లో మెసొపొటేమియాలోని బాబిలోనియన్ సామ్రాజ్యంలో (ప్రస్తుత ఇరాక్ అని చెప్పవచ్చు) మొట్టమొదటి జనగణనను చేపట్టినట్లు జనాభా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అప్పటి నుంచి జనగణన సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది, కానీ జనాభా శాస్త్రవేత్తల పని సులభతరం అవుతున్నట్లు కనిపించడం లేదు.

ప్రభుత్వంపై పెరుగుతున్న అపనమ్మకం, గోప్యత గురించి ఆందోళనలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికావంటి చాలా అభివృద్ధి చెందిన దేశాలు కూడా కచ్చితమైన డేటాను సేకరించే విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయని డాక్టర్ కనెడా చెప్పారు.

"డేటాపై వెచ్చించే ప్రతి ఒక్క రూపాయి 32 రూపాయల ఫలితాన్ని ఇస్తుంది" అని అన్నారు కనెడా.

అభివృద్ధి చెందిన దేశాలలో గణాంకాల సేకరణ సంస్థల బడ్జెట్‌లో కోత పెడుతున్నారని డాక్టర్ కనెడా అన్నారు. ఇక తక్కువ అభివృద్ధి చెందిన, పేద దేశాల విషయానికి వస్తే జనాభా గణాంకాలను సేకరించడానికి అయ్యే ఖర్చులు, ఇతర సమస్యలు పెద్ద సవాలుగా మారాయి.

అయినప్పటికీ, "గణాంకాల వ్యవస్థను బలోపేతం చేయడానికి పెట్టే ప్రతి రూపాయి 32 రెట్లు ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది." అని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

ప్రపంచంలో అత్యంత దుర్భర స్థితిలో ఉన్న వర్గాల గణాంకాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి సిఫార్సు చేస్తోంది.

"ఉదాహరణకు, యుక్తవయస్సులో ఉన్న తల్లులకు (15-19 ఏళ్ల వయస్సు) సంబంధించి సమగ్రమైన గణాంకాలు లేని ప్రాంతాలే కౌమారదశలో ప్రసవాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలని తెలుస్తోంది."

ప్రస్తుత ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్’ నివేదిక యూఎన్ అధికారిక జనాభా అంచనాలకు సంబంధించిన 28వ ప్రచురణ. 1950 - 2023 మధ్య నిర్వహించిన 1,700 కంటే ఎక్కువ జాతీయ జనగణన ఫలితాలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలు, 2,890 జాతీయ ప్రాతినిధ్య నమూనా సర్వేల ఆధారంగా దీనిని తయారు చేశారు.

యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME), వియన్నాలోని ఐఐఏఎస్‌ఏ-విట్‌జెన్‌స్టెయిన్ సెంటర్‌లు ప్రపంచ జనాభా అంచనాలను రూపొందించే మరో రెండు ప్రధాన సంస్థలు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)