భారతీయుడు: రజనీకాంత్ కోసం రాసిన కథ కమల్ హాసన్ వద్దకు ఎలా వచ్చింది?

కమల్ హాసన్

ఫొటో సోర్స్, LYCA PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, 28 ఏళ్ళ తరువాత భారతీయుడు రెండో భాగం జూలై 12న విడుదలవుతోంది
    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతీయుడు-2 సినిమా శుక్రవారం (జులై 12న) విడుదలవుతోంది. 28 ఏళ్ళ కిందట విడుదలైన భారతీయుడు మొదటి భాగం సంచలనం సృష్టించింది. మరి భారతీయుడు- 2 కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయనుందా?

భారతీయుడు సినిమాకు సంబంధించిన ప్రకటనలు 1996 ఏప్రిల్, మే నెలల్లో విడుదలైనప్పుడు అభిమానులు ఎంతో ఉత్కంఠకు గురయ్యారు. అంతకుముందు ద్రోహి లాంటి విభిన్న సినిమాను అర్జున్‌తో కలిసి నటించిన కమల్‌ హాసన్ వెంటనే, జెంటిల్‌మేన్, ప్రేమికుడు చిత్రాలతో మంచిపేరు తెచ్చుకున్న శంకర్‌తో చేతులు కలపడం అందరి అంచనాలను పెంచింది.

డైరెక్టర్ శంకర్‌కు భారతీయుడు మూడో సినిమా. ఈ సినిమాకు ఏఎం. రత్నం నిర్మాత. అంతకుముందు శంకర్ తీసిన జెంటిల్‌మేన్, ప్రేమికుడు చిత్రాలను రత్నం తెలుగులోకి డబ్ చేసి భారీ లాభాలను ఆర్జించడంతో, తమిళంలో శంకర్‌తో నేరుగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఆ చిత్రమే భారతీయుడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
రజనీకాంత్

ఫొటో సోర్స్, SUN PICTURES

ఫొటో క్యాప్షన్, భారతీయుడు రజనీ కాంత్ కోసం రాసిన కథ

రజనీ కోసం రాసిన కథ

భారతీయుడు సినిమా కథను నిజానికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను దృష్టిలో పెట్టుకుని రాశారని ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వసంత్‌పాలన్ తన ఫేస్‌బుక్ పోస్టులో రాశారు.

‘‘అది 1994 అనుకుంటా. కాదలన్ (ప్రేమికుడు) సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘శంకర్ నా కోసం కథమైనా ఉందా?’’ అని రజనీ అడిగారు. శంకర్ రజనీ కోసం ‘పెరియమానుషన్’ పేరుతో కథను సిద్ధం చేశారు. ఆ కథను రజనీ ఎంతో ప్రశంసించారు. కానీ కాదలన్ పూర్తయ్యేసరికి రజనీకాంత్ డేట్లు దొరకలేదు’’

‘‘కాదలన్ తరువాత పెరియమానుషన్ కథను తెరకెక్కించాలని శంకర్ నిశ్చయించుకున్నారు. ఆ కథలో కథనాయకుడు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయాలి. ఈ కథను శంకర్ కమల్‌ హాసన్‌కు చెప్పారు. అయితే, ఒకవేళ డబుల్ రోల్ చేయడానికి కమల్ ఇష్టపడకపోతే అందుకోసం ప్లాన్ బీని కూడా సిద్ధం చేసుకున్నారు. కొడుకు పాత్రకు తెలుగు హీరోలు నాగార్జున లేదా వెంకటేశ్‌ను తీసుకోవచ్చని, తండ్రిపాత్రను డాక్టర్ రాజశేఖర్‌తో చేయించాలని భావించారు’’ అని తెలిపారు.

కమల్ హాసన్

ఫొటో సోర్స్, INDIAN MOVIE

ఫొటో క్యాప్షన్, శంకర్ దర్శకత్వం వహించి మూడో సినిమా భారతీయుడు

అలాగే పెరియమానుషన్ టైటిల్ భారతీయుడు (ఇండియన్)గా ఎలా మారిందో కూడా వసంతపాలన్ వివరించారు.

‘‘కథా విస్తృతికి ‘పెరియమానుషన్’ అనే పేరు సముచితంగా ఉండదని భావించారు. దీంతో మరో టైటిల్ కోసం వెతకాల్సి వచ్చింది. సేనాధిపతి, ఐఎన్ఏ, ఫ్రీడమ్, సత్యమేవ జయతే, పుదు ఆయుధం, యుద్ధం లాంటి పేర్లను ఆలోచించారు. కానీ చివరగా భారతీయుడుకు ఫిక్స్ అయ్యారు’’ అని చెప్పారు.

ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ... రజనీని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ అనే విషయం తెలియకుండానే కమల్ హాసన్ తనదైన శైలిలో ఆ పాత్రను రక్తికట్టించారని తెలిపారు.

భారతీయుడు మొదటి భాగంలో ఊర్మిళా మాతోండ్కర్, మనీషా కోయిరాలా హీరోయిన్లుగా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జీవా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

కమల్ హాసన్

ఫొటో సోర్స్, LYCA PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, భారతీయుడు మూడో భాగం కూడా విడుదలవుతుందని ప్రకటించారు.

భారతీయుడు సినిమా ఎంత కలెక్ట్ చేసింది?

భారతీయుడు టేకింగ్, భారతీయుడిగా కమల్ ఆహార్యం విభిన్నంగా ఉంటుంది. కథ విషయానికొస్తే కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఓ అధికారి హత్యకు గురవుతారు. అదే విధంగా పలువురు ప్రభుత్వాధికారులు హత్యకు గురవుతుంటారు.

కృష్ణస్వామి అనే ఓ సీబీఐ ఆఫీసర్ ఈ హత్యలపై విచారణ జరుపుతుంటారు. మరోపక్క చందు, అలియాస్ చంద్రబోస్ ఆర్టీఓ ఆఫీస్‌లో బ్రోకర్‌గా పనిచేస్తుంటాడు. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం కోసం అతను ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ ఇంట్లో పనులన్నీ చేస్తుంటాడు. అతనికి ఐశ్వర్య అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది.

ఓ దశలో ఈ హత్యలన్నింటికీ సేనాపతి అనే స్వాతంత్ర్య సమరయోధుడే కారణమని కృష్ణస్వామి కనిపెడతాడు. కానీ సేనాపతి, కృష్ణ స్వామికి చిక్కకుండా తప్పించుకుంటాడు. ఈ సేనాపతి ఎవరనేది ఫ్లాష్‌బాక్‌లో వస్తుంది. దీని తరువాత సేనాపతి హత్యలు చేయడం మరింతగా పెరుగుతుంది. అతను చేసే పనులకు ప్రజల నుంచి మద్దతు కూడా పెరుగుతుంది.

సేనాపతి కొడుకే చందు. అతను కండీషన్‌లో లేని బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఆ బస్సు ప్రమాదానికి కారణమై 40 మంది పిల్లలు చనిపోతారు. దీంతో సేనాపతి తన కొడుకు చందును చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఎయిర్‌పోర్ట్‌లో తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఘర్షణలో కొడుకును సేనాపతి హత్య చేస్తాడు. అక్కడ జరిగిన విమానం పేలుడులో సేనాపతి చనిపోయాడని ప్రజలందరూ భావిస్తారు. కానీ అతను తప్పించుకున్నాడని కృష్ణస్వామి గ్రహిస్తాడు. తరువాత హాంగ్‌కాంగ్‌లో తేలిన సేనాపతి కృష్ణ స్వామికి ఫోన్ చేసి, అవసరం ఉన్నప్పుడు తాను మళ్ళీ తిరిగి ఇండియాకు వస్తానని చెప్పడంతో మొదటి భాగం పూర్తవుతుంది.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రానికి ఎంత ఖర్చయిందనే విషయం ఎవరికీ తెలియదు. బహుశా 8 నుంచి 12 కోట్ల రూపాయల వ్యయం అయి ఉంటుందని చెబుతుంటారు.

ఇండియన్‌గా తమిళంలో, భారతీయుడిగా తెలుగులో, హిందూస్తానీ పేరుతో హిందీలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

ఈ సినిమా అప్పట్లో 50 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందని చెబుతారు.

విమానంలో భారతీయుడు2 చిత్రబృందం

ఫొటో సోర్స్, LYCAPRODUCTIONS

ఫొటో క్యాప్షన్, కేరళ‌లో భారతీయుడు2 ప్రమోషన్స్ కోసం వెళుతున్న చిత్ర బృందం

భారతీయుడు-2 ఎందుకు ఆలస్యమైంది?

భారతీయుడు మొదటి భాగంలోని క్లైమాక్స్ సీన్‌కు సీక్వెల్ తీసేటంత స్టఫ్ ఉన్నప్పటికీ చాలా ఏళ్లపాటు ఆ ఆలోచనే ఎవరికీ రాలేదు.

2017లో బిగ్‌బాస్ రియాల్టీ షోలో భారతీయుడు రెండో భాగాన్ని త్వరలోనే మొదలుపెడతామని కమల్‌ హాసన్ ప్రకటించారు. ముందు ఈ సీక్వెల్‌ను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించాల్సి ఉన్నప్పటికీ, ఆ తరువాత ఆ కంపెనీ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంది.

తరువాత లైకా ప్రొడక్షన్ తెరపైకి వచ్చింది. దీని తరువాత ప్రీపొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. శంకర్ చిత్రాలకు సహజంగా ఏఆర్ రెహమానే సంగీతం అందిస్తారు. కానీ ఈ సినిమాకు అనిరుద్ధ్ మ్యూజిక్ సమకూర్చారు.

అనేక కారణాల వల్ల సినిమా ప్రొడక్షన్ లేటవుతూ వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ 2019లో మొదలైంది. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, ఎస్.జే.సూర్య, బాబీసింహా, ప్రేమనాథం ఈ సినిమాలొ జాయిన్ అయ్యారు. అయితే కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీని తరువాత ఈ సినిమా నిర్మాణంలో రెడ్ జెయింట్ మూవీస్ కూడా భాగస్వామి అయింది.

అవాంతరాలన్నింటినీ దాటుకుని సినిమా చిత్రీకరణ పూర్తయింది. సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకున్నారు.

కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆలస్యం కారణంగా జులై 12న రిలీజ్ అవుతోంది.

హాంగ్‌కాంగ్ నుంచి తిరిగొచ్చిన సేనాపతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన వీడియోల ద్వారా దేశంలో జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్న చిత్రా అరవిందన్‌తో సేనాపతి చేతులు కలుపుతాడు.

ఇండియన్ 2

ఫొటో సోర్స్, LYCAPRODUCTIONS

భారతీయుడు -3

భారతీయుడు మూడో భాగాన్ని కూడా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే మూడో భాగం 80 శాతం షూటింగ్ పూర్తయిందని, మరికొన్నిరోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని చెబుతున్నారు. మూడో భాగాన్ని 2025లో విడుదల చేయనున్నారు.

భారతీయుడు మొదటి భాగం విడుదలైనప్పుడు, దాని గురించిన చర్చ అనేక నెలలు నడిచింది. ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్, వివిధ రాష్ట్రాలకు చెందిన నటీనటులు, సినిమా తీసిన విధానం ఇలా ప్రతి అంశం చర్చనీయాంశమైంది. ఆ సినిమా ఉత్తమ కథనాయకుడు, ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ విభాగంలో జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది.

ఆ సినిమా తమిళనాడులోని అనేక థియేటర్లలో 150 రోజులకుపైగా నడిచింది. ఇప్పటికీ ఈ సినిమాలో సీన్లు టెలివిజన్‌లో వస్తుంటే అభిమానులు తమ పని మరిచిపోయి చూస్తుంటారు.

28 ఏళ్ళ తరువాత భారతీయుడు 2 సినిమా విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి అనుభూతిని మిగుల్చుతుందో చూడాలి.

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)