ప్యాంట్లో 104 పాములను అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు, అన్నీ బతికున్నవే

చైనా కస్టమ్ అధికారులు

ఫొటో సోర్స్, Customs China

ఫొటో క్యాప్షన్, వందకి పైగా పాములు ప్యాంట్లో పెట్టుకుని వస్తున్న వ్యక్తిని పట్టుకున్న కస్టమ్ అధికారులు
    • రచయిత, టామ్ మెక్‌ఆర్థర్
    • హోదా, బీబీసీ న్యూస్

బతికున్న వందకు పైగా పాములను తన ప్యాంట్లో పెట్టుకుని చైనాలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కస్టమ్ అధికారులు పట్టుకున్నారు.

హాంకాంగ్ నుంచి షెన్‌జెన్ మధ్యలోనున్న ‘‘నథింగ్ టు డిక్లేర్’’ గేటు దాటుతున్న ఒక అనుమానితుడిని అధికారులు ఆపారు.

ఆయన్ను తనిఖీ చేసినప్పుడు, ప్యాంట్ లోపల ఆరు కాన్వాస్ డ్రాస్ట్రింగ్ బ్యాగులు(తాడు లాగితే ముడి బిగుసుకునేవి) కనిపించాయి.

ఈ బ్యాగులలో 104 పాములు ఉన్నట్టు చైనా కస్టమ్స్ అధికారులు చెప్పారు.

ప్రతి బ్యాగులో వివిధ సైజులు, ఆకారాలు, రంగుల్లో ఉన్న పాములున్నాయని, అన్నీ బతికే ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

దీనికి సంబంధించిన వీడియోను చైనీస్ కస్టమ్స్ అధికారులు విడుదల చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఇద్దరు బోర్డర్ ఏజెంట్లు చూపిస్తున్న వీడియోలో, ఎరుపు, గులాబీ, తెల్ల రంగులలో ఉన్న పాములు పలుచటి బ్యాగులలో ఉన్నాయి.

అవన్నీ చిన్న పాములే.

జీవ సంరక్షణ, వ్యాధుల నియంత్రణ చట్టాల కింద.. అనుమతి లేకుండా ఆ దేశానికి చెందని జీవులను చైనాలోకి తీసుకెళ్లడం నిషేధం.

ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం శిక్ష తప్పదని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే, ఆ వ్యక్తికి ఎంత కాలం శిక్ష విధిస్తారో చెప్పలేదు.

2023లో అదే క్రాసింగ్ పాయింట్ వద్ద లోదుస్తులలో ఐదు పాములను దాచిపెట్టి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఒక మహిళను సైతం పట్టుకున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు అక్రమ రవాణా కేంద్రాలలో చైనా ఒకటి. ఇటీవల కాలంలో, అక్రమంగా సాగుతున్న ఈ వాణిజ్యంపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)