మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, రొనాల్డోకు తొమ్మిదేళ్లుగా మగపాము తోడు లేదు
    • రచయిత, సోఫీ క్రిడ్‌ల్యాండ్, కర్టిస్ లాన్సస్టర్
    • హోదా, బీబీసీ న్యూస్

ఎన్నో ఏళ్లుగా మగపాముగా భావిస్తూ వచ్చిన ఓ పాము 14 పిల్లలను పెట్టింది. అది కూడా ఎలాంటి తోడు లేకుండా.

రోనాల్డో అనే పేరున్న ఈ 13 ఏళ్ల ‘బోవా కన్‌స్ట్రిక్టర్’ జాతి పాము ‘సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్ కాలేజీ’లో ఉంది.

రొనాల్డో పిల్లలను కనే వరకు దానిని మగపాముగానే భావించారు కాలేజీలోని జంతు సంరక్షణ నిపుణులు పీట్ క్విన్లాన్.

అంతే కాదు గత తొమ్మిదేళ్లలో రొనాల్డో ఎప్పుడూ మగపాముతో జతకట్టింది లేదని ఆయన తెలిపారు.

ఇలా మగ తోడు లేకుండా పిల్లలు పుట్టడాన్ని ‘పార్థెనోజెనిసిస్’గా వ్యవహరిస్తారు. ఒక్క బ్రెజిలియన్ రెయిన్‌బో బోవా కన్‌స్ట్రిక్టర్‌ జాతి పాము విషయంలో మూడుసార్లు మాత్రమే ఇలా జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు
బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, క్విన్లాన్ మొదట రొనాల్డోని మగపాముగా భావించారు

"నేను తొమ్మిదేళ్ల క్రితం రొనాల్డోను రక్షించాను" అని క్విన్లాన్ చెప్పారు.

రెండేళ్ల కిందట కాలేజీలో జంతు సంరక్షణ విభాగంలో చేరినప్పుడు తనతో పాటు తాను సేకరించిన పాములను కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్లు చెప్పారు.

రొనాల్డోకి పిల్లలు పుట్టినప్పుడు తాను వేరేచోట ఉన్నానని క్విన్లాన్ చెప్పారు. ''ఒక ట్యాంక్‌లో పాము పిల్లలు తిరుగుతున్నట్లు ఒక విద్యార్థి చూసి సిబ్బందిని అప్రమత్తం చేశారు''

''ఆ వెంటనే అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని పరిగెత్తుకుంటూ కిందకు వచ్చా. అక్కడ ఎటుచూసినా పాముపిల్లలు కనిపించాయి'' అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, రొనాల్డో 14 పిల్లలను పుట్టించింది

ఇలా మగతోడు లేకుండా పిల్లలు పుట్టడం కొన్ని జీవుల్లో సాధ్యమే.

కీటకాల వంటి చాలా రకాల అకశేరుకాలు (వెన్నెముక లేనివి) లైంగిక సంపర్కం లేకుండానే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి.

తమను తాము క్లోనింగ్ చేసుకోవడం ద్వారా, జన్యుపరంగా తమలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి.

ఫిబ్రవరిలో అమెరికాలో ఒక స్టింగ్రే(ఒక రకం సముద్ర జీవి) భాగస్వామి లేకుండానే గర్భం దాల్చింది.

అయితే, పాముల వంటి వెన్నెముక గల సరీసృపాల్లో ఇలా జరగడం చాలా అరుదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)