బొడ్డులో దూదిలాంటి వ్యర్థాలు ఎలా చేరతాయి, అక్కడ ఇంకా బతికే జీవులు ఏంటి, వాటితో ప్రమాదమెంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేసన్ జి గోల్డ్‌మన్
- హోదా, బీబీసీ ఫీచర్స్ కరస్పాండెంట్
నాభిలో ఏర్పడే మెత్తని దూదిలాంటి వ్యర్థాల గురించి తెలుసుకోవాల్సిన రెండు కీలక విషయాలు ఉన్నాయి.
మొదటిది, శాస్త్రీయంగా దీనిని "నేవల్ ప్లఫ్" అంటారు. అయితే, శాస్త్రీయ పరిభాషలో రాసేవాళ్లు దీనిని బెల్లీ బటన్ లింట్ (బీబీఎల్) అని పిలుస్తారు.
రెండోది, మధ్య వయస్కులు, పొట్ట మీద వెంట్రుకలు ఎక్కువగా ఉన్న పురుషులు, ముఖ్యంగా ఇటీవలే బరువు పెరిగిన వారి నాభిలో ఈ వ్యర్థాలు ఎక్కువగా ఏర్పడతాయి.
డాక్టర్ కార్ల్ క్రస్‌జెల్నికీ అనే సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆస్ట్రేలియన్ సైన్స్ రేడియో షో నిర్వహిస్తుండగా, ఆయన శ్రోతలలో ఒకరు నాభిలో మెత్తని దూదిలాంటి వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తాయి, అవి ఎలా ఏర్పడతాయి అని ప్రశ్నించారు.
అది క్రస్‌జెల్నికీని ఒక ఆన్‌లైన్ సర్వే చేయడానికి ప్రేరేపించింది. దాని ద్వారా ఆయన బీబీఎల్ అనేది, ప్రధానంగా శరీరంపై వెంట్రుకలు ఉన్న మధ్య వయస్కులైన పురుషులకు సంబంధించిన సమస్య అనే నిర్ధరణకు వచ్చేలా చేసింది.
తన పరిశోధనకుగానూ క్రస్‌జెల్నికీ 2002లో ఇగ్ నోబెల్ బహుమతినీ అందుకున్నారు. "ఇది మొదట మీకు సరదాగా అనిపిస్తుంది. ఆపై మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది" అనేది ఆ పరిశోధనకు వచ్చిన ప్రశంస.
ఆన్‌లైన్ సర్వేతో పాటు క్రస్‌జెల్నికీ, ఆయన సహచరులు వలంటీర్ల నుంచి నమూనాలను సేకరించారు. దీని కోసం వారు వలంటీర్లను వారి నాభి చుట్టూ ఉన్న వెంట్రుకలను క్షవరం చేసుకోవాలని కోరారు. దీనివల్ల మెత్తటి దూదిలాంటి వ్యర్థాలు పేరుకుపోవడాన్ని నిరోధించవచ్చని తేలింది. దీంతో డాక్టర్ క్రస్‌జెల్నికీ, ఆయన సహచరులు నాభిలో వ్యర్థాలు ఏర్పడటానికి ఒక కారణాన్ని కనుగొన్నారు.
నాభి చుట్టూ ఉన్న వెంట్రుకలు, "వన్-వే రాచెట్ మెకానిజం"లా పని చేస్తాయని, అవి దుస్తుల లోపలి నుంచి చిన్న ఫైబర్ ముక్కలను లాక్కుని, వాటిని నాభిలో నిక్షిప్తం చేస్తాయని వాళ్లు నిర్ధరించారు.


ఫొటో సోర్స్, Getty Images
పాత దుస్తులతో తక్కువ సమస్య
నాభిలో నిండుకునే ఈ వ్యర్థాలకు ఇదే కారణమనే వాదనను ప్రపంచవ్యాప్తంగా సమర్థించింది క్రస్‌జెల్నికీ ఒక్కరే కాదు. 2009లో, వియన్నా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు జార్జ్ స్టెయిన్‌హౌజర్ మెడికల్ హైపోథీసిస్ పత్రికలో ఆశ్చర్యపరిచే అనేక విషయాలను ప్రచురించారు.
మూడేళ్ల పాటు స్టెయిన్‌హౌజర్ ప్రతి సాయంత్రం తన నాభిలో ఏర్పడిన ఆ దూదిలాంటి వ్యర్థాలను సేకరించేవారు. ప్రతిరోజూ ఉదయం స్నానంతో సహా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినప్పటికీ, సాయంత్రానికి ఆయన నాభి మెత్తని ఆ వ్యర్థాలతో నిండిపోయేది.
స్టెయిన్‌హౌజర్ తన నాభి నుంచి ఇలాంటి 503 నమూనాలను సేకరించారు. వాటి మొత్తం బరువు ఒక్క గ్రాము కూడా తూగలేదు. సగటున, ఒక్కో వ్యర్థపు ముక్క బరువు 1.82 మిల్లీ గ్రాములు ఉండగా, ఏడు ముక్కలు 7.2 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటిలో అతి పెద్ద ముక్క బరువు 9.17 మిల్లీగ్రాములు.
"కాటన్ ఫైబర్‌లు జమకావడం వల్ల ఇది ఏర్పడినట్లు స్పష్టం అవుతోంది.’’ అని స్టెయిన్‌హౌజర్ తెలిపారు. ఎందుకంటే, తాను ఏ రంగు చొక్కా వేసుకునేవారో, ఆ రోజు వ్యర్థాలు అవే రంగులో ఉండేవి. ఆయన పాత టీ-షర్టులు ధరించినప్పుడు తక్కువ వ్యర్థాలు జమ అయ్యేవి. దీనికి కారణం బహుశా అప్పటికే దానిపై ఉన్న ఫైబర్ పోగులు దాని నుంచి రాలిపోయి ఉండడం వల్ల కావొచ్చు.
స్టెయిన్‌హౌజర్ చివరికి, ''నాభి చుట్టూ ఉన్న వెంట్రుకలే నాభిలో దూదిలాంటి వ్యర్థాలు ఏర్పడడానికి కారణం'' అనే క్రస్‌జెల్నికీ నిర్ణయాన్నే బలపరిచారు. వెంట్రుకలు చొక్కా నుంచి చిన్నచిన్న ఫైబర్‌లను రాసుకుని రాసుకుని, వాటిని నాభి వైపు మళ్లిస్తాయని ఆయన వాదించారు.
"వెంట్రుకల చివరలు ఒక రకమైన 'హుక్స్'లా పనిచేస్తాయి." అని ఆయన అన్నారు. ఒకసారి ఆయన తన నాభి చుట్టూ ఉన్న జుట్టును షేవ్ చేశారు. దీని వల్ల డాక్టర్ క్రస్‌జెల్నికీ ప్రయోగంలో పాల్గొన్న వారితో పాటు, ఆయనా తన నాభి శుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
కానీ, స్టెయిన్‌హౌజర్ తన పరిశోధనలో ఒక అడుగు ముందుకు వేశారు. ఆయన పూర్తి తెల్లగా ఉన్న 100% కాటన్ టీ-షర్టును ధరించి, ఆ తర్వాత సేకరించిన బీబీఎల్ నమూనాలోని రసాయన మిశ్రమాన్ని విశ్లేషించారు. నాభిలోని వ్యర్థాలలో టీ షర్టులోని ఫైబర్‌లు ఉంటే, అది పూర్తిగా సెల్యులోజ్‌తో తయారైనట్లు ఆ విశ్లేషణలో తేలాల్సి ఉంది. అయితే, అవే కాకుండా ఇతర వ్యర్థాలూ నాభిలోకి చేరుకున్నాయని ఆయన గమనించారు.
రసాయన పరీక్షల ఆధారంగా, మిగిలిన వ్యర్థాలలో దుమ్ము, చర్మపు కణాలు, కొవ్వు, ప్రోటీన్లు, చెమట కలిసి ఉండొచ్చని స్టెయిన్‌హౌజర్ అనుమానించారు. దీని ఆధారంగా దూదిలాంటి వ్యర్థాలు ఉన్న వాళ్ల నాభి సాధారణంగా మరింత పరిశుభ్రంగా ఉంటుందని ఆయన వాదించారు. ఎందుకంటే, దాన్ని తొలగించే ప్రక్రియలో నాభి మొత్తం శుభ్రమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
నాభిలోని ఈ దూదిలాంటి వ్యర్థాలను విశ్లేషించడానికి తమ సమయాన్ని, శక్తిని కేటాయించింది బహుశా క్రుస్‌జెల్నికీ, స్టెయిన్‌హౌజర్ వంటి పరిశోధకులు మాత్రమే అయి ఉండొచ్చు. అయితే నాభిలో ఇంకా ఏమేం ఉన్నాయో అర్థం చేసుకోవడానికి నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలోనూ (ఎన్‌సీఎస్‌యూ) పరిశోధనలు జరిగాయి.
ఎన్‌సీఎస్‌యూ జీవశాస్త్ర విభాగం, కెక్ సెంటర్ ఫర్ బిహేవియరల్ బయాలజీలో పరిశోధకుడైన రాబ్ డన్, ‘బెల్లీ బటన్ డైవర్సిటీ ప్రాజెక్ట్’ అనే సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్‌పై పని చేశారు.
2011లో రాబ్ డన్, ఆయన సహచరులు 500 కంటే ఎక్కువ మంది వలంటీర్ల నుంచి నాభిలోని వ్యర్థ నమూనాలను సేకరించారు. కానీ, ఈ పరిశోధకులు దూదిలాంటి వ్యర్థాలపై అంత ఆసక్తి చూపలేదు. దానికన్నా వాళ్లు నాభిలోని ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను అర్థం చేసుకోవాలనుకున్నారు. మన నాభి లోపల ఎలాంటి బ్యాక్టీరియా నివసిస్తుందో వాళ్లు తెలుసుకోవాలనుకున్నారు.
ఆ అధ్యయనంతో ప్రారంభించిన రాబ్ డన్, ఆయన బృందం.. నాభిలో దాగిన సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని కనుగొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నాభిలో జీవ వైవిధ్యం
మొదట పరీక్షించిన 60 నమూనాలలో, వాళ్లకు కనీసం 2,368 రకాల బ్యాక్టీరియా కనిపించింది. అది ఇంకా తక్కువ అని వాళ్లు అనుమానిస్తున్నారు. అయితే, అది ఉత్తర అమెరికా పక్షులు లేదా చీమల జీవవైవిధ్యం కంటే రెండు రెట్లు ఎక్కువ. కానీ, ఆ జాతులు చాలా అరుదైనవి. వాటిలో 2,128 రకాలు ఆరుగురి కంటే తక్కువ మంది నాభిలో కనిపించాయి.
నిజానికి, సూక్ష్మజీవుల రకాలు చాలావరకూ ఒక వ్యక్తి నాభిలోనే కనిపించాయి. మానవ నాభిలో కనిపించే బ్యాక్టీరియాలలో ఎక్కువ భాగం కొన్ని జాతులకు చెందినవే. ప్రతి వ్యక్తిలోనూ సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా రకం ఏదీ లేనప్పటికీ, ఈ ప్రయోగంలో పాల్గొన్నవారిలో కనీసం 70% మందిలో ఎనిమిది రకాల బ్యాక్టీరియా కనిపించింది. ఆ ఎనిమిది రకాలు మొత్తం బ్యాక్టీరియాలో దాదాపు సగం వరకూ ఉన్నాయి.
ఎందుకు నాభిలో ఇంత జీవ వైవిధ్యం?
రాబ్ డన్, ఆయన సహచరులు ఈ బ్యాక్టీరియా జాతుల సమూహం మానవ చర్మంపై, అలాగే నాభిలో కూడా జీవించడానికి అలవాటుపడ్డాయని అనుమానిస్తున్నారు. కొన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చి పోతుండవచ్చు.
ఏ వ్యక్తి నాభిలో ఏ రకమైన బ్యాక్టీరియా ఉంటుందో అంచనా వేయడం అసాధ్యం. అయితే, పరిశోధకులు తరచుగా నాభిలో ఏ రకం బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది, ఏ రకం అరుదైనది అని మాత్రం అంచనా వేయగలుగుతారు.
అందువల్ల, మీ నాభిలో దూదిలాంటి వ్యర్థాలు ఏర్పడకపోతే చింతించాల్సిన అవసరం లేదు. మీ నాభి ఇప్పటికీ చాలా జీవవైవిధ్యం కలిగిన ఉత్తేజకరమైన ప్రదేశమే.
ఇవి కూడా చదవండి:
- రక్త పిశాచాలు ఉన్నాయా? లేవా?
- పుతిన్‌కు ఘనస్వాగతం పలికిన కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఉత్తర కొరియాకు పుతిన్ ఎందుకు వెళ్లారు? 3 ప్రశ్నలు, సమాధానాలు
- ఒకే ఐఎంఈఐ నంబర్‌తో 1.5 లక్షల ఫోన్లు, ఈ మోసం ఎలా చేశారు?
- పన్నెండు రోజుల్లో 1,000 కిలోమీటర్లు పరుగెత్తిన 52 ఏళ్ల మహిళ, ఇంత సాహసం ఎందుకంటే...
- టీ20: పాకిస్తాన్ జట్టు ఇది వరల్డ్ కప్ అన్న విషయం అర్థం చేసుకోలేకపోయిందా?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















