పెనైల్ క్యాన్సర్‌: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

తన పురుషాంగంపై మొటిమ లాంటిది పెరగడం గమనించిన బ్రెజిల్‌కి చెందిన ఒక పెన్షనర్ వైద్యులను సంప్రదించారు.

''అదేంటో తెలుసుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ తిరగడం మొదలుపెట్టా. కానీ, వైద్యులందరూ అది అదనపు చర్మమని చెప్పి మందులు రాసిచ్చేవారు'' అని 63 ఏళ్ల ఆ వ్యక్తి గుర్తు చేసుకున్నారు.

మందులు వాడినా ఆ మొటిమ లాంటిది పెరుగుతూనే ఉంది. అది ఆయన వైవాహిక జీవితంపై ప్రభావం చూపింది. జొవావ్ తన భార్యతో లైంగికంగా కలవలేకపోయారు.

''మేం అన్నాచెల్లెళ్ల మాదిరిగా ఉండాల్సి వచ్చింది'' అని ఆయన తెలిపారు. అసలేం జరుగుతోందో కారణం కనుక్కోవాలని ఆయన నిశ్చయించుకున్నారు.

జొవావ్ ఆయన అసలు పేరు కాదు. ఆయన విజ్ఞప్తి మేరకు పేరు మార్చాం.

ఐదేళ్ల పాటు ఆయన వైద్య నిపుణుల చుట్టూ తిరుగుతూ, వారు సూచించిన పరీక్షలు చేయించుకుంటూ, వారు చెప్పిన మందులను వాడారు. ''కానీ పరిష్కారం దొరకలేదు'' అని ఆయన చెప్పారు.

ఆ తర్వాత 2023లో ఆయనకు ఉన్న వ్యాధి నిర్ధరణ అయింది. జొవావ్‌కు పెనైల్ క్యాన్సర్ (పురుషాంగ క్యాన్సర్).

''నా కుటుంబ సభ్యులకు అది దిగ్భ్రాంతికర విషయం. అంతేకాకుండా, నా పురుషాంగంలో కొంత భాగాన్ని కత్తిరించాల్సి వచ్చింది. నా తల తీసేసినట్లు ఉంది'' అన్నారు జొవావ్.

''ఇదొక రకమైన క్యాన్సర్. కానీ ఇతరులకు చెప్పుకోలేరు. ఎందుకంటే, అదో జోక్ అయిపోతుంది.''

పెనైల్ క్యాన్సర్ చాలా అరుదు. కానీ, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా క్యాన్సర్ కేసులు, వాటి వల్ల జరుగుతున్న మరణాల రేటు పెరుగుతోంది.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

'సర్జరీ అంటే భయమేసింది'

తాజా అధ్యయనాల ప్రకారం, బ్రెజిల్‌లో ప్రతి 100,000 మంది పురుషుల్లో 2.1 మంది ఈ పెనైల్ క్యాన్సర్‌కి గురవుతున్నారు.

బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2012 నుంచి 2022 మధ్య 21,000 కేసులు నమోదుకాగా, సుమారు 4,000కి పైగా మరణాలు సంభవించాయి. గత పదేళ్ల కాలంలో 6,500 కంటే ఎక్కువ మందిలో పురుషాంగం తొలగింపు లేదా కొంతభాగం కత్తిరింపు శస్త్రచికిత్సలు జరిగాయి. అంటే, సగటున ప్రతి రెండు రోజులకు ఒక ఆపరేషన్.

బ్రెజిల్‌లో అత్యంత పేద రాష్ట్రమైన మారన్‌హవావ్‌లో అత్యధికంగా ప్రతి లక్ష మంది పురుషుల్లో 6.1 మంది పెనైల్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు గుర్తించారు.

పురుషాంగం మీద అల్సర్ (పుండు)తో ఈ రకం క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. దాని నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఆ పుండు ఎంతకీ తగ్గదు.

ఈ లక్షణాలను తొలి దశలోనే గుర్తిస్తే ఆ పుండు భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించడం, లేదా రేడియోథెరపీ, కీమోథెరపీ వంటి వైద్య చికిత్సల ద్వారా కోలుకునే అవకాశం ఉంటుంది.

కానీ, చికిత్స తీసుకోకుండా అలా వదిలేస్తే పురుషాంగంలోని కొంతభాగం, లేదంటే పురుషాంగం మొత్తాన్ని తీసేయాల్సి రావొచ్చు. అది పెరిగి వృషణాలు, ఇతర జననేంద్రియ అవయవాలు కూడా తొలగించాల్సి రావొచ్చు.

జనవరిలో జొవావ్ పురుషాంగాన్ని పాక్షికంగా తొలగించారు. ఇది చాలా కష్టమైన సమయమని ఆయన అన్నారు.

''మనకి ఇలా జరుగుతుందని ఎప్పటికీ ఊహించం. దీనిని ఎవరికీ చెప్పుకోలేం కూడా'' అన్నారు జొవావ్.

''సర్జరీ అంటే భయపడ్డా. కానీ నాకు వేరే మార్గం లేదు. ఆపరేషన్ తర్వాత కొద్దివారాలు బాధనిపించింది. కానీ దానిని కాదనలేను. మన పురుషాంగాన్ని కత్తిరించాల్సి రావడం నిజంగా భయంకరం.''

కొంతమంది రోగులకు మొత్తం పురుషాంగాన్ని తొలగించాల్సి వస్తుంది, అది వారి జీవితాన్ని మార్చేస్తుంది.

''పాక్షికంగా పురుషాంగాన్ని తొలగించిన కేసుల్లో మూత్రం పురుషాంగం ద్వారానే బయటికి వస్తుంది'' అని సావో పాలోలోని ఏసీ కమార్గో క్యాన్సర్ సెంటర్‌‌లో యూరాలజీ విభాగానికి చెందిన తియాగో క్యామెలో మౌరావ్ తెలిపారు.

''అయితే, పురుషాంగం మొత్తం తొలగించాల్సి వచ్చినప్పుడు మూత్రాశయ రంధ్రాన్ని వృషణాలకు, మలద్వారానికి మధ్యన పెరినియమ్‌కు మార్చాల్సి ఉంటుంది. దాని వల్ల రోగి టాయిలెట్‌కి వెళ్లినప్పుడు కూర్చుని మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది'' అని చెప్పారు.

మారిసియో డెనర్ కార్డీరియో

ఫొటో సోర్స్, SBU

ఫొటో క్యాప్షన్, మారిసియో డెనర్ కార్డీరియో

వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల పురుషాంగం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ యూరాలజీకి చెందిన మారిసియో డెనర్ కార్డీరియో చెప్పారు.

పెనైల్ క్యాన్సర్ కారణంగా ఫిమోసిస్, స్మోకింగ్‌గా పిలిచే పురుషాంగం పైచర్మం బిగుతుగా మారడం వంటి ప్రమాదాలు కూడా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత ఈ వ్యాధి బారిన పడకుండా సాయపడుతుందని కార్డీరియో అన్నారు.

''ఎవరైనా పురుషాంగం పైచర్మం లోపల సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అక్కడ పేరుకుపోయే స్రావాలు ఉత్పత్తి అవుతాయి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది'' అని ఆయన చెప్పారు.

''అలా పదేపదే జరిగితే, కణితి రూపంలో ప్రమాదకరంగా మారుతుంది.''

పరిశుభ్రతతో పాటు, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పీవీ - నిరంతరం సోకే వైరస్‌ల సమూహానికి పేరు) ''ప్రధాన ప్రమాదకారకాల్లో ఒకటి'' అని కార్డీరియో చెప్పారు. కొన్నిసందర్భాల్లో ఈ హెచ్‌పీవీ నోటి, పురుషాంగ క్యాన్సర్లకు దారితీయవచ్చు.

''హెచ్‌పీవీ వైరస్‌లను అంతం చేసేందుకు టీకాలు వేసే కార్యక్రమం భారీస్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది, అవి ఇలాంటి గాయాలను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ, టీకాలు వేస్తున్న రేటు బ్రెజిల్‌లో అవసరమైన దానికంటే చాలా తక్కువగా ఉంది'' అని ఆయన చెప్పారు.

''బ్రెజిల్‌లో టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ టీకాల రేటు అమ్మాయిల్లో 57 శాతానికి, అబ్బాయిల్లో 40 శాతానికి మించడం లేదు. ఈ వ్యాధిని నిరోధించేందుకు టీకాల రేటు సుమారు 90 శాతం వరకూ ఉండడం ఉత్తమం'' అని కార్డీరియో అన్నారు.

వ్యాక్సీన్ గురించి తప్పుడు సమాచార వ్యాప్తి, దాని ప్రభావంపై సందేహాలు టీకాలు ఎక్కువగా తీసుకోకపోవడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెచ్‌పీవీ వ్యాక్సిన్

పెనైల్ క్యాన్సర్ తాజా పరిశోధనల ప్రకారం, ఒక్క బ్రెజిల్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.

2022లో, జేఎంఐఆర్ పబ్లిక్ హెల్త్ అండ్ సర్వైలెన్స్ జర్నల్ 43 దేశాల నుంచి సేకరించిన తాజా సమాచారంతో, ఈ వ్యాధిపై పెద్దయెత్తున జరుగుతున్న అధ్యయనాల ఫలితాలను ప్రచురించింది.

ఈ జర్నల్‌ ప్రకారం, 2008 నుంచి 2012 మధ్య కాలంలో అత్యధికంగా యుగాండాలో 100,000కి 2.2 మంది, థాయ్‌లాండ్‌లో 100,000కి 1.4, అత్యల్పంగా కువైట్‌లో 100,000కి 0.1మంది ఈ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు.

''అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెనైల్ క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, యూరోపియన్ దేశాల్లోనూ ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది'' అని చైనాలోని యాట్ సేన్ యూనివర్సిటీకి చెందిన లీవెన్ ఫు, టియాన్ టియాన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం గుర్తించింది.

1979 నుంచి 2009 మధ్య ఇంగ్లండ్‌లో పురుషాంగ క్యాన్సర్‌లో పెరుగుదల కనిపించిందని, 100,000కి 1.1 నుంచి 1.3కి పెరిగినట్లు వారు తెలిపారు. జర్మనీలో 1961 నుంచి 2012 మధ్య కాలంలో 100,000కి 1.2 నుంచి 1.8కి, అంటే 50 శాతం పెరిగినట్లు వారు పేర్కొన్నారు.

గ్లోబల్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ ప్రిడిక్షన్ టూల్ ప్రకారం, ఈ గణాంకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 2050 నాటికి, ప్రపంచవ్యాప్తంగా పెనైల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 77 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా.

అప్పటికి వృద్ధుల జనాభా పెరుగుదలను ఇది సూచిస్తోంది. ఎందుకంటే, పెనైల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా 60 ఏళ్లకు పైబడిన వారిలో కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

''పెనైల్ క్యాన్సర్ చాలా అరుదైన వ్యాధి, దానిని చాలా వరకూ నివారించవచ్చు. పురుషులు తమ పురుషాంగాన్ని రోజూ సబ్బుతో కడుక్కోవడం, లైంగిక కలయిక తర్వాత అంగాన్ని శుభ్రం చేసుకోవడం ముఖ్యం'' అని కార్డీరియో చెప్పారు.

సెక్స్ సమయంలో కండోమ్‌ ఉపయోగించడం, శస్త్రచికిత్స ద్వారా అంగం పైచర్మాన్ని తొలగించుకోవడం వంటివి ఫిమోసిస్ వంటి సందర్భాల్లో పెనైల్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడంలో సాయపడుతుందని ఆయన సలహా ఇస్తున్నారు.

జొవావ్ ప్రస్తుతం తాజా వైద్య పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివరిలో అవి రావొచ్చు.

''నాకు నయం అవుతున్నట్లు రిపోర్ట్స్‌లో వస్తుందన్న నమ్మకం ఉంది'' అన్నారాయన.

''పురుషాంగం కత్తిరించిన నొప్పి ప్రస్తుతం లేదు. ఇప్పుడు బావున్నా. కానీ, ముందుముందు నా పురుషాంగం ఇంకొంత కత్తిరించాల్సి రావొచ్చు.''

యూకే క్యాన్సర్ రీసర్చ్ ప్రకారం, పెనైల్ క్యాన్సర్‌కి గురైన వారిలో దాదాపు 90 శాతం కంటే ఎక్కువ మందిలో ఇది వృషణాలకు వ్యాపించలేదు, అందువల్ల ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది.

రోన్ కార్వాలో, బీబీసీ బ్రెజిల్ అదనపు రిపోర్టింగ్

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)