వెల్లుల్లి జలుబును తగ్గిస్తుంది, క్యాన్సర్ నిరోధిస్తుందనే మాటల్లో నిజమెంత?

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

వెల్లుల్లి జలుబును నయం చేస్తుందని, బీపీ తగ్గిస్తుందని, శరీరంలో కొవ్వుని (కొలెస్ట్రాల్‌) నియంత్రిస్తుందనే అభిప్రాయాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. కానీ, శాస్త్రీయంగా అవి నిరూపితమయ్యాయా? ఆహారంలో వెల్లుల్లిని ఎంతవరకూ తీసుకోవచ్చు?

అలాంటి అభిప్రాయాలను మీరు నమ్మితే, జలుబు చేసిందని అనిపించినప్పుడు వెల్లుల్లి తీసుకోవడానికి మీరు సిద్ధమైపోవచ్చు. అలా వెల్లుల్లిని మీ ముక్కురంధ్రాల్లో మాత్రం పెట్టుకోకండి.

జలుబుకు మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలుగా ఆరోగ్యానికి వెల్లుల్లి మేలు చేస్తుందని చెబుతుంటారు. అయితే, ఈ వాదనలను సైన్స్ ఒప్పుకుంటుందా? వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.

వెల్లుల్లితో ఆరోగ్యపరమైన ప్రయోజనం ఉందా?

''వెల్లుల్లిలో పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, సల్ఫర్ అధిక మోతాదులో ఉంటాయి. మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ మధ్యస్తంగా ఉంటాయి. ఇదొక అద్భుతమైన కూరగాయ'' అని బ్రిటిష్ డైటీషియన్ అసోసియేషన్ ప్రతినిధి, పీడియాట్రిక్ డైటీషియన్ (పోషకాహార నిపుణులు) బహీ వాన్ డి బోర్ చెప్పారు.

పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్‌ అధికంగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే సల్ఫర్‌ సమ్మేళనం. ఇది మనకు కచ్చితంగా మంచిది. ఇది అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, ప్రీబయోటిక్ ఫైబర్‌‌ను అందించే గొప్ప వనరు కూడా. ఇది మన పేగులో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పోషణకు కీలకం.

''జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచేందుకు, సక్రమంగా పనిచేసేలా చేసేందుకు పేగులోని ఈ మంచి బ్యాక్టీరియాకి ఫైబర్‌ అవసరం.''

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

వెల్లుల్లి కొలెస్ట్రాల్‌, బీపీ తగ్గిస్తుందా?

2016లో ఇరాన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో పాల్గొన్నవారు ప్రతిరోజూ 20 గ్రాముల వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిశ్రమాన్ని ఎనిమిది వారాలపాటు తీసుకున్నారు. దాని ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్, బీపీ రెండూ తగ్గినట్లు చూపించింది.

అదే ఏడాది ప్రచురితమైన మరో అధ్యయనం వెల్లుల్లి రక్తపోటును తగ్గించగలదని పేర్కొంది.

అయితే, మీరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని సంప్రదిస్తే అందుకు విరుద్ధమైన సమాధానం వస్తుంది. ఆ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందనే 'అపోహ'ను తొలగిస్తూ 2007లో ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించారు.

''ఓ మోస్తరుగా కొలెస్ట్రాల్ పెరిగిన 200 మంది ఆరోగ్యవంతులైన పెద్దలు ఆరునెలల పాటు వెల్లుల్లిని తీసుకున్నారు. అది రక్తంలోని కొలెస్ట్రాల్ (LDL - కొలెస్ట్రాల్)‌ను తగ్గించలేకపోయింది.

వారికి రోజుకొక డోసు చొప్పున ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బ ఇచ్చారు'' అని ఆ అధ్యయనం రాయడంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ గార్డెనర్ వివరించారు.

వెల్లుల్లి హృదయనాళాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఇటీవల ప్రచురితమైన అధ్యయన పత్రాలను చూస్తే, గార్డెనర్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటారా?

''మా అధ్యయనంలో 200 మంది పాల్గొన్నారు. ఆరు నెలల పాటు, నిలకడగా జరిగింది. అది నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) నిధులు 1.4 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి నిర్వహించిన అధ్యయనం.

మా అధ్యయనం ప్రచురితమైనప్పటి నుంచి, అంత కచ్చితత్వంతో అధ్యయనం జరిగిందంటే నాకు ఆశ్చర్యమే. కానీ, అది నిజమైతే దాని ఫలితాల గురించి తెలుసుకోవడం ఆసక్తికరమే.''

''వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండొచ్చన్నది ఆమోదయోగ్యమే. కానీ, సమగ్రంగా నిర్వహించిన ఏదైనా అధ్యయనం ద్వారా వాటిని నిర్ధారించడమే సవాల్'' అని నిపుణులు చెబుతున్నారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

వెల్లుల్లి క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుందా?

టీఎన్‌యూ నార్వే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ మారిట్ ఒట్టెర్లీ, ఆమె సహచరులు తమ క్యాన్సర్ పరిశోధనలో భాగంగా వెల్లుల్లిపై పరిశోధనలు జరిపారు.

''తాజా పచ్చి వెల్లుల్లిలోని పదార్థాలు సెల్యులార్ స్ట్రెస్ మెకానిజంను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడతాయని గుర్తించాం. అది కణాల ప్రొటీన్‌ ఉత్పత్తి, లేదా ప్రొటీన్ పునరుద్ధరణలో సమస్యలున్న కణాలను నాశనం చేయడంలో కీలకమని భావిస్తున్నాం.''

ఈ బృందం తాజా వెల్లుల్లి, ఇథనాల్‌ను ఉపయోగించి వెల్లుల్లి సారాన్ని తయారుచేసింది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లలో ప్రయోజనకరంగా పనిచేస్తోంది.

''పెద్దపేగు, పురీషనాళం, రొమ్ము, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లలో ప్రయోజనకరమైన ప్రభావం ఉంటుందని తెలిపే అనేక ఎపిడెమిలాజికల్ అధ్యయనాలు ఉన్నాయి. ఎలుకలపై మేం ఆ వెల్లుల్లి సారాన్ని పరీక్షించాం. అందులో క్యాన్సర్ నిరోధక ప్రభావాలు ఉన్నట్లు కనుగొన్నాం.''

అయితే, ఈ ఫలితాలకు షరతులు వర్తిస్తాయి. ఉదాహరణకు, వెల్లుల్లి మిశ్రమం ద్రవపదార్థం కావొచ్చు. కానీ అది గడ్డకట్టినప్పుడు, లేదంటే ఎండిపోయినప్పుడు, అది తక్కువ ప్రభావవంతంగా మారుతుంది. ''ఆరోగ్య సంబంధిత పదార్థాలు చాలా వరకూ గడ్డకట్టి, లేదా ఎండిపోయి ఉంటాయి, అందువల్ల ఇదొక ముఖ్యమైన విషయం.''

రెండోది ఈ అధ్యయనం జంతువులపై జరిగింది, మనుషులపై కాదు. అయితే, మనుషుల్లోనూ ఇవే ఫలితాలు రావొచ్చని ఒట్టెర్లీ బలంగా విశ్వసిస్తున్నారు.

పచ్చి వెల్లుల్లి, వెల్లుల్లి సారం లేదా అల్లిసిన్ ఉపయోగించి, మనుషుల భాగస్వామ్యంతో నిర్వహించిన 83 పరీక్షలను ఇటీవల సమీక్షించగా, అందులో క్యాన్సర్‌తో సహా అనేక విషయాల్లో ప్రయోజనకర ప్రభావాలు చూపుతున్నట్లు తేలింది.

''వారానికి రెండు కంటే ఎక్కువ పచ్చి వెల్లుల్లి రెబ్బలు ఉండే ఆహారాలపై ఎన్నో ఎపిడెమిలాజికల్ అధ్యయనాలు జరిగాయి. అందులో అలాంటి ఆహారాల వల్ల క్యాన్సర్ ప్రమాదం తక్కువని కనుగొన్నారు.''

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

జలుబును నయం చేస్తుందా?

మేం మాట్లాడిన కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, వెల్లుల్లి జలుబుని నివారిస్తుందని సూచించే అధ్యయనాలు ఉన్నాయి. దీనిపై యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీ ప్రొఫెసర్ మార్క్ కోహెన్ పరిశోధన చేశారు. ఆ అధ్యయనంలోని వెల్లడైన విషయాలను నిర్ధారించడానికి లేదా తిరస్కరించడడానికి తగిన ఆధారాలు లేవని ఆయన గుర్తించారు. అయినప్పటికీ వెల్లుల్లి ఉపయోగపడుతుందని ఆయన నమ్ముతున్నారు.

''ఇన్ఫెక్షన్ల నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుందని సమర్థించే ఆధారాలు లభ్యమయ్యాయి. వెల్లుల్లిలో బలమైన యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెల్లుల్లిలో యాంటీవైరల్ లక్షణాలు బలంగా ఉన్నాయని, కణాల్లోకి వైరస్ ప్రవేశాన్ని ఇది నిరోధిచంగలదని వెల్లుల్లి యాంటీవైరల్ లక్షణాలపై ఇటీవల నిర్వహించిన అధ్యయనం సూచిస్తోంది.''

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

వెల్లుల్లిని ఆహారంలో ఎలా తీసుకోవాలి?

ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లయితే, ''మీ ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవడం కీలకం'' అని వాన్ డి బోర్ చెప్పారు. ''అందరికీ ఒకటే మోతాదు సరిపోక పోయినప్పటికీ, కనీసం వారానికి ఒకసారైనా భోజనంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి''

భోజనంలో వెల్లుల్లి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ఎలా అనే దాని గురించి వంట నిపుణులు, కుక్‌బుక్ గార్లిక్ రచయిత లిన్‌ఫోర్డ్‌ని సలహా అడిగాం.

మీరు కోరుకున్నట్లు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేయొచ్చు. వెల్లుల్లి రుచి ఎక్కువగా ఉండాలని కోరుకుంటే వెల్లుల్లి పేస్ట్ చేసి మీరు తయారుచేసే వంటకంలో వాడొచ్చు. పేస్ట్‌ను వేయడం వల్ల వెల్లుల్లిలోని అన్ని పదార్థాలు వంటకంలో కలుస్తాయి.

కేవలం వెల్లుల్లి ఫ్లేవర్ కావాలనుకుంటే వెల్లుల్లి రెబ్బలను ఆలివ్ ఆయిల్‌లో వేయించి, ఆ తర్వాత తీసేయండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కలిసిన నూనెతో వంట చేస్తే వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది.

మీరు చేసుకునే సలాడ్‌కు వెల్లుల్లి ఫ్లేవర్ రావాలనుకుంటే, సలాడ్ పాత్ర లోపలి భాగాన్ని వెల్లుల్లి రెబ్బలతో రుద్దాలి.

వెల్లుల్లిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. వెల్లుల్లి మెత్తబడినా, లేదా గోధుమ రంగులోకి మారినట్లు కనిపించినా ఆ వెల్లుల్లి గడ్డను పాడైపోయినట్లుగా భావించి పడేయాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి అందరికీ మంచిదేనా?

వెల్లుల్లి కొంతమందిలో ఉదర సంబంధిత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ''దురదృష్టవశాత్తూ కొంతమందికి, ముఖ్యంగా ఐబీఎస్(ఇర్రిటబుల్ బొయెల్ సిండ్రోమ్ - ఆహార నాళంలో సమస్య) ఉన్న వారికి ఇబ్బందికరం. అందువల్ల ఐబీఎస్ ఉన్న పిల్లలతో సహా ఎవరికైనా ఇబ్బంది ఉంటే, అది ఏస్థాయిలో ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం'' అని వాన్ డి బోర్ చెప్పారు.

''వెల్లుల్లి రుచిని ఇంకా బాగా ఆస్వాదించాలంటే వంటలో వెల్లుల్లి కలిపిన నూనెలను ఉపయోగించడం ఒక మంచి ప్రత్యామ్నాయం. ఈ పద్ధతి ఐబీఎస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ నూనెలో తక్కువ స్థాయిలో ఉండడమే అందుకు కారణం.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)