బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, బెర్న్డ్ డెబస్మాన్ జూనియర్, టామ్ బాట్మన్,
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టి మోర్ నగరంలో పటాప్‌స్కో నదిపై ఉన్న ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి’ని డాలీ నౌక ఢీకొన్న సమయంలో ఏం జరిగింది? 948 అడుగుల (289 మీటర్ల) పొడవున్న డాలీ కంటైనర్ నౌకలోని సిబ్బంది ఏం జరుగుతుందో గ్రహించేలోపే ఈ ప్రమాదం సంభవించిందా?
ఈ నౌక శ్రీలంకకు వెళ్ళేందుకు 27 రోజుల ప్రయాణానికి సిద్ధమై, బాల్టిమోర్ నౌకాశ్రయాన్ని దాటి ఆ నగరంలోని ప్రసిద్ధ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జి వైపు దూసుకుపోయింది.
అదే సమయంలో నౌకలో కరెంట్ పోయింది. ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి. నౌక ఇంజిన్‌కు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అప్పటికే అర్థరాత్రి అయింది. నౌకలో విద్యుత్ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సిబ్బంది అంతా మరింత చీకటిలోకి జారుకున్నారు.
నౌకలోని స్థానిక నావికుడు చుక్కానిని పోర్టు వైపు తిప్పమని, లంగరు వేయమని హడావిడిగా ఆదేశాలు ఇస్తున్నారు.
చివరకు అత్యవసర జనరేటర్‌ను ఆన్ చేసినా నౌక ఇంజిన్లు పనిచేయలేదు.
నౌక ప్రమాదానికి గురికాబోతోందని అర్థం చేసుకున్న సిబ్బంది గత్యంతరం లేని స్థితిలో అర్థరాత్రి 1.30గంటల సమయంలో మేడే కాల్ జారీ చేశారు.
‘‘ఒక ఓడ నియంత్రణ కోల్పోయింది’’ అని మేరీల్యాండ్ రవాణా అధికారి ఒకరు రేడియోలో చెప్పారు. ‘‘దానిని మీరు నియంత్రణలోకి తెచ్చేవరకు మేం ట్రాఫిక్‌ను ఆపాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.
నౌకలోని సిబ్బందిని మేరీ ల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ ‘హీరోలు’గా అభివర్ణించారు. ఈ ప్రమాదంలో వారు వెంటనే స్పందించిన కారణంగానే అధికారులు బ్రిడ్జిపై వాహన రాకపోకలను నిలిపి వేయగలిగారని, తద్వారా అనేకమంది ప్రాణాలు కాపాడినట్లయిందని తెలిపారు.
మేడే కాల్ కు, నౌక వంతెనను గుద్దుకోవడానికి మధ్యనున్న రెండు నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగిందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
నిత్యం 30 వేలమంది రాకపోకలు
డాలీ నౌక 1.5 మైళ్ళ పొడవు (2.4 కిలోమీటర్లు)న్న బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్‌ను ఢీ కొట్టగానే, బ్రిడ్జి ముక్కముక్కలై పాటాప్స్కో నదిలోని చల్లటి నీటిలో పడిపోయింది.
ఆ సమయంలో బ్రిడ్జిపై పనిచేస్తున్న రహదారి సిబ్బంది ఆరుగురు నదిలోకి పడిపోయారు. వీరంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం అమెరికా తీర ప్రాంత గస్తీదళం ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
చనిపోయిన ఆరుగురు మెక్సికో, గ్వాటెమాల, హోండురస్, ఎల్ సాల్విడార్‌కు చెందినవారిగా స్థానిక మీడియా పేర్కొంది. అయితే, బీబీసీ దీనిని స్వతంత్రంగా నిర్ధరించలేదు. దీనిపై స్పందించాల్సిందిగా దౌత్యాధికారులను కోరింది.
ఇక నౌకలో ఉన్న 22 మంది సిబ్బంది భారతీయులే. ఈ ప్రమాదంలో వారిలో ఎవరూ గాయపడలేదు.
47 సంవత్సరాల కిందట కట్టిన ఈ బ్రిడ్జి కూలిపోవడం గవర్నర్ మూరె సహా నగరంలోని అనేకమందిని కదిలించింది.
ఈ బ్రిడ్జిపై ప్రతిరోజూ 30 వేల మంది మేరీలాండ్ వాసులు రాకపోకలు సాగిస్తుంటారు.
‘‘కీలకమైన ఈ బ్రిడ్జి కూలిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుండె పగిలిపోయింది’’ అని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గవర్నర్ మూరె చెప్పారు.
డాలీ నౌకలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోవడానికి అసలు కారణమేంటనే విషయం ఇంకా అస్పష్టంగానే ఉంది.
జాతీయ రవాణా రక్షణ బోర్డు చైర్మన్ జెన్నిఫర్ హోమాండే మాట్లాడుతూ డేటా రికార్డర్ లోని సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉందని చెప్పారు.
‘‘మా విచారణలో ఇదో కీలకాంశం’’ అని ఆమె చెప్పారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది బాధితులు, వారి కుటుంబాల గురించి అని ఆమె తెలిపారు.
మంగళవారం తెల్లవారగానే బ్రిడ్జి సమీపంలో నివసించేవారందరూ ఈ ఘటన గురించి తెలుసుకుని నివ్వెరపోయారు.
‘ఈ విషయం తెలియగానే వణుకు వచ్చింది. ఇదో దుర్దినం’’ అని నదికి సమీపంలో నివసించే జాన్ ఫ్లాన్స్‌బర్గ్ చెప్పారు. మరో స్థానికురాలు డార్లెన్ ఇర్విన్ మాట్లాడుతూ తనకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు ఏదో ప్రమాదం జరుగుతోందని భావించానని చెప్పారు.
కొన్ని గంటల తరువాత ఆమె తన ఇంటి కిటికీ నుంచి పాటాప్క్సో నది వైపు చూసినప్పుడు అక్కడ విధ్వంసం ఏ స్థాయులో జరిగిందో అర్థమైంది.
మూడు వేల కంటైనర్లను మోసుకుపోతున్న నౌక కూలిపోయిన బ్రిడ్జి శిథిలాల మధ్యన చిక్కుకుపోయి కనిపించింది.
కొంతసేపటి తరువాత ఆ ప్రాంతమంతా పోలీసు బోట్లతో గాలింపు, సహాయక చర్యలకు వేదికగా మారిపోగా, తీర గస్తీదళం హెలికాప్టర్లు పైన ఎగురుతూ కనిపించాయి.
స్థానిక పాఠశాల క్రీడా మైదానంలో రెండు అమెరికా యూహెచ్ -60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు నిలిపి ఉంచారు.
గల్లంతైన వారిపైనే తమ దృష్టినంతటిని కేంద్రీకరించినట్టు అధికారులు పదేపదే చెపుతున్నా, ఈ ఘటన ప్రభావం అమెరికా తీరప్రాంతంలో అత్యత రద్దీగా ఉండే బాల్టిమోర్ ఓడరేవు పై కూడా పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
ఈ జలమార్గం అమెరికాకు కీలకం
ఈ జలమార్గాన్ని తిరిగి తెరవడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని మేరీలాండ్ సెనేటర్ బెన్ కార్డిన్ విలేఖరులకు చెప్పారు.
ఈ పోర్టు వస్తు రవాణాకు కీలకమైన ప్రాంతీయ కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచి ఇనుము, అల్యూమినియం నుంచి వ్యవసాయ పరికరాలవరకు రవాణా అవుతుంటాయి. జనరల్ మోటార్స్, హోండా కార్ల కంపెనీలు కూడా ఈ పోర్టును ఉపయోగించుకుంటాయి.
కిందటేడాది ఈ పోర్టు నుంచి 7,50,000 కార్ల రవాణా జరిగినట్టు మేరీలాండ్ పోర్ట్ అధికారుల వద్ద ఉన్న డేటా ద్వారా తెలుస్తోంది.
‘‘ఈ ఘటన ఇతర నౌకల ప్రయాణానికి భంగం కలిగించచడమే కాక, ఫిలడెల్ఫియా, నార్‌ఫోక్ ఓడరేవుల నిర్వహణా సామర్థ్యాన్ని కష్టతరం చేస్తోంది. అంతిమంగా నౌకా రవాణా ఆలస్యమవుతుంది’’ అని మిర్కో వోయిట్జిక్ చెప్పారు. ఆయన గోలుసు కట్టు సరఫరా సేవలు అందించే ఎవర్ స్ట్రీమ్ అనలిటిక్స్ కు గ్లోబల్ డైరక్టర్ గా ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ వద్ద మంగళవారం మాట్లాడుతూ తన సొంత రాష్ట్రం డెలావర్ నుంచి వాష్టింగ్టన్ కు రావడానికి ఆ బ్రిడ్జి మీదుగా అనేకసార్లు ప్రయాణించినట్టు గుర్తు చేసుకున్నారు. ఈ వంతెనను పునరుద్ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
‘‘ఈ ఆపత్కాలాన్ని ఎదుర్కోవడానికి మనమంతా ఫెడరల్ వనరులను వినియోగించి, పోర్టును పునర్ నిర్మిద్దాం’’ అని చెప్పారు. ఈ పోర్టుపై 15 వేల ఉద్యోగులు ఆధారపడి ఉన్నారని బైడెన్ చెప్పారు.
అయితే ఈ కార్యక్రమం ఎప్పటిలోగా పూర్తి అవుతుందనే విషయాన్ని చెప్పడానికి అధికారులు నిరాకరించారు.
ప్రస్తుతానికి తామంతా గాలింపు, రక్షణ చర్యలపైనే పూర్తిగా దృష్టి సారించినట్టు అధికారులు చెప్పారు.
డాలీ నౌక ప్రమాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ట్రాకింగ్ వెబ్ సైట్ వెస్సెల్ ఫైండర్ ప్రకారం 2016లో ఈ నౌక బెల్జియన్ పోర్ట్ యాంట్‌రెప్ లో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఎవరూ గాయపడినట్టుగానీ, చెప్పుకోదగ్గ నష్టం జరిగినట్టుగానీ తెలియరాలేదు.
మంగళవారం చీకటిపడిపోవడంతో నౌక, అందులోని 3వేల కంటైనర్లు పాటాప్స్కో నదిపైనే ఉండిపోయాయి. నౌక ముందుభాగం వంతెన శిథిలాల మధ్యన చిక్కుకునే ఉంది.
ఇవి కూడా చదవండి:
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- చైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందా, ప్రపంచం మీద ప్రభావం ఏంటి? 5 కీలక పరిణామాలు
- మిషన్ కనెక్ట్ పాడేరు: వేయని రోడ్డుకు రూ.65 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టర్లు...బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















