మిషన్ కనెక్ట్ పాడేరు: వేయని రోడ్డుకు రూ.65 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టర్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

మిషన్ కనెక్ట్ పాడేరు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గుమ్మ పంచాయతీలోని నిమ్మోట గ్రామానికి వెళ్లాలంటే సముద్ర మట్టం నుంచి 3 వేల అడుగుల ఎత్తుకి చేరుకోవాలి.

దీనికి సమీపంలోనే కర్రిగూడ, కడరేవు అనే గ్రామాలున్నాయి. ఈ మూడు గ్రామాలను కలుపుతూ ‘మిషన్ కనెక్ట్ పాడేరు’ ప్రాజెక్టులో భాగంగా రహదారి మంజూరైంది.

ఈ రోడ్డును వేయాలంటే గిరిశిఖర గ్రామాలను కలుపుతూ 3.8 కిలోమీటర్లు మేర కొండపై భాగం నుంచి గ్రామాల వరకు రోడ్ ఫార్మేషన్ చేయాలి. అడ్డొచ్చిన కొండలను బ్లాస్టింగ్ చేయాలి. కల్వర్టులు నిర్మించాలి.

అవసరమైన చోట చిన్న బ్రిడ్జిలు కట్టాలి. ఆ తర్వాత గ్రావెల్ వేయాలి. ఆ తరువాతే రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుంది.

కానీ, అవేవి జరగక్కుండానే మొత్తం పనులు అయిపోయినట్లు చూపించి కాంట్రాక్టర్లకు డబ్బులు బదిలీ చేశారు. వాస్తవానికి చెట్లు తొలగించడం, బ్లాస్టింగ్స్ వంటి కొన్ని పనులు మాత్రమే చేశారు.

అసలు నిమ్మోట నుంచి కడరేవు వరకు మంజూరైన రోడ్డు విషయంలో ఏం జరిగింది? అధికారులు రోడ్డు వేశామని చెబుతున్న చోట ప్రస్తుతం ఏముంది? ఏళ్లుగా తమ గ్రామాలకు రోడ్డు కోసం ఎదురు చూస్తున్న గిరిజనులు ఏమంటున్నారు? బీబీసీ పరిశీలనలో ఏం తేలింది? బీబీసీ వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగింది?

నిమ్మోట గ్రామస్థులు

నిమ్మోట గ్రామం నుంచి మొదలు పెడితే...

అనంతగిరి మండలంలోని నిమ్మోట నుంచి కడరేవుకి రోడ్డు వేయాలంటే మధ్యలో కొండ దాటాలి. ఆ కొండ దిగువన ఉన్న కర్రిగూడ మీదుగా ఆ రోడ్డు వెళ్తుంది. దీని మొత్తం పొడవు 3.8 కిలోమీటర్లు. రోడ్ ఫార్మేషన్, అంటే మొక్కలు తొలగించడం, చదును చేయడం వంటి పనుల కోసం 2021లో రూ.25 లక్షలు మంజూరయ్యాయి.

ఇక్కడ రోడ్డు అంటే తారు రోడ్డు లేదా సిమెంటు రోడ్డు కాదు. గ్రావెల్ రోడ్డు మాత్రమే. చిన్నచిన్న చెట్లు, మొక్కలు, ముళ్లపొదల్ని తొలిగించి చదును చేసి ఒక దారిని ఏర్పాటు చేస్తారు. అవసరమైన చోట కల్వర్టులు, చిన్న వంతెనలు నిర్మిస్తారు.

ప్రభుత్వం ఈ పనులకు దశల వారీగా బిల్లులను కాంట్రాక్టర్లకు మంజూరు చేస్తుంది. ఇలా 2023 మార్చి 23 నుంచి జూన్ 12 మధ్య మొత్తం రూ.65 లక్షలను కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు ఎఫ్టీవో (Fund Transfer Order) లెక్కల ద్వారా తెలుస్తోంది. నిమ్మోట నుంచి కర్రిగూడ మీదుగా కడరేవు వరకు రోడ్డు పనులు చేసినందుకు కాంట్రాక్టర్ (మెటీరియల్ సప్లయర్) కు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

నిమ్మోట రోడ్డు పనులు

అయితే సుమారు రూ. 65 లక్షలు కాంట్రాక్టరుకు ఇచ్చినా...ఆ మొత్తానికి అధికారులు చెబుతున్నట్లు రోడ్డు పనులు పూర్తి కాలేదు. జరిగిన కొద్ది మేర పనులు కూడా ప్రస్తుతానికి నిరుపయోగంగానే ఉన్నాయి. పైగా ఈ రోడ్డుని ఎలా పూర్తి చేయాలో తెలియని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.

ఈ విషయాన్ని అరకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వేణుగోపాల్ వద్ద బీబీసీ ప్రస్తావించింది. ఇప్పుడు పనులు నిలిచిన మాట వాస్తవమే కానీ, మరో మూడు నెలల్లో ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

ప్రస్తుతానికి కొంత భాగం జంగిల్ క్లియరెన్స్, బ్లాస్టింగ్ వంటి రోడ్ ఫార్మేషన్ వర్క్, నిమ్మోట గ్రామం నుంచి దాదాపు కిలోమీటరున్నర గ్రావెల్ వర్క్ మాత్రమే జరిగినట్లు అక్కడికి వెళ్లిన బీబీసీ బృందానికి కనిపించింది.

మిషన్ కనెక్ట్ పాడేరు

పనులు జరగకుండానే నిధులు జమ

ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు కూడా రహదారి సదుపాయం కల్పించాలనేది ‘మిషన్ కనెక్ట్ పాడేరు’ ప్రాజెక్టు లక్ష్యం.

ఉపాధి హామీ పథకంలో భాగంగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిమ్మోట గ్రామం నుంచి కడరేవు గ్రామం వరకు రూ. 1 కోటి 2 లక్షలతో రోడ్డు మంజూరైంది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన వివిధ పనులకు గానూ మొత్తం రూ. 65 లక్షలు నిధులు మంజూరు చేశారు.

నిమ్మోట గ్రామం నుంచి కర్రిగూడ వరకు మాత్రమే కొద్దిమేర రోడ్డు పనులు చేసి కడరేవు రోడ్డు పనులు జరిగినట్లు బిల్లులు పాస్ చేశారు. పనులు చేయకుండానే బిల్లులు కాంట్రాక్టర్‌కు ఎలా పాస్ చేశారని ఇంజనీరింగ్ అధికారులను బీబీసీ ప్రశ్నించింది.

నిమ్మోట నుంచి కడరేవు వరకు రోడ్ పనులు పూర్తి కాలేదని అరుకు ట్రైబల్ వెల్ఫేరు విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్ ఒప్పుకున్నారు.

కానీ, బిల్లులు మాత్రం జరిగిన పనికే (నిమ్మోట నుంచి కడరేవు వరకు చేసిన కొన్ని పనులు) చెల్లించామని, నిమ్మోట నుంచి కడరేవు వరకు భాగాలుగా కాకుండా ఒకే పనిగా భావించడంతో మొత్తం పేమెంట్ చేసినట్లు సమాధానం చెప్పారు.

కర్రిగూడ నుంచి కడరేవు గ్రామానికి (పనుల్లో ఒక భాగం) రోడ్ ఫార్మేషన్, సీడీ వర్క్స్ (కల్వర్టులు, బ్లాస్టింగ్, చిన్న వంతెనలు, గ్రావెల్ రోడ్ వేయడం) పూర్తి చేసినందుకు 2023 జూన్ 12న కాంట్రాక్టర్‌కు బిల్లు నెంబరు 1 ద్వారా రూ. 1,99,862.84 (రూ. 2 లక్షలు) చెల్లించారు.

ఇదే తరహాలో కర్రిగూడ నుంచి కడరేవు వరకు వివిధ పనులు చేసినట్లు మొత్తం 8 బిల్లులకు సంబంధించిన సొమ్మును కాంట్రాక్టరు ఖాతాలో వేశారు. ఇక మొత్తం నిమ్మోట నుంచి కడరేవు వరకు జరిగిన పనులను లెక్కేస్తే సుమారు రూ.65 లక్షల బిల్లును కాంట్రాక్టరుకు జమ చేశారు.

ఈ కాంట్రాక్టు పనులు చేసిన మెటీరియల్ సప్లయర్ (కాంట్రాక్టర్) కె. వెంకటేశ్వర రాజును బీబీసీ ప్రశ్నించింది. అందుకు ఆయన...

‘‘నిమ్మోట నుంచి కడరేవు వరకు జరిగిన వివిధ పనులకు గాను మాకు బిల్లులు చెల్లించారు. దానికి పనులు కూడా చేశాం. కానీ అక్కడ వర్షాలు, ఇతర పరిస్థితులు కారణంగా పనులు ప్రారంభించాక ఆగిపోయాయి. కర్రిగూడ, కడరేవు మధ్య కూడా మేం రోడ్డు పనులు చేశాం. కానీ వర్షాలు కారణంగా అక్కడ మొక్కలు మొలిచి మేం చేసిన పనులు కనిపించడం లేదు.” అని బీబీసీకి చెప్పారు.

బిల్లులకు సంబంధించిన సొమ్మును ముందుగా ఎలా తీసుకున్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు.

“ప్రస్తుతం పనులు చేస్తున్నాం. వారం రోజుల్లో పూర్తి చేస్తాం. విత్ డ్రా చేసిన డబ్బుతో ఎక్కడెక్కడ ఏయో పనులు చేశామనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేం. త్వరలో వివరాలు చెప్పగలను. ప్రస్తుతానికి ఇంతకు మించి మాట్లడలేను.” అని చెప్పారు.

గిరిజనులు

ఆరు కిలోమీటర్లు నడిచినా కనిపించని ఆనవాళ్లు

కర్రిగూడ నుంచి కడరేవుకు పనులు జరిగినట్లు బిల్లులు క్లియర్ అవ్వడంతో అక్కడ అసలు ఏం పనులు జరిగాయనే అంశాన్ని పరిశీలించేందుకు బీబీసీ బృందం కాలినడకన ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసి కడరేవు గ్రామం చేరుకుంది.

ఈ ఆరు కిలోమీటర్ల పొడవునా రాళ్లు, రప్పలు, డొంకలు, నాలుగు వాగులు కనిపించాయి తప్ప ఎక్కడా మట్టి రోడ్డు కానీ ఆ దారి కోసం పనులు జరిగినట్లు కానీ ఆనవాళ్లు కనిపించలేదు.

‘‘మాకు రోడ్డు మంజూరైంది. దానికి డబ్బులు కూడా వచ్చాయి. కానీ రోడ్డు మాత్రం మా గ్రామంలో కనిపించడం లేదు. మా గ్రామంలో రోడ్డు ఎక్కడుందో అధికారులు వచ్చి చూపించాలి’’ అని కడరేవు గ్రామస్థుడు రాజారావు అన్నారు.

‘‘రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఏ చిన్న పనికైనా 14 కిలోమీటర్లు కొండెక్కి, దిగి, వాగులు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. అందుకు 8 గంటలు పడుతోంది. రోడ్డు వచ్చిందని సంబరపడితే అధికారులకు డబ్బులు వచ్చాయి కానీ మాకు రోడ్డు రాలేదు’’ అని కడరేవుకు చెందిన ముత్యాలమ్మ అన్నారు.

నిమ్మోట నుంచి కర్రిగూడ వరకు కొంచెం పని జరిగినట్లు కనిపించినా, కర్రిగూడ నుంచి కడరేవుకు కనీసం జంగిల్ క్లియరెన్స్ జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. దీనిపై అధికారులను బీబీసీ ప్రశ్నిస్తే, కొంత పని చేసినా అక్కడ మళ్లీ మొక్కలు మొలిచాయని, వాటిని తొలగించాల్సిన బాధ్యత కాంట్రాక్టరుదేనని సమాధానం చెప్పారు.

కొండపై పలకల రాళ్లు అడ్డంగా రావడంతో రోడ్డు పనులు నిలిచిపోయాయని, త్వరలోనే కింద నుంచి మళ్లీ పనులు మొదలు పెట్టి, కొండపై ఉన్న రోడ్డుకు కనెక్ట్ చేస్తామని అధికారులు చెప్పారు.

“నిమ్మోట నుంచి కడరేవుకు రోడ్డు వేసేందుకు రెండు ప్రయత్నాలు చేశాం. ఆ రెండు ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. స్థానికులు కూడా పైనుంచి కాకుండా కింద నుంచే రోడ్డు వేయండని కోరుతున్నారు. అందుకే కొండపై జరిగిన పనులను నిలిపి వేసి, కింద నుంచి పనులు మొదలు పెడతాం” అని అనంతగిరి ట్రైబల్ వెల్ఫేర్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ గణేష్ బీబీసీతో చెప్పారు.

మిషన్ కనెక్ట్ పాడేరు

నిధులు పక్కదారి పట్టిస్తున్నారు: గిరిజన సంఘాలు

‘‘మిషన్ కనెక్ట్ పాడేరు’’ నిధుల్ని అధికారులు పక్కదోవ పట్టిస్తున్నారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కొండపైన ఉన్న గిరిశిఖర గ్రామాలను ఎవరూ పట్టించుకోరని, అక్కడ ఏం చేసినా ఎవరికీ తెలియదనే దీమాతో అధికారులు పనులు చేయకుండా, చేసినట్లు బిల్లులు పాస్ చేస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కైపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయిదో షెడ్యూల్ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు కె. గోవిందరావు బీబీసీతో చెప్పారు.

“గిరిజన గ్రామాలకు నిధులు మంజూరైనా రోడ్డు పనులు చేయకుండానే చేసినట్లు చూపించి నిధులు నొక్కేస్తున్నారు. పనులు చేయకుండా బిల్లులు చెల్లించకూడదు. అలాంటిది బిల్లులు చెల్లించి దాదాపు ఏడాదవుతున్న పనులు పూర్తి కాలేదు. మరి అధికారులు ఏం చేస్తున్నారు?” అని కె. గోవిందరావు ప్రశ్నించారు.

మిషన్ కనెక్ట్ పాడేరు

మిషన్ కనెక్ట్ పాడేరు ప్రాజెక్టు

అల్లూరి జిల్లాలోని పాడేరు డివిజన్‌లో డోలీమోతలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ‘‘మిషన్ కనెక్ట్ పాడేరు’’ ప్రాజెక్టుని ప్రారంభించారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రావెల్, మెటల్ రోడ్లు నిర్మించి ఆదివాసీల రాకపోకల సమస్యలను పరిష్కరించడం దీని లక్ష్యం.

11 మండలాల పరిధిలో 1,180 కి.మీ మేర 485 రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ. 354 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటిలో గతేడాది అక్టోబర్‌కు కేవలం రూ.57.81 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అయితే పనులు జరగకుండానే కొన్నిచోట్ల బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

‘‘అనంతగిరి మండలంలో నిమ్మోట, కడరేవు, పాతకోట, నందిగొమ్మి, తేనెపట్టు రహదారి పనుల్లో భారీ ఎత్తున ఆక్రమాలు జరిగాయి. ఏజెన్సీలోని అన్నిచోట్లా మిషన్ కనెక్ట్ పాడేరు రోడ్ల పనుల తీరు ఇలానే ఉంది. ఇందుకు నిమ్మోట-కడరేవు రోడ్డు ఉదాహరణ’’ అని గోవిందరావు ఆరోపించారు.

మిషన్ కనెక్ట్ పాడేరు

‘‘మళ్లీ మొదలైన పనులు’’

ఈ ఏడాది మార్చి 20, 21వ తేదీల్లో బీబీసీ అక్కడకు వెళ్లి పరిశీలించింది. ఆ తర్వాత 24వ తేదీ నుంచి రోడ్డు పనులు ప్రారంభించినట్లు అధికారులు కొన్ని ఫోటోలు, వీడియోలు బీబీసీకి పంపించారు. ఇదే విషయాన్ని స్థానిక గిరిజనులను బీబీసీ అడుగగా, వారు కూడా పనులు మొదలైనట్లు తెలిపారు.

‘‘గిరి శిఖర గ్రామం కావడంతో పనులు ఆలస్యం అయ్యాయి. కాంట్రాక్టరుకి ఇచ్చిన ప్రతి రూపాయికి పని చేయిస్తాం. మూడు నెలల్లో కచ్చితంగా నిమ్మోట- కడరేవు రోడ్డు పనులు పూర్తి చేస్తాం’’ అని ఇంజనీరింగ్ అధికారులు బీబీసీతో చెప్పారు.

మీడియా వచ్చిందని కంటితుడుపు కోసం కాకుండా పనులు తొందరగా పూర్తి చేయాలని గిరిజనులు కోరారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: వేయని రోడ్డుకు రూ.65 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టర్లు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)