ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి?

వెలిగొండ
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి, రైతులకు నీళ్లు అందిస్తామని 2020లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

ఆ తర్వాత, 2022 ఆగస్టు నాటికి అంటూ పొడిగించారు. చివరకు 2023 ఖరీఫ్ సమయానికి వెలిగొండ కాలువల్లో నీళ్లు పారిస్తామని చెప్పారు.

ఇన్ని గడువులు ముగిసినా 2024 నాటికి కూడా ఇచ్చిన మాట నెరవేరలేదు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం, అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేకపోయారు. 30 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.

ఇటీవల రెండు టన్నెళ్ల తవ్వకాలు పూర్తయ్యాయి. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ కార్యక్రమం కూడా నిర్వహించారు. కానీ, ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తే తమ పొలాలు సాగు చేసుకోవచ్చని ఆశిస్తున్న రైతులకు మాత్రం ఇంకా ప్రయోజనం దక్కలేదు.

కృష్ణా జలాలను నల్లమల సాగర్ ద్వారా ఎప్పుడు తరలిస్తారనే అంశంలో ఇప్పటికీ స్పష్టత కనిపించడం లేదు.

ముంపుకు గురవుతున్న నిర్వాసితులకు చెల్లించాల్సిన పునరావాసం, నష్టపరిహారం నిధులు కేటాయించే ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందనే అంశంతోపాటు ప్రాజెక్టు ద్వారా రైతులకు ప్రయోజనం ఎప్పుడు కలుగుతుందనే అంశంపైనా అనుమానాలు కొనసాగుతున్నాయి.

వెలిగొండ ప్రాజెక్టు

మూడు దశాబ్దాలు

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అత్యల్పంగా ఉండే ప్రాంతం ప్రకాశం జిల్లా. ఏటా మెట్ట ప్రాంతంలో నీటి ఎద్దడి ఉంటుంది. రాష్ట్రమంతా మిగులు వర్షపాతం నమోదై, ప్రధాన నదులు వరదలతో పొంగిన సమయంలో కూడా ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తాగునీటికి కూడా ట్యాంకర్లపై ఆధారపడాల్సి ఉంటుంది.

మండు వేసవిలోనే కాకుండా ఏడాది పొడవునా తాగునీటిని ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేయాల్సిందే.

ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతంతో పాటుగా నెల్లూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తాగు, సాగు నీటి సమస్యలు తీర్చేందుకు కృష్ణా జలాల వినియోగం గురించి అనేక దశాబ్దాలు పాటు చర్చలు సాగాయి.

చివరకు వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నది బ్యాక్ వాటర్ తరలించేందుకు 1980ల నుంచి టన్నెళ్ల నిర్మాణం ప్రతిపాదనలు ఉన్నాయి.

1994లో సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేశారు. 1996 మార్చి5న చంద్రబాబు తొలిసారిగా వెలిగొండ ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేశారు. అయితే, పనులు ముందుకు సాగలేదు.

2004లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు చేయాలని అనుకుంది.

2004 అక్టోబరు 27న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఇది ప్రాజెక్టుకు రెండో శంకుస్థాపన.

శ్రీశైలం జలాశయం వద్ద ఏటా సగటున 45 రోజులు వరద ప్రవాహం అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. మిగులు జలాల్లో 43.5 టీఎంసీల నీటిని కొల్లం వాగు ద్వారా రెండు సొరంగ మార్గాలకు మళ్లించి, అక్కడి నుంచి వరద కాలవ ద్వారా నల్లమల శ్రేణుల సమీపంలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద జలాశయం నిర్మించి నిల్వచేసే ప్రయత్నం 2005 నుంచి సాగుతోంది.

తద్వారా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాలకు సాగు, తాగు నీటి అవసరాలు తీర్చాలని అనుకున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు

టన్నెళ్ల పనుల్లో జాప్యం

కృష్ణానదీ జలాలను గ్రావిటీ ద్వారా తరలించేందుకు 18.8 కి.మీ పొడవునా రెండు టన్నెల్స్ తవ్వాల్సి వచ్చింది. నల్లమల అడవుల మధ్యలోని కొండలను తవ్వి, శ్రీశైలం ప్రాజెక్ట్‌ సమీపంలో కొల్లం వాగుని చేరేందుకు దాదాపు 17 ఏళ్లు పట్టింది.

తొలి టన్నెల్ పనులను 2008లో వై.ఎఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత 2009లో నాటి జలవనరుల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రెండో టన్నెల్ పనులకు శంకుస్థాపన చేశారు.

మొదటి టన్నెల్ ద్వారా 10.7 టీఎంసీల నీటిని తరలించేలా నిర్మాణం చేశారు. 7 మీటర్ల వ్యాసం గల ఈ టన్నెల్ ద్వారా 45 రోజుల పాటు నీటిని తరలించవచ్చు. 9.2 మీ వ్యాసంగల రెండో టన్నెల్‌ను సుమారు 33 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుగుణంగా సిద్ధం చేశారు.

టన్నెల్ ద్వారా ప్రకాశం జిల్లాలో ప్రవేశించే కృష్ణా జలాలను 20 కిలోమీటర్ల పాటు వరద కాలువల ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి మూడు సాగునీటి కాలువల ద్వారా పొలాలకు నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 30 మండలాలకు ప్రయోజనం దక్కుతుందని, ఈ ప్రాంతంలోని సుమారు 15 లక్షల మందికి తాగునీటి సమస్య తీరిపోతుందని అధికారులు లెక్కలేస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు

నీళ్లు చూస్తామని అనుకోలేదు

రెండో టన్నెల్‌ను కొల్లం వాగుతో అనుసంధానం చేసే ప్రక్రియ 2024 జనవరిలో పూర్తి కావడంతో వాటి నిర్మాణం పూర్తికావొచ్చిందని చెబుతున్నారు. వాస్తవానికి మూడు సంవత్సరాల క్రితమే మొదటి టన్నెల్ అందుబాటులోకి వచ్చింది.

2021లో కృష్ణా నది వరదల సమయంలో నదీ జలాలు ఈ టన్నెళ్లలో ప్రవేశించాయి.

లింక్ కెనాల్, ఫీడర్ చానెళ్లు, డ్యామ్ కూడా సిద్ధం కావడంతో మొదటి టన్నెల్ ద్వారా నీటి పంపిణీ చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ, రెండో టన్నెల్ పనులకు ఆటంకం అవుతుందని ఆగిపోయారు.

‘‘ఎన్నో పోరాటాలు చేశాం. ఎట్టకేలకు టన్నెళ్లు పూర్తయ్యాయి. ఇక నీరు వదలడానికి ఆటంకం ఉండదనే అనుకుంటున్నాం. వెలిగొండలో నీళ్లు చూడాలనేది మా కల. బతికుండగా చూస్తామా లేదా అన్న సందేహం కూడా వచ్చింది. ఇప్పుడు నీళ్లు వదలడానికి నిర్వాసితుల సమస్య ముందుకొచ్చింది. ఆ సమస్యను కూడా తీర్చి మా ప్రాంత రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం" అంటూ మార్కాపురం మండలం రైతు శ్రీనివాస రెడ్డి అన్నారు.

70 ఏళ్ల శ్రీనివాస రెడ్డి గతంలో వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు

నిర్వాసితులే అసలు సమస్య..

వెలిగొండ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికి నిర్వాసితుల సమస్య కీలకంగా మారింది.

అధికారిక లెక్కల ప్రకారం, వెలిగొండ ప్రాజెక్టులో పునరావాసం కల్పించాల్సిన గ్రామాలు 11 ఉన్నాయి. ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేస్తే అవి జలమయం అవుతాయి. కాబట్టి వారికి ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతే నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో డ్యామ్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా నిర్వాసిత గ్రామాల రైతులకు ఎకరానికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించారు.

వారి కోసం 8 కాలనీల నిర్మాణాలకు ఏర్పాట్లు చేశారు. భూములు చదును చేసి, మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యుత్, మంచినీరు, డ్రెయిన్లు, రోడ్లు వంటివి పూర్తి చేశారు.

భూములతో పాటు ఇళ్లు కోల్పోతున్న వారికి ఒక్కో కుటుంబానికి సగటున రూ. 11.5 లక్షల చొప్పున ఇచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించింది.

వారిలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 12.5 లక్షలు చొప్పున ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ ప్రకటన చేసి అయిదేళ్లు దాటిపోయింది.

వెలిగొండ ప్రాజెక్టు

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందించాల్సిన వారి సంఖ్య 3,728 ఉన్నట్లు మొదట్లో గుర్తించారు. 15 ఏళ్లు పూర్తవుతున్నతరుణంలో కొత్తగా మరో 3,590 మందిని ఈ జాబితాలో చేర్చాల్సి వచ్చింది. దాంతో 7,318 మందికి పరిహారం అందించాలి. దానికోసం సుమారుగా రూ. 1,100 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

2022-23 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ.856.15 కోట్లు కేటాయించారు. కానీ, పూర్తిగా నిధులు విడుదల కాలేదు. ఆ మరుసటి ఏడాది కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారు. దాంతో పునరావాసం, పరిహారం చెల్లింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

''పునరావాసం కోసం డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. చాలాకాలంగా తిప్పుతున్నారు. కానీ, మాకు రావాల్సింది ఇవ్వట్లేదు. నీళ్లు వస్తాయో,లేదోననే అనుమానంతో ఈ ఏడాది కూడా కొందరు రైతులు బోర్లు వేసుకుంటున్నారు. ప్రభుత్వం త్వరగా అందరికీ ప్యాకేజీ ఇచ్చేస్తే ఊళ్లు ఖాళీ చేస్తాం'' అని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత రైతు ఎర్రయ్య అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు

పది రెట్లు పెరిగిన ప్రాజెక్టు వ్యయం

ఈ ప్రాజెక్ట్ నిర్మాణ తొలి అంచనా వ్యయం రూ.980 కోట్లు కాగా, ఆ తర్వాత అది రూ.5,500 కోట్లకు చేరింది. 2014 నాటికే 5 ప్రధాన కాలువలు 80% పూర్తి చేసి, 3 ఆనకట్టల్ని నిర్మించారు.

తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ. 9 వేల కోట్లు దాటుతోంది. అంటే ప్రాజెక్టు వ్యయం తొలి అంచనా కంటే దాదాపు పదిరెట్లు పెరిగింది.

ప్రాజెక్టు రెండు టన్నెళ్లను పూర్తి చేయడం పట్ల వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా గర్విస్తున్నానని సీఎం జగన్ అన్నారు.

‘‘వచ్చే జులై, ఆగస్టు నాటికి శ్రీశైలం నీటిని నల్లమల సాగర్‌కు తరలిస్తాం. ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కూడా నీటిని నింపే నాటికి పూర్తి చేస్తాం. వీటికోసం రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తాం. అత్యంత కీలకమైన టన్నెళ్లు పూర్తి కావడంతో ఇక మిగిలినవన్నీ పెద్ద సమస్య కాదు. రిజర్వాయర్ కూడా సిద్ధంగా ఉంది. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం పూర్తి చేస్తాం. ఆ తర్వాత నీళ్లు పుష్కలంగా నింపుతాం" అని సీఎం వై.ఎస్. జగన్ ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసినప్పటికీ, మరోవైపు ఇంకా పలు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కాలువల నిర్మాణం పనులు ఇంకా పూర్తికాలేదు. దానికి తోడుగా టన్నెళ్లలో లైనింగ్ సహా ఇతర తుది దశ పనులు సాగుతున్నాయి.

"ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి అవుతాయి. లైనింగ్ సహా ఇతర కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. వాటిని వేగవంతంగా చేస్తున్నాం. ఈ ఏడాది చివరి నాటికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది" అని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రాంబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)