రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

రష్యాలో భారతీయుడి మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తన కుమారుడితో కలిసి భర్త అస్ఫాన్ ఫొటో చూపిస్తోన్న భార్య
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌కి చెందిన యువకుడు రష్యన్ ఆర్మీ కోసం పనిచేస్తూ మరణించినట్లు రష్యాలోని భారత కార్యాలయం ప్రకటించింది. యువకుడి పేరు మహమ్మద్ అస్ఫాన్ అని ఎంబసీ తెలిపింది.

అయితే, ఎంబసీ ప్రకటనపై ఆ యువకుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రష్యా–యుక్రెయన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశం నుంచి చాలా మంది యువకులు రష్యాకు వెళ్లి, అక్కడి సైన్యం తరఫున పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

‘‘నేరుగా యుద్ధంలో పాల్గొనేవి కాకుండా, అక్కడి ఆర్మీకి సహాయకులుగా ఉండే ఉద్యోగాలు అని చెప్పి, వారిని తీసుకువెళ్లినట్లు’’ అస్ఫాన్ బంధువులు చెబుతున్నారు. కానీ, వారిని యుద్ధం రంగుంలో వాడుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.

మహమ్మద్ అస్ఫాన్

ఫొటో సోర్స్, Mohammed_Afsan/Instagram

ఫొటో క్యాప్షన్, మహహ్మద్ అస్ఫాన్

'రష్యా ఆర్మీ క్వార్టర్స్‌లో పని ఉంటుందన్నారు'

హైదరాబాద్ రెడ్‌హిల్స్‌కు చెందిన మహమ్మద్ అస్ఫాన్, స్థానిక దుస్తులషోరూంలో మేనేజర్‌గా పనిచేసేవాడు.

రష్యా-యుక్రెయిన్ యుద్ధం జరుగుతోన్న సమయంలో బాబా వ్లాగ్స్ అనే సంస్థ అస్ఫాన్‌కు ఎక్కువ జీతం ఆశ చూపి రష్యా ఆర్మీకి సహాయకుల ఉద్యోగానికి రిక్రూట్ చేశారని బీబీసీతో చెప్పారు అస్ఫాన్ సోదరుడు మహమ్మద్ ఇమ్రాన్ .

‘‘అక్కడ ఆరు నెలలు పని ఉంటుంది. ఆర్మీ క్వార్టర్స్‌లో పనిచేయాలి. యుక్రెయిన్ పంపరు. ఆర్మీ వారికి హెల్పర్‌గా పనిచేయాలని చెప్పారు. దుబాయ్‌లో ఉండే ఫైసల్ ఖాన్, ముంబైలో ఉండే పూజ, సూఫియాన్, మొయిన్ వీళ్లతో పాటుగా మాస్కోలో ఉండే రమేశ్.. వీళ్లంతా ఆ సంస్థ తరఫున భారత్‌లోని యువతతో మాట్లాడి, వారిని రష్యా ఆర్మీలో చేరుస్తున్నారు. వీరిలో రమేశ్ అనే వ్యక్తి రష్యా ఆర్మీకి రిక్రూటర్. మా తమ్ముడిని కూడా ఇలానే ఆర్మీ హెల్పర్ పేరుతో రష్యా తీసుకెళ్లి, చివరకు యుద్ధంలో పెట్టేశారు’’ అని ఆరోపించారు ఇమ్రాన్.

గతేడాది డిసెంబరు 31 నుంచి అస్ఫాన్‌ను సంప్రదించడం సాధ్యం కాలేదని ఇమ్రాన్ చెప్పారు.

అనుమానం వచ్చి అస్ఫాన్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ను కలిశారు. అసదుద్దీన్ ఒవైసీ సమాచారం కోసం భారత విదేశాంగ శాఖ, రష్యాలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించినట్టు తెలిపారు. జనవరి 25న అసద్ ఈ విషయమై లేఖలు కూడా రాశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. జనవరి నుంచి అస్ఫాన్ ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడి రాయబారులతో ఎంపీ అసద్ కూడా మాట్లాడారు.

మహమ్మద్ ఇమ్రాన్
ఫొటో క్యాప్షన్, అస్ఫాన్ సోదరుడు మహమ్మద్ ఇమ్రాన్

‘ఫోన్ చేస్తే, అఫ్సాన్ చనిపోయాడన్నారు’

మహమ్మద్ ఇమ్రాన్ తన ప్రయత్నాల్ని కొనసాగించారు. ఎప్పటిలాగే మార్చి 5న రష్యాలో భారత ఎంబసీకి కాల్ చేసి తన తమ్ముడి గురించి ఆరా తీశారు.

‘‘నన్ను ఒక నిమిషం హోల్డులో పెట్టారు. మళ్లీ లైన్లోకి వచ్చి, ఆయన చనిపోయారు అని చెప్పారు. నాకేం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే ఎంపీ అసదుద్దీన్ దగ్గరకు పరుగెత్తాను. ఆయన కూడా ట్రై చేశారు. ఆయనకూ ఎంబసీ వారు అదే సమాధానం చెప్పారు. చనిపోయారని మీరెలా చెబుతారని నేను మళ్లీ ఎంబసీకి కాల్ చేసి అడిగాను. సాక్ష్యం ఉందా? అని వారిని ప్రశ్నించాను. తమ దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదనీ, తమకు రష్యన్ ఫెడరేషన్ నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందిందనీ, అదే విషయం చెబుతున్నామనీ, ఎంబసీ వారు నాకు సమాధానం ఇచ్చారు. సాక్ష్యం లేనప్పుడు ఎలా నమ్మాలి?’’ అని ప్రశ్నించారు ఇమ్రాన్.

ఆయన మాట్లాడుతూ ‘‘నేను మా తమ్ముడిని అక్కడకు పంపిన ఏజెంట్లను ఇదే విషయమై ప్రశ్నించాను. వాళ్లయితే తమ దగ్గర గానీ, రష్యా ఆర్మీ దగ్గర గానీ ఎటువంటి సమాచారం లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఎవర్ని నమ్మాలి? ఏజెంట్లు మమ్మల్ని మంగళవారం వరకూ వేచి ఉండమన్నారు. సరైన సమచారం కోసం ఎదురు చూస్తున్నాం మేమిప్పుడు.. మా తమ్ముడు చనిపోతే వెంటనే ఆయన శరీరం ఇక్కడకు రప్పించాలి. గుజరాత్ నుంచి వెళ్లి రష్యాలో చనిపోయిన వ్యక్తి మృతదేహం కూడా ఇంకా భారత్‌కు రాలేదని తెలిసింది. ఒకవేళ మా తమ్ముడు బతికుంటే, వెంటనే ఆయన్ను ఇక్కడకు పంపించండి. మా నాన్న, తమ్ముడి భార్య అంతా కంగారు పడుతున్నారు’’ అన్నారు ఇమ్రాన్.

నలుగురు అన్నదమ్ముల్లో ఆఖరి వాడైన అస్ఫాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

పిల్లలో ఒకరికి 20 నెలల వయసు కాగా, మరొకరికి 8 నెలల వయసు. ఇప్పటి వరకూ అస్ఫాన్ జీతం కానీ మరే విధమైన డబ్బు కానీ తమకు అందలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

రష్యాలో భారతీయుడి మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తన సోదరుడు అస్ఫాన్ ఫొటో చూపిస్తోన్న మహమ్మద్ ఇమ్రాన్

భారత ఎంబసీ ప్రకటన..

మరోవైపు మహమ్మద్ అస్ఫాన్ మరణించినట్టు రష్యాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

ఈ మేరకు “అస్ఫాన్ కుటుంబ సభ్యులతోనూ, రష్యా యంత్రాంగంతోనూ మాట్లాడుతున్నామనీ, ఆయన మృతదేహాన్ని భారత్‌కు పంపడానికి ప్రయత్నం చేస్తున్నాం” అని ఎక్స్ వేదికగా ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

రష్యా సైన్యంలో భారతీయులు
ఫొటో క్యాప్షన్, అస్ఫాన్‌తోపాటు పంజాబ్, హరియాణాల నుంచి రష్యాకు వెళ్లిన భారతీయులు తమకు సాయం చేయాలని కోరుతూ భారత్‌లో ఉన్న తమవారికి వీడియో పంపారు.

బయట పడుతున్న కేసులు..

భారతదేశం నుంచి రష్యా వెళ్లి, యుద్ధంలో పాల్గొని, కనిపించకుండా పోయిన వారి కేసులు దేశవ్యాప్తంగా బయటపడుతూ వస్తున్నాయి.

తెలంగాణలోని నారాయణపేటకు చెందిన ఒక వ్యక్తి కేసు కూడా ఈ మధ్యే బయట పడింది. గత రెండు నెలలుగా వీటి సంఖ్య పెరుగుతోంది.

‘‘ఇటువంటి ఫిర్యాదులపై మేం వెంటనే స్పందిస్తున్నాం. మాస్కోలో, ఇక్కడ రెండు దేశాల అధికారులూ వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకుని బాధితులకు సహాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.’’ అని ఈ ఫిబ్రవరి 26న భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన కూడా చేసింది.

భారత ఎంబసీ

ఫొటో సోర్స్, MEA/IndianGovt

ఫొటో క్యాప్షన్, భారత్‌ నుంచి రష్యాకు ఉద్యోగం కోసం వెళ్లి, సైన్యంలో పనిచేయిస్తున్న కేసుల విషయమై విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది.
వీడియో క్యాప్షన్, తూర్పు యుక్రెయిన్: యుద్ధ రంగానికి దగ్గరగా ఉన్న గ్రామాలను ఖాళీ చేస్తున్న ప్రజలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)