నాగర్ కర్నూల్: గుప్తనిధుల పూజల పేరుతో 11 మందిని సత్యం యాదవ్ ఎలా చంపేశాడు? ఈ మిస్టరీ ఎలా వీడింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక: ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో మూడున్నరేళ్లుగా హత్యాకాండ సాగిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
గుప్త నిధులు వెలికి తీసేందుకు పూజలు చేస్తానంటూ నమ్మించి 11 మందిని రామటి సత్యనారాయణ(47) అలియాస్ సత్యం యాదవ్ చంపేశాడని తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌కు చెందిన ఆయన్ను అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, nagarkurnool police
రియల్ ఎస్టేట్ వ్యాపారి మిస్సింగ్ కేసుతో బయటపడ్డ మిస్టరీ
పూజలు చేసే సమయంలో యాసిడ్‌తో పాటు కొన్ని రకాల చెట్ల నుంచి వచ్చే విషపూరిత పదార్థాలను కలిపి తీర్థంగా ఇచ్చి హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు చెప్పారు.
తెలంగాణలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో వారి కుటుంబం నివాసముంటోంది.
తన భర్త ఐదు రోజులుగా కనిపించడం లేదని వెంకటేశ్ భార్య లక్ష్మి నాగర్ కర్నూల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నవంబరు 26న ఫిర్యాదు చేశారు.
‘‘ఆయన నవంబరు 21న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని సత్యనారాయణ వద్దకు వెళ్తున్నట్లు చెప్పారు. కానీ, తర్వాత నుంచి ఫోన్ పనిచేయలేదు. ఐదు రోజులైనా ఆచూకీ లేదు. అనుమానం వచ్చి నాగర్ కర్నూల్ వెళ్లి ఆరా తీసినా, ఎక్కడా సమాచారం లేదు. 26న పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని వివరించారు వెంకటేశ్ భార్య లక్ష్మి.

ఫొటో సోర్స్, Getty Images
‘తీర్థం’లో విషపదార్థాలు
పోలీసుల కథనం ప్రకారం... ఇద్దరూ నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందిన వారే కావడంతో స్నేహితుల ద్వారా వెంకటేశ్‌కు సత్యం యాదవ్‌తో పరిచయం ఏర్పడింది.
తాను గుప్తనిధులు వెలికి తీస్తానంటూ వెంకటేశ్‌కి సత్యం యాదవ్ చెబుతుండేవాడు. అందుకోసం తమ కుటుంబం కొన్ని తరాలుగా పూజలు చేస్తోందని, వాటిని తానూ నేర్చుకున్నానంటూ నమ్మించాడు.
అయితే, వెంకటేశ్, సత్యం యాదవ్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా పరిచయం ఏర్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
''కొద్దిరోజుల కిందట వెంకటేశ్ తన స్నేహితులను వెంటబెట్టుకెళ్లి గుప్తనిధులు తీసేందుకు పూజలు చేయాలని సత్యం యాదవ్‌ను అడిగారు. అప్పుడు వెంకటేశ్‌ను మాత్రమే విడిగా పిలిపించాడని, ఒక్కడివే వస్తేనే గుప్తనిధులు తీసేందుకు, పూజలు చేసేందుకు వీలవుతుందని సత్యం యాదవ్ నమ్మబలికాడు'' అని పోలీసులు చెప్పారు.
‘‘గుప్త నిధులు తీయాలంటే మనిషిని చంపాల్సి ఉంటుందని వెంకటేశ్‌తో చెబుతూ వచ్చాడు. అందుకు ముగ్గురు గర్భిణులను బలి ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. అప్పటికే పూజల కోసం రూ.9 లక్షలు తీసుకున్నాడు.
తర్వాత నరబలి అనే సరికి వెంకటేశ్ భయపడి తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగాడు. తర్వాత నరబలి అవసరం లేదని, పూజలు చేస్తానంటూ ఒక్కడివే రావాలని చెప్పాడు. అతన్ని నగరానికి సమీపంలోని కొండపైకి తీసుకెళ్లాడు.
అక్కడ పూజలు చేస్తున్న క్రమంలో తీర్థంలో విషపదార్థాలు కలిపి తాగించి చంపేశాడు. అందులో ఏమేం కలిపాడన్నది తెలియాల్సి ఉంది. తర్వాత ముఖంపై యాసిడ్ పోశాడు ’’ అని చెప్పారు జోగులాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్.

ఫొటో సోర్స్, SP NAGARKURNOOL/twitter
చంపేశాక ఏం చేసేవాడు?
‘‘గుప్తనిధుల కోసం చేసే పూజలు ఎవరికీ చెప్పకూడదని ముందే సత్యం యాదవ్ షరతు విధించేవాడు. ఎక్కడ అనుమానం వచ్చినా వారిని గట్టిగా మందలించేవాడు. ఎవరికైనా చెబితే వారు వాటాలకు రావొచ్చని, పోలీసులకు చెబితే రూపాయి కూడా అందదని చెబుతూ భయపెట్టేవాడు. అందుకే బాధితులు చెప్పేందుకు ముందుకు రాలేదు’’ అని చెప్పారు ఎస్పీ వైభవ్ గైక్వాడ్.
సత్యం యాదవ్ హత్యలు చేసిన తీరును ఆయన బీబీసీకి వివరించారు.
‘‘గుప్త నిధుల కోసమని అతడు నిర్మానుష్య ప్రాంతాలకు బాధితులను తీసుకెళ్లేవాడు. అక్కడ ఏవో ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తున్నట్లు చేసేవాడు. ఆ క్రమంలో బాధితులకు మాయమాటలు చెప్పి తాను చెప్పినట్టు చేసేలా మార్చుకునేవాడు. బాధితులు కూడా తమకు తెలియకుండానే అతని మాయలో పడేవారు.
పూజ చేసిన తర్వాత జిల్లేడు, గన్నేరు చెట్ల నుంచి తీసుకున్న విషపదార్థాలు, యాసిడ్ వంటివి పాలల్లో కలిపి తీర్థంగా అందించేవాడు. అవి తాగి చనిపోతే వారి వస్తువులు, నగలతో అక్కడి నుంచి పారిపోయేవాడు. ఒకవేళ చనిపోకుండా అపస్మారక స్థితిలో ఉంటే బండరాళ్లతో కొట్టి చంపేవాడు’’ అని ఎస్పీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ విపరీత మనస్తత్వం?
సత్యం యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. తర్వాత గుప్త నిధుల కోసం పూజలు చేస్తానంటూ స్థానికంగా నమ్మబలికాడు.
తర్వాత పరిచయాలు పెరిగిన కొద్దీ కొందరికి గుప్తనిధులపై ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని పూజల పేరిట మూడున్నరేళ్లుగా హత్యలు చేస్తూ వచ్చాడు.
‘‘ఇతనిది తీవ్రమైన సైకో మనస్తత్వం. చంపడం అంటే కూరగాయలు కోసినంత ఈజీగా అనుకుంటుంటాడు. అంతటి సైకో మనస్తత్వంతో 11మందిని చంపేశాడు’’ అన్నారు డీఐజీ ఎల్ఎస్ చౌహాన్.
వరుసగా హత్యలు చేయడాన్ని ‘సైకో మనస్తత్వం’గా చెప్పారు ఉస్మానియా యూనివర్శిటీ సైకాలజీ మాజీ విభాగాధిపతి సి.బీనా.
‘‘ఈ తరహా మనుషులు చూసేందుకు సాధారణంగానే కనిపిస్తారు. అందరితో కలివిడిగా ఉంటారు. కానీ, వారి మనస్తత్వం సైకో తరహాలో ఉంటుంది. ఎవరూ మనల్ని చూడరనే ధైర్యంతో ఘాతుకానికి పాల్పడుతుంటారు. వీరిని గుర్తించడం కూడా కష్టమవుతుంది’’ అని బీనా బీబీసీతో చెప్పారు.
మనిషి దురాశకు పోకుండా పరిమితులకు లోబడి ఉండటం మంచిదని చెప్పారు బీనా.

ఫొటో సోర్స్, Nagarkurnool District Police/fb
ఒకే కేసులో నలుగురి హత్యలు
మొత్తం ఏడు కేసుల్లో కలిపి 11 మందిని సత్యం యాదవ్ చంపినట్లు తేలిందన్నారు డీఐజీ ఎల్ఎస్ చౌహాన్. ఇందులోని ఒక కేసులో ఒకే కుటుంబంలోని నలుగురు హత్యకు గురయ్యారు.
‘‘2020 ఆగస్టు 14 వనపర్తి జిల్లా నాగాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వీరిలో హజిరాబీ(60), ఆష్మాబేగం(32), ఖాజా(35), ఆశ్రీన్(10) ఉన్నారు. గుప్త నిధుల కోసం పూజలు చేస్తున్న క్రమంలో వీరు హత్యకు గురుయ్యారు.
ఈ హత్యలు ఎవరు చేశారన్న విషయంపై అప్పట్లో స్పష్టత లేదు. ఈ హత్యల వెనుక సత్యనారాయణ ఉన్నట్లు మా విచారణలో తేలింది.
ముందుగా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరిగింది. కానీ, సత్యం యాదవ్ ఇచ్చిన రసాయనాల కారణంగానే ఆ కుటుంబం అంతా చనిపోయింది.
2021 నవంబరులో నాగర్ కర్నూల్ జిల్లా ఎండబెట్లకు చెందిన సలీం పాషాను ఇదే విధంగా హత్యచేశాడు. గుర్తుతెలియని వ్యక్తిగా అప్పట్లో పోలీసులు కేసు కట్టారు.
అలాగే, కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన ఆరెపల్లి శ్రీనివాసులు, రెండేళ్ల కిందట నాగర్ కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన వాసర్ల లింగస్వామి, నిరుడు కల్వకుర్తి సమీపంలోని తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్ రెడ్డి హత్యలు, అనంతపురం జిల్లా కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, తిరుపతమ్మ హత్య, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు పరిధిలో ఒక వ్యక్తి హత్య కేసులోనూ సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్లు గుర్తించాం’’ అని చౌహాన్ చెప్పారు.
కోర్టు అనుమతితో పీటీ వారెంటుపై అతన్ని విచారణకు తీసుకుని మరిన్ని వివరాలు రాబడతామని ఆయన అన్నారు.
డబ్బులు, భూములు
సత్యం యాదవ్ చేసిన హత్యల వెనుక కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఇప్పటి వరకూ జరిగిన హత్యలను గమనిస్తే బాధితుల నుంచి డబ్బులు తీసుకోవడం, భూముల రిజిస్ట్రేషన్ వంటివి జరిగాయని పోలీసులు చెబుతున్నారు.
‘‘వనపర్తిలో బాధితుల నుంచి ప్లాటు రిజిస్టర్ చేయించుకున్నాడు. నాగర్ కర్నూల్ కేసులో భూమి రిజిస్టర్ చేసుకున్నాడు. రాయచూర్ కేసులో హత్యకు గురైన తండ్రీకూతుళ్ల నుంచి మూడున్నర ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
గుప్తనిధులపై బాధితులకు ఉన్న దురాశతో ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు’’ అని చెప్పారు ఎల్ఎస్ చౌహాన్.
గతంలో నాగర్ కర్నూల్ పట్టణంలో భూమి డబుల్ రిజిస్ట్రేషన్ విషయంలో అతనిపై చీటింగ్ కేసు నమోదైనట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
డిటోనేటర్లు స్వాధీనం
నిందితుడు సత్యనారాయణ నుంచి పోలీసులు డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద డిటోనేటర్లు ఎందుకు ఉన్నాయనే దిశగా పోలీసులు విచారణ జరిపారు.
సాధారణంగా మనిషిని చంపేందుకు యాసిడ్, వివిధ రకాల విష పదార్థాలను వినియోగించేవాడు.
అయితే, అతని వద్ద దొరికిన డిటోనేటర్ల గురించి పోలీసులు విచారణ జరిపినప్పుడు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
‘‘బాధితులను నమ్మించేందుకు డిటోనేటర్లు దగ్గర పెట్టుకున్నాడు. గుప్త నిధులు తవ్వే క్రమంలో ఏవైనా బండరాళ్లు అడ్డొస్తే వాటిని పేల్చివేయడానికి డిటోనేటర్లను ఏర్పాటు చేసుకున్నాడు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నాం’’ అని చెప్పారు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్.
అలాగే, ఐదు సెల్ ఫోన్లు, పది సిమ్ కార్డులు, కారు, రసాయన పదార్థాలు నిల్వ ఉంచిన పెట్టెలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ఫొటో సోర్స్, SP NAGARKURNOOL/twitter
పోలీసులపై విమర్శలేంటి?
సత్యనారాయణ అరెస్టు తర్వాత పోలీసులపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సత్యనారాయణపై నాగర్ కర్నూల్ పోలీసులకు హైదరాబాద్ మహిళ ఒకరు ఫిర్యాదు చేశారు. తన భూమి అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని ఆమె పేర్కొన్నారు.
కానీ, ఆ విషయాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అది జరిగిన తర్వాత కూడా సత్యనారాయణ హత్యలు చేస్తూ వచ్చినట్లు పోలీసులు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది.
‘‘పోలీసులపై ఆరోపణలున్న విషయం మాకు తెలిసింది. ఈ విషయంలో విచారణ జరిపిస్తాం. నిందితుడితో సంబంధాలున్నట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సూలూరు సుబ్బారావు మర్డర్ కేసు: మహిళల వెంటపడే ఆయన ఎలా చనిపోయారు
- కోరుట్ల: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే
- 9 హత్యలు చేసిన వ్యక్తిని పోలీసులు పిచ్చివాడని వదిలేశారు... ఆ తరువాత మరో 30 మందిని కిరాతకంగా చంపేశాడు
- వీరప్పన్: తెలుగు ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ తలను నరికి కాలితో తన్నారా, అంతక్రూరంగా ఎందుకు చంపారు?
- వివాహేతర సంబంధం బయటపడడంతో భర్తతో కలిసి ప్రియుడి హత్య, తల సముద్రంలో విసిరేసి మొండెం పెట్టెలో పెట్టి రైలెక్కించేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














