దుస్తుల హుక్కులా కనిపించే సీక్రెట్ కెమేరాల అమ్మకం.. అమెజాన్‌ను కోర్టుకు లాగిన మహిళ

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, క్రిస్ వాలెన్స్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్, బీబీసీ న్యూస్
అమెజాన్‌లో దుస్తుల హుక్కులుగా కనిపించే రహస్య కెమెరాలను అమ్ముతున్నారు. గాడ్జెట్ల విషయంలో ఇప్పటికే ఈ సంస్థపై వేసిన దావా మీద విచారణ జరుగుతుండగా, తాజాగా మరో కొత్త వివాదం చెలరేగింది.
క్లాత్స్ హుక్కు కెమెరా అమెజాన్‌లో లిస్ట్ అవడాన్ని బీబీసీ ఫీచర్స్ గుర్తించింది. బాత్‌రూమ్‌లో ఈ డివైజ్ పెట్టుకోవచ్చని ఈ ప్రోడక్ట్ ఫోటో తెలియజేస్తుంది.
అమెజాన్‌లో కొన్న దుస్తుల హుక్కు కెమెరా వాడి బాత్‌రూమ్‌లో తనను చిత్రీకరించారని ఆరోపిస్తూ ఒక మహిళ అమెజాన్‌ను కోర్టుకు లాగారు.
ఈ రిటైల్ దిగ్గజం తప్పనిసరిగా కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా జడ్జి తీర్పు ఇచ్చారు.
బ్రిటిష్ చట్టాలను అతిక్రమిస్తూ ఇలాంటి డివైజ్‌లను దుర్వినియోగం చేస్తున్నారని ప్రైవసీ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించేందుకు అమెజాన్ నిరాకరించింది.
విదేశాల్లో చదువుకుంటూ, నటి కావాలని కోరుకున్న ఒక విద్యార్థిని అమెజాన్ కంపెనీకి వ్యతిరేకంగా అమెరికాలో చట్టపరమైన చర్యలకు దిగారు.
తన చిన్నతనంలో వెస్ట్ వర్జీనియాలో ఒక ఇంట్లో నివాసముంటున్నప్పుడు, బట్టల హుక్కుల మాదిరి ఉన్న కెమెరాతో తనను బాత్‌రూమ్‌లో చిత్రీకరించారని ఆరోపించారు. ఆ బట్టల హక్కును అమెజాన్‌లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
అమెరికాలోని జిల్లా కోర్టులో తాను దాఖలు చేసిన ఫిర్యాదులో ఆ కెమెరా అమెజాన్‌లో లిస్ట్ అయినట్లు తెలిపారు. అక్కడ నుంచే ఈ కెమెరాను కొనుగోలు చేసి ఉంటారని ఆరోపించారు.
బాత్‌రూమ్‌లో తువాలును తగిలించే హుక్కు లాగా పేర్కొంటూ.. ‘‘వారి దృష్టిని ఆకర్షించదు’’ అనే క్యాప్షన్‌తో అమెజాన్‌లో రహస్య కెమెరాను లిస్ట్ చేశారని చెప్పారు.
ఈ టవల్ హుక్కు కెమెరాలు బాత్‌రూమ్‌లో రహస్యంగా వ్యక్తుల అంగీకారం లేకుండానే చిత్రీకరిస్తుంటాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కెమెరా వాడకం గురించి అమెజాన్‌కు తెలుసని పేర్కొంటూ.. అమెజాన్ ఇంక్, అమెజాన్ డాట్ కామ్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌సీలపై ఆరోపణలు చేశారు. దీనికి పరిహారాన్ని కోరారు.
అయితే, ఇటీవల జరిగిన వాదనలలో అమెజాన్ ఈ కేసును కొట్టివేసేలా కోర్టును కోరడంలో విఫలమైంది.
అమెజాన్ డాట్ కో డాట్ యూకే(Amazon.co.uk)లో ఇలాంటి కెమెరాలను బీబీసీ పరిశీలించింది. అమెజాన్‌లో ఇలాంటి కెమెరాలు ఎన్నో లిస్ట్ చేసి ఉన్నాయని గుర్తించింది.
ఒక క్లాత్ హుక్ కెమెరా ప్రొడక్ట్ వివరాల్లో బాత్ రూంలో దీన్ని పెట్టుకోవచ్చని చెబుతుంది. మరో ప్రొడక్ట్ ఇమేజ్ ఫోటోలో బెడ్ పక్కన పెట్టుకోవచ్చని చూపిస్తుంది.
బెడ్‌రూమ్‌లో దీన్ని పెట్టుకోవచ్చని చూపిస్తూ మరో క్లాత్స్ హుక్ కెమెరా అమెజాన్‌లో లిస్ట్ అయింది. దీని వాడకాలను కూడా వివరిస్తోంది. ఒక జంట గొడవపడుతున్న ఫోటోను చూపిస్తూ.. ఆ జంట మధ్యనున్న మోసాన్ని ఎత్తిచూపించింది.
అమెజాన్‌లో అమ్ముతున్న ఇలాంటి ఇతర కెమెరాలు:
- హిడెన్ కెమెరా అలారం క్లాక్.. ఒక జంట ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ బెడ్‌పై పడుకోవడాన్ని ఫోన్‌లో చూపిస్తూ ఈ ప్రొడక్ట్ ఇమేజ్‌ను లిస్ట్ చేసింది.
- యూఎస్‌బీ ఛార్జర్ మాదిరి ఈ కెమెరా ఉంటుంది. ఇంట్లో సన్నిహితంగా ఉన్న జంటల సన్నివేశాలను ఇది చిత్రీకరించనున్నట్లు చూపించారు.
- స్మోక్ అలారానికి లోపల కెమెరాను దాచడం ద్వారా భాగస్వాముల ‘అనైతిక’, వివాహేతర సంబంధాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు.
- ఎలాంటి రివ్యూలు లేని షవర్ రేడియో మాదిరి బాత్‌రూమ్ స్పై కెమెరా కూడా అమెజాన్‌లో లిస్ట్ అయి ఉంది. అమెజాన్‌లో ఇన్ని రోజుల పాటు ఈ లిస్టింగ్‌లు ఎలా ఉంటున్నాయని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
చాలా కెమెరాలు ఇంట్లో చిన్నపిల్లలను చూసేందుకు, వారి సెక్యూరిటీ కోసం ఉపయోగించేవి అయినప్పటికీ.. ఎన్నో బ్రిటిష్ చట్టాలను అతిక్రమిస్తూ ఈ కెమెరాలను దుర్వినియోగపరుస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయంపై న్యాయ సంస్థ పిన్సెంట్ మాసన్స్‌కు చెందిన ప్రైవసీ పార్టనర్ జయ హందా మాట్లాడారు.
ఇంట్లో ప్రైవసీ గురించి ఎక్కువగా అంచనాలు పెట్టుకుంటున్న కొందరు... వేధింపులు, పిల్లల సంరక్షణ, లైంగిక నేరాలు లేదా మానవ హక్కుల చట్టాలు వంటి న్యాయ విధానాల కింద నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ఒకవేళ ఈ వీడియో పెద్ద ఎత్తున షేర్ అయితే డేటా సంరక్షణ సమస్యలు కూడా వచ్చే అవకాశముందన్నారు.
ఇవి కూడా చదవండి:
- కొరియా ఓటీటీ సిరీస్‌లలో ఈ కాలం అమ్మాయిలు మామూలుగా లేరు, అదరగొట్టేస్తున్నారు...
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














