మీ ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేస్తే గుర్తించడమెలా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ ఇటీవల తన యూజర్లకు హెచ్చరిక మెసేజ్‌లను, ఈమెయిల్‌లను పంపింది.
భారత్‌లో విపక్ష నేతలు, ఎంపీలు, ప్రముఖ జర్నలిస్ట్‌ల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడుల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ హెచ్చరిక సందేశాల సారాంశం.
‘‘ప్రభుత్వ స్పాన్సర్డ్ సైబర్ అటాకర్లు మీ ఫోన్‌పై దాడి చేయొచ్చు. యాపిల్ ఐడీతో అనుసంధానమైన మీ ఐఫోన్ అటాకర్లకు లక్ష్యంగా మారిందని యాపిల్ భావిస్తోంది’’ అని ఐఫోన్ తయారీ కంపెనీ ఈ సందేశాల్లో తెలిపింది.
‘‘ఈ సైబర్ దాడి వ్యక్తిగతంగా మీరెవరు? మీరేం చేస్తుంటారు? అన్న దాన్ని లక్ష్యంగా చేసుకుని చేయనున్నారు. ఒకవేళ మీ ఐఫోన్ సెక్యూరిటీ సిస్టమ్‌పై దాడి చేస్తే, మీ సమాచారం, ఇతరులతో జరిపిన సంభాషణలు, కెమెరా, మైక్రోఫోన్ ఇలా ప్రతీది వారి చేతిలోకి వెళ్తుంది.
అలాగే, వారు మిమ్మల్ని ట్రాక్ చేస్తారు. కొన్ని దాడులను మీరు గుర్తించలేకపోవచ్చు. దయచేసి ఈ హెచ్చరికపై కాస్త శ్రద్ధ వహించండి’’ అని యాపిల్ తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, శివసేన నేత ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా వంటి పలు నేతలకు యాపిల్ ఈ హెచ్చరికలు పంపింది.
భారత్‌లో ఐఫోన్ వాడుతున్న చాలా మంది విపక్ష నేతలకు ఈ హెచ్చరిక టెక్ట్స్ మెసేజ్‌లు వచ్చినప్పటి నుంచి ఈ అంశంపై అంతటా చర్చ జరుగుతోంది.
ఈ సైబర్ దాడి హెచ్చరిక నిజమైనదా లేదా నకిలీదా అనే దానిపై చర్చ జరుగుతున్న తరుణంలో, మరి ఆండ్రాయిడ్ ఫోన్లపై జరిగే ఇలాంటి సైబర్ దాడులను ఎలా గుర్తించాలి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనే అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆండ్రాయిడ్ ఫోన్లు సైబర్ దాడులకు గురయ్యే అవకాశముందా?
ఈ అంశంపై సైబర్ నేరాల నిపుణుడు మురళీక్రిష్ణన్ చిన్నదురైతో బీబీసీ మాట్లాడింది.
‘‘ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్‌ను హ్యాక్ చేయడం కష్టమే. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేందుకు కాస్త సులభతరంగా ఉంటాయి. దీంతో సైబర్ దాడి ఘటనలు జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది’’ అని మురళి చెప్పారు.
ఆండ్రాయిడ్ ఫోన్ సైబర్ దాడికి గురైందా, లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిచ్చారు.
‘‘ఆండాయిడ్ ఫోన్‌ను పూర్తిగా పరిశీలించకుండా, ఆ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అన్నది తెలుసుకోవడం అసాధ్యమే. కానీ, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఏ యాప్స్ నడుస్తున్నాయో చూస్తే.. ఏదైనా అవసరం లేని యాప్స్‌ను మీరు గుర్తిస్తే, వెంటనే వాటిని ఆపివేయొచ్చు. అవే సైబర్ దాడులకు పూర్తిగా కారణం కాకపోవచ్చు కూడా’’ అని మురళి చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హ్యాక్ అయిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను తేలికగా గుర్తించడమెలా?
హ్యాక్ అయిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను తేలికగా గుర్తించవచ్చని మురళి చెప్పారు.
‘‘టెకీలు కానీ వారు కూడా తేలికగా ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయిన సంగతి తెలుసుకోవచ్చు.
మీ సెల్ ఫోన్ అసాధారణంగా హీటెక్కడం లేదా ఒక్కసారిగా ఫోన్ బ్యాటరీ పడిపోవడం జరుగుతున్నప్పుడు... ఈ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో తెలియని యాప్స్ నడుస్తున్నట్లు మీరు అనుమానించాలి’’ అని మురళి చెప్పారు.
అదేవిధంగా, ఆండ్రాయిడ్ ఫోన్‌లో జనరల్ సెట్టింగ్స్ ముఖ్యంగా ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఏమైనా మార్పులు జరిగాయేమో చూడాలని సైబర్‌క్రైమ్‌లో పీహెచ్‌డీ చేసిన పీఏ రంజన్ చెప్పారు.
‘‘చాలా సార్లు ఆండ్రాయిడ్ ఫోన్‌పై దాడి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో గుర్తించే సరికే చాలా ఆలస్యమవుతుంది.
అలాంటి సైబర్ అటాక్ తర్వాత, మీ ఫోన్ సెట్టింగ్స్ మారిపోతాయి. మీరు దాన్ని గుర్తించి, సరిగ్గా రీప్లేస్ చేస్తే, సైబర్ దాడి తర్వాత కూడా మీ ఫోన్ డేటాను కాపాడుకోవచ్చు’’ అని రంజన్ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సైబర్ దాడుల నుంచి ఎలా రక్షించుకోవచ్చు?
ఏ ఫోన్ వాడుతున్నారనేదానితో నిమిత్తం లేకుండా, మీరు రెండు సెల్ ఫోన్లు వాడితే మంచిదని మురళి సూచించారు.
ఒక సెల్ ఫోన్‌లో మీరు రోజూ వాడే అన్ని యాప్స్‌ను ఉంచుకోవాలి.
మరో ఫోన్‌లో ముఖ్యమైన, అత్యవసరమైన, భద్రమైన డేటాను పెట్టుకోవాలి. ఈమెయిళ్లను కూడా వేరువేరుగా వాడాలి.
అప్పుడు, ఒక సెల్ ఫోన్‌కు మరో సెల్ ఫోన్‌కి సంబంధం ఉండదు.
చాలా వరకు సైబర్ దాడులు మనం వాడే సోషల్ మీడియా యాప్స్ ద్వారానే జరుగుతున్నాయని, వాటితోనే లింక్ ఉంటుందని రంజన్ చెప్పారు.
పోర్న్ వెబ్‌సైట్ల కోసం వీపీఎన్‌ను వాడే వారు ఎక్కువగా సైబర్ దాడుల బారిన పడుతున్నారు.
వాటిని మీరు తప్పించుకుంటే, మీకు మీరు సురక్షితంగా ఉండొచ్చని రంజన్ అన్నారు.
సైబర్ దాడుల నుంచి 100 శాతం ఎవర్నీ కాపాడలేమని రంజన్, మురళి ఇద్దరూ చెప్పారు.
మీ డేటా హ్యాకర్ల చేతిలో పడకూడదంటే ఏం చేయాలి?
ఇంటర్నెట్, యాప్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యాప్స్ ఏవి పడితే అవి డౌన్‌లోడ్ చేయరాదు. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచే యాప్స్ డౌన్ చేసుకోవడం చాలా వరకు సురక్షితం.
అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్, మెసేజీలలో ఉండే లింకులను క్లిక్ చేయొద్దు. అటాచ్‌మెంట్లు డౌన్‌లోడ్ చేయొద్దు. వాటిలో మాల్‌వేర్ ఉండే ప్రమాదం ఉంది.
''వైఫై, బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేయడం సైబర్ నేరగాళ్లకు చాలా సులభం. కాబట్టి అవసరం లేని సమయాలలో ఆ రెండూ ఆఫ్ చేయడం మంచిది'' అని మెకఫీ సంస్థ సూచిస్తోంది.
ఫోన్‌లో అప్లికేషన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, ఫోన్‌ను ఇతరులకు ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు హ్యాక్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని కాస్పరెస్కీ చెబుతోంది.
బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఫోన్ అవసరం లేకపోతే స్విచాఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- దిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పాఠశాలలు బంద్
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- తెలంగాణలో బీసీని సీఎం చేస్తామన్న బీజేపీ... తెలుగు ముఖ్యమంత్రుల్లో ఏ కులం వారు ఎందరున్నారు?
- వరల్డ్ కప్ 2023 : ద్రవిడ్ ప్రతీకారం తీర్చుకుంటారా...ఎవరి మీద, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














