మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే, వెంటనే ఈ 5 పనులు చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మనలో ఎవరైనా ఫోన్ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇది ఎవరికైనా జరగొచ్చు.

ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు సెల్ ఫోన్‌ను ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. ఒక్క క్షణంలో ఫోన్ పెట్టిన చోటు నుంచి మాయమైపోవచ్చు. సెల్ ఫోన్ పోగొట్టుకునేందుకు మనం అప్రమత్తంగా లేని కొన్ని క్షణాలు చాలు.

సెల్ ఫోన్ పోయిందనే బాధతో పాటు, మన వ్యక్తిగత సమాచారం, విలువైన డాక్యుమెంట్లు కూడా కోల్పోతాం. మళ్లీ సెల్ ఫోన్ కొనుక్కోవడమంటే ఖర్చుతో కూడుకున్న పని.

మీ మొబైల్ ఫోన్ చోరీకి గురయితే మీరు తీసుకోవలసిన 5 జాగ్రత్తలు ఇవే.

1. ఫోన్ సిమ్ లాక్ చేయాలి

"ఫోన్ దొంగతనం అయిందని గ్రహించిన వెంటనే మీ సెల్ ఫోన్‌ను లాక్ చేయాలి" అని డిజిటల్ సెక్యూరిటీ నిపుణులు ఎమీలియో సిమోనీ చెప్పారు.

"ఫోన్ చిప్‌ను క్యాన్సిల్ చేయమని ఆపరేటర్‌కు చెప్పాలి. దాంతో, మీరు పోగొట్టుకున్న ఆ సెల్ ఫోన్ వేరేవాళ్లు వాడేందుకు పనికిరాదు" అని వివరించారు.

ఆపరేటర్ వివరాలు సదరు సంస్థల వెబ్ సైటులలో లభిస్తాయి.

దీనికి మీ ఫోన్ ఐఎమ్‌ఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) తెలిసుండాలి. దీని ద్వారా మొబైల్ ఫోన్‌ను వెంటనే పనికిరాకుండా చేయవచ్చు. ఇది మొబైల్ ఫోన్ల అంతర్జాతీయ రిజిస్ట్రీ. ఈ కోడ్‌ను రాసుకుని ఎక్కడైనా అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

ఐఎమ్ఈఐ కోడ్ ఫోన్ డివైస్ బాక్స్ లేదా సెల్ ఫోన్‌పై ఉంటుంది.

ఐఎమ్ఈఐ తెలుసుకోవాలంటే ఫోన్ డయల్ ప్యాడ్ లో *#06# డయల్ చేయాలి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

2. యాప్ పాస్వర్డ్ మార్చాలి

"సెల్ ఫోన్‌లో ఉన్న అప్లికేషన్ల పాస్‌‌వర్డ్‌లన్నిటినీ వేరే చోట లాగిన్ అయి వెంటనే మార్చాలి" అని సిమోనీ చెప్పారు.

పాస్‌వర్డ్‌లు మార్చకపోతే నేరస్థులు సులభంగా వ్యక్తిగత సమాచారాన్ని, కుటుంబ వివరాలను సేకరించే ప్రమాదం ఉంటుంది.

"సాధారణంగా బ్యాంకింగ్ యాప్‌లు ఆటోమేటిక్‌గా పాస్‌వర్డ్‌ను మార్చనివ్వవు. కానీ, ఈ మెయిల్, సోషల్ మీడియా యాప్‌ల పాస్‌వర్డ్ లను సులభంగా మార్చుకునే అవకాశం ఉంటుంది" అని సిమోనీ చెప్పారు.

కొన్ని అప్లికేషన్లు వెబ్‌సైటుల ద్వారా పాస్‌వర్డ్ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్ మీడియా యాప్‌లలో ఆయా వేదికల సెక్యూరిటీ, లాగ్ ఇన్ సెక్షన్‌ల ద్వారా పాస్‌వర్డ్ మార్చుకునే వీలుంటుంది.

జీ మెయిల్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే సెక్షన్‌లో పాస్‌వర్డ్ మార్చుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

3. ఆర్ధిక సంస్థలకు సమాచారం ఇవ్వాలి

మీకు ఖాతాలున్న బ్యాంకుకు, ఇతర ఆర్ధిక సంస్థలకు వెంటనే ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం.

దీని వల్ల మీ మొబైల్ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసిన బ్యాంకింగ్ యాప్‌ను బ్లాక్ చేసే వీలుంటుంది.

నేరస్థులు థర్డ్ పార్టీ అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ చేయకుండా నిరోధించడం సాధ్యమవుతుంది.

దీని కోసం ప్రతీ బ్యాంకుకు కస్టమర్ సర్వీస్ విభాగాలుంటాయి. బ్యాంకు వెబ్‌సైటు పై సంబంధిత వివరాలు లభిస్తాయి.

బ్యాంకుల ఫోన్ నంబర్లు కూడా వెబ్‌సైటులో లేదా గూగుల్‌లో ఉంటాయి. అయితే, గూగుల్ నుంచి ఫోన్ నంబర్లు తీసునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఒక్కొక్కసారి నకిలీ ఫోన్ నంబర్లు కూడా ఉండొచ్చు. సెల్ ఫోన్ పోయిందనే కంగారులో మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేయకుండా చూసుకోవాలి.

వీడియో క్యాప్షన్, డిజిటల్ బెగ్గర్

4. కుటుంబ సభ్యులు, స్నేహితులకు వెంటనే సమాచారమివ్వాలి

కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ పోయిన విషయాన్ని వెంటనే తెలియచేయాలి.

"చాలా సార్లు ఫోన్ దొంగలించిన వ్యక్తులు బంధువులు, స్నేహితుల వివరాలను సేకరించి వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. వారిని డబ్బు లేదా బ్యాంకు వివరాలు అడగడం లాంటివి చేస్తారు" అని సిమోనీ వివరించారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, FIROZABAD POLICE

5. పోలీసులకు ఫిర్యాదు చేయాలి

ఫోన్ చోరీకి గురైన విషయాన్ని పోలీసులకు తెలియచేసి ఫిర్యాదు నమోదు చేయడం చాలా ముఖ్యం.

ఫిర్యాదు కాపీని బ్యాంకుకు, ఇన్సూరెన్సు అధికారులకు లేదా ఇతర సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది.

ఒక్కొక్కసారి సెల్ ఫోన్‌తో పాటు మన గుర్తింపు పత్రాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కొత్త గుర్తింపు పత్రాలు వచ్చేవరకూ చేతిలో ఫిర్యాదు కాపీ ఉంచుకోవడం చాలా అవసరం.

"ఫిర్యాదు నమోదు చేయడం వల్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు" అని సిమోనీ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ట్విటర్ సీఈఓ స్థాయికి పరాగ్ అగర్వాల్ ఎలా చేరుకున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)