సంజూ శాంసన్ 'మాస్టర్ క్లాస్' నుంచి బుమ్రా యార్కర్ల వరకు: టీమిండియాను చాంపియన్‌గా నిలబెట్టిన 5 విషయాలు

క్రికెట్, భారత్, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

న్యూజీలాండ్‌తో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు 255/5 పరుగుల రికార్డు స్కోరు సాధించి, వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది.

పవర్‌ప్లేలో బ్యాటర్ల జోరు నుంచి బౌలర్ల కట్టుదిట్టమైన స్పెల్స్ వరకు.. ఈ మ్యాచ్ గమనాన్ని మార్చిన 5 అంశాలు ఏంటంటే..

టీ20 ప్రపంచకప్, భారత్ విజయం, అహ్మదాబాద్

ఫొటో సోర్స్, Getty Images

1. అభిషేక్ 'పవర్‌ప్లే బ్యాటింగ్'

టాస్ గెలిచిన న్యూజీలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరంభంలోనే కివీస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బౌలర్ల వేగాన్ని అనుకూలంగా మార్చుకుంటూ మైదానం నలుమూలలా బౌండరీలు కొట్టాడు.

కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు సాధించిన అభిషేక్, పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ స్కోరును వికెట్ నష్టపోకుండా 90 పరుగులకు చేర్చాడు.

ఫైనల్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో మొదటి ఆరు ఓవర్లలోనే ఓవర్‌కు 15 పరుగుల చొప్పున రాబట్టడం భారత్‌కు భారీ స్కోరు సాధించేందుకు అవసరమైన పునాదిని వేసింది.

ఇది న్యూజీలాండ్ బౌలింగ్ వ్యూహాలను ఆరంభంలోనే ఒత్తిడిలోకి నెట్టింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టీ20 ప్రపంచకప్, భారత్ విజయం, అహ్మదాబాద్

ఫొటో సోర్స్, Getty Images

2. సంజూ శాంసన్ 'మాస్టర్ క్లాస్' ఇన్నింగ్స్

ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌కు అసలైన బలాన్నిచ్చింది ఓపెనర్ సంజూ శాంసన్. అభిషేక్ ఔట్ అయ్యాక కూడా ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ముఖ్యంగా రచిన్ రవీంద్ర వేసిన ఒక ఓవర్‌లో శాంసన్ మూడు భారీ సిక్సర్లు బాది స్టేడియంను హోరెత్తించాడు సంజు. ఈ దాడితో కివీస్ స్పిన్ విభాగం పూర్తిగా లయ తప్పింది.

సంజు శాంసన్ 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, స్ట్రైక్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఆడిన తీరు మ్యాచ్‌లోనే హైలైట్‌గా నిలిచింది.

టీ20 ప్రపంచకప్, భారత్ విజయం, అహ్మదాబాద్

ఫొటో సోర్స్, Getty Images

3. ఇషాన్ కిషన్ 'కౌంటర్ అటాక్'

అభిషేక్ ఔటయ్యాక వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్, రన్ రేట్ ఏమాత్రం తగ్గకుండా కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

మిచెల్ శాంట్నర్ తన స్పిన్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేసే ప్రయత్నం చేసినా, ఇషాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 23 బంతుల్లోనే 55 పరుగులు చేసి న్యూజీలాండ్ ఫీల్డింగ్ సెటప్‌ను గందరగోళానికి గురిచేశాడు.

ఇషాన్ ఇన్నింగ్స్ వల్ల 10 నుంచి 15 ఓవర్ల మధ్య కూడా భారత్ సగటు ఓవర్‌కు 12 పరుగుల పైనే కొనసాగింది.

ఇషాన్, సంజూ బ్యాటింగ్‌తో కేవలం 15 ఓవర్లలోనే భారత్ 200 పరుగులు దాటింది.

టీ20 ప్రపంచకప్, భారత్ విజయం, అహ్మదాబాద్

ఫొటో సోర్స్, Getty Images

4. శివమ్ దూబే 'డెత్ ఓవర్' మెరుపులు

కీలక సమయంలో సూర్యకుమార్, హార్ధిక్ పాండ్యా ఔటవడంతో భారత్ 240 పరుగులైనా చేస్తుందా అనుకున్నారంతా. ఈ తరుణంలో శివమ్ దూబే తన పవర్ హిట్టింగ్‌ను ప్రదర్శించాడు. భారీ షాట్లతో స్కోరును పెంచాడు. ముఖ్యంగా నీషమ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో దూబే ఆడిన తీరు అద్భుతం.

ఆ ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో భారత్ స్కోరు ఒక్కసారిగా 255/5కి చేరుకుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు. 20 ఓవర్లలో 256 పరుగులు చేయాలంటే న్యూజీలాండ్ బ్యాటర్లు ప్రతి ఓవర్‌లోనూ భారీ షాట్లు ఆడాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ 'కొండంత లక్ష్యం' కివీస్‌కు సవాలుగా మారింది.

టీ20 ప్రపంచకప్, భారత్ విజయం, అహ్మదాబాద్

ఫొటో సోర్స్, Getty Images

5. బుమ్రా యార్కర్లు

బ్యాటర్లు భారీ స్కోరు అందించాక, భారత బౌలర్లు, ఫీల్డర్లు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. మరోపక్క బుమ్రా యార్కర్లతో చెలరేగిపోయాడు.

256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్‌ను పవర్‌ప్లేలోనే భారత బౌలర్లు దెబ్బతీశారు. జస్‌ప్రీత్ బుమ్రా తన మొదటి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి పరుగుల ప్రవాహాన్ని నియంత్రించాడు.

మరోవైపు, అక్షర్ పటేల్ రంగంలోకి దిగి తన స్పిన్ మ్యాజిక్‌తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరి ధాటికి ఆరు ఓవర్లు ముగిసేసరికి కివీస్ మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి రన్ రేట్ విషయంలో వెనుకబడింది.

అంతేకాదు, పవర్ ప్లేలో భారత్ ప్లేయర్లు మంచి ఫీల్డింగ్ కనబరిచారు. ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్.

పవర్‌ప్లేలో లభించిన ఈ ఆరంభ ఆధిక్యం భారత్‌ను విజయం దిశగా నడిపింది. ఆ తర్వాత, చేయాల్సిన రన్ రేట్ పెరగడం, వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో కివీస్ జట్టుకు ఓటమి తప్పలేదు.

బుమ్రా యార్కర్లను న్యూజీలాండ్ బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు.

బుమ్రా నాలుగు వికెట్లు, అక్షర్ పటేల్ మూడు వికెట్లతో న్యూజీలాండ్ జట్టును గట్టిగా దెబ్బతీశారు.

సమష్టి కృషితో భారత జట్టు అహ్మదాబాద్‌లో కొత్త చరిత్రను లిఖించింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో క్లినికల్ పెర్ఫార్మెన్స్‌తో టీమిండియా చాంపియన్‌గా నిలిచి, లక్షలాది మంది అభిమానుల మధ్య ప్రపంచకప్‌ను ముద్దాడింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)