టీ20 వరల్డ్ కప్ 2026: మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత్, న్యూజీలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారీ విజయం

టీ20 -2026 ప్రపంచకప్‌ను గెలిచిన భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా సంబరం
చదివే సమయం: 4 నిమిషాలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి భారత్ మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

ఏ జట్టు కూడా ఇప్పటి వరకు వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలుచుకోలేదు.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి టీ20 కప్ విజేతగా నిలిచింది.

ఇప్పటి వరకు నాలుగుసార్లు టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన టీమిండియా... 2007, 2024, 2026లో విజేతగా నిలిచింది.

2014లో రన్నరప్‌గా నిలిచింది.

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ జట్టు ఏ దశలోనూ భారత్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

వికెట్లు ఒకదాని వెంట ఒకటి పడిపోతూ ఉండటంతో కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.

19 ఓవర్లలో159 పరుగులకు ఆలౌటైంది.

టీ20 వరల్డ్ కప్, భారత్, న్యూజీలాండ్, క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

భారత బౌలర్లలో బుమ్రా, అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు.

బూమ్రా నాలుగు వికెట్లు, అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశారు.

హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మకు తలో వికెట్ తీశారు.

క్రికెట్, భారత్, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్‌ తడబడింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.

మూడో ఓవర్‌ నుంచి న్యూజీలాండ్ వికెట్లు పడడం మొదలైంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన ఫిన్ అలెన్ లాంగాన్ వద్ద తిలక్ వర్మకు క్యాచ్‌గా దొరికిపోయాడు.

ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడుతూ వచ్చాయి.

బుమ్రా వేసిన నాలుగో ఓవర్ తొలిబంతికే రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్ బాటపట్టాడు.

అనంతరం మళ్లీ బాల్ తీసుకున్న అక్షర్ పటేల్, 5వ ఓవర్ ఐదో బంతికి ఫిలిప్స్‌‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.

తర్వాత వచ్చిన చాప్‌మన్ 3 పరుగులకే పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

క్రికెట్, భారత్, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన సెయిఫెర్ట్.. ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో న్యూజీలాండ్ 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్, బుమ్రా బౌలింగ్‌లో నీషమ్, హెన్రీ ఔటయ్యారు.

దీంతో 141 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది న్యూజీలాండ్ జట్టు.

అనంతరం శాంట్నర్, జేకబ్ వికెట్లు కోల్పోయి 159 పరుగులకే ఆలౌలైంది.

భారీ స్కోర్ ఛేదించే క్రమంలో న్యూజీలాండ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఒక్క సెయిఫెర్ట్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

క్రికెట్, భారత్, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఇన్నింగ్స్..

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది.

భారత బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ 89 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులు, ఇషాన్ కిషన్‌ 54 పరుగులు సాధించారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ శుభారంభాన్నిచ్చారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

అభిషేక్ ఔటైన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత్ కేవలం 15 ఓవర్లలోనే 200 పరుగులు దాటింది.

ఆ తర్వాత, వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత రన్‌రేట్ తగ్గింది. అయితే, చివరి ఓవర్‌లో శివమ్ దూబే హిట్టింగ్ చేయడంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు సాధించింది.

న్యూజీలాండ్ జట్టులో నీషమ్ 3 వికెట్లు తీశాడు.

క్రికెట్, భారత్, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రారంభం నుంచి దూకుడుగా..

ఆరంభం నుంచి భారత్ దూకుడుగా ఆడింది.

ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ అందుకున్నాడు. సంజూ శాంసన్‌తో కలిసి సిక్సులు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు.

పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.

51 పరుగులు చేసిన అభిషేక్, ఇన్నింగ్స్ 8వ ఓవర్లో, రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

10 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది.

క్రికెట్, భారత్, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఆ తర్వాత, ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

89 పరుగులు చేసిన శాంసన్ భారీ షాట్ ఆడబోయి నీషమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దీంతో 15.1 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 2 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది.

అనంతరం వెంటవెంటనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్, సూర్య, హార్దిక్ పాండ్యా ఔటయ్యారు. దీంతో భారత రన్‌రేట్ తగ్గింది.

చివరి ఓవర్‌లో శివమ్ దూబే హిట్టింగ్ చేయడంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్రికెట్, భారత్, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

మ్యాచ్‌లో కొన్ని హైలైట్స్..

ఇండియా ఈ మ్యాచ్‌‌లో కొట్టిన సిక్సర్లతో కలిపి టోర్నీలో వంద సిక్సర్లు పూర్తి చేసింది.

అభిషేక్ శర్మ టోర్నీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు.

ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

తొలిసారి ఇండియన్ ఓపెనర్లు 50కి పైగా పరుగుల భాగస్వామ్యం అందించారు.

టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ కొట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)