ఐఆర్ఐఎస్ దేనా: అమెరికా దాడికి గురైన ఈ ఇరాన్ నౌక విశాఖలో ఉన్నప్పుడు ఏం జరిగింది?

ఇరాన్ నౌకాదళం, ఐఆర్ఐఎస్ దేనా,విశాఖ

ఫొటో సోర్స్, Indian Navy’s Eastern Naval Command

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 18న ఫ్లీట్ రివ్యూలో ఐఆర్ఐఎస్ దేనా పాల్గొంది.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఫిబ్రవరి 16, 2026.

కైలాసగిరి గ్లాస్ వంతెనపై నిలబడి ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూస్తూ ఇరాన్ నౌకాదళ సిబ్బంది ఉత్సాహంగా మాట్లాడారు.

"మేం రోజూ సముద్రంలోనే ఉంటాం. కానీ ఇక్కడి నుంచి చూస్తే ఆకాశంపై నుంచి చూస్తున్నట్లు ఉంది" అని ఇరాన్ నావికాదళ బృందం తనతో అన్నారని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్ ఏంవీ ప్రణవ్ గోపాల్ బీబీసీతో చెప్పారు.

"ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేసిందనే వార్తలు రావడంతో ఆ క్షణాలు గుర్తొచ్చాయి" అని విశాఖలోని సీనియర్ జర్నలిస్ట్ రాజు వేంపాటి అన్నారు.

వీరిలాగే మరి కొందరు కూడా విశాఖలో ఇరాన్ నౌకాదళ బృందాన్ని చూసిన సంగతులు గుర్తు చేసుకుంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫిబ్రవరి 25న ఇరాన్‌కు బయలుదేరిన నౌక

ఫ్లీట్ రివ్యూ, మిలాన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనేక దేశాల నౌకలు విశాఖకు వచ్చాయి. వాటిలో ఇరాన్ నౌక ఐఆర్ఐఎస్ దేనా కూడా ఉంది.

విశాఖపట్నంలో ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మిలాన్ విన్యాసాల్లో 70 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. ఫిబ్రవరి 18న ఫ్లీట్ రివ్యూలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గౌరవ వందనాన్ని కూడా స్వీకరించారు.

ఫ్లీట్ రివ్యూ 2026 ప్రధాన కార్యక్రమం ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు జరిగింది. అయితే సన్నాహక కార్యక్రమాలతో కలిపి ఇది ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు కొనసాగింది.

ఐఆర్ఐఎస్ దేనా రాకను స్వాగతిస్తూ ఫిబ్రవరి 18న తూర్పు నౌకాదళ డిఫెన్స్ పీఆర్వో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే మిలాన్ విన్యాసాలు ముగిసిన వెంటనే ఫిబ్రవరి 25న ఆ యుద్ధ నౌక తమ దేశానికి బయలుదేరిందంటూ తూర్పు నౌకాదళం మరో ప్రకటనలో పేర్కొంది. ఇది భారత్-ఇరాన్‌ మధ్య ఉన్న దీర్ఘకాల సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తోందని ఆ ప్రకటన తెలిపింది.

సన్నాహక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చాలా దేశాల నౌకలు ముందుగానే వచ్చాయి. ఇరాన్ నౌకాదళ సిబ్బంది విశాఖ నగరంలో ఫిబ్రవరి 16న పర్యటక ప్రదేశాలను సందర్శిస్తూ కనిపించారు.

ఇరాన్ నౌకాదళం, ఐఆర్ఐఎస్ దేనా, కైలాసగిరి,విశాఖ

ఫొటో సోర్స్, VMRDA

కైలాసగిరిపై ఇరాన్ నావికాదళం

"ఇరాన్ సైనికులు కైలాసగిరిపై ఉన్న గ్లాస్ వంతెనను చూసి చాలా ఉత్సుకతకు గురయ్యారు. ఎదురుగా సముద్రం, చుట్టూ పచ్చదనం, అందమైన గ్లాస్ వంతెన పై నడవడం చాలా నచ్చిందని వారు నాతో అన్నారు" అని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్ ఏంవీ ప్రణవ్ గోపాల్ బీబీసీతో చెప్పారు.

"నిత్యం సముద్రంలో తిరిగే మాకు ఆకాశం పైనుంచి చూస్తున్నట్లు ఉంది అని చాలా ఉత్సాహంగా మాట్లాడారు. మా టీం వారితో ఒక ఫోటో తీసుకుంటామని అడుగుదామని అనే లోపు... ఇక్కడ మీతో ఒక ఫోటో తీసుకుంటామని వారే అన్నారు." అని ప్రణవ్ గోపాల్ గుర్తు చేసుకున్నారు.

ఐఎఫ్ఆర్, మిలాన్ ఏర్పాట్లలో భాగంగా వీఎంఆర్డీఏ చేపట్టిన సుందరీకరణ పనులను ఫిబ్రవరి 16న ప్రణవ్ గోపాల్ పరిశీలించారు. బీచ్ రోడ్‌లోని మ్యూజియంలు, కైలాసగిరి తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

కైలాసగిరిపై అభివృద్ధి పనులు పరిశీలిస్తుండగా ఇరాన్‌కు చెందిన నావికాదళ అధికారులు, సిబ్బంది రావటంతో ప్రణవ్ గోపాల్ వారితో కాసేపు మాట్లాడారు. వారిని గ్లాస్ వంతెన వద్దకు తీసుకువెళ్లి, ఆ వంతెన ప్రత్యేకతను వివరించారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలోని మ్యూజియంల గురించి వివరించారు.

"ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు కదిలి కైలాసగిరి అంతా తిరుగుతూ పనులను పర్యవేక్షిస్తూ ఎంట్రన్స్ వద్దకు వచ్చాను. అక్కడ మళ్లీ వారు కనిపించారు. నన్ను చూసి నవ్వారు. అక్కడ కూడా మరో ఫోటో తీసుకున్నాం" అని ఆయన చెప్పారు.

"ప్లీట్ రివ్యూలో భాగంగా సిటీ పరేడ్ చేస్తున్నప్పుడు అన్ని దేశాల రక్షణ దళాల బ్యాండ్ బృందాలు ఆర్కే బీచ్‌లో పరేడ్ చేశాయి. అందులో కూడా వారిని చూశాను. అయితే ఆ తర్వాత విశాఖ నుంచి వెళ్తుండగా... వారి నౌకపై అమెరికా దాడి చేసిందనే వార్తలు చూశాను. చాలా మంది మరణించారని కూడా ఆ వార్తల్లో పేర్కొన్నారు. చాలా బాధ కలిగింది" అని ప్రణవ్ గోపాల్ బీబీసీతో చెప్పారు.

ఇరాన్ నౌకాదళం, ఐఆర్ఐఎస్ దేనా, కైలాసగిరి,విశాఖ

ఫొటో సోర్స్, VMRDA

ఫొటో క్యాప్షన్, ఇరాన్ బృందం కైలాసగిరి, గ్లాస్ బ్రిడ్జిలను సందర్శించింది.

షిప్పులో నివాసం.. సిటీలో షాపింగ్…

"ఏదైనా దేశం నుంచి భారత్‌కు లేదా భారత్ నుంచి మరో దేశానికి విన్యాసాల్లో పాల్గొనేందుకు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నౌకాదళ సిబ్బంది వెళ్లడం సాధారణంగా జరిగేదే. ఆ సమయంలో వారు తాము ప్రయాణించిన నౌకల్లోనే నివాసం ఉంటారు. హోటళ్లలో, బయట తెలిసిన వాళ్ల ఇళ్లలో ఉండటం వంటివి చేయరు. అలాగే ఎప్పుడు మన వద్దకు వచ్చారు, ఎప్పుడు వెళ్లారనే విషయాలు కూడా బహిర్గతం కావు" అని భారత నౌకాదళంలోని సబ్‌మెరైన్‌లో సోనార్ ఆపరేటర్‌గా పని చేసి రిటైరైన కృష్ణమూర్తి బీబీసీతో చెప్పారు.

ప్రస్తుతం కృష్ణమూర్తి విశాఖలో కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం బాధ్యుడిగా ఉన్నారు.

ఇరాన్ నౌకాదళం కూడా నౌకలోనే ఉంటూ... నగరంలో పలు పర్యటక ప్రాంతాలను సందర్శించింది. షాపింగ్ చేసింది. ఇది సహజంగా జరిగేదే. మరో దేశం వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతి, ఇతర విశేషాలను తెలుసుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

"ఇరాన్ బృందం కైలాసగిరి, గ్లాస్ వంతెనలను కూడా అలాగే సందర్శించింది. అలాంటి సమయాల్లో వాళ్లతో నగర ప్రజలు ఫోటోలు దిగుతారు, వీడియోలు తీసుకుంటుంటారు" అని కృష్ణమూర్తి చెప్పారు.

"నేను మూడోసారి ఐఎఫ్ఆర్‌లో ప్రోటోకాల్ విధులు నిర్వహిస్తున్నాను. ఇరాన్ సైనికులు సిటీ పరేడ్‌లో భాగంగా పరేడ్ చేయడం చూశాను. చాలా సింపుల్‌గా వారి పరేడ్ వెళ్లినట్లుగా ఉంటుంది.

ఇరాన్ యుద్ధనౌక దాడికి గురైందని తెలిసిన తర్వాత ఆ పరేడ్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆర్కే బీచ్ రోడ్డులో కవాతు చేసిన బృందం తిరుగు ప్రయాణంలో అంతర్జాతీయ జలాల్లో దాడికి గురికావడం బాధాకరంగా ఉంది" అని కృష్ణమూర్తి బీబీసీతో అన్నారు.

ఇరాన్ నౌకాదళం, ఐఆర్ఐఎస్ దేనా, విశాఖ

ఫొటో సోర్స్, Indian Navy’s Eastern Naval Command

'పరేడ్‌లో ఇరాన్ బృందాన్ని చూశాను...'

ఇరాన్ నౌక ఐఆర్ఐఎస్ దేనా శ్రీలంక సమీపంలో అంతర్జాతీయ జలాల్లో దాడికి గురైందని తెలిసిన వెంటనే తన సెల్ ఫోన్‌లోని వీడియో గ్యాలరీకి వెళ్లానని ప్లీట్ రివ్యూని కవర్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ రాజు వేంపాటి బీబీసీతో చెప్పారు.

"నేను సిటీ పరేడ్ కవర్ చేసినప్పుడు వారి వీడియోలు తీసినట్లు గుర్తుంది. అందుకే గ్యాలరీ చూశాను. వారు పరేడ్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో నా ఫోన్‌లో ఉంది. మిగతా నౌకాదళ బృందాల పరేడ్‌తో పోల్చినప్పుడు వారి పరేడ్ చాలా సింపుల్‌గా అనిపించింది. నేను మళ్లీ వీడియో చూసినప్పుడు కూడా అదే అనిపించింది.

ఫిబ్రవరి 18న ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి వందన స్వీకారం కార్యక్రమాన్ని కవర్ చేశాం. అందులో ఐఆర్ఐఎస్ దేనా పాల్గొంది. ఆ తర్వాత రోజు ఫిబ్రవరి 19న సిటీ పరేడ్ జరిగింది.

పరేడ్ చేస్తున్న అన్ని దేశాల వారినీ జర్నలిస్టుగా నేను నా ఫోన్‌లో వీడియోలు తీస్తున్నాను. వారి ముఖ కవళికలు, రూపం మనకు బాగా తెలిసినట్లే అనిపించింది.

ఎందుకంటే అప్పటి వరకు పరేడ్‌లో వెస్ట్రన్ కంట్రీస్ వారు వరుసగా వెళ్లడం... ఆ తర్వాత ఇరాన్ బృందం రావడంతో... నాకు ఏదో సడెన్‌గా మనవాళ్లే అన్న ఫీల్ వచ్చింది" అని రాజు గుర్తు చేసుకున్నారు.

ఇరాన్ నౌకాదళం, ఐఆర్ఐఎస్ దేనా,విశాఖ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ షిప్ ఐఆర్ఐఎస్ దేనా (ఫైల్ ఫోటో)

ప్లీట్ రివ్యూలో...

ఫిబ్రవరి 18న విశాఖలోని తూర్పు నౌకాదళం నిర్వహించిన ఐఎఫ్ఆర్ 2026లో పాల్గొన్న ఐఆర్ఐఎస్ దేనా యుద్ధ నౌకను భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల అధిపతి ద్రౌపదీ ముర్ముకి పరిచయం చేస్తూ... 45 సెకన్ల పాటు దాని వివరాలను లైవ్‌లో చెప్పారు.

ఆ తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి ఐఆర్ఐఎస్ దేనా నుంచి ఇరాన్ నౌకాదళం గౌరవ వందనం చేసింది. దానికి ప్రతిగా ఆమె గౌరవ వందనం చేశారు.

ఐఆర్ఐఎస్ దేనాని ఫ్లీట్ రివ్యూలో పరిచయం చేస్తూ దాని కమాండర్‌గా అబుజాద్ జారే (Abuzad Zare) వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ నౌక 2021 జూన్ నుంచి సేవలందిస్తోందని తెలిపారు. ఇరాన్‌లోని మౌంట్ దేనా పేరును ఈ నౌకకు పెట్టినట్లు తెలిపారు.

ప్రత్యక్ష ప్రసారంలో ఈ నౌకతో పాటు ఆ నౌకలోని నౌకాదళాన్ని కూడా చూపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)