అయతొల్లా అలీ ఖమేనీ: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎలా ఎదిగారు, అమెరికాకు శత్రువుగా ఎందుకు మారారు?

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల మొదటి రోజే అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
గత మూడు దశాబ్దాలుగా ఇరాన్‌ను పాలిస్తున్న 86 ఏళ్ల ఖమేనీ మృతిని ఆ దేశ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాలించిన పాలకులలో ఆయన ఒకరు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత, దేశంలో రెండో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.
సుప్రీం లీడర్ సర్వాధికారాలు కలిగిన పదవి. దేశాధినేతగా ఉండటంతో పాటు, ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్‌తో సహా సాయుధ దళాలన్నింటికీ కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఖమేనీ పూర్తిగా నియంత కాదు. ఇరాన్ అధికార వ్యవహారాలన్నింటికీ ఈయనే కేంద్రం. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ వ్యవహారాన్నయినా ఈయన వీటో చేయగలరు. ప్రభుత్వ అధికారులను స్వయంగా ఎంపిక చేయగలరు.
ఇరాన్ యువత ఖమేనీ అధికారంలో లేని జీవితాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వ టెలివిజన్ ఆయన ప్రతి కదలికను ప్రసారం చేసేది. బహిరంగ ప్రదేశాల్లోని బిల్‌బోర్డులపై, దుకాణాల్లో ఆయన చిత్రాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి.
విదేశీ వ్యవహారాల్లో తరచుగా ఇరాన్ అధ్యక్షులు వార్తల్లో నిలిచినప్పటికీ, దేశం లోపల మాత్రం అన్నింటినీ నడిపించేది ఖమేనీయే.


ఫొటో సోర్స్, AFP via Getty Images
ఎవరీ అలీ ఖమేనీ?
ఇరాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన మషాద్‌లో, 1939లో అలీ ఖమేనీ పుట్టారు. మొత్తం 8 మంది సంతానంలో ఈయన రెండోవారు. ఇరాన్‌లో ఆధిపత్యవర్గమైన షియా ముస్లిం శాఖలో ఈయన తండ్రి మధ్యస్థాయి మతగురువు.
ఖమేనీ తన బాల్యం పేదరికంలోనే గడిచిందని కానీ, భక్తిమయంగా ఉందని గొప్పగా చెప్పుకునేవారు. తరచుగా తాను కేవలం "రొట్టె, ఎండుద్రాక్షలు" తిని బతికినట్లు ఆయన చెబుతుండేవారు.
చిన్నవయసులోనే ఖురాన్‌ను లోతుగా అధ్యయనం చేసిన ఖమేనీ 11 ఏళ్లకే మతగురువు అయ్యారు. ఆ సమయంలో అనేక మత పెద్దల తరహాలోనే ఆయన పనితీరు రాజకీయం, ఆధ్యాత్మికం మేళవింపుగా ఉండేది.
ఒక సమర్థవంతమైన వక్తగా ఉన్న ఖమేనీ, అప్పటి ఇరాన్ రాజు (షా)కు వ్యతిరేకంగా గళమెత్తారు. అయితే, ఇస్లామిక్ విప్లవం కారణంగా షా పదవీచ్యుతులయ్యారు.
చాలా సంవత్సరాల పాటు ఖమేనీ అజ్ఞాత జీవితం, జైలు జీవితం గడిపారు. షా పాలనలో రహస్య పోలీసులు ఆయన్ను ఆరుసార్లు అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Gamma-Rapho via Getty Images
ప్రార్థనల నాయకునిగా..
ఇస్లామిక్ విప్లవం వచ్చిన ఏడాది తర్వాత, రాజధాని తెహ్రాన్‌లో శుక్రవారం ప్రార్థనల నాయకునిగా ఖమేనీ నియమితులయ్యారు.
ప్రతివారం ఆయన ఇచ్చే రాజకీయ ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రసారమయ్యేవి. ఇది ఖమేనీని దేశంలోని కొత్త నాయకత్వంలో ఒక బలమైన వ్యక్తిగా నిలబెట్టింది.
విప్లవం తర్వాత నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో, ఖమేనీకి విధేయులైన కొందరు మిలిటెంట్ వర్సిటీ స్టూడెంట్స్ అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆక్రమించారు. పదుల సంఖ్యలో దౌత్యవేత్తలు, ఎంబసీ సిబ్బందిని బందీలుగా చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Bettmann via Getty Images
పదవీచ్యుతుడైన 'షా'కు ఆశ్రయం ఇవ్వాలనే అమెరికా నిర్ణయానికి నిరసనగా ఈ చర్యకు దిగిన విద్యార్థులకు, ఖమేనీ సహా ఇరాన్ విప్లవ నాయకులు మద్దతు పలికారు. బందీలను 444 రోజుల పాటు తమ అధీనంలోనే ఉంచారు.
ఈ ఘటన అమెరికాలోని కార్టర్ పాలన పతనానికి దారితీసింది. అలాగే, అమెరికా, పాశ్చాత్య దేశాల వ్యతిరేక మార్గంలో ఇరాన్ పయనించేలా చేసింది, అదే విప్లవానికి అసలు గుర్తింపుగా మారింది. ఈ ఉదంతం అంతర్జాతీయంగా దశాబ్దాల పాటు ఇరాన్‌ను ఒంటరయ్యేలా చేసింది.
ఇది జరిగిన కొద్ది కాలానికే, ఖమేనీ ఒక హత్యాయత్నం నుంచి బయటపడ్డారు. జూన్ 1981లో, ఒక అసమ్మతి బృందం టేప్ రికార్డర్‌లో బాంబును దాచిపెట్టింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే అది పేలింది. ఈ ఘటనలో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. తన కుడి చేయి పనితీరును శాశ్వతంగా కోల్పోయారు ఖమేనీ.

ఫొటో సోర్స్, Hulton Archive via Getty Images
అధ్యక్ష బాధ్యతలు
1981 చివర్లో, అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్-అలీ రాజాయ్ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఖమేనీ పోటీ చేశారు. ఎవరు పోటీ చేయాలనేది ఖమేనీ చేతుల్లోనే ఉండటంతో, ఫలితం ఎలా ఉంటుందనే విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. ఖమేనీ 97 శాతం ఓట్లతో విజయం సాధించారు.
ఆయన ప్రారంభోపన్యాసం తన అధ్యక్ష పాలన ఎలా ఉండబోతుందో స్పష్టం చేసింది. అందులో ఆయన "అమెరికా ప్రభావంతో ఉన్న వామపక్షవాదులను" తీవ్రంగా ఖండించారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఖమేనీ ఒక యుద్ధకాల నాయకుడిగా మారారు. ఆయన పదవిలోకి రావడానికి కొన్ని నెలల ముందే, పొరుగు దేశమైన ఇరాక్.. ఇరాన్‌పై దాడి చేసింది. ఖమేనీ ఇస్లామిక్ విప్లవం ఇతర దేశాలకు పాకి, తన అధికారాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందోనని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ భయపడటమే దీనికి కారణం.
ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ యుద్ధం అత్యంత క్రూరంగా, రక్తసిక్తంగా మారింది. ఈ యుద్ధంలో ఇరుపక్షాల వైపు కలిపి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ నెలల తరబడి యుద్ధ భూమిలోనే గడిపేవారు. అక్కడ ఆయనకు పరిచయమైన, కలిసిన ఎందరో కమాండర్లు, సైనికులు కళ్లముందే మరణించారు.
ఇరాన్‌లోని సరిహద్దు గ్రామాలపై ఇరాక్ సైన్యం రసాయన ఆయుధాలను ప్రయోగించింది. రాజధాని తెహ్రాన్‌తో సహా సుదూర ప్రాంతాలలోని నగరాలపై క్షిపణులతో దాడులు చేసింది.
మరోవైపు, ఇరాక్ రక్షణ శ్రేణులను ఛేదించడానికి ఇరాన్ 'హ్యూమన్ వేవ్స్' (పెద్ద సంఖ్యలో సైనికులను పంపడం) పై ఆధారపడింది. ఇందులో కనీస పోరాట వయస్సు కూడా లేని యువకులు ఉండేవారు. దీనివల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది.

ఫొటో సోర్స్, Ayatollah Khamenei
ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు
1981లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(86) మరణించడంతో, ఆయన వారసుడిగా.. 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' (మత పెద్దల మండలి) ఖమేనీని ఎంపిక చేసింది. కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైనప్పటికీ, మతపరమైన పాండిత్యంలో ఆయన రికార్డు బలహీనంగా ఉందనే అభిప్రాయం ఉండేది.
"నేను ఎన్నో తప్పులు లోపాలున్న ఒక సామాన్య వ్యక్తిని, నిజానికి ఒక చిన్న మత విద్యార్థిని" అని ఆయన తన తొలి ప్రసంగంలో అంగీకరించారు.
"అయితే, నా భుజాలపై ఒక బాధ్యతను ఉంచారు. ఈ బరువైన బాధ్యతను మోయడానికి నా సర్వశక్తులను, దేవుడిపై ఉన్న నా పూర్తి విశ్వాసాన్ని ఉపయోగిస్తాను" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.
మత పెద్దల్లో గౌరవం, ఖమేనీకి ఉన్నంత ప్రజాదరణ లేకపోవడంతో, కొత్త సుప్రీం లీడర్ తన సొంత అధికార బలగాన్ని నిర్మించుకోవడానికి చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
పాలన ఎలా సాగింది?
అయితే, తదుపరి 30 ఏళ్లలో ఖమేనీ పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పోలీసులు, మీడియా, మతపరమైన ఉన్నత వర్గాలతో సహా, తనకు విధేయులైన వారి నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకున్నారు.
వాషింగ్టన్‌లోని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ఫెలో కరీమ్ సద్జాద్‌పూర్ ప్రకారం, సుప్రీం లీడర్ అధికారం "కఠినమైన మత పెద్దలు, కొత్తగా ధనవంతులైన రివల్యూషనరీ గార్డ్స్‌తో కూడిన ఒక సన్నిహిత కూటమి"పై ఆధారపడి ఉంది.
ప్రజలలో తన పట్ల భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఖమేనీ వ్యక్తిత్వ ఆరాధనను ప్రోత్సహించారు. రాజకీయ అణచివేత, ప్రత్యర్థుల అక్రమ అరెస్టులూ జరిగాయి.
ఆయన చాలా అరుదుగా విదేశాలకు వెళ్లేవారు. ఖమేనీ తన భార్య, ఆరుగురు పిల్లలు, మనవరాళ్లు, మనవళ్లతో కలిసి సెంట్రల్ తెహ్రాన్‌లోని ఒక నివాస సముదాయంలో చాలా నిరాడంబరంగా జీవించేవారని రిపోర్టులున్నాయి.

ఫొటో సోర్స్, Hulton Archive via Getty Images
దేశీయంగా, తనపై వ్యతిరేకతను పూర్తిగా అణచివేశారు ఖమేనీ.
1999లో విద్యార్థుల నిరసనలు ఆయన అధికారానికి ముప్పుగా మారినప్పటికీ, వాటిని అణచివేయగలిగారు. ఒక దశాబ్దం తర్వాత, అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కొందరు తిరుగుబాటు చేయడంతో, వారిపై పెప్పర్ స్ప్రే వాడటం, కొట్టడం, కాల్పులు జరపడం వంటివి జరిగాయి.
2019లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిరసనలు మిన్నంటినప్పుడు, చట్టవిరుద్ధమైన ప్రదర్శనలను అడ్డుకోవడానికి ఖమేనీ రోజులు తరబడి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ఆ సమయంలో పోలీసులు నిరసనకారులపై మెషిన్ గన్‌లతో కాల్పులు జరిపి వారిని చంపారు.
మహిళా విద్యపై గత పాలకులు విధించిన అడ్డంకులను ఖమేనీ తొలగించారు. కానీ, ఆయనకు లింగ సమానత్వంపై ఏమాత్రం నమ్మకం లేదు. హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మహిళలను అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఏకాంత కారాగారంలో ఉంచారు. వారికి మద్దతు ఇచ్చిన వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఒక మానవ హక్కుల న్యాయవాదికి 38 ఏళ్ల జైలు శిక్ష, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు.
ఇక 2022లో, హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదనే ఆరోపణతో అరెస్ట్ అయి, పోలీసు కస్టడీలో మరణించిన 22 ఏళ్ల మహ్సా అమిని ఉదంతం ఇస్లామిక్ విప్లవానికే అతిపెద్ద సవాలుగా నిలిచింది.
ఆమె మరణం తర్వాత జరిగిన నిరసనల్లో భద్రతా దళాల చేతిలో 550 మందికి పైగా మరణించారని, 20,000 మందిని నిర్బంధించారని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అమెరికాతో వివాదాలు
ఖమేనీ ఒంటరి దేశానికి నాయకత్వం వహిస్తున్నట్లు విదేశాల్లో మాట్లాడుకునేవారు. అమెరికాపై సెప్టెంబర్ 11 (2001) దాడుల తర్వాత, అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాన్‌ను విమర్శించారు.
ఇజ్రాయెల్‌తో నిరంతరం సాగే పోరులో, ఖమేనీ లెబనాన్‌లోని 'హిజ్బుల్లా' అనే సాయుధ షియా బృందాన్ని తన ప్రతినిధిగా వాడుకున్నారు.
ఖమేనీ వాషింగ్టన్‌తో అటు రాజీ పడకుండా, ఇటు నేరుగా యుద్ధానికి దిగకుండా చాలా జాగ్రత్తగా విదేశీ విధానం అమలుచేశారు.
అమెరికాతో అత్యంత ఘర్షణ వాతావరణం నెలకొన్న అంశం అణ్వాయుధాలు. ఇరవై ఏళ్ల కిందట ఖమేనీ.. అణ్వాయుధాలు ఇస్లాంకు వ్యతిరేకమని ప్రకటిస్తూ, వాటి అభివృద్ధిని నిషేధిస్తూ ఒక 'ఫత్వా' జారీ చేశారు. కానీ, ఆయన పాలనలో ఇరాన్ రహస్యంగా అణు ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలు బలంగా నమ్మాయి.
దీనికి ప్రతిస్పందనగా, ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు, ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారులలో ఒకటిగా ఉన్న ఇరాన్‌ను పేదరికంలోకి నెట్టాయి. ఫలితంగా పెరిగిన నిరుద్యోగం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. 2015లో కుదిరిన అణు ఒప్పందాన్ని ఖమేనీ వ్యతిరేకించలేదు.
ఈ ఒప్పందం ప్రకారం, ఆంక్షల తొలగింపునకు బదులుగా ఇరాన్ తన అణు కార్యకలాపాలపై పరిమితులు విధించుకోవాలి. అయితే, అమెరికా ఈ ఒప్పందాన్ని దీర్ఘకాలం పాటిస్తుందో, లేదోనని ఆయన అప్పట్లోనే అనుమానం వ్యక్తం చేశారు.
2018లో ట్రంప్ అణు ఒప్పందం నుంచి వైదొలిగి, ఇరాన్‌ను కొత్త ఒప్పందానికి తీసుకువచ్చేందుకు మళ్లీ ఆంక్షలు విధించారు. రెండు సంవత్సరాల తర్వాత, సుప్రీం లీడర్‌కు అత్యంత సన్నిహితుడైన టాప్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసీం సులేమానీని ఇరాక్‌లో హతమార్చాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు.
దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, రష్యా, చైనాలతో మరింత సన్నిహితంగా మెలిగారు.
జూన్ 2025లో ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి నిల్వలు, అగ్రశ్రేణి సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినప్పుడు, ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ నగరాలపైకి క్షిపణుల వర్షం కురిపించింది.
ఈ యుద్ధంలో అమెరికా కూడా చేరి, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై దాడులు చేసినప్పుడు, ఖమేనీ లొంగిపోబోనని శపథం చేశారు. కానీ, గత కొన్నేళ్లలో మొదటిసారిగా ఆయన బలహీనంగా కనిపించారు.
జనవరి 2026లో కుప్పకూలిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కారణంగా ఖమేనీ పాలన వీధి నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నిరసనలను ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణచివేసింది. మానవ హక్కుల సంఘాల ప్రకారం, ఈ దాడుల్లో కనీసం 6,488 మంది నిరసనకారులు మరణించగా, మరో 53,700 మంది నిర్బంధంలో ఉన్నారు.
తదుపరి వారాల్లో, ట్రంప్ ఆ ప్రాంతంలో అమెరికా సైనిక బలాన్ని పెంచాలని ఆదేశించారు. ఇరాన్ తన అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందానికి అంగీకరించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు. కానీ, ఖమేనీ యురేనియం శుద్ధిని ఆపడానికి నిరాకరించారు.
"అమెరికా యుద్ధం ప్రారంభిస్తే, అది ఒకే దేశానికి పరిమితం కాకుండా మొత్తం ప్రాంతానికి వ్యాపించే యుద్ధంగా మారుతుందని తెలుసుకోవాలి" అని ఖమేనీ జనవరి 2026 చివరలో హెచ్చరించారు.
ఖమేనీ ఇరాన్ అధికార యంత్రాంగంపై తన పట్టును కఠినంగా కొనసాగించారు. కొన్నిసార్లు ఆయన ఇరాన్ సంస్కరణవాదులు, సంప్రదాయవాదుల మధ్య జరిగే గొడవలను పట్టించుకోకుండా, రాజకీయాలకు అతీతుడైన వ్యక్తిగా తనను తాను చిత్రించుకున్నారు.
ప్రస్తుతం ఇరాన్ జీవితం ఆయన నిర్దేశించిన చట్టాల ప్రకారమే నడుస్తోంది. ఆయన వారసుడు ఎవరు అనేది, దాని వల్ల ఎలాంటి మార్పులు వస్తాయనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










