అమెరికా, బ్రిటన్‌లు 1953లో ఇరాన్ ప్రభుత్వాన్ని కుట్ర చేసి ఎలా కూలదోశాయి?

ఫొటో సోర్స్, INTERCONTINENTALE/AFP via Getty Images
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, జర్నలిస్ట్, పరిశోధకులు
ఆ రోజు రాత్రి ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో వాతావరణం గంభీరంగా ఉంది. అక్కడ ఏదో పెద్ద పరిణామం జరగబోతుంది.
అర్ధరాత్రి వేళ ప్రధానమంత్రిని అరెస్టు చేయడానికి ఓ ట్రక్కు నిండా సైనికులు అక్కడికి వచ్చారు. అయితే, ప్రధానమంత్రికి నమ్మకస్తులైన అధికారులు ఈ విషయం తెలుసుకుని ఆ సైనికులను అరెస్టు చేశారు.
కానీ, అక్కడ ఇదే చివరి పరిణామం కాదు. ఈ తిరుగుబాటు వేళ్లు ఎంతో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి.
ఇది ఇరాన్‌లో ఇటీవల జరుగుతున్న నిరనసలకు సంబంధించినది కాదు. 1953 ఆగస్టు 15 నాటిది.
ఇరాన్ ప్రధానమంత్రి మొహమ్మద్ మొసాదే పదవీచ్యుతుడిని చేసేందుకు అప్పటికే పథకం రచించారు. ఇందులో ఇరాన్ రాజు షా సహా అమెరికా, బ్రిటన్ ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించాయి. ఈ కుట్రకు మొహమ్మద్ మొసాదే బాధితులుగా మారారు. ఆయన ప్రభుత్వం కూలిపోయింది.

ఇటీవల ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. ఆనాడు జరిగిన అంశాలను గుర్తు చేస్తున్నాయి. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాను హెచ్చరించింది ఇరాన్.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మొహమ్మద్ మొసాదే ప్రభుత్వాన్ని 1953లో కూలదోయడంలో తాను కీలక పాత్ర పోషించినట్లుగా 2013లో విడుదల చేసిన పత్రాల్లో మొదటిసారి అధికారికంగా అంగీకరించింది సీఐఏ.
అమెరికా విదేశాంగ పాలసీలో భాగంగా సీఐఏ సూచనలతోనే ఇరాన్‌లో ఆనాడు సైనిక తిరుగుబాటు జరిగిందని ఈ పత్రాల్లోని కొన్ని భాగాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో, 73 ఏళ్ల కిందట ఇరాన్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణాలు, ఇందులో అమెరికా, బ్రిటన్ పోషించిన పాత్ర, ఆనాటి ఘట్టాలను ఈ కథనంలో వివరించే ప్రయత్నం చేసింది బీబీసీ.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్, ఇరాన్ ...ఆయిల్
ఈ కథ 1908లో ఇరాన్‌లో చమురు నిల్వలను కనిపెట్టినప్పుడు ప్రారంభమైంది.
ఇరాన్‌లో ఖజర్ పాలకుడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం… ఆ దేశం నుంచి 80 శాతానికి పైగా చమురును 'ఆంగ్లో-పర్షియన్ ఆయిల్ కంపెనీ' ద్వారా బ్రిటన్ సేకరించేది.
అదే సమయంలో ఇరాన్ తమ సహజ వనరుల నుంచి 10 నుంచి 12 శాతం మాత్రమే పొందేది.
1925లో ఖజర్ చక్రవర్తి అహ్మద్ షాను కూలదోసి, రెజా షా ( ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్‌కు తాత).. పహ్లావి వంశాన్ని స్థాపించారు. ఆయన 1941 వరకు ఇరాన్ షాగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కొడుకు మొహమ్మద్ రెజా పహ్లావీకి అధికారం సంక్రమించింది.
ఇరాన్‌లో బ్రిటీష్ ఆయిల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజాందోళనలు 1940ల చివర్లో మొదలయ్యాయని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌కు చెందిన పరిశోధకులు వోల్ఫ్‌గ్యాంగ్ కె. క్రెస్సిన్ వెల్లడించారు.
విదేశీ నియంత్రణను తగ్గించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఈ కంపెనీపై ఆడిట్ నిర్వహించేందుకు ప్రయత్నించిందని అమెరికన్ జర్నలిస్ట్ స్టీఫెన్ కిన్‌జెర్ తన పుస్తకం "ఆల్ ద షా'స్ మెన్" అనే పుస్తకంలో రాశారు.
అయితే ఈ విషయంలో ఇరాన్ ప్రభుత్వంతో కంపెనీ సహకరించకపోవడంతో 1951లో ఆ దేశ పార్లమెంట్.. చమురు పరిశ్రమను జాతీయం చేయడానికి మద్దతు తెలుపుతూ ఓటు వేసింది.
ఈ చట్టానికి ప్రధానంగా మద్దతు తెలిపిన వ్యక్తి ఆనాటి ఇరాన్ ప్రధాన మంత్రి డాక్టర్ మొహమ్మద్ మొసాదే.
బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా ప్రకారం.. తమ ప్రయోజనాలకు ముప్పు ఎదురవ్వడాన్ని గమనించిన బ్రిటన్.. అక్కడి ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు ఓ సీక్రెట్ క్యాంపెయిన్ ప్రారంభించింది.
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం.. "మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంటరీ డిక్రీ (ఉత్తర్వు) ద్వారా మొహమ్మద్ మొసాదే పదవి నుంచి తొలగించాలని షాను ఒప్పించేందుకు ప్రయత్నించింది. కానీ ఈ పథకం ఫలించలేదు. అందుకు భిన్నంగా మొసాదేకు ప్రజాదరణ పెరిగింది. అదే సమయంలో షా ప్రజాదరణ పడిపోయింది" అని పేర్కొంది.
"ఈ తిరుగుబాటుకు బ్రిటన్ ఒంటరిగా బాధ్యత వహించాలనుకోలేదు. ఈ విషయంలో అమెరికాను తనతో చేతులు కలపాలని కోరింది. ఆనాటి ప్రచ్ఛన్న యుద్ధ మేఘాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇరానియన్ కమ్యూనిస్టు పార్టీకి మొసాదే దగ్గరవుతున్నారనే వార్తలు విస్తరించాయి. అప్పుడు ఆయన కమ్యునిజాన్ని బహిరంగంగా వ్యతిరేకించినప్పటికీ కూడా ఇవి వ్యాపించాయి" అని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మొహమ్మద్ మొసాదేకు వ్యతిరేకంగా బ్రిటన్, అమెరికా పొత్తు
అమెరికాకు చెందిన టైమ్ మేగజీన్ 1951లో ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా మొహమ్మద్ మొసాదేను ప్రకటించింది.
ఆయన "అంతర్జాతీయ వ్యవహారాలలో అత్యంత క్రియాశీల విధానాన్ని అవలంభించారు. అది ఎంతటి స్థాయిలో ఉందంటే.. వేలమైళ్ల దూరంలో ఉన్న దేశాల మంత్రిత్వ శాఖలలో కూడా రాత్రుళ్లు పొద్దుపోయే వరకు దీపాలు వెలుగుతూ ఉండేవి. అంటే ఆయన విధానంపై అంతసేపు చర్చలు జరుగుతున్నాయని అర్థం. ప్రజలు ఆయనను అమితంగా ఇష్టపడ్డారు" అని ఆ మేగజీన్ పేర్కొంది.
అయితే, "మొసాదేను రాజీపడని వ్యక్తిగా భావించిన బ్రిటిష్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్… 1953 ప్రారంభంలో ఆయన ప్రభుత్వాన్ని కూలదోయాలని నిర్ణయించుకున్నారు" అని కిన్‌జెర్ పేర్కొన్నారు.
ఈ చర్యకు అమెరికా "ఆపరేషన్ అజాక్స్" అని పేరు పెట్టగా, బ్రిటన్ "ఆపరేషన్ బూట్" అని పేరు పెట్టింది.
1953 మార్చిలో సైనిక నేతృత్వంలోని తిరుగుబాటుకు మద్దతు కోరుతూ ఓ ఇరానియన్ జనరల్ అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారని తెహ్రాన్‌లో సీఐఏ కేంద్రం రిపోర్ట్ చేసిందని ఇరానియన్ ఆర్కిటెక్చర్ నిపుణుడు, ఈ తిరుగుబాటు ప్రణాళికదారుల్లో ఒకరైన డాక్టర్ డోనల్డ్ ఎన్. విల్బర్‌ను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ రచయిత జేమ్స్ రైసెన్ రాశారు.
"నేను షా అనుకూల జనరల్ ఫజ్లోల్లా జాహిదిని తిరుగుబాటుకు నాయకత్వం వహించడానికి నియమించాను. తద్వారా ఆయన ఏదో విధంగా మొసాదేను ప్రధానమంత్రిగా తొలగించగలరు" అంటూ ఇరాన్‌లో బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐ6 చీఫ్ నార్మన్ డెర్బీషైర్‌తో జరిగిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ.. ది గార్డియన్ పత్రికలో జులియన్ బోర్గర్ రాశారు.
సీఐఏ డైరెక్టర్ అలెన్ డబ్ల్యూ.డల్లెస్ ఏప్రిల్ 4న మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ఆమోదించారు. ఈ డబ్బును "మొసాదేను తొలగించడానికి ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు" అని విల్బర్ తన పుస్తకం 'క్లాండెస్టైన్ సర్వీస్ హిస్టరీ: ఓవర్‌త్రో ఆఫ్ ప్రీమియర్ మొసాద్దేఘ్- నవంబర్ 1952 టు ఆగస్టు 1953'లో పేర్కొన్నారు.
షా ప్రధాన పాత్ర పోషించాలనేది ప్రణాళిక అని విల్బర్ రాశారు. అయితే, "ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో, అనిశ్చిత భయాలతో యువ షా ఉన్నారు" అని ఏజెన్సీ అధికారులు రాశారు.
ఆయన తరుచూ తన కుటుంబంతో విభేదించేవారు. ముఖ్యంగా తన కవల సోదరి ప్రిన్సెస్ అష్రఫ్‌తో ఈ విభేదాలు ఎక్కువగా ఉండేవి.
అంతేకాకుండా, సీఐఏ మాటల్లో చెప్పాలంటే, షాకు బ్రిటిష్ వారి కుట్రల పట్ల 'అకారణమైన భయం' ఉండేది. ఇది ఉమ్మడి కార్యకలాపాలకు ఒక అడ్డంకిగా ఉండేది.
1952 అక్టోబర్‌లో… మొహమ్మద్ మొసాదేకు బ్రిటన్‌తో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిని.. ఆ దేశ దౌత్యవేత్తలు, గూఢచారులను ఆయన బహిష్కరించారు.
దీంతో డెర్బీషైర్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆయన తన తిరుగుబాటు ప్రణాళికలను బేరూత్‌లోని సీఐఏకి అప్పగించారు.

ఫొటో సోర్స్, ECHO
'సంకోచించే షా'ను ఒప్పించే ప్రయత్నాలు
షా సంకోచంలో ఉన్నప్పుడు, అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ ఇంకా తుది ఆమోదం ఇవ్వనప్పటికీ.. ఈ ప్రణాళికలు ముందుకు సాగాయి.
జూన్ నెలలో, అమెరికా, బ్రిటన్ ఇంటెలిజెన్స్ అధికారులు తమ వ్యూహాన్ని బేరూత్‌లో ఖరారు చేశారు.
ఆ తర్వాత వెంటనే సీఐఏ నియర్ ఈస్ట్, ఆఫ్రికా డివిజన్ హెడ్ కెర్మిట్ రూజ్‌వెల్ట్ ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించేందుకు తెహ్రాన్‌కు చేరుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ చివరికు జులై 11న ఈ ప్లాన్‌ను ఆమోదించారు.
ప్లాన్ ప్రకారం.. ప్రజల్లో అశాంతిని రేకెత్తించే బాధ్యత సీఐఏది. దేశం పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయినప్పుడు, షా ఏ మాత్రం జంకగుండా రాయల్ ఉత్తర్వుల జారీ ద్వారా డాక్టర్ మొసాదేను తొలగించి, జనరల్ జాహిదిని ప్రధానమంత్రిగా నియమించాలి.
సరిగ్గా అదే సమయంలో సీఐఏ ఆఫీసర్ స్టీఫెన్ మీడ్, బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డెర్బీషైర్‌లు యువరాణి అష్రఫ్ పహ్లావీని కలిశారు. ఇరాన్‌కు తిరిగి రావాలని ఆమెను ఒప్పించారు. తామిచ్చిన స్క్రిప్ట్‌ను ఆమె సోదరుడు ఫాలో అయ్యేలా ఒప్పించాలని చెప్పారు.
తమకు నచ్చని యువరాణి తిరిగి వెనక్కి రావడంపై మొసాదే అనుకూల వర్గాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయని విల్బర్ రాశారు.
తన అనుమతి లేకుండా ఆమె తిరిగి రావడంపై షా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరిని కలిసేందుకు తొలుత నిరాకరించారు. ఆ తర్వాత తోబుట్టువుల మధ్య సంభాషణ ఎలా జరిగిందో చరిత్రలో ఎక్కడా లేదు.
సీఐఏ తన ప్రాపగాండ క్యాంపెయిన్‌ను ఉధృతం చేసింది. ఒక ప్రముఖ వార్తాపత్రిక యజమానికి సుమారు 45 వేల డాలర్ల (సుమారు రూ.40 లక్షల) రుణం ఇప్పించింది. ఇలా చేయడం ద్వారా ఆ వార్తాపత్రికను తమ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసేలా ఒప్పించవచ్చని సీఐఏ నమ్మింది.
మొసాదేను తొలగించి, జనరల్ జాహిదిని నియమించేందుకు సీఐఏ సిద్ధం చేసిన ఉత్తర్వుపై సంతకం పెట్టేందుకు తొలుత షా నిరాకరించారు.
అదే సమయంలో మొసాదే తనకు వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్రను తెలుసుకున్నారు. పార్లమెంట్‌ను రద్దు చేసేందుకు నేషనల్ రెఫరెండాన్ని ప్రకటించడం ద్వారా తన అధికారాన్ని పదిలం చేసుకోవాలని మొసాదే ప్రయత్నించారు.
ఆగస్టు 10 నాటికి చివరికి జనరల్ జాహిదిని, ఈ కుట్రలో పాల్గొన్న కొందరు మిలటరీ ఆఫీసర్లను కలిసేందుకు షా ఒప్పుకున్నారు. కానీ, ఈ ఉత్తర్వులపై సంతకం పెట్టేందుకు మాత్రం నిరాకరించారు.
చివరికి ఆగస్టు 13న షా ఈ ఉత్తర్వులపై సంతకం పెట్టారు. ఆర్మీ నేతృత్వంలోని తిరుగుబాటుకు ఆయన మద్దతు ఇస్తున్నారనే వార్తలు వెంటనే జనరల్ జాహిదికి విధేయులుగా ఉన్న సైనికాధికారుల్లో వ్యాపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
తిరుగుబాటు
ఆగస్టు 15న తిరుగుబాటు మొదలైంది. కానీ, ఒక ఇరాన్ సైనికాధికారి వల్ల, ఈ రహస్యం వెంటనే బయటకి పొక్కింది. ఈ కుట్రకు సంబంధించిన వివరాలన్ని మొసాదేకు తెలిశాయి.
ఇంటెలిజెన్స్ హిస్టరీ ప్రకారం..తిరుగుబాటు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే డాక్టర్ మొసాదే చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ తఖీ రియాహీకి విషయం తెలిసి, తన డిప్యూటీని రాయల్ గార్డు బ్యారక్స్ వద్దకు పంపారు.
డిప్యూటీని అక్కడే అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో షాకు అనుకూల దళాలు నగరాన్నంతా తమ గుప్పిట్లోకి తీసుకుని, ఇతర సీనియర్ అధికారులను అరెస్ట్ చేశాయి.
సైన్యానికి, ప్రభుత్వ కార్యాలయాలకు మధ్యన టెలిఫోన్ లైన్లను కట్ చేశారు. టెలిఫోన్ ఎక్స్చేంజ్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
కానీ, ఆశ్చర్యకరంగా ఫోన్లు పనిచేస్తూనే ఉన్నాయి. జనరల్ తఖీ రియాహీ, షా అనుకూల బలగాల నుంచి తప్పించుకుని, ప్రధానమంత్రికి అండగా నిలబడాలని కమాండర్లను సమన్వయం చేయడం మొదలుపెట్టారు.
డాక్టర్ మొసాదేను ఆయన ఇంట్లో అరెస్టు చేయడానికి పంపిన షా అనుకూల సైనికులను ప్రభుత్వ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
సైనిక ప్రధాన కార్యాలయంలో ఉన్న ట్యాంకులను, మొసాదేకు నమ్మకస్తులైన ప్రభుత్వ దళాలను చూసి జనరల్ జాహిదితో కలిసి పనిచేస్తున్న ఒక సీనియర్ సైనిక అధికారి అక్కడి నుంచి పారిపోయారు.
చరిత్ర రికార్డుల ప్రకారం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు విఫలమైందని తెహ్రాన్ రేడియో మరుసటి రోజు ఉదయం ప్రకటించింది.
అమెరికా రాయబార కార్యాలయంలోని సీఐఏ అధికారులు చీకట్లోనే ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వారికెలాంటి మార్గం లేకుండా పోయిందని చరిత్ర పత్రాలలో ఉంది.
కెర్మిట్ రూజ్‌వెల్ట్ రాయబార కార్యాలయం నుంచి బయటకి వచ్చి, ఉత్తర తెహ్రాన్‌లో దాక్కున్న జనరల్ జాహిదిని కనుగొన్నారు. ఆశ్చర్యకరంగా, ఆ ఆపరేషన్‌ను వదులుకునేందుకు జాహిది సిద్ధంగా లేరు.
జనరల్ జాహిదిని చట్టబద్ధమైన ప్రధానమంత్రి అని ప్రజలకు హామీ ఇస్తే, తిరుగుబాటు విజయవంతం అవుతుందని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆ ఉద్దేశ్యంతోనే రెండు రాయల్ ఉత్తర్వులపై షా సంతకాలు పెట్టారనే వార్తలను వ్యాపించేలా చేశారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ హిస్టరీలో పేర్కొని ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
తెహ్రాన్‌లోని సీఐఏ స్టేషన్ ఒక మెసేజ్‌ను న్యూయార్క్‌లోని అసోసియేటెడ్ ప్రెస్‌కు పంపింది.
దానిలో అనధికారిక సమాచారం ప్రకారం.. షా కు చెందిన రెండు ఉత్తర్వులు తమ వద్ద ఉన్నాయని ఈ కుట్రలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.
దానిలో ఒకటి మొసాదేను తొలగించడం, రెండోది జనరల్ జాహిదిని ప్రధానమంత్రిగా నియమించడం. సీఐఏ, దాని ఏజెంట్లు ఈ ఉత్తర్వులను తెహ్రాన్‌లో కొన్ని వార్తా పత్రికలకు పంపించారు.
కానీ, ఈ ప్రాపగాండ క్యాంపెయిన్ త్వరలోనే ముగిసిపోయింది. చాలామంది ఇరాన్ సీఐఏ ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు, లేదా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
షా ఆగస్టు 16న బాగ్దాద్ పారిపోయారని తెలుసుకున్నాక, ఈ ఆపరేషన్ పునరుద్ధరించే ఆశలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు స్పష్టంగా వెల్లడైంది.
రూజ్‌వెల్ట్‌ను వెంటనే తిరిగి వచ్చేయమని సూచిస్తూ సీఐఏ ప్రధాన కార్యాలయం టెలిగ్రామ్ పంపింది.
దీనికి రూజ్‌వెల్ట్ నిరాకరించారు. బాగ్దాద్ రేడియోలో షా మాట్లాడటం, జనరల్ జాహిది కఠినంగా వ్యవహరించడం వల్ల విజయానికి ఇంకా ఆశ మిగిలి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అనుకున్నట్లుగానే తాను ఆ ఉత్తర్వులపై సంతకాలు పెట్టినట్లు ఆగస్టు 17న బాగ్దాద్ నుంచి షా ప్రకటించారు.
ఈ కీలక సమయంలో షా దేశం విడిచివెళ్లిపోవడం, తిరుగుబాటులో పాల్గొన్న కొందరు అధికారులను అరెస్ట్ చేయడంపై సంతృప్తి చెందిన డాక్టర్ మొసాదే ప్రభుత్వం, ప్రమాదం తప్పిపోయిందనే నమ్మకంతో.. నగరం చుట్టూ ఏర్పాటు చేసిన చాలా వరకు బలగాలను ఉపసంహరించుకుంది.
అదే రోజు రాత్రి, జనరల్ జాహిదిని, కొందరు ప్రముఖ ఇరాన్ ఏజెంట్లను, మిలటరీ అధికారులను వాహనాల అండర్ క్యారేజీలు, పూర్తిగా మూసివేసిన జీపుల్లో దాచిపెట్టి, అమెరికా రాయబార కార్యాలయంలోకి తీసుకొచ్చింది సీఐఏ. అక్కడ అనేక విషయాలపై చర్చలు జరిగాయి.
ఆగస్టు 19న ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు వారంతా అంగీకారానికి వచ్చారు.
ఇరాన్ చరిత్రకారుడు మైఖేల్ ఆక్స్‌వర్తీ ప్రకారం.. ''మొసాదేకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం ఆయన పతనంలో కీలకమైంది'' అని అన్నారు.
అయితే, షా మరోసారి సీఐఏను నిరాశపరిచారు. ఆ తర్వాత రోజే ఆయన బాగ్దాద్‌ను వీడి రోమ్ వెళ్లారు. ప్రవాసంలోనే గడిపారు.
డాక్టర్ మొసాదే ప్రభుత్వ వార్తాపత్రికలేమో.. పహ్లావీ సామ్రాజ్యం అంతమైందని రిపోర్టు చేయగా.. కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి విడుదలైన ప్రకటనేమో.. ఇది ఆంగ్లో-అమెరికా కుట్రగా అభివర్ణించింది. నిరసనకారులు షా విగ్రహాలను ధ్వంసం చేశారు.
అజాక్స్‌ను కొనసాగించాలా? లేదా ఉపసంహరించుకోవాలా? అని ప్రధాన కార్యాలయం నుంచి సీఐఏ తెహ్రాన్ స్టేషన్ సలహా కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
విజయమెలా?
అయితే, అమెరికన్లు దీన్ని ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో.. తెహ్రాన్ వీధుల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆగస్టు 19న కొన్ని తెహ్రాన్ వార్తాపత్రికలు షాకు చెందిన ఎంతో కాలం నాటి ఉత్తర్వులను ప్రచురించారు. ఆ తర్వాత వెంటనే షాకు అనుకూలదారులు వీధుల్లో గుమికూడటం ప్రారంభించారు.
విల్బర్ ఇంటెలిజెన్స్ హిస్టరీ ప్రకారం.. ''వారందరికీ కావాల్సింది నాయకత్వం'' అని అన్నారు.
సీఐఏ ఇరానియన్ ఏజెంట్ల నుంచి ఆ నాయకత్వం లభించిందని పేర్కొన్నారు.
వీధుల్లోకి వచ్చిన గుంపును పార్లమెంట్ దిశగా తీసుకెళ్లేందుకు ఒక జర్నలిస్టు(ఏజెన్సీకి చెందిన అత్యంత ముఖ్యమైన ఇరానియన్ ఏజెంట్లలో ఒకరు) నేతృత్వం వహించారు. వార్తాపత్రిక కార్యాలయాలకు నిప్పు పెట్టాలని డాక్టర్ మొసాదే ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి ప్రజలకు సూచించారు. మరొక ఇరానియన్ సీఐఏ ఏజెంట్ ఇతర వార్తా పత్రికల కార్యాలయాలపై దాడి చేసేందుకు ఒక గుంపుకు నేతృత్వం వహించారు.
ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం.. ఉదయం 10.15కు షాకు అనుకూలమైన దళాలతో నిండిన ట్రక్కులు అన్ని ప్రధాన కూడళ్ల వద్దకు వచ్చాయి.
మధ్యాహ్నంకల్లా.. ఆ నిరసనకారుల గుంపుకు కొందరు అధికారుల నుంచి ప్రత్యక్షంగా నాయకత్వం లభించింది. గంటలోనే సెంట్రల్ టెలిగ్రాఫ్ ఆఫీసును స్వాధీనం చేసుకున్నారు.
షాకు మద్దతుగా తిరుగుబాటు చేయాలని కోరుతూ ప్రావిన్సులకు టెలిగ్రామ్‌లు పంపించారు. కొద్దిసేపు కాల్పులు జరిగిన తర్వాత, పోలీసు ప్రధాన కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖలను కూడా స్వాధీనం చేసుకున్నారు నిరసనకారులు.
అదే సమయంలో తెహ్రాన్ రేడియో స్టేషన్‌పై కొందరు పౌరులు, సైనికాధికారులు, పోలీసులు దాడి చేశారు. షా అనుకూలవాదులు ఆ బ్రాడ్‌కాస్ట్‌ను వారి చేతుల్లోకి తీసుకుని, తిరుగుబాటుదారులు విజయం సాధించారని ప్రకటించారు. రాయల్ ఉత్తర్వులను చదివారు.
రాయబార కార్యాలయంలోని సీఐఏ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. అండర్‌గ్రౌండ్‌లో దాక్కున్న జనరల్ జాహిదిని కెర్మిట్ రూజ్‌వెల్ట్ బయటకు రప్పించారు.
ఒక ట్యాంకును సిద్ధం చేసి, ఆయన్ను రేడియో స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచే జాతినుద్దేశించి జనరల్ జాహిది ప్రసంగం చేశారు.
డాక్టర్ మొసాదే, ఇతర ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామాలు చూసి సోవియట్ యూనియన్ ఆశ్చర్యపోయింది.
మొసాదే ప్రభుత్వం కుప్పకూలినా, ''ఇరాన్‌లో అమెరికా ఆపరేషన్ విఫలం'' అన్న రిపోర్టునే మాస్కో రేడియో బ్రాడ్‌కాస్ట్ చేసింది.
షాతో కలిసి సీఐఏ డైరెక్టర్ అలెన్ డల్లెస్ రోమ్ నుంచి తెహ్రాన్‌కు విమానంలో వెళ్లారు.
జనరల్ జాహిది అధికారికంగా మొసాదే స్థానాన్ని చేపట్టారు.
తొలుత మొసాదేను విచారించి మరణశిక్ష విధించారు. కానీ షా వ్యక్తిగత ఆదేశాల మేరకు, రాజద్రోహం నేరం కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
శిక్ష పూర్తయిన తర్వాత ఆయన జీవితాంతం గృహ నిర్బంధంలో గడపవలసి వచ్చింది. గృహ నిర్బంధంలో ఉండగానే ఆయన 1967లో మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














