సోమాలిలాండ్‌ను ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఎందుకు గుర్తించింది? తుర్కియే, సౌదీ, ఇతర కొన్ని దేశాలు ఎందుకు ఆగ్రహిస్తున్నాయి?

సోమాలియా ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోమాలిలాండ్ ప్రత్యేక దేశంగా ఏర్పడటంపై సోమాలియా ప్రజలు నిరసనలు చేపట్టినప్పుడు గత ఏడాది జనవరిలో తీసిన ఫోటో

సోమాలియాతో విడిపోయిన సోమాలిలాండ్‌ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించిన తొలి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది.

ఇజ్రాయెల్ ఆ దేశంతో వ్యవసాయం, ఆరోగ్యం, సాంకేతికత రంగాల్లో తక్షణమే సహకారాన్ని విస్తరించుకోవాలని భావిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పోస్టు చేశారు.

ఈ పరిణామాన్ని ''ఒక చరిత్రాత్మక ఘట్టం''గా సోమాలిలాండ్ అధ్యక్షుడు అబ్దుర్‌ రెహమాన్ మోహమ్మద్ అబ్దుల్లాహి వర్ణించారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన వీడియోలో, ''అబ్రహం ఒప్పందాల్లో చేరాలనుకునే సోమాలిలాండ్ కోరికను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు తెలియజేస్తాను'' అని నెతన్యాహు చెబుతున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సూడాన్, మొరాకో సహా కొన్ని అరబ్ దేశాలు 2020లో కుదుర్చుకున్న దౌత్య ఒప్పందాలను అరబ్ ఒప్పందాలు అంటారు.

ట్రంప్ తొలి పదవీ కాలంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇందులో.. ట్రంప్ కీలక పాత్ర పోషించారు.

అబ్రహం ఒప్పందాల్లో చేరేందుకు సోమాలిలాండ్ సిద్ధంగా ఉందని అబ్దుల్లాహి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

అయితే, ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించగా.. సోమాలిలాండ్‌ను ఇజ్రాయెల్ గుర్తించిన నిర్ణయాన్ని తాను ఫాలో కాలేదని, తాను ఈ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు.

''సోమాలిలాండ్‌ను మీరు ప్రత్యేక దేశంగా గుర్తిస్తారా?'' అని ట్రంప్‌ను ‘న్యూయార్క్ పోస్ట్’ అడిగినప్పుడు.. తొలుత ఆయన ''నో, ఇంకా నిర్ణయం తీసుకోలేదు'' అని చెప్పారు. ఆ తర్వాత తన సమాధానం ''నో'' అని చెబుతూ.. సోమాలిలాండ్ ఎక్కడుందో ఎవరికైనా నిజంగా తెలుసా? అని ట్రంప్‌ ప్రశ్నించారు.

సోమాలియా నుంచి వేరుపడిన దేశంలో కూడా అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేస్తుందా? అని ట్రంప్‌ను ప్రశ్నించగా.. అదంత ''పెద్ద విషయం కాదు'' అని బదులిచ్చారు.

''అన్నీ పరిశీలిస్తాం. అధ్యయనం చేస్తాం. నేను చాలా చూస్తాను. నేనెప్పుడూ ఉత్తమమైన నిర్ణయాలే తీసుకుంటాను. ఈ నిర్ణయాలు సరైనవిగా మారతాయి'' అని ట్రంప్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సోమాలియా నుంచి విడిపోయిన ప్రాంతమే సోమాలిలాండ్. 1991 నుంచి స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది.

ఇజ్రాయెల్ నిర్ణయంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సోమాలియా, తుర్కియే, జిబౌటి విదేశీ వ్యవహారాల మంత్రులతో ఈజిప్ట్ విదేశాంగ మంత్రి విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు.

సోమాలియా ఐక్యత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు తమ నాలుగు దేశాలు మద్దతు తెలియజేశాయని ఈజిప్ట్ విదేశాంగ మంత్రి తమ ప్రకటనలో తెలిపారు.

స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏకపక్ష చర్యలకు తాము వ్యతిరేకమని హెచ్చరించాయి.

సార్వభౌమ దేశాల్లోని కొన్ని ప్రాంతాలను స్వతంత్రంగా గుర్తించడం అంతర్జాతీయ చట్టం, యూఎన్ చార్టర్ ప్రకారం ప్రమాదకరమైన అడుగు అవుతుందని అన్నారు.

మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని దేశాలతో తమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ, గాజాలో యుద్ధం, ఇరాన్‌తో సంక్షోభం వంటివి ఈ ప్రయత్నాలకు గండి కొట్టాయి.

సోమాలిలాండ్‌కు సొంత కరెన్సీ, పాస్‌పోర్ట్, పోలీస్ బలగాలు ఉన్నాయి.

సోమాలియా మాజీ నియంత జనరల్ సియాద్ బారే పాలనకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘ పోరాటం తర్వాత, 1991లో సోమాలిలాండ్ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. అయితే, అప్పటి నుంచి ఈ ప్రాంతం దశాబ్దాలుగా ఏకాకిగానే ఉంది.

స్వయం ప్రకటిత రిపబ్లిక్‌ అయిన సోమాలిలాండ్‌ జనాభా 60 లక్షలు. సోమాలియా, ఇథియోపియా, ఈజిప్ట్ దేశాలతోపలు ప్రాదేశిక వివాదాల్లో చిక్కుకుంది సోమాలిలాండ్.

సోమాలిలాండ్ అధ్యక్షుడు, నెతన్యాహు

ఫొటో సోర్స్, X/@netanyahu

ఫొటో క్యాప్షన్, సోమాలిలాండ్ అధ్యక్షునితో వీడియో కాల్‌లో మాట్లాడిన నెతన్యాహు

ఇజ్రాయెల్‌కు ఈ నిర్ణయం ఎందుకంత ముఖ్యం?

ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గెడియాన్ సార్ గత వారం ద్వైపాక్షిక సంబంధాల గురించి అబ్దుల్లాహితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ గుర్తింపును సోమాలియా విదేశాంగ మంత్రి ఖండించారు. తమ సార్వభౌమాధికారంపై జరిగిన ‘ఉద్దేశపూర్వక దాడి’గా వర్ణించారు. దీన్ని ఇజ్రాయెల్ తీసుకున్న చట్టవిరుద్ధ చర్యగా పేర్కొన్నారు.

సోమాలియాతో పాటు తుర్కియే, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ)లు ఇజ్రాయెల్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.

తుర్కియే విమర్శలను సోమాలిలాండ్ కొట్టేసింది. ''తుర్కియే అభ్యంతరాలు క్షేత్రస్థాయిలోని వాస్తవాన్ని ప్రతిబింబించడం లేదు. 34 ఏళ్లుగా సోమాలియాలో భాగంగా లేని రిపబ్లిక్ ఆఫ్ సోమాలిలాండ్‌ను ఇజ్రాయెల్ గుర్తించింది. సోమాలిలాండ్ అధ్యక్షుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. ప్రముఖ నగరాల్లో జరిగిన వేడుకలు ప్రజల ఆమోదాన్ని తెలియజేశాయి. సోమాలిలాండ్ ప్రజలను గౌరవించాలని తుర్కియేను మేం అభ్యర్థిస్తున్నాం'' అని సోమాలిలాండ్ పేర్కొంది.

సోమాలిలాండ్ ఎన్నో ఏళ్లుగా దౌత్య గుర్తింపును కోరుతోంది. ఇటీవల తన ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసింది. గత అక్టోబర్‌లో అబ్దుల్లాహి ఇథియోపియా పర్యటనే దీనికి ఉదాహరణ.

శుక్రవారం వరకు ఏ దేశం నుంచి పూర్తి స్థాయి గుర్తింపును సోమాలిలాండ్ పొందనప్పటికీ.. ఇథియోపియా, అమెరికా, యూఏఈ వంటి పలు దేశాలతో డిప్లొమాటిక్ కాంటాక్ట్స్‌ను ఇది నిర్వహిస్తోంది. ఈ దేశాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది.

ఫిబ్రవరిలో దుబయిలో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో సోమాలిలాండ్ అధికారులు పాల్గొన్నారు. ఇదే సమయంలో యూఏఈ అధికారులతో సమావేశమైనట్లు సోమాలిలాండ్ విదేశాంగ శాఖ అప్పుడు ప్రకటించింది.

సోమాలిలాండ్‌లో యూఏఈ సైనిక స్థావరం ఉందని పలు కథనాలు వచ్చాయి. అయితే, యూఏఈ ఈ విషయం ధ్రువీకరించలేదు. ప్రముఖ యూఏఈ పోర్టు కంపెనీ డీపీ వరల్డ్‌కు సోమాలిలాండ్ నగరమైన బెర్బెరాలో ఒక పోర్టు ఉంది.

యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

ఒప్పందానికి యూఏఈ సంబంధం ఏమైనా ఉందా?

సోమాలిలాండ్‌ను అకస్మాత్తుగా ఒక స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ గుర్తించడం వెనుక యూఏఈ ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

''నిశ్శబ్దంగా చెప్పాల్సిన విషయాలను బెంజమిన్ నెతన్యాహు సాధారణంగా బిగ్గరగా చెబుతుంటారు. అబ్రహం ఒప్పందాలతో సోమాలిలాండ్‌ గుర్తింపును ముడిపెట్టడం ద్వారా.. ఇటీవల కాలంలో హార్న్ ఆఫ్ ఆఫ్రికాను పునర్ నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన యూఏఈ మద్దతు, ప్రభావాన్ని ఇజ్రాయెల్ నొక్కి చెబుతోంది'' అని ఆఫ్రికా వ్యవహారాల నిపుణులు, అనలిస్టు కామెరాన్ హడ్సన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

2020లో ఇజ్రాయెల్‌తో అబ్రహం ఒప్పందాల్లో చేరిన తొలి దేశాలు యూఏఈ, బహ్రెయిన్.

హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా కీలకమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే, ఎర్ర సముద్రానికి, బాబ్-ఎల్-మందేబ్ జలసంధికి ఇది దగ్గరగా ఉంది.

సబ్-సహరన్ ఆఫ్రికన్ (ఉప-సహారా ఆఫ్రికా) దేశాలతో తన సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఇజ్రాయెల్ పనిచేస్తోంది. 2021లో ఆఫ్రికన్ యూనియన్‌లో అబ్జర్వర్ స్టేటస్‌ను పొందింది. కానీ, పలు సభ్య దేశాలు వ్యతిరేకించడంతో 2023లో ఈ హోదాను కోల్పోయింది.

అరబ్ లీగ్‌లో సభ్య దేశం కావడంతో.. ఇజ్రాయెల్‌తో సోమాలియా ఎలాంటి దౌత్య సంబంధాలను పెట్టుకోలేదు. కానీ, సోమాలిలాండ్ రాజధాని హర్గీసాలో తుర్కియేకు కాన్సులేట్ ఉంది.

నెతన్యాహు

ఫొటో సోర్స్, X/@netanyahu

ఇజ్రాయెల్ నిర్ణయానికి కారణాలేంటి?

సోమాలిలాండ్‌ను ఇజ్రాయెల్ గుర్తించేందుకు పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

''హూతీ తిరుగుబాటుదారులపై భవిష్యత్‌లో దాడులు చేయడంతో పాటు పలు వ్యూహాత్మక కారణాల కోసం ఎర్ర సముద్ర ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌కు మిత్ర దేశాలు కావాలి'' అని గత నెలలో విడుదల చేసిన రిపోర్టులో ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ పేర్కొంది. యెమెన్‌లో ‘ఇరాన్‌తో మద్దతు ఉన్న’ తిరుగుబాటుదారులను ప్రస్తావిస్తూ ఈ కామెంట్ చేసింది.

'ఇలాంటి సహకారానికి సోమాలిలాండ్ అనువైన దేశంగా ఉంది. ఎందుకంటే, ఇది సంఘర్షణ ప్రాంతానికి అతి సమీపంలో ఒక ఆపరేషనల్ ఏరియాను ఇజ్రాయెల్‌కు అందిస్తుంది'' అని ఈ రిపోర్టు పేర్కొంది. దీని వెనుకాల ఆర్థిక కారణాలను కూడా ఈ రిపోర్టు ప్రస్తావించింది.

ఇదే సమయంలో సోమాలిలాండ్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు లేకపోవడంతో విదేశీ రుణాలు, సహాయం, పెట్టుబడులు అందడం లేదు. దీంతో, ఈ ప్రాంతం తీవ్ర పేదరికంలో కొట్టుకుంటోంది.

''సోమాలిలాండ్‌ను సార్వభౌమ దేశంగా ఇజ్రాయెల్ గుర్తించడం వల్ల.. బెర్బెరా పోర్టుకు నేరుగా యాక్సెస్, హూతీ బెదిరింపుల నేపథ్యంలో ఎర్ర సముద్రంలో భద్రతను మెరుగుపర్చడం, ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కొనడం వంటి మూడు కీలకమైన వ్యూహాత్మక విషయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు'' అని జియోపాలిటికల్ రైటర్ వాలినా చక్రోవా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

ఇస్లామిక్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇస్లామిక్ దేశాల నుంచి వ్యతిరేకత

ఈ గుర్తింపుకు తుర్కియే, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఒమన్, జోర్డాన్ వంటి అనేక దేశాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

'' అంతర్జాతీయ చట్టం కింద, సోమాలియా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి ఇజ్రాయెల్ గౌరవమివ్వాలి. సోమాలియాలో ఏదైనా భాగాన్ని గుర్తించడం చట్టాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుంది. సోమాలిలాండ్ అనేది సోమాలియాలో భాగం. మా సార్వభౌమత్వాన్నికాపాడుకునేందుకు మా ప్రజలందరూ ఐక్యతతో ఉన్నారు'' అని సోమాలియా అధ్యక్షుడు మొహమ్మద్ ఫార్మాజో అన్నారు.

సోమాలియా సభ్య దేశంగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ కూడా సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించింది.

సార్వభౌమ దేశంగా సోమాలిలాండ్‌ను గుర్తించడం తుర్కియేకు అతిపెద్ద ఎదురుదెబ్బ అని తుర్కియే పార్లమెంట్‌లోని ఇంటర్నేషనల్ అఫైర్స్ కమిటీ డిప్యూటీ చైర్మన్, తుర్కియే పార్లమెంట్ సభ్యులు సి. కాని తోరున్ అన్నారు.

''సోమాలియా నుంచి సొంతంగా స్వతంత్రం ప్రకటించుకున్న సోమాలిలాండ్‌ను ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించడం తూర్పు ఆఫ్రికాకు మాత్రమే కాక తుర్కియేకు కూడా కీలకమైన పరిణామం. ఇజ్రాయెల్ చర్య ఎర్ర సముద్రంలో, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో, ఈస్ట్ ఆఫ్రికాలో స్థిరత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా.. పలు ఘర్షణలకు ఆజ్యం పోస్తుంది'' అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

''2011 నుంచి సోమాలియాలో తుర్కియే పెట్టుబడులు పెడుతుంది'' అని తోరున్ రాశారు.

'' సోమాలియాకు తుర్కియే బలమైన ఆర్థిక, సైనిక భాగస్వామి. నేను అంబాసిడర్‌గా ఉన్నప్పుడు 2013లో సోమాలియా-సోమాలిలాండ్ మధ్య జరిపిన చర్చలు ఏకీకరణ దిశగా తీసుకున్న చర్యలను బలోపేతం చేశాయి. కానీ, ఈ నిర్ణయం స్థానిక సమతుల్యతను మార్చేస్తుంది. ఇజ్రాయెల్ నిర్ణయం వల్ల ఇతర దేశాలు ప్రభావితం కాకుండా ఉండేందుకు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో చర్చలు జరిపే విధానాన్ని తుర్కియే తక్షణమే చేపట్టాలి'' అని పేర్కొన్నారు.

సౌదీ అరేబియా విదేశాంగ శాఖ కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. సోమాలియా సార్వభౌమాధికారినికి పూర్తి మద్దతు ఇస్తామని, ఇజ్రాయెల్ చర్యను అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా ఖండిస్తామని తెలిపింది. ఇస్లామిక్ దేశాల ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) కూడా ఇజ్రాయెల్ ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించింది.

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కూడా దీనిపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ నిర్ణయం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ జీసీసీ సెక్రటరీ జనరల్ జాసిమ్ మొహమ్మద్ అల్-బుదేవి ప్రకటన విడుదల చేశారు.

జీసీసీలో మొత్తంగా ఆరు దేశాలు – బహ్రెయిన్, ఒమన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ ఉంటాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)