పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తే పరిస్థితులు మారుతాయా? ఆ ‘దేశాన్ని’ పాలించేదెవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాల్ ఆడమ్స్
- హోదా, డిప్లమాటిక్ కరస్పాండెంట్
పాలస్తీనా దౌత్యవేత్త హుసమ్ జోమ్లాట్‌ను ఈ నెల మొదట్లో లండన్‌లోని చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్‌లో చర్చలకు పిలిచారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని వాగ్దానం చేసిన దేశాల జాబితాలో యూకే, ఫ్రాన్స్, ఇతర దేశాలతో పాటు బెల్జియం కూడా చేరింది.
బ్రిటన్‌కు పాలస్తీనియన్ మిషన్ హెడ్‌గా ఉన్న డాక్టర్ జోమ్లాట్.. ఇది అత్యంత ముఖ్యమైన క్షణమని అన్నారు.
''న్యూయార్క్‌లో మీరు చూడబోయేది ద్విదేశ పరిష్కారాన్ని అమలు చేసేందుకు నిజమైన చివరి ప్రయత్నం కావొచ్చు'' అని చెప్పారు.
దాన్ని విఫలం కాకుండా చూసుకోవాలని కోరారు.
ముందు నుంచి ఇజ్రాయెల్‌కు మిత్రదేశాలుగా ఉన్న బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలు సైతం చివరికి పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించే నిర్ణయం తీసుకున్నాయి.
బ్రిటన్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ యూకే నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్‌లో వెల్లడించారు.
‘మిడిల్ ఈస్ట్‌లో భయానక పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో, ద్విదేశ పరిష్కారం, శాంతి అవకాశాలను సజీవంగా ఉంచేందుకు మేం చర్యలు తీసుకుంటున్నాం'' అని చెప్పారు.
దీనర్థం ఆచరణీయమైన పాలస్తీనా దేశంతో పాటు ఇజ్రాయెల్‌ను సురక్షితంగా ఉంచడమని అన్నారు.

ఇప్పటివరకు పాలస్తీనాను 150కి పైగా దేశాలు ఒక దేశంగా గుర్తించాయి.
అదనంగా యూకే, ఇతర దేశాలు కూడా గుర్తించడం ఒక అద్భుతమైన పరిణామంగా చాలామంది చూస్తున్నారు.
''ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా ఇప్పుడున్నంత శక్తిమంతంగా ఎప్పుడూ లేదు'' అని మాజీ పాలస్తీనా అధికారి జేవియర్ అబు ఈద్ చెప్పారు.
పాలస్తీనా కోసం ప్రపంచం కూడా కదలివస్తోంది.
అయితే, అసలు పాలస్తీనా అంటే ఏంటి? గుర్తించేందుకు ఒక దేశం ఉందా? అనే ప్రశ్నలతో పాటు పలు ఇతర ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
1933 మోంటెవీడియో కన్వెన్షన్‌లో ప్రత్యేక దేశం కోసం నాలుగు ప్రమాణాలను రూపొందించారు.
అందులో రెండింటిపై పాలస్తీనా న్యాయబద్ధంగా తన వాదనలను వినిపించుకోవచ్చు. దానిలో ఒకటి శాశ్వత జనాభా (గాజాలో యుద్ధం దీన్ని ప్రమాదంలో పడేసినప్పటికీ.. శాశ్వత జనాభాను ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు), అంతర్జాతీయ సంబంధాల్లోకి ప్రవేశించగలిగే సామర్థ్యం ఉండటం. దీనికి డాక్టర్ జోమ్లాట్‌నే నిజమైన ఉదాహరణ.
అయితే, 'నిర్వచించిన భూభాగపు' నిబంధనకు మాత్రం ఇది సరిపోవడం లేదు.
ఇప్పటి వరకు పాలస్తీనా తుది సరిహద్దులపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. (దీంతో ఎలాంటి శాంతి ప్రక్రియ ఉండదు).
పాలస్తీనియన్లు తమ ప్రాంతాన్ని మూడు భాగాలుగా చెప్పుకొంటున్నారు. ఒకటి తూర్పు జెరూసలెం, రెండు వెస్ట్‌బ్యాంక్, మూడు గాజా స్ట్రిప్.
1967లో ఆరు రోజుల యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ఈ మూడింటిన్ని జయించింది.
కిందనున్న మ్యాప్ నుంచి మీరు చూస్తే ఎక్కడ సమస్యలు మొదలయ్యాయో తెలుస్తుంది.
1948లో ఇజ్రాయెల్ స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి శతాబ్ద కాలంలో 75 ఏళ్ల పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లను భౌగోళికంగా వేరు చేసింది ఆ దేశం.

వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం, యూదు స్థిరనివాసులు ఉండటమంటే.. పాలస్తీనా అథారిటీ అని అర్థం. 1990ల్లో ఓస్లో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత ఏర్పాటైన అథారిటీ ఇది. అక్కడ దాదాపు 40 శాతం భూభాగాన్ని పాలస్తీనా అథారిటేయే నడుపుతోంది.
1967 నుంచి విస్తరించిన సెటిల్‌మెంట్లు, వెస్ట్ బ్యాంకును మెల్లగా ధ్వంసం చేశాయి.
పాలస్తీనియన్లు తమ రాజధానిగా భావిస్తున్న తూర్పు జెరూసలెం, యూదుల సెటిల్‌మెంట్లతో తలమునకలైంది. మెల్లగా వెస్ట్‌బ్యాంక్ నుంచి ఈ నగరాన్ని తప్పించారు.
ఇక గాజా విషయానికొస్తే మరింత ప్రమాదకరంగా మారింది. 2023 అక్టోబర్‌లో హమాస్ దాడుల తర్వాత సుమారు రెండేళ్లుగా యుద్ధాన్ని ఎదుర్కొంటోన్న గాజా స్ట్రిప్ తన భూభాగంలో చాలా వరకు కోల్పోయింది.
అయితే ఇవన్నీ సమస్య పరిష్కారానికి సరిపోనప్పటికీ, ఒక దేశంగా గుర్తించేందుకు కావాల్సిన మోంటెవీడియో కన్వెన్షన్‌లో ప్రతిపాదించిన నాలుగో నిబంధన.. కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వం కావాలి.
పాలస్తీనియన్లకు ఇది అతిపెద్ద సవాలుగా మారింది.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
'మాకు సరికొత్త నాయకత్వం కావాలి'
1994లో ఇజ్రాయెల్, పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) మధ్య జరిగిన ఒప్పందం పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ ఏర్పాటుకు దోహదం చేసింది.
దీన్నే పాలస్తీనియన్ అథారిటీ లేదా పీఏ అంటారు. గాజా, వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనియన్లపై పాక్షికంగా పౌర నియంత్రణను ఇది కలిగి ఉంది.
కానీ, 2007లో హమాస్‌కు ప్రధాన పీఎల్‌ఓ వర్గం ఫతా మధ్య రక్తపాత ఘర్షణలు చెలరేగినప్పుడు, హమాస్ ఫైటర్లు గాజాను తమ చేతుల్లోకి తీసుకున్నారు.
ఈ యుద్ధం ఫలితంగా ఉమ్మడి ప్రభుత్వం రద్దయి పాలస్తీనా భూభాగం విడిపోయింది.
ఫలితంగా గాజా హమాస్ చేతుల్లోకి, వెస్ట్‌బ్యాంక్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాలస్తీనియన్ అథారిటీ చేతుల్లోకి వచ్చాయి. పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమ్ముద్ అబ్బాస్.
అదే సమయంలో పాలస్తీనియన్ రాజకీయాలు చాలావరకు దెబ్బతింటూ వచ్చాయి. చాలామంది పాలస్తీనియన్లు తమ నాయకత్వం విషయంలో దురుసుగా ప్రవర్తిస్తూ వచ్చారు.

పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడే పురోగతిని పక్కనపెడితే, అంతర్గతంగా సమన్వయం కుదిరే అవకాశాలపై అక్కడి ప్రాంత ప్రజలు నిరాశనే వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ చివరిసారి అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికలు 2006లో జరిగాయి. దీనర్థం 36 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏ పాలస్తీనియన్ కూడా వెస్ట్ బ్యాంక్ లేదా గాజాలో ఓటు వేయలేదు.
''మాకు కొత్త నాయకత్వం కావాలి'' అని పాలస్తీనియన్ న్యాయవాది డయానా బట్టు అంటున్నారు.
అక్టోబర్ 2023లో గాజాలో యుద్ధం మొదలైన తర్వాత, ఈ సమస్య మరింత జటిలంగా మారింది.
వేలాది మంది తమ పౌరులు చనిపోతున్నప్పుడు, అబ్బాస్ పాలస్తీనియన్ అథారిటీ వెస్ట్‌బ్యాంక్‌లోని తమ ప్రధాన కార్యాలయం నుంచి చూస్తూ, నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఫొటో సోర్స్, MAHMUD HAMS/AFP via Getty Images
అంతర్గతంగా అసమ్మతి
నాయకత్వ శ్రేణుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఎన్నో సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి.
బహిష్కరణకు గురైన తర్వాత కొన్నేళ్లకు పీఎల్ఓ చైర్మన్ యాసిర్ అరాఫత్ తిరిగి పాలస్తీనా అథారిటీకి నేతృత్వం వహించేందుకు వచ్చినప్పుడు, స్థానిక పాలస్తీనియన్ రాజకీయనేతలు తమను పక్కన పెట్టినట్లు భావించారు.
మరింత ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన పాలస్తీనా అథారిటీ వెస్ట్ బ్యాంక్‌ను కాలనీగా మారుస్తున్న ఇజ్రాయెల్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో అశక్తురాలిగా మిగిలిపోయింది.
అలాగే 1993 సెప్టెంబరులో అమెరికా వైట్ హౌస్‌లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇషాక్ రాబిన్‌తో చేతులు కలపడం ద్వారా సాధిస్తానని చెప్పిన స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం అనే వాగ్దానాలను అది నెరవేర్చలేకపోయింది.
ఆ తర్వాత కాలంలో రాజకీయ పరిణామాలు సాఫీగా సాగేందుకు అనుకూలమైన పరిస్థితులు లేవు. శాంతి చర్చలు విఫలమవుతూ వచ్చాయి. యూదుల సెటిల్‌మెంట్లు విస్తరించాయి. ఇరు వైపుల తీవ్రవాదుల ఘర్షణలు పెరిగాయి. హమాస్, ఫతా మధ్య 2007లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.
''సాధారణ పరిస్థితుల్లో కొత్త తరాలు, ప్రజల తరఫున నిల్చునే కొత్త వ్యక్తులు పుట్టుకొచ్చేవారు'' అని పాలస్తీనియర్ చరిత్రకారుడు యెజిద్ సెయీయ్ చెప్పారు.
''కానీ, ఇది అసాధ్యమైంది. ఆక్రమిత ప్రాంతాల్లో పాలస్తీనియన్లు వేర్వేరు చిన్న ప్రాంతాల్లోకి వెళ్లడంతో ఛిన్నాభిన్నమయ్యారు.' అని చెప్పారు.
అయితే, ఇన్ని పరిస్థితులున్నప్పటికీ ఒక వ్యక్తి మార్వాన్ బర్ఘౌతి పాలస్తీనియన్ల కోసం వచ్చారు.
వెస్ట్‌బ్యాంక్‌లో పుట్టిపెరిగిన ఈయన 15 ఏళ్ల వయసులోనే ఫతాలో క్రియాశీలంగా మారారు. అరాఫత్ నేతృత్వంలోని పీఎల్ఓ వర్గం ఇది.

ఫొటో సోర్స్, REUTERS/Gary Hershorn
రెండోసారి పాలస్తీనా తిరుగుబాటు సమయంలో బర్ఘౌతి ప్రముఖ నాయకుడిగా ఎదిగారు.
దాడులకు ప్రణాళిక వేసి ఐదుగురు ఇజ్రాయెలీలను చంపినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో, ఆయన అరెస్ట్ అయ్యారు.
ఈ అభియోగాలను ఆయన ఖండిస్తూ వచ్చారు. 2002 నుంచి ఆయన ఇజ్రాయెల్ జైలులోనే ఉన్నారు.
భవిష్యత్‌లో నేతల గురించి పాలస్తీనియన్లు చర్చించుకున్న ప్రతిసారీ, 23 ఏళ్లుగా జైలులో ఉన్న ఆ వ్యక్తి గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇటీవల వెస్ట్ బ్యాంకుకు చెందిన పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పాలసీ అండ్ సర్వే రీసెర్చ్ సేకరించిన అభిప్రాయ సేకరణలో 50 శాతం మంది పాలస్తీనియన్లు తమ అధ్యక్షునిగా బర్ఘౌతిని కోరుకుంటున్నారు.
గాజాలో ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకెళ్లిన వారిని విడిచిపెట్టాలంటే, తాము కోరిన రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరుతున్న హమాస్ జాబితాలో ఆయన పేరే ప్రముఖంగా ఉందని భావిస్తున్నారు.
హమాస్‌తో ఎంతోకాలంగా ఘర్షణ ఉన్న ఫతాలో ఆయన సీనియర్ సభ్యుడు కావడం గమనార్హం.
అయితే, బర్ఘౌతి విడుదలకు సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
నెతాన్యాహు, పాలస్తీనా దేశం
గాజాలో యుద్ధానికి ముందు కూడా పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదాను బెంజమిన్ నెతాన్యాహు కొట్టిపారేశారు.
''మా ఉనికికే ప్రమాదకరంగా నిలిచే పాలస్తీనా దేశ ఏర్పాటును ఎన్నో దశాబ్దాలుగా అడ్డుకున్న వ్యక్తిని నేనేనని ప్రతి ఒక్కరికీ తెలుసు'' అని 2024 ఫిబ్రవరిలో అన్నారు.
గాజాను తమ నియంత్రణలోకి తీసుకోవాలని పాలస్తీనా అథారిటీకి అంతర్జాతీయంగా పిలుపు వస్తున్నప్పటికీ, గాజా భవిష్యత్ పాలనలో పీఏకు ఎలాంటి పాత్ర లేదని నెతాన్యాహు నొక్కి చెప్పారు.
అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడులను కూడా అబ్బాస్ ఖండించలేదని తెలిపారు.
వెస్ట్‌బ్యాంక్ నుంచి ఈస్ట్ జెరూసలెంను వేరు చేసే సెటిల్‌మెంట్ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ ఆగస్టులోనే ఆమోదమిచ్చింది.
3,400 ఇళ్లకు ఆమోదం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఈ ఆమోదం దేశంగా ఏర్పడాలనే పాలస్తీనా ఆలోచనను పాతిపెడుతుందని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిక్ అన్నారు.
ఇదేమీ తమకు కొత్తది కాదని యెజిద్ సెయీయ్ అన్నారు.
''ఆర్చ్‌ఏంజెల్ (ప్రధాన దేవదూత) మైఖేల్‌ను భూమిపైకి తీసుకొచ్చి, పాలస్తీనా అథారిటీకి అధిపతిగా చేయొచ్చు. కానీ, ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే, ఎందుకంటే ఏ విధమైన విజయాన్ని అయినా పూర్తిగా అసాధ్యం చేసే పరిస్థితులలో మీరు పని చేయాలి'' అని తెలిపారు. అంతేకాక, ఇది చాలాకాల సమస్యగా పేర్కొన్నారు.
అయితే ఒక విషయం అయితే స్పష్టంగా ఉంది. ఒకవేళ పాలస్తీనా దేశంగా ఏర్పడితే, దాన్ని హమాస్ నడపదు.
ఫ్రాన్స్, సౌదీ అరేబియాలు స్పాన్సర్ చేసిన మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో జులైలో రూపొందించిన ఒక డిక్లరేషన్‌లో గాజాలో హమాస్ తన పాలనకు అంతం పలకాలని, ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి ఇవ్వాలని ప్రకటించారు.
న్యూయార్క్ డిక్లరేషన్‌ను అన్ని అరబ్ దేశాలు అంగీకరించాయి. ఆ తర్వాత, యూఎన్ జనరల్ అసెంబ్లీలో 142 సభ్య దేశాలు దీన్ని అంగీకరించాయి.
దీనిలో భాగంగా సాంకేతిక నిపుణులకు చెందిన స్వతంత్ర పాలనకు గాజాలో అథారిటీని అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ కూడా తెలిపింది.
బర్ఘౌతి జైలులో ఉన్నారు. అబ్బాస్‌కు 90 ఏళ్ల వస్తున్నాయి. హమాస్ క్షీణిస్తోంది. వెస్ట్‌బ్యాంక్ ముక్కలు ముక్కలవుతుంది. పాలస్తీనాలో నాయకత్వ లోపం ఉందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కానీ, అంతర్జాతీయ గుర్తింపు అనేది అర్థరహితమైనది అయితే కాదు.
ఇది చాలా విలువైనది కావొచ్చని డయానా బట్టు అన్నారు. ఎందుకు ఈ దేశాలు చేస్తున్నాయి? వాటి ఉద్దేశమేంటన్నది గుర్తించాలని హెచ్చరించారు.
గుర్తింపుకు ప్రతీకాత్మక చిహ్నం దొరకడం మాత్రమే సరిపోదని బ్రిటన్ ప్రభుత్వంలోని అధికారుల్లో ఒకరన్నారు.
అయితే, ఇక్కడ మెదిలే ప్రశ్న ఏంటంటే.. కేవలం ఒక గుర్తింపు పొందిన దేశంగా యూఎన్ జనరల్ అసెంబ్లీ గుర్తించడమే కాకుండా.. దేశ పురోగతి దిశగా మనమేదైనా చేయగలమా?అన్నది ముఖ్యమన్నారు.
గుర్తింపు తర్వాత తీసుకోవలసిన చర్యలుగా గాజా, వెస్ట్ బ్యాంక్ ఏకీకరణ, పాలస్తీనా అథారిటీకి, పాలస్తీనా ఎన్నికలకు మద్దతు (అలాగే గాజా కోసం అరబ్ పునర్నిర్మాణ ప్రణాళిక) వంటి డిక్లరేషన్‌లోని సూచనలను లండన్‌లోని అధికారులు కూడా చెబుతున్నారు.
ఇజ్రాయెల్ నిర్దాక్షిణ్యంగా వీటిని వ్యతిరేకించింది. వెస్ట్‌బ్యాంక్ మొత్తాన్ని లేదా కొన్ని విభాగాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సైతం డజన్ల కొద్ది పాలస్తీనా అధికారులకు వీసాలను వెనక్కి తీసుకోవడం లేదా నిరాకరించడం చేస్తూ అనూహ్యమైన చర్య తీసుకున్నారు.
ఇది యూఎన్ సొంత నిబంధనలను సైతం ఉల్లంఘించినట్లు అనిపిస్తుంది.
పాలస్తీనాను దేశంగా గుర్తించే విషయంలో యూఎన్‌లో అమెరికా వీటో పవర్‌ను ఉపయోగించుకోనుంది.
అయితే, ''రివేరా ప్రణాళిక'గా పిలిచే దానికే కట్టుబడి ఉన్నారు ట్రంప్. ఈ ప్రణాళిక కింద గాజాలో దీర్ఘకాలిక యాజమాన్య స్థానాన్ని అమెరికా తీసుకోనుంది.
అయితే గాజా దీర్ఘకాలిక భవిష్యత్ ప్రస్తుతం న్యూయార్క్ డిక్లరేషన్, ట్రంప్ ప్లాన్, అరబ్ రీకన్‌స్ట్రక్షన్ ప్లాన్ మధ్యలో కూరుకుపోయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














