ఇస్లామిక్ దేశాలు ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాయా?

దోహ, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అరబ్, ఇస్లామిక్ దేశాల అత్యవసర శిఖరాగ్ర సమావేశం దోహాలో జరిగింది.
    • రచయిత, సందీప్ రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత, అరబ్ దేశాల మధ్య నేటో తరహా సైనిక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం ఊపందుకుంటున్నట్లు కనిపిస్తోంది.

దోహాలో అరబ్, ఇస్లామిక్ దేశాల అత్యవసర శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇందులో మొదట సభ్య దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. తదుపరి సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజ్ష్కియన్, ఇరాక్ ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా-అల్ సుదానీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సహా అనేక దేశాల అగ్ర నాయకులు హాజరయ్యారు.

ఇంతలో, ఈజిప్ట్ నుంచి వచ్చిన ప్రతిపాదన మళ్లీ 'ఉమ్మడి భద్రతా దళం'పై చర్చను లేవనెత్తింది.

ది నేషనల్ వార్తాపత్రిక కథనం ప్రకారం, నేటో తరహా సాయుధ దళాన్ని సృష్టించాలనేది ఈజిప్ట్ ప్రతిపాదన. దీని అధ్యక్ష పదవిని 22 అరబ్ లీగ్ దేశాలకు ఒకరి తర్వాత మరొకరికి అప్పగించనున్నారు. మొదటి అధ్యక్షుడు ఈజిప్ట్ నుంచి వస్తారు.

ది న్యూ అరబ్ మీడియా ప్రకారం, అటువంటి ప్రతిపాదన మొదట 2015లో వచ్చింది. ఆ సమయంలో యెమెన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమై హౌతీ తిరుగుబాటుదారులు సనాను స్వాధీనం చేసుకున్నారు.

ఇపుడు, దోహాపై దాడుల తర్వాత తుర్కియేలో కూడా ఆందోళన పెరిగింది.

"ఖతార్‌లో జరిపినట్లుగానే ఇజ్రాయెల్ తన విచక్షణారహిత దాడులను పెంచవచ్చు. అది దేశాన్ని, మొత్తం రీజియన్‌ను విపత్తు వైపు నెట్టవచ్చు" అని తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రియర్ అడ్మిరల్ జేకీ అక్తుర్క్ హెచ్చరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈజిప్టు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సెప్టెంబర్ 9న, దోహాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది.

ఈజిప్ట్ ప్రతిపాదన ఏమిటి?

ఈజిప్ట్ నుంచి వచ్చిన ప్రతిపాదనలో సైన్యం, వైమానిక దళం, కమాండో యూనిట్ల మధ్య మెరుగైన సమన్వయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సమగ్ర ట్రైనింగ్, లాజిస్టిక్స్, సైనిక వ్యవస్థలను ఏర్పాటుచేయడం కూడా ఉన్నాయి.

అలాగే, సభ్య దేశాలు, సైనిక నాయకత్వంతో సంప్రదింపుల ఆధారంగా సైనిక బలగాలను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వనున్నారు.

లెబనీస్ మీడియా సంస్థ అల్ అఖ్బర్ కథనం ప్రకారం, ఈజిప్ట్ ఈ రకమైన సైనిక సంకీర్ణానికి 20,000 మంది సైనికులను అందజేస్తామని ప్రతిపాదనలో పేర్కొంది. అయితే సౌదీ అరేబియా సహకారంపరంగా రెండో అతిపెద్ద దేశం అవుతుంది.

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి దీని గురించి అనేక దేశాలతో మాట్లాడారు.

ఈ రకమైన సైనిక సమన్వయాన్ని ఈ ప్రాంతంలోని దేశాలు ఇంతకుముందూ చూశాయి- మొదటి గల్ఫ్ యుద్ధం లేదా ఇజ్రాయెల్‌పై జరిగిన అనేక యుద్ధాలలో.

అరబ్, ఇస్లామిక్ దేశాల మధ్య ఇటువంటి సైనిక కూటమిని - సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ - బాగ్దాద్ ఒప్పందం అని పిలిచేవారు. ఇది 1955 నుంచి 1979 వరకు కొనసాగింది.

దోహాలో ఇజ్రాయెల్ దాడిపై అరబ్ దేశాల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న యూఏఈ కూడా విమర్శించింది.

ఇరాక్ ప్రధానమంత్రి మొహమ్మద్ షియా అల్-సుదానీ కూడా 'ఇస్లామిక్ సైనిక కూటమి' ఏర్పాటుకు పిలుపునిచ్చారు.

తుర్కిష్ ప్రభుత్వ ప్రసార సంస్థ టీఆర్టీ వరల్డ్ కథనం ప్రకారం, గాజా, ఖతార్‌లలో ఇజ్రాయెల్ ఇటీవలి చర్యలకు సమిష్టి ప్రతిస్పందన అవసరమని సూదానీ సూచించారు.

దోహాపై జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు హమాస్ సభ్యులు, ఒక ఖతార్ భద్రతా అధికారి చనిపోయారని, ఇది "అంతర్జాతీయ చట్టం దిగ్భ్రాంతికరమైన ఉల్లంఘన" అని, ఇజ్రాయెల్ చర్యలు మొత్తం ప్రాంత భద్రతకు ముప్పు కలిగిస్తాయని ఆయన అన్నారు.

"ముస్లిం దేశాలు కలిసి వచ్చి తమను తాము రక్షించుకోగల ఉమ్మడి భద్రతా దళాన్ని ఏర్పాటు చేయలేకపోవడానికి ఎటువంటి కారణం లేదు" అని అల్ జజీరా ఛానెల్‌తో సుదానీ అన్నారు. అరబ్, ఇస్లామిక్ దేశాలు రాజకీయ, భద్రతా, ఆర్థిక స్థాయిలో సమగ్ర భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శిఖరాగ్ర సమావేశానికి ముందు ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి భేటీ అయ్యారు.

ఇజ్రాయెల్‌ను శిక్షించాలంటున్న ఖతార్

"అంతర్జాతీయ సమాజం ద్వంద్వ ప్రమాణాలను ముగించి, ఇజ్రాయెల్ నేరాలకు శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది" అని ఖతార్ ప్రధాన మంత్రి సోమవారం శిఖరాగ్ర సమావేశానికి ముందు వ్యాఖ్యానించారు.

"మా సోదర ప్రజలు, పాలస్తీనియన్లను వారి భూమి నుంచి తరిమికొట్టడానికి ఉద్దేశించిన విధ్వంసక యుద్ధం విజయవంతం కాదని ఇజ్రాయెల్ గ్రహించాలి" అని అన్నారాయన.

దోహా దాడిపై ముసాయిదా తీర్మానాన్ని శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తామని ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ శిఖరాగ్ర సమావేశం దృఢమైన, ఏకీకృత అరబ్-ఇస్లామిక్ వైఖరి, ఇజ్రాయెల్‌పై స్పష్టమైన, నిర్దిష్ట చర్యలకు ముందుకు తీసుకెళుతుందని గ్రూపు ఆశిస్తున్నట్లు హమాస్ రాజకీయ బ్యూరో సభ్యుడు బస్సెం నయీమ్ చెప్పారు.

ఈ ప్రాంతంలోని ఖతార్‌లో అమెరికా అతిపెద్ద సైనిక స్థావరాన్ని కలిగి ఉంది. దీనితో పాటు, అమెరికా, ఈజిప్టుతో పాటు ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వం వహించడంలోనూ ఖతార్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

దోహా దాడిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది అమెరికా, ఇజ్రాయెల్ మధ్య బలమైన సంబంధాలకు హాని కలిగించదని కూడా పునరుద్ఘాటించారు.

దాడి గురించి ఖతార్‌కు ఇచ్చిన సమాచారం గురించి వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లెవిట్ చేసిన ప్రకటనపై ఇప్పటికే వివాదం చెలరేగింది. ఆ ప్రకటన ప్రకారం, 'దాడికి ముందే ఖతార్‌కు సమాచారం అందింది'. కానీ, 'దాడి జరిగిన 10 నిమిషాల తర్వాత తనకు ఈ సమాచారం అందిందని' ఖతార్ ప్రధానమంత్రి అన్నారు.

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియా ఇప్పటికే ఉగ్రవాద వ్యతిరేక సైనిక సంస్థకు నాయకత్వం వహిస్తోంది.

'అరబ్ నేటో' సాధ్యమవుతుందా?

అరబ్ దేశాల మధ్య నేటో లాంటి సైనిక కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది. కానీ, నిపుణులకు దాని అమలు గురించి పెద్దగా నమ్మకం లేదు.

"అరబ్ నేటో ఆలోచన గురించి ఇంతకుముందు కూడా చర్చ జరిగింది. సౌదీ అరేబియా దానికి చాలా ప్రాధాన్యతనిచ్చింది. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్‌ను దానికి అధ్యక్షుడిగా చేశారు. కానీ, ముందుకు సాగలేదు" అని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోని నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఫ్యాకల్టీ సభ్యుడు ప్రేమానంద్ మిశ్రా అన్నారు.

"అన్ని దేశాల భద్రతా ప్రయోజనాలు చాలా భిన్నంగా ఉంటాయి. వాటి మధ్య ఏకాభిప్రాయాన్ని నిర్మించడం చాలా కష్టమైన పని. ఉదాహరణకు, సౌదీ అరేబియా, ఇరాన్ తమ విభేదాలను పరిష్కరించుకోని కలిసి రాగలవా? ఎందుకంటే ఉమ్మడి సైనిక కూటమి ఏర్పడాలంటే, నిఘా భాగస్వామ్యం కూడా ఉంటుంది" అని అన్నారు.

గత కొన్నిరోజులుగా సౌదీ, ఇరాన్ మధ్య సంబంధాలను సాధారణీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇతర దేశాల మధ్య ప్రాంతీయ కూటమికి సంబంధించి ఏవైనా నిర్దిష్ట చర్యలు తీసుకుంటారా లేదా అనేది స్పష్టంగా తెలియదు.

'ఈ ప్రతిపాదన ఈజిప్ట్ నుంచి వచ్చింది, అది ఈ స్థితిలో ఉందో లేదో చూడాలి. అలాంటి ఏదైనా సమూహాన్ని పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, నేటో అనుమతిస్తాయా?' అని ప్రేమానంద్ మిశ్రా ప్రశ్నించారు.

అరబ్ దేశాలకు అరబ్ లీగ్, ఓఐసీ లేదా జీసీసీ వంటి సంస్థలు ఉన్నాయని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఆసియా స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముదస్సిర్ కమర్ అన్నారు.

ఇది కాకుండా, సౌదీ అరేబియా నాయకత్వంలో ఉగ్రవాద వ్యతిరేక సైనిక సంస్థ ఉందని తెలిపారు. కానీ, అసలు సమస్య ఏమిటంటే అరబ్ దేశాల మధ్య పరస్పర విభేదాలను ఎదుర్కోవడం అని గుర్తుచేశారాయన.

"ప్రస్తుతం అనేక అరబ్ దేశాలతో ఉద్రిక్తత, సంఘర్షణలో ఉన్న ఇజ్రాయెల్‌ను విస్మరించడం ఏ కూటమికైనా కష్టం అవుతుంది" అని ముదస్సిర్ కమర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)