‘తమిళ్ టైగర్’ ప్రభాకరన్ చివరి క్షణాలెలా గడిచాయంటే...

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నవంబరు 27, 2008న ప్రభాకరన్ ఇచ్చిన ప్రసంగం ఆయన జీవితంలో చివరి ప్రసంగంగా నిలిచింది. మరికొన్ని నెలల్లోనే ఆయన జీవితం ముగిసిపోతుందని ఎవరికీ తెలియదు. అయితే తన జీవితం చివరిక్షణాల వరకూ కూడా ప్రభాకర్ వైఖరిలో ఏమార్పూ లేదు.

జాఫ్నా తమిళ మేయర్‌ను 1975లో హత్య చేయడం, ఒక ఏడాది తర్వాత ఎల్‌టీటీఈ ని స్థాపించడం తప్పితే, ప్రభాకరన్ చాలా కాలంపాటు ప్రపంచానికి తెలియని వ్యక్తిగానే ఉండిపోయారు.

చెన్నైలో (అప్పట్లో మద్రాసు)లో 1982మేలో ఆయన పట్టుబడినప్పుడు భారత అధికార యంత్రాంగం ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. ఓ చిన్న నేరస్తుడిగా మాత్రమే భావించింది. ప్రభాకరన్ పట్టుబడటం అదే మొదటిసారి, చివరిసారికూడా.

అయితే 1983లో 13మంది సింహళ సైనికుల హత్యకు ప్రభాకరన్ బాధ్యత వహించినప్పుడు తమిళ మైనార్టీలకు వ్యతిరేక వాతావరణం ఏర్పడింది.

అది ఆయన దేశం తలరాతను మార్చివేసింది.

అప్పటిదాకా శ్రీలంక అంటే ప్రపంచం దృష్టిలో టీ, సుందరదృశ్యాలు మాత్రమే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభాకరన్ ప్రత్యర్థులతో వ్యవహరించేతీరు సోవియట్ యూనియన్ నేత స్టాలిన్ తరహాలో ఉండేదని ఓ జర్నలిస్టు రాశారు.

ప్రభాకరన్ పనితీరు

ఆ తర్వాత నాలుగేళ్లలో ప్రభాకరన్ ప్రభావం, ఆత్మవిశ్వాసం ఎంతగా పెరిగాయంటే, భారత సైనిక శక్తిని సవాలు చేయడానికి కూడా ఆయన ఏ మాత్రం సంకోచించలేదు.

శ్రీలంకలోని పుణ్యక్షేత్రమైన అనురాధపురలో సింహళ బౌద్ధుల హత్య తర్వాత ప్రభాకరన్ గురించి చాలా చర్చ జరిగింది.

ఆ తర్వాత వెంటనే, శ్రీలంకలో ప్రత్యర్థి తమిళ సంస్థల నాయకుల హత్యలు మొదలయ్యాయి. అది తమిళుల ఏకైక నాయకుడిగా ఆయన ఎదగడానికి జరుగుతున్న ప్రయత్నంగా భావించేవారు.

"ప్రభాకరన్ చెప్పిన ప్రతి మాట ఒక చట్టం. ఆయన్ను సవాలు చేయలేరు. ఆయన ముందు తల వంచి, ఆయన చెప్పిన ప్రతిదానితో ఏకీభవిస్తేనే, మీరు తమిళ ఈలం కోసం పోరాడగలరు" అని ప్రముఖ జర్నలిస్ట్ ఎం.ఆర్. నారాయణ్ స్వామి తన 'ది రూట్ ఆఫ్ ప్రభాకరన్' పుస్తకంలో రాశారు.

"మీరు ఆయనతో విభేదిస్తే ఎల్‌టీటీఈనైనా విడిచిపెట్టాలి లేదా ప్రపంచాన్ని అయినా విడిచిపెట్టాలి. ఆయన్ను వ్యతిరేకించే ఎవరినైనా 'ద్రోహి'గా భావించేవారు. సోవియట్ యూనియన్ మాజీ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ తన ప్రత్యర్థులతో వ్యవహరించిన విధంగానే ప్రభాకర్ ప్రవర్తించేవారు" అని ఎం.ఆర్. నారాయణ్ స్వామి రాశారు.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, konark

ఫొటో క్యాప్షన్, ఎం.ఆర్. నారాయణ్ స్వామి 'ది రూట్ ఆఫ్ ప్రభాకరన్' పుస్తకం.

వరుస హత్యలు

ప్రభాకరన్ సంస్థ శ్రీలంకలోనే కాకుండా భారతదేశంలో కూడా కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. కొన్నిసార్లు ఆయనకు లేదా ఎల్‌టీటీఈకి ఒకప్పుడు సాయం చేసిన వారిని కూడా వదల లేదు.

"ప్రభాకరన్ ప్రారంభ జీవితం గురించి పుస్తకం రాయాలని ప్లాన్ చేస్తున్న వ్యక్తిని పారిస్‌లోని ఆయన ఇంటి ముందు కాల్చి చంపారు" అని ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత్రి అనితా ప్రతాప్ తన 'ఐలాండ్ ఆఫ్ బ్లడ్' పుస్తకంలో రాశారు,

"తూర్పు, ఉత్తర శ్రీలంకలోని పేద కుటుంబాలకు చెందిన తమిళ పిల్లలు వారి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఎల్‌టీటీఈ తరఫున పోరాడాల్సి వచ్చింది. ప్రభాకరన్ తన ముగ్గురు పిల్లలకు మాత్రం ప్రేమ, బొమ్మలు, సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చారు. భారతదేశం కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో తన పాత భాగస్వామిని చంపించారు" అని ఆమె రాశారు.

శ్రీలంక రక్షణ మంత్రి తన కార్యాలయానికి వెళ్తుండగా హత్యకు గురయ్యారు. ఈత కొలనులో ఈత కొడుతుండగా ఒక తమిళ విదేశాంగ మంత్రి హత్యకు గురయ్యారు. భారీ మే డే ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఒక అధ్యక్షుడు హత్యకు గురయ్యారు.

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తమిళనాడులో ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజీవ్ గాంధీ హత్యకు ప్రభాకరన్ ప్రణాళిక వేశారు.

తగ్గిపోయిన ప్రభాకరన్ ప్రభావం

చిన్న విషయాలకే హింసకు పాల్పడటం ఏదో ఒక రోజు తన పతనానికి దారితీస్తుందని ప్రభాకరన్ ఎప్పుడూ గ్రహించలేదు.

శ్రీలంకలో ఒకప్పుడు దాదాపు మూడింట ఒకవంతు ప్రాంతాన్ని నియంత్రించిన ప్రభాకరన్, తర్వాత కాలంలో ఓ ఫుట్‌బాల్ మైదానానికి సమానమైన ప్రాంతానికి పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

"మొదటిసారి, నేను ఎల్‌టీటీఈ యోధుల కళ్లలో భయాన్ని చూశాను. సంవత్సరాలుగా ఎల్టీటీఈని నిశితంగా గమనిస్తున్న నాలాంటి వ్యక్తికి ఇది పూర్తిగా కొత్త విషయం" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎల్టీటీఈ సభ్యుడు గుర్తుచేసుకున్నారు.

"మే 17న, ప్రభాకరన్ తన సన్నిహితులతో యుద్ధభూమి నుంచి తాను పారిపోనని లేదా ఆయుధాలు విడిచిపెట్టనని చెప్పారు. కానీ ఎవరైనా పోరాటం నుంచి వైదొలగాలనుకుంటే, అందుకు స్వేచ్ఛ ఉందని, సాధారణ పౌరులతో కలిసిపోవాలనుకునే వారు తమ ఆయుధాలను వదిలిపెట్టి వెళ్లిపోవచ్చని అన్నారు. శత్రువుల చేతుల్లో పడకుండా చనిపోవాలనుకునే వారు సైనైడ్ మాత్రలు తీసుకోవచ్చని చెప్పారు"

సూర్యభగవానుడి అవతారమని, ఎప్పటికీ ఓడిపోరని అనుచరులు నమ్మే వ్యక్తికి ఇది దయనీయమైన వీడ్కోలు.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నంబరు 8ని దురదృష్టమైన అంకెగా ప్రభాకరన్ భావించేవారు.

ప్రభాకరన్ - నంబరు 8

తాను చెప్పాలనుకున్నది చెప్పడానికి ప్రభాకరన్ మే 17నే ఎంచుకోవడం కాకతాళీయం కాదు.

ప్రభాకరన్ పాత సహచరుడు రాజేశ్ కుమార్ బ్రిటన్‌లో నివసిస్తున్నారు. ఇప్పుడు ఆయన పేరు రాఘవన్.

"8వ నంబరును ప్రభాకరన్ దురదృష్టంగా భావిస్తారు. భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తుందని, 8, 17, 26 తేదీల్లో ప్రభాకరన్ ఏ పనీ చేసేవారు కాదు. ఆయన మూఢనమ్మకం ఎంత బలంగా ఉండేదంటే, ఈ తేదీల్లో ఆయన రోజంతా తన రహస్య స్థావరంలోనే ఉండి మరుసటి రోజు మాత్రమే బయటకు వచ్చేవారు" అని రాఘవన్ చెప్పారు.

"1980లలో తమిళనాడులో పది ఎల్టీటీఈ శిక్షణా శిబిరాలు జరగాల్సి ఉండగా, అందులో కేవలం తొమ్మిది మాత్రమే జరిగాయి. ఎనిమిదో శిబిరాన్ని నిర్వహించకపోవడమే దీనికి కారణం కావచ్చు'' అని రాఘవన్ వివరించారు.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాడీగార్డుతో ప్రభాకరన్

వరుస ఓటములతో క్షీణించిన నైతిక స్థైర్యం

ఏప్రిల్ 2008లో శ్రీలంక సైన్యం వాయువ్య జిల్లా మన్నార్‌ను ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత, నవంబరులో తమిళ తిరుగుబాటుదారులు వ్యూహాత్మకంగా ముఖ్య ప్రదేశాలైన పూనేరిన్, మంకుళంలను విడిచిపెట్టాల్సి వచ్చింది.

ఎల్టీటీఈలో అత్యంత అనుభవజ్ఞులైన సైనిక నాయకుడు కండియా బాలశేఖరన్ అలియాస్ బాల్‌రాజ్ గుండెపోటుతో మే 2008లో మరణించడం ప్రభాకరన్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ.

బాలశేఖరన్ గౌరవార్థం ఎల్టీటీఈ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. బాల్‌రాజ్ చనిపోకపోతే, శ్రీలంక సైన్యంతో వారి యుద్ధం ఫలితం భిన్నంగా ఉండేదని చాలామంది మాజీ తమిళ టైగర్లు నమ్ముతున్నారు.

2009 నాటికి, ప్రభాకరన్‌కు మరిన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వ దళాలు మొదట పరంతన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. తరువాత సమీపంలోని కిళినోచ్చిని స్వాధీనం చేసుకున్నాయి. దీనిని ఎల్టీటీఈ పరిపాలనా రాజధానిగా భావిస్తారు.

తమిళ టైగర్ల నాయకత్వం విదేశీ సందర్శకులను కలిసే ప్రదేశం ఇదే. ఇక్కడే ప్రభాకరన్ 2002 ఏప్రిల్‌లో తన చివరి విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.

కిళినోచ్చిలో ఓటమి ఎల్టీటీఈ సభ్యుల నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల్టీటీఈలో బాల్‌రాజ్‌ను అనుభవజ్ఞులైన గెరిల్లా నాయకుడిగా భావిస్తారు.

యుద్ధాన్ని ముగించాలని శ్రీలంకపై ఒత్తిడి

ప్రభాకరన్ ప్రసంగాలను అనువదించే వారి ఉన్నత స్థాయి మీడియా సమన్వయకర్త వేలాయుధన్ దయానిధి అలియాస్ దయా మాస్టర్, కుమార్ పంచరత్నం అలియాస్ జార్జ్, దూసుకొస్తున్న శ్రీలంక సైన్యానికి లొంగిపోవడాన్ని టైగర్లు తీవ్ర అవమానంగా భావించారు.

అధ్యక్షుడు మహింద రాజపక్స తమ్ముడు గొటబయ రాజపక్స ఆ సమయంలో శ్రీలంక రక్షణ మంత్రి. ఎల్టీటీఈకి వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు.

"యుద్ధాన్ని వెంటనే ముగించాలని గొటబయ రాజపక్సపై అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. అమెరికా పౌరసత్వం కూడా ఉన్న రాజపక్స, అమెరికా సంధానకర్తలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు కానీ మే 14న తన సైనిక కమాండర్లకు ఈ విషయాన్ని తెలియజేశారు" అని ఎం.ఆర్. నారాయణ్ స్వామి రాశారు.

"ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందని ఆయన వారిని అడిగారు. ఈ యుద్ధం త్వరలో విజయంతో ముగియాలని, లేకుంటే అమెరికా ఒత్తిడిని తట్టుకోవడం కష్టమవుతుందని ఆయన అన్నారు" అని ఎం.ఆర్. నారాయణ్ స్వామి రాశారు.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల్టీటీఈపై శ్రీలంక సైన్యం పై చేయి సాధించినప్పుడు గొటబయ రాజపక్స శ్రీలంక రక్షణమంత్రి.

పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న ప్రభాకరన్

మే 16న, శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ చివరి రక్షణ రేఖను కూల్చివేసింది.

జీ-11 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అధ్యక్షుడు మహింద రాజపక్స, ఈ వార్త విన్న తర్వాత, ఎల్టీటీఈపై సైనిక విజయాన్ని ముందుగానే ప్రకటించారు.

ఎల్టీటీఈ అంతర్జాతీయ వ్యవహారాల చీఫ్ కుమారన్ పథ్‌మంథన్ అలియాస్ కేపీ అదే రోజు కౌలాలంపూర్‌లో "పోరాటం చివరి దశకు చేరుకుంది. మేము మా తుపాకులను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాం" అని ప్రకటించారు.

మహింద, కేపీ తొందరపడి అలా ప్రకటించారు గానీ మూడువైపుల నుంచి చుట్టుముట్టినప్పటికీ పోరాటాన్ని కొనసాగించాలని ప్రభాకరన్ నిర్ణయించుకున్నారు.

పోరాటం చాలా తీవ్రంగా ఉండటంతో తమిళ టైగర్లు చాలా రోజులుగా స్నానం చేయలేదు. వారి దగ్గర ఆహారం కూడా దాదాపుగా అయిపోయింది. శ్రీలంక సైనికుల చేతికి చిక్కకుండా ఉండటానికి కొంతమంది తమిళ గెరిల్లాలు ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల్టీటీఈ 1,600చదరపు మీటర్లకు పరిమితమైందని మే 17న శ్రీలంక ఆర్మీ ప్రకటించింది.

మే 17న చివరిసారి సజీవంగా కనిపించిన ప్రభాకరన్

మే 17 రాత్రి శ్రీలంక సైనికులు, తమిళ టైగర్ల సమూహాన్ని 1,600 చదరపు మీటర్ల విస్తీర్ణానికి పరిమితం చేశారు. మూడువైపుల నుంచీ వారిని చుట్టుముట్టారు. నాలుగో వైపు నందికాదల్ సరస్సు ఉంది. అక్కడ శ్రీలంక నౌకాదళం నిఘా ఉంటుంది.

మే 17 ఎల్టీటీఈకి చాలా దురదృష్టకరమైన రోజుగా నిరూపితమైంది. చాలామంది కమాండర్లు సహా 150 మందికి పైగా ఎల్టీటీఈ సభ్యులు ఆ రోజు చనిపోయారు.

"ప్రభాకరన్ చివరిసారిగా మే 17 ఉదయం సజీవంగా కనిపించారు. నేను ప్రభాకరన్ ఉన్న ప్రదేశానికి 6 గంటలకు చేరుకున్నాను. మా ఆహారం అంతా అయిపోయింది" అని 'ఎస్‌కె' అనే ఎల్టీటీఈ గెరిల్లా ఒకరు తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

"నమ్మండి, నమ్మకపోండి, తమిళ ఈలం సృష్టించాలనే తన కల కూలిపోబోతోందని గ్రహించినప్పటికీ, ప్రభాకరన్ మామూలుగానే కనిపించారు'' అని ఎస్‌కె తెలిపారు.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోరాటం చివరిదశకు వచ్చేసరికి ఎల్టీటీఈలో ముగ్గురు కీలక నేతలు మాత్రమే మిగిలారు.

ప్రభాకరన్ కుమారుడు మృతి

మరుసటి రోజు, మిగిలిన ఎల్టీటీఈ దళ సభ్యులు సైనిక ముట్టడిని ఛేదించడానికి ప్రయత్నించారు. వారు అందులో విజయం సాధించారు. కానీ 30 నిమిషాల్లోనే శ్రీలంక సైనికులు తిరిగి ముట్టడించారు.

ఈసారి శ్రీలంక సైన్యం చేసిన దాడిలో చాలామంది ఎల్టీటీఈ కమాండర్లు, ప్రభాకరన్ 24 ఏళ్ల కొడుకు చార్లెస్ ఆంటోనీ కూడా మరణించారు.

శ్రీలంక సైనికులు ఆంటోనీ మృతదేహాన్ని పరిశీలించినప్పుడు, ఆయన దగ్గర 23 లక్షల శ్రీలంక రూపాయలు దొరికాయి.

అప్పటికి ప్రభాకరన్, పొట్టు అమ్మన్, సూసాయి తప్ప టైగర్ల మిగిలిన అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిందని 53వ డివిజన్ కమాండర్ కమల్ గుణరత్నే అంగీకరించారు.

ప్రభాకరన్ గురించి ఏదైనా వార్త వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ సనత్ ఫోన్సెకా స్పష్టం చేశారు.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభాకరన్ కొడుకు చార్లెస్ ఆంటోనీ(కుడి)

గుణరత్నెకు అందిన ప్రభాకరన్ మరణ వార్త

మే 19 ఉదయం వరకు ప్రభాకరన్ ఎక్కడ ఉన్నారనే దానిపై మేజర్ గుణరత్నెకు ఎలాంటి సమాచారం లేదు. నందికాదల్ ప్రాంతంలోని బురద, ఉప్పునీటిలో భీకర యుద్ధం జరిగిందని ఆయన జూనియర్ ఆఫీసర్లలో ఒకరు సమాచారం అందించారు. చాలా మంది ఎల్టీటీఈ సభ్యులు అక్కడ చిక్కుకున్నారు. వారిలో ఎవరూ ఆయుధాలు వదిలేయడానికి సిద్ధంగా లేరు.

చివరికి, పోరాటం ముగిసిన గంట తర్వాత, గుణరత్నెకు తాను ఎదురుచూస్తున్న వార్త అందింది.

‘‘మేజర్ జనరల్ గుణరత్నేతో కల్నల్ రవిప్రియ, 'సర్, మనం ప్రభాకరన్‌ను చంపాం' అని చెప్పారని గార్డన్ వైయిస్ తన 'ది కేజ్, ది ఫైట్ ఫర్ శ్రీలంక అండ్ ది లాస్ట్ డేస్ ఆఫ్ ది తమిళ టైగర్స్' అనే పుస్తకంలో రాశారు.

గుణరత్న ఆశ్చర్యంగా నిజమేనా అని అడగ్గా కల్నల్ రవిప్రియ, 'అవును, సూర్య చంద్రులు ఉన్నంత నిజం సార్' అని బదులిచ్చారు.

కానీ గుణరత్నే ఈ విషయాన్ని నిర్ధరించుకోవాలనుకున్నారు. కల్నల్ లలింథా గమాగేను సంఘటనా స్థలానికి పంపించారు. నిమిషాల్లోనే గమాగే దాదాపుగా అరుస్తున్న స్వరం సైనిక టెలిఫోన్‌లో ప్రతిధ్వనించింది,

'సార్, యురేకా. సర్ అది కరెక్ట్. ఆయన ప్రభాకరన్'

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభాకరన్ చనిపోయారని పూర్తిగా నిర్ధారించుకున్నతర్వాతే ప్రకటన చేశారు.

ప్రభాకరన్ మృతదేహం లభ్యం

పూర్తిగా నిర్ధరించుకున్న తర్వాత, గుణరత్నే ఈ వార్తను ఆర్మీ చీఫ్ జనరల్ ఫోన్సెకాకు తెలియజేశారు. దీనికి ముందు, ప్రభాకరన్ మృతదేహాన్ని తన వద్దకు తీసుకురావాలని ఆయన సైనికులను కోరారు.

"అప్పటికి ప్రభాకరన్ మృతదేహం ఉన్న ప్రదేశంలో దాదాపు మూడు వేల మంది శ్రీలంక సైనికులు గుమిగూడారు. కొంతమంది సైనికులు మురికిగా ఉన్న నీటిలోకి దూకి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు" అని ఎం.ఆర్. నారాయణ్ స్వామి రాశారు.

"సైనికులు ప్రభాకరన్ మృతదేహాన్ని చూసిన వెంటనే, గాల్లోకి కాల్పులు ప్రారంభించారు. ఒక అధికారి ఆ సైనికులను క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నించారుగానీ ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు'' అని ఎం.ఆర్. నారాయణ్ స్వామి రాశారు.

ఈ వార్త అందినప్పుడు జనరల్ ఫోన్సెకా శ్రీలంక పార్లమెంటులో ఉన్నారు. ఫోన్సెకాతో ఫోన్‌లో గుణరత్నే సింహళంలో - 'మహా ఎస్ ఇవారై' అంటే 'ఒక పెద్ద మనిషిని చంపేశాం' అని చెప్పారు.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంక అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఫోన్సెకా

గుర్తింపు కార్డులోని సీరియల్ నంబర్ 001

అప్పటికి దాదాపు అరగంట క్రితం పదిన్నర గంటలకు ప్రభాకరన్ మరణించారు. ఆయన వయసు 54 సంవత్సరాలు.

"ఆయన నుదిటిపై పెద్ద గాయం ఉంది, తల రెండు భాగాలుగా చీలిపోయింది. నోరు తెరిచి ఉంది. ఏమీ మాట్లాడలేనట్టు ఆయన కళ్లు పైకి చూస్తున్నాయి. గడ్డంలో వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి" అని ఎం.ఆర్. నారాయణ్ స్వామి రాశారు.

"మేజర్ జనరల్ గుణరత్నే ఆయన శరీరాన్ని తాకినప్పుడు, అది ఇంకా వెచ్చగా ఉంది. ఆయన నుదిటిపై ఉన్న బుల్లెట్ గాయం తప్ప శరీరంపై ఎక్కడా వేరే బుల్లెట్ గాయం లేదు. ప్రభాకరన్ సైనిక యూనిఫాం ధరించి ఉన్నారు. ఆయన జేబును వెతికినప్పుడు, సీరియల్ నంబర్ 001 ఉన్న ఎల్టీటీఈ గుర్తింపు కార్డు కనిపించింది. అది జనవరి 1, 2007న జారీ చేసిన కార్డు" అని ఎం.ఆర్. నారాయణ్ స్వామి తన పుస్తకంలో తెలిపారు.

దీంతో పాటు, ఆయన దగ్గర కొన్ని డయాబెటిస్ మందులు కూడా దొరికాయి. సింగపూర్‌లో కొన్న ద్రాక్ష సువాసనవచ్చే హ్యాండ్ లోషన్ కూడా ఆయన దగ్గర దొరికింది. ఆయన తలపై తగిలిన లోతైన గాయంపై నీలిరంగు వస్త్రం కప్పారు.

"12.7 ఎంఎం బుల్లెట్ వల్ల ప్రభాకరన్ మరణించారని ఒక సైనిక అధికారి నాకు చెప్పారు" అని గార్డన్ వైయిస్ రాశారు.

ప్రభాకరన్ సైనిక యూనిఫాంను తొలగించాలని శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ ఫోన్సెకా ఆదేశించారు. శ్రీలంక సైనికులు తప్ప మరెవరికీ సైనిక యూనిఫాం ధరించే హక్కు లేదన్నది ఆయన వాదన.

ప్రభాకరన్, ఎల్టీటీఈ, శ్రీలంక, తమిళనాడు

ఫొటో సోర్స్, Ministry of Defence Sri Lanka

ఫొటో క్యాప్షన్, ప్రభాకరన్ ఎల్టీటీఈ గుర్తింపు కార్డు

ప్రభాకరన్ మృతదేహం గుర్తింపు

"ప్రభాకరన్ మృతదేహాన్ని గుర్తించడానికి ఇద్దరు మాజీ ఎల్టీటీఈ నాయకులు కల్నల్ కరుణ, దయా మాస్టర్‌లను అక్కడికి పంపుతున్నట్టు గుణరత్నెతో ఫోన్సెకా చెప్పారు" అని నారాయణ్ స్వామి రాశారు.

"మాజీ టైగర్లు ఇద్దరినీ సైనిక విమానంలో అక్కడికి తీసుకువచ్చారు. నిర్జీవంగా ఉన్న ఆ వ్యక్తిని గుర్తించడానికి వారికి ఒక్క క్షణం కూడా పట్టలేదు"

ప్రభాకరన్ మరణంతో, శ్రీలంకలో దశాబ్దాలుగా కొనసాగుతున్న తమిళ ఈలం సాయుధ ఉద్యమం, రక్తపాత అంతర్యుద్ధం ముగిసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)