కచ్చతీవు అప్పగింతకు శ్రీలంక సిద్ధమా, కాదా? ఆ మంత్రి ఏమన్నారు?

ఫొటో సోర్స్, Google
- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు అప్పగించే ఉద్దేశం తమకు లేదని శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద అన్నారు.
కావాలంటే భారత్, కన్యాకుమారి సమీపంలోని వాడ్జ్ బ్యాంక్ ప్రాంతాన్ని శ్రీలంకతో మార్పిడి చేసుకోవచ్చని ఆయన శ్రీలంకలోని జాఫ్నాలో గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సూచించారు.
వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో విలువైన వనరులుండటంతోనే భారత్ స్వాధీనం చేసుకుందని ఆరోపించారు.
ఇదే సందర్భంలో, కచ్చతీవును భారత్‌కు అప్పగించడం గురించి జరుగుతున్న చర్చపై శ్రీలంక మత్స్యకారులూ స్పందించారు.

ఫొటో సోర్స్, Getty Images
కచ్చతీవు ఎందుకు తెర మీదకొచ్చింది?
కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే శ్రీలంకకు అప్పగించిందని ఇటీవల బీజేపీ విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కాంగ్రెస్, డీఎంకేలపై ఆరోపణలు చేశారు.
“కచ్చతీవు దీవిని శ్రీలంకకు కాంగ్రెస్ ఎలా అప్పగించిందనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇది భారతీయులందరికి కోపం తెప్పించేది. కాంగ్రెస్‌ను నమ్మలేమని మరోసారి స్పష్టమైంది. భారత ఐక్యతను బలహీనపరచడం, దేశ ప్రయోజనాలకు హాని కలిగించడమే 75 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న పని" అని ఎక్స్ వేదికగా మోదీ విమర్శించారు.
మరోవైపు తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు డీఎంకే ఏమీ చేయలేకపోయిందని, కచ్చతీవు విషయంలో డీఎంకే ద్వంద్వ ప్రమాణాలు బయటపడ్డాయని మోదీ విమర్శించారు.
కచ్చతీవు ద్వీపం అప్పగింతపై బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆర్టీఐ కింద వివరాలు సేకరించారు.
ఆ పత్రాలలో లభించిన సమాచారం ఆధారంగా కాంగ్రెస్, డీఎంకేలపై బీజేపీ నాయకులు విమర్శలు మొదలుపెట్టారు. అనంతరం ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారు.
దీంతో కచ్చతీవు అంశం శ్రీలంకలో కూడా చర్చనీయాంశంగా మారింది. అక్కడి మంత్రులు కూడా స్పందించారు.

శ్రీలంక ప్రభుత్వం ఏమంటోంది?
''కచ్చతీవు శ్రీలంకదా? భారత్‌దా? అనే దానిపై వాదనలు జరుగుతున్నాయి, సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు'' అని అన్నారు మంత్రి డగ్లస్ దేవానంద.
"1974లో కచ్చతీవు ద్వీపంపై శ్రీలంక, భారత ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, భారత మత్స్యకారులు శ్రీలంక జలాల్లోకి, శ్రీలంక మత్స్యకారులు భారత జలాల్లోకి వెళ్లి చేపలు పట్టొచ్చు. ఆ తర్వాత 1976లో దీనిని సవరించారు. దాని ప్రకారం భారత మత్స్యకారులు శ్రీలంక జలాల్లోకి రాకూడదు, శ్రీలంక మత్స్యకారులు భారత జలాల్లోకి వెళ్లకూడదు'' అని మంత్రి డగ్లస్ అన్నారు.
కచ్చతీవు భారత ప్రాంతమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన చెప్పారు.
"కన్యాకుమారి సమీపంలో విస్తృత వనరులున్న వాడ్జ్ బ్యాంక్ ఉంది, కచ్చతీవు ద్వీపం కంటే ఇది దాదాపు 80 రెట్లు పెద్దది" అని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వాడ్జ్ బ్యాంక్‌ను భారత్ స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన విమర్శించారు.
అక్కడున్న మత్స్య సంపదను దృష్టిలో పెట్టుకొని భారత్, వాడ్జ్ బ్యాంక్ స్వాధీనం చేసుకుందని, శ్రీలంక మత్స్యకారులను దానిలోకి రాకుండా నిషేధించిందని డగ్లస్ ఆరోపించారు.
కచ్చతీవు అంశంపై శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కేబినెట్‌లోని తమిళ సంతతి మంత్రి జీవన్ తొండమాన్ ఆంగ్ల దినపత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో మాట్లాడారు.
"కచ్చతీవు శ్రీలంక భూభాగంలో ఉంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి శ్రీలంకతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటివరకు కచ్చతీవుకు సంబంధించి భారత్ నుంచి ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదు. అలాంటి ఆరోపణలపై శ్రీలంక విదేశీ వ్యవహారాల శాఖ స్పందిస్తుంది'' అని అన్నారు.

నిపుణుల అభిప్రాయం ఏమిటి?
తమిళనాడు ఓటర్లలో బీజేపీపై విశ్వాసం, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతను పెంచే లక్ష్యంతో నరేంద్ర మోదీ కచ్చతీవు ద్వీపం అంశాన్ని లేవనెత్తుతున్నారని బీబీసీతో శ్రీలంకకు చెందిన అంతర్జాతీయ సంబంధాల పరిశోధకుడు డాక్టర్ హసిత్ కందౌదహేవా అన్నారు.
ఒప్పందం ద్వారా కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారని, భారత రాజ్యాంగం ప్రకారం ఆ ద్వీపంపై హక్కును కోల్పోలేదని ఆయన చెప్పారు.
భారత్ కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందేందుకు అనేక మార్గాలున్నాయని హసిత్ కందౌదహేవా అంటున్నారు.
"మొదటిది ఏమిటంటే, భారత ప్రభుత్వం ఆ దేశ సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చు, వారు కోర్టు నుంచి ఆర్డర్ పొందితే, ఎటువంటి సమస్య లేకుండా ద్వీపంపై హక్కును తిరిగి పొందవచ్చు. రెండోది, దౌత్యపరమైన చర్చల ద్వారా సాధ్యమవుతుంది. కాకపోతే కొంచెం క్లిష్టంగా ఉంటుంది" అని హసిత్ కందౌదహేవా సూచించారు.
అయితే, ఎన్నికలే లక్ష్యంగా మోదీ ప్రకటనలు చేసినప్పటికీ, వారు ఈ విషయంలో ముందుకు వెళతారని ఆశించలేమని హసిత్ అభిప్రాయపడ్డారు.
కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకోగలదా అనే విషయంపై బీబీసీతో జాఫ్నాలోని భారత మాజీ డిప్యూటీ రాయబారి నటరాజన్ మాట్లాడారు.
కచ్చతీవును శ్రీలంక నుంచి వెనక్కి తెస్తామని ఎవరైనా చెబితే అది కుదరదన్నారు. కచ్చతీవు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ‘ఇది పూర్తయిన కథ’ అని తీర్పునిచ్చిందని నటరాజన్ గుర్తుచేశారు.
‘‘కచ్చతీవును అప్పటి భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇచ్చారు. కచ్చతీవు సమస్యపై తమిళనాడు ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఇది మంచి నిర్ణయమైనా కాకపోయినా, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక మత్స్యకారులు ఏమంటున్నారు?
మరోవైపు కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు అప్పగించేది లేదని శ్రీలంక మత్స్యకారులు చెబుతున్నారు.
"కచ్చతీవు ఒక ముగిసిన అధ్యాయం. ఇది మాకు మాత్రమే చెందినది. భారత్‌లో చర్చిస్తే, అది రాజకీయ ప్రయోజనాల కోసమే" అని బీబీసీతో జాఫ్నా జిల్లా ఫిషింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు చెల్లతురై నరకునం అన్నారు.
‘‘కచ్చతీవు చట్టబద్ధంగా మాది, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదులుకోబోం, అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లి చేపలు పట్టేందుకు అవసరమయ్యే పడవలు కూడా మా దగ్గరున్నాయి. భారత్ కచ్చతీవు కోసం డిమాండ్ చేస్తే, వాడ్జ్ బ్యాంకు మాకూ కావాలి. చేపలు సమృద్ధిగా ఉన్న వాడ్జ్ బ్యాంక్ మత్స్యకారులకు మంచి వనరుగా ఉంది" అని చెల్లతురై చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ ఎంపీ సీట్లలో ఆ కుటుంబాలదే హవా
- అనంతపురం: కరవుసీమలో పచ్చదనం ఎలా వచ్చింది? హార్టికల్చర్ సాగులో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఎలా నిలిచింది?
- ఎలక్టోరల్ బాండ్స్: ఐటీ దాడులు, కొత్త కాంట్రాక్టులు, రాజకీయ పార్టీలకు విరాళాలు
- నీలం సంజీవ రెడ్డి: సీఎం, రాష్ట్రపతి సహా 5 కీలక పదవులు చేపట్టిన ఒకే ఒక్కడు
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తేదీలు వచ్చేశాయి, షెడ్యూల్ పూర్తి వివరాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














