శ్రీలంకలో 269 మంది ప్రాణాలు తీసిన ఆనాటి ఆత్మాహుతి బాంబు దాడులు రాజపక్సను ఎన్నికల్లో గెలిపించడానికే జరిగాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సునేత పెరీరా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
‘నా భర్త, ఇద్దరు కూతుళ్లు చనిపోయినప్పుడే నేనూ చనిపోయి ఉంటే బాగుండేది అని ఇప్పటికి వెయ్యిసార్లు అనుకుని ఉంటాను’
‘ఈస్టర్ ఆదివారం రోజున చర్చిలో నా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. నాకు తెలివి వచ్చి చూసేసరికి నా చిన్న కూతురు ప్రాణం లేకుండా పడి ఉంది’
శ్రీలంకలో 2019 ఏప్రిల్ 21న కేథలిక్ చర్చిలు, విలాసవంతమైన హోటళ్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన వరుస ఆత్మాహుతి బాంబు దాడుల్లో 269 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజధాని కొలంబోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటువాపితీయలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో బాంబర్ ఆత్మాహుతి దాడి చేయడంతో చనిపోయినవారిలో ‘నిరంజలీ యశవర్థన’ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
‘నా భర్త, ఇద్దరు కూతుళ్ల అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయాను నేను. తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో ఉండడంతో వారికి తుది వీడ్కోలు పలకలేకపోయాను’ అని బీబీసీతో చెప్పారు నిరంజలీ.
‘వారిని మళ్లీ చూడలేను. నాలో నేను అనుభవించే బాధ మాటల్లో చెప్పలేనిది’ అన్నారామె.
ఈ ఘటన జరిగిన తరువాత గత నాలుగేళ్ల కాలంలో శ్రీలంక ప్రజలు, కొందరు రాజకీయ నాయకులు, కేథలిక్ ప్రముఖులలో అనుమానాలు పెరిగాయి. రాజపక్స కుటుంబీకులను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకే ఈ బాంబు దాడులు జరిగి ఉంటాయన్న అనుమానాలు చాలామందిలో కలిగాయి.
అయితే, గత రెండు దశాబ్దాలలో చాలాకాలం పాటు శ్రీలంక అధ్యక్ష, ప్రధాని పదవిలను అనుభవించిన రాజపక్స కుటుంబం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వచ్చింది.
ఇప్పుడు బ్రిటిష్ టెలివిజన్ కంపెనీ చానల్ 4 చేసిన ఇన్వెస్టిగేషన్‌లో ఓ ‘విజిల్ బ్లోయర్’ చెప్పిన విషయాల ఆధారంగా తాజాగా రాజపక్స కుటుంబీకులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Handout
శ్రీలంక నిఘా విభాగ అధికారి ఒకరు ఈ దాడులకు ముందు బాంబర్లను కలిశారని చానల్ 4 డాక్యుమెంటరీ ఆరోపించింది.
మిలిటరీ ఇంటెలిజెన్స్ పోలీసులను తప్పుదోవ పట్టించిందని, ఆ అకృత్యాల తరువాత గొటబాయ రాజపక్స ప్రభుత్వం దర్యాప్తు సాగకుండా ఆధారాలను ధ్వంసం చేసిందని ఆ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.
అధికారంలోకి రావడం కోసం సొంత ప్రజలనే చంపడమనేది ఒక జుగుప్సాకర వాస్తవం అని రాజపక్స కుటుంబానికి ఒకప్పటికి మిత్రుడొకరు ఈ డాక్యుమెంటరీలో చెప్పారు.
ఈ విషయాలపై రాజపక్స కుటుంబీకుల స్పందనను చానల్ 4 కోరినప్పటికీ వారు నేరుగా స్పందించలేదు.
అయితే, ఆ తరువాత గొటాబయ రాజపక్స మాత్రం తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజపక్స కుటుంబ క్రౌన్ ప్రిన్స్‌గా చెప్పే ఎంపీ నమాల్ రాజపక్స బీబీసీతో మాట్లాడుతూ ఈ ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితం అని అన్నారు.
ఈ దాడులలో పాల్గొన్న బాంబర్లు అందరికీ రింగ్ లీడర్‌గా అనుమానిస్తున్న ఇస్లామిస్ట్ ప్రీచర్ పేరు జహ్రాన్ హషీమ్.
శ్రీలంకలో ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలని కోరుకున్న మిలిటెంట్ ఆయన. అందుకోసం చావుకు కూడా సిద్ధమైన వ్యక్తి హషీమ్.
హషీమ్, మరో సూసైడ్ బాంబర్ కొలంబోలోని షాంగ్రి లా హోటల్ పేలుళ్లలోనే మరణించారు. శ్రీలంక పోలీసులు చెప్తున్న ప్రకారం దాడుల్లో పాల్గొన్న మొత్తం 9 మంది సూసైడ్ బాంబర్లలో వీరు కూడా ఉన్నారు.
అప్పటి దాడుల తరువాత కొద్దిసేపటికి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) ఆ దాడులకు తామే కారణమంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో బాంబర్లు ఎవరెవరో కూడా చూపించింది.
అయితే, ఈ డాక్యుమెంటరీలో చేస్తున్న ఆరోపణలు కనుక నిజమైతే ఈ బాంబర్లు శ్రీలంక నిఘా విభాగానికి ముందే తెలిసి ఉండాలి.
దాడులకు సుమారు ఏడాది ముందు రింగ్ లీడర్ హషీమ్ సహా ఐఎస్‌కి చెందిన కొందరితో శ్రీలంక సీనియర్ ఇంటిలిజెన్స్ అధికారి సురేశ్ సల్లాయ్ భేటీ అయినట్లు డిస్పాచెస్ డాక్యుమెంటరీలో ఆరోపించారు.
ఆ మీటింగ్ తానే ఏర్పాటు చేశానని, సమావేశం జరుగుతున్నంతసేపు అక్కడే బయట ఉన్నానని ఆ విజిల్ బ్లోయర్ చెప్పారు.
ఈ డాక్యుమెంటరీలో మాట్లాడిన ప్రధాన విజిల్ బ్లోయర్ హంజీర్ అజాద్ మౌలానా. ఇంటిలిజెన్స్ అధికారి, ఇస్లామిస్ట్ గ్రూప్ కలిసి ఈ దాడులకు పథక రచన చేశాయని ఆయన ఆరోపించారు.
బౌద్ధులు ఎక్కువగా ఉండే శ్రీలంకలో ఈ దాడులతో అస్థిరత, భయం కలిగించాలన్నది వారి ప్రణాళిక అని.. తద్వారా 2019 అధ్యక్ష ఎన్నికలలో రాజపక్సల విజయానికి మార్గమేర్పడుతుందన్నది వారి ఆలోచనని పేర్కొన్నారు.
కాగా ఈ దాడుల తరువాత ఏడు నెలలకు జరిగిన ఎన్నికలలో రాజపక్స విజయం సాధించారు.
మౌలానా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సెల్‌కూ వాంగ్మూలం ఇచ్చారని, యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ఆయనతో మాట్లాడాయని ఈ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.
‘నా జీవిత కాలమంతా ఈ పాపాన్ని మోయలేను. నేను నిజం చెప్పాలనుకుంటున్నాను’ అని మౌలానా ఆ డాక్యుమెంటరీలో చెప్పారు.
అధికార మార్పిడి కోసం అమాయక ప్రజలను చంపేశారు అన్నారాయన.
సివనెసతూరి చంద్రకాంతన్ అలియాస్ పిళ్లయన్‌కు మౌలానా ఇరవై ఏళ్ల పాటు సహాయకుడిగా, అనువాదకుడిగా పనిచేశారు.
పిళ్లయన్ ఒకప్పుడు ఎల్టీటీఈలో పనిచేశారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై మాట్లాడే ఓ తమిళ ఎంపీ హత్య కేసులో పిళ్లయన్ జైలుకు వెళ్లారు.
ఆ సమయంలో తాను జహ్రాన్ హషీమ్‌ను కలిశానని, ఇస్లామిస్ట్‌లు రాజకీయంగా తమకు ఉపయోగపడతారని అప్పుడు భావించానని మౌలానా చెప్పారు.
అప్పటికి జహ్రాన్ హషీమ్ అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్‌టీజే) కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు.
శ్రీలంక సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి సురేశ్ సల్లాయ్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాలని జహ్రాన్ తనను కోరారని మౌలానా చెప్పారు.
ఇస్లామిక్ గ్రూప్ మిలిటెంట్లతో కలిసి...
2018 ఫిబ్రవరిలో జహ్రాన్ సహా ఆరుగురు ఎన్‌టీజే సభ్యులు సురేశ్ సల్లాయ్‌ను కలిశారని.. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు తనను బయట ఉండమన్నారని మౌలానా చెప్పారు.
ఆ తరువాత సురేశ్ తనతో మాట్లాడుతూ.. శ్రీలంక అట్టుడికిపోవాలని రాజపక్సలు కోరుకుంటున్నారని.. అలా జరిగితేనే గొటబాయ రాజపక్స అధ్యక్షుడు కాగలుగుతారని చెప్పారు.
కాగా ఈస్టర్ పేలుళ్లకు రెండు రోజుల ముందు భారత ఇంటెలిజన్స్ విభాగం శ్రీలంకలో చర్చిలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చంటూ హెచ్చరించింది.
అయితే, అప్పటికి అధ్యక్షుడుగా ఉన్న మైత్రిపాల సిరిసేన సహా శ్రీలంక ప్రభుత్వంలో అప్పటికి కీలకంగా ఉన్నవారంతా తమకు అలాంటి హెచ్చరికలేవీ అందలేదని చెప్పారు. మరోవైపు శ్రీలంక నిఘా విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కోర్టుకు చెప్పారు.
కాగా చానల్ 4తో సురేశ్ సల్లాయ్ మాట్లాడుతూ ఈస్టర్ సండే బాంబు దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
అంతేకాదు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నందున పరువు నష్టం దావా సహా న్యాయపరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటూ సురేశ్ సల్లాయ్ లాయర్ డిస్పాచెస్ ప్రొగ్రాం ప్రొడ్యూసర్లను హెచ్చరించారు.
జహ్రాన్, ఎన్‌టీజే సభ్యులను తాను కలిశాను అని ఆరోపిస్తున్నప్పటికీ ఆ సమయంలో తాను మలేసియాలో ఉన్నానని.. బాంబు దాడులు జరిగిన సమయంలో ఇండియాలో ఉన్నానని సురేశ్ సల్లాయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గెలిచినా రాజీనామా చేయాల్సి వచ్చింది
2019లో ఈస్టర్ ఆదివారం నాటి బాంబు దాడుల అనంతరం ముస్లిం వ్యతిరేక ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనే గొటబాయ రాజపక్స తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ప్రకటించారు.
ఈస్టర్ దాడుల వెనుక ఉన్నవారిని కోర్టు బోను ఎక్కిస్తానని కూడా ఆయన చెప్పారు. ఆయన తన ఎన్నికల హామీలలోనూ ఈ విషయం చెప్పారు.
అక్కడికి కొద్దినెలల్లోనే, అంటే 2019 నవంబర్ 16న జరిగిన ఎన్నికలలో గొటబాయ రాజపక్స భారీ విజయం సాధించారు.
ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్(ఎస్ఐఎస్) కొత్త డైరెక్టరుగా సురేశ్ సల్లాయ్ నియమితులయ్యారు. 2021లో పిళ్లయాన్ నిర్దోషిగా విడుదలయ్యారు.
అయితే, గొటబాయ రాజపక్స్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఈస్టర్ ఆదివారం నాటి దాడుల కారకులను పట్టుకోలేకపోయారన్న విమర్శలు ఆయనపై వచ్చాయి.
2022 జులైలో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసిన కాలంలో పెల్లుబికిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి దేశం విడిచివెళ్లాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
చానల్-4 డాక్యుమెంటరీ ప్రసారమైన తరువాత...
చానల్-4లో ఈ డాక్యుమెంటరీ ప్రసారమైన తరువాత దాన్ని ఖండిస్తూ గొటబాయ ఒక ప్రకటన విడుదల చేశారు. దాడులు జరగడానికి ముందు సల్లాయ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
మరోవైపు ఎంపీ నమల్ రాజపక్స (మహింద రాజపక్స కుమారుడు) కూడా బీబీసీతో మాట్లాడుతూ తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
దాడులు జరిగేటప్పటికి తమ కుటుంబం అధికారంలో లేదని, అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ విభాగాలను తాము ఎలా తమ చేతుల్లో ఉంచుకోగలమని ప్రశ్నించారు.
ఆ దాడులు జరగడానికి ముందు తమ పార్టీ ‘శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్’ ప్రాంతీయ, స్థానిక ఎన్నికలలో మంచి విజయాలు సాధిస్తూ వస్తోందని.. అలాంటప్పుడు తీవ్రవాదుల సహకారం తీసుకోవాల్సిన అవసరం తమకేంటని ఆయన ప్రశ్నించారు.
ఈ దాడుల కారకులను పట్టుకుంటామన్న హామీలను పట్టించుకోకపోవడం, దర్యాప్తును నీరుగార్చడం వంటి ఆరోపణలపై ఆయన్ను ప్రశ్నించగా దాడులతో సంబంధం ఉన్న అనేక మందిని గొటబాయ రాజపక్స అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారని, దర్యాప్తులో తమ కుటుంబం జోక్యం చేసుకోలేదని చెప్పారు.
చానల్-4 డాక్యుమెంటరీ తరువాత శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.

ఫొటో సోర్స్, Niranjalee Yasawardana
బాధితులు ఏమంటున్నారంటే..
ఈ డాక్యుమెంటరీలో ఎవరు ఎలాంటి ఆరోపణలు చేశారు, రాజపక్స కుటుంబీకులు ఏమని ఖండించారు అనేది పక్కన పెడితే బాధిత కుటుంబాలకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.
ఈ డాక్యుమెంటరీలో కనిపించిన ఇద్దరు బాధితులలో ఒకరైన నిరంజలీ మాట్లాడుతూ.. కేథలిక్‌లు అయినా, బౌద్ధులైనా, ముస్లింలైనా, హిందువులైనా సామాన్యులే రాజకీయ తీవ్రవాదానికి, జాత్యహంకారానికి బలవుతారని అన్నారు.
రాజకీయ అధికారం కోసం 269 మందిని ఊచకోత కోయడం అనాగరిక చర్య అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














