4,000 మంది మహిళలకు రహస్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని ముస్లిం వైద్యుడిపై ఆరోపణలు ఎందుకు?

శ్రీలంక

ఫొటో సోర్స్, Mohamed Shafi

ఫొటో క్యాప్షన్, వాయువ్య శ్రీలంక నగరం కురునెగళకు చెందిన డా.షఫీ ఈ ప్రచారాలకు కేంద్ర బిందువు అయ్యారు
    • రచయిత, సునేత్ పెరేరా
    • హోదా, బీబీసీ న్యూస్

ఒక ట్యాబ్లెట్‌తో ప్రజల గర్భధారణ సామర్థ్యం పోతుందా?

మహిళల లోదుస్తుల్లో జెల్ రాస్తే వారికి పిల్లలు పుట్టరా?

సిజేరియన్ డెలివరీ చేసినప్పుడే గుట్టుచప్పుడు కాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేయొచ్చా?

ఇవన్నీ శ్రీలంకలోని ముస్లిం-వ్యతిరేక అతివాద బౌద్ధుల్లో ప్రచారం అవుతున్న కుట్ర సిద్ధాంతాలు.

కుటుంబ నియంత్రణ మార్గాల ద్వారా మెజారిటీ బౌద్ధుల సంఖ్యను తగ్గించేసి, తమ సంఖ్యను పెంచుకునేందుకు కొందరు మైనారిటీ ముస్లిం వైద్యులు ప్రయత్నిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

వాయువ్య శ్రీలంక నగరం కురునెగళకు చెందిన ఓ వైద్యుడు ఈ ప్రచారాలకు కేంద్ర బిందువు అయ్యారు.

‘‘నేనొక ముస్లింను. రహస్యంగా నేను 4,000 మంది బౌద్ధ మహిళలకు కుటుంబ నియంత్రణ చేసినట్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు.’’ అని సర్జన్‌గా పనిచేస్తున్న మమహ్మద్ షఫీ బీబీసీతో చెప్పారు.

సిజేరియన్ ఆపరేషన్ల సమయంలో బౌద్ధ మహిళల ఫాలోపియన్ ట్యూబులను డా.షఫీ గట్టిగా నొక్కేశారని, ఫలితంగా ఆ మహిళలకు భవిష్యత్‌లో పిల్లలు పుట్టడంలేదని ఆయనపై కొందరు ఆరోపణలు చేశారు.

2019, మే 24న ఉగ్రవాద ఆరోపణలపై ఆయనను అరెస్టు కూడా చేశారు.

‘‘నన్ను నేరస్థులతో కలిపి జైలులో పెట్టారు. అసలు నన్నెందుకు ఇలా చేస్తున్నారు? అని అనిపించేది. నా భార్య, పిల్లల కోసమైనా దీని నుంచి నేను బయటపడాలని అనుకున్నాను.’’ అని డా. షఫీ చెప్పారు.

ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఆయన 60 రోజులపాటు జైలులోనే గడపాల్సి వచ్చింది.

2019 జులైలో కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. అయితే, ఈ కేసు వల్ల ఆయన వృత్తికి దూరం కావాల్సి వచ్చింది.

నాలుగేళ్ల తర్వాత ఆయనపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని తేలింది. దీంతో 2023 మే నెలలో మళ్లీ శ్రీలంక ఆరోగ్య శాఖ ఆయన విధుల్లో కొనసాగొచ్చని స్పష్టంచేసింది.

శ్రీలంక

ఫొటో సోర్స్, AFP

ఈస్టర్ పేలుళ్లతో..

శ్రీలంకలోని 2.2 కోట్ల జనాభాలో బౌద్ధులు 70 శాతం వరకూ ఉంటారు. మరో 10 శాతం ముస్లింలు ఇక్కడ జీవిస్తున్నారు. హిందువుల జనాభా 12 శాతం, క్రైస్తవుల వాటా 7 శాతం ఉంటుంది.

ఆరోపణలకు ముందు అన్ని వర్గాలకు చెందిన ప్రజలూ షఫీ దగ్గరకు వైద్యం కోసం వచ్చేవారు.

కానీ, 2019, ఏప్రిల్ 21న ఇక్కడి చర్చిలు, ప్రముఖ హోటళ్లు లక్ష్యంగా ఈస్టర్‌నాడు బాంబులు పేలాయి. వీటిలో 250 మందికిపైగా ప్రజలు మరణించారు. ఆనాటి బాంబు దాడులు షఫీ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన కొందరు అతివాదులు ఆ దాడులు చేశారు. 2009లో తమిళ టైగర్ వేర్పాటువాదులతో శ్రీలంక అంతర్యుద్ధం తర్వాత దేశాన్ని అత్యంత దారుణంగా కుదిపేసిన దాడులివీ.

ఆ దాడుల తర్వాత శ్రీలంకలో ముస్లిం వ్యతిరేక భావజాలం చాలా పెరిగింది.

చాలా మంది ముస్లింల ఇళ్లు, మసీదులు, దుకాణాలను తగులబెట్టారు. ఒక ముస్లిం యువకుడిని మూకదాడితో హత్య కూడా చేశారు.

మీడియా

ఫొటో సోర్స్, Divaina

ఫొటో క్యాప్షన్, ఈస్టర్ పేలుళ్లకు నెల రోజుల తర్వాత ఆరోపణలతో ఇక్కడి ప్రధాన వార్తా పత్రిక ‘దివైన’ మొదటి పేజీలో ఒక కథనం ప్రచురించారు

అసత్య ఆరోపణలు..

2019 మే 23న ఈస్టర్ పేలుళ్లకు నెల రోజుల తర్వాత, ఇక్కడి ప్రధాన వార్తా పత్రిక ‘దివైన’ మొదటి పేజీలో ఒక కథనం ప్రచురించారు. ‘తవీద్ జమాత్ వైద్యుడు 4,000 మంది సింహళ బౌద్ధ మహిళలకు రహస్యంగా కుటుంబ నియంత్రణ చేశారు. దీనికి పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆ డాక్టరును అరెస్టు చేసేందుకు దర్యాప్తు జరుగుతోంది.’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఈస్టర్ బాంబు పేలుళ్లలో ఆరోపణలు ఎదుర్కొన్న రెండు స్థానిక ఇస్లామిక్ సంస్థల్లో ‘నేషనల్ తవీద్ జమాత్’ కూడా ఒకటి.

అయితే, తమ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఆ పత్రిక వెల్లడించలేదు. మరోవైపు డా. షఫీ గుర్తింపును బయటపెట్టే వివరాలు కూడా ఆ కథనంలో లేవు. కానీ, ఫేస్‌బుక్‌లో ఆ డాక్టర్ షఫీనే అంటూ ప్రచారాలు మొదలయ్యాయి. ఆ పోస్టులో షఫీ ఫోటోతోపాటు ఆయన లొకేషన్ కూడా పెట్టేవారు.

‘‘నాపై బహిరంగంగా ఆరోపణలు రావడం అదే తొలిసారి.’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.

‘‘వార్డు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్ననాతోపాటు కొందరు సీనియర్ హౌస్ ఆఫీసర్లు ఈ అసత్య ప్రచారాలపై ఫిర్యాదు చేసేందుకు కురునేగళ టీచింగ్ హాస్పిటల్ డైరెక్టర్‌ డాక్టర్ శరత్ వీరబందర దగ్గరకు వెళ్లాం. నా ప్రాణానికి హాని ఉందని కూడా చెప్పాం.’’ అని ఆయన తెలిపారు.

‘‘అయితే, కేవలం ఆసుపత్రి ఆవరణలో సమస్యను మాత్రమే నేను పరిష్కరించగలను. బయటి విషయాలు నా ఆధీనంలో ఉండవు.’’ అని శరత్ చెప్పారని షఫీ వివరించారు. దీనికి రెండు రోజుల తర్వాత డా. షఫీని అరెస్టు చేశారు.

‘‘అరెస్టు వారెంట్ లేకుండానే పోలీసులు నన్ను తీసుకెళ్లి జైలులో పెట్టారు. అడిగితే శాంతి, భద్రతల పరిరక్షణ కోసమే తీసుకెళ్తున్నామని చెప్పారు.’’ అని ఆయన వివరించారు.

బౌద్ధులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, షఫీ భార్య ఫాతిమా ఇమారా పనిచేసే హాస్పిటల్ వెలుపల బౌద్ధ సన్యాసులు వచ్చి నిరసన తెలియజేసేవారు

మీడియాలో విద్వేషం

ఆ తర్వాత టీవీ చానెళ్ల వరకు వెళ్లడంతో ఈ విషయం సోషల్ మీడియాలోనూ విస్తృతంగా వ్యాపించింది.

‘‘నేన్నొక ఉగ్రవాదిగా మీడియాలో చూపించారు. టీవీ చానెళ్లలో విద్వేషం, సోషల్ మీడియాలోని ఫేక్ న్యూస్ నా జీవితాన్ని నాశనం చేశాయి.’’ అని డా. షఫీ తెలిపారు.

మరోవైపు షఫీ భార్య ఫాతిమా ఇమారా పనిచేసే హాస్పిటల్ వెలుపల బౌద్ధ సన్యాసులు వచ్చి నిరసన తెలియజేసేవారు.

‘‘ నా భార్యను కూడా చంపేస్తామని బెదిరించారు. మా పిల్లల విషయంలో ఆమె చాలా భయపడేవారు. ఆమె ఉద్యోగం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది’’ అని డా. షఫీ తెలిపారు.

‘‘మా పెద్ద కుమార్తె పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేది. తను స్కూలుకు వెళ్లాలని అనుకునేది. కానీ, మేం దానికి అనుమతించేవాళ్లం కాదు. ఎందుకంటే ప్రజల్లో మాపై చాలా కోపం ఉండేది. దీంతో తను కుంగుబాటుతో బాధపడేది. మొత్తానికి మా పిల్లల స్కూల్‌ను మేం మార్చాల్సి వచ్చింది.’’ అని ఆయన వివరించారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Anadolu Agency/Getty Images

డాక్టర్ షఫీ అరెస్టు అనంతరం ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కొలంబో వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పిల్లలను మూడు స్కూల్స్ మార్చాల్సి వచ్చింది.

‘‘నా భార్య, పిల్లలు ఒక చోటు వదిలి, మరో చోటుకు నిత్యం మారాల్సి వచ్చేది. నా అకౌంట్లను స్తంభింపచేయడంతో వారి దగ్గర డబ్బులు కూడా ఉండేవి కాదు.’’ అని షఫీ చెప్పారు.

మహమ్మద్ షఫీపై దాదాపు 800 మంది మహిళలు తమ వాంగ్మూలాలను సమర్పించారు. అయితే, వీరికి రహస్యంగా కుటుంబ నియంత్రణ చేసినట్లు శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కు ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

మరోవైపు షఫీకి ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్నట్లు కూడా దేశ నిఘా సంస్థకు కూడా ఎలాంటి ఆధారాలూ లభించలేదు.

ఎన్నికల ప్రచారంలో..

ఈస్టర్ బాంబు దాడుల తర్వాత మాజీ సైన్యాధ్యక్షుడు గొటాబయ రాజపక్ష తను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఇస్లామిక్ అతివాదానికి తాను అడ్డుకట్ట వేస్తానని ప్రకటించారు.

ఈ ఎన్నికల సమయంలో ముస్లిం వ్యతిరేక భావజాలం పతాక స్థాయికి వెళ్లింది. 2019 నవంబరులో ఆ ఎన్నికలు జరిగాయి.

‘‘జాత్యహంకారం ఒక వ్యసనం లాంటిది. దానికి బానిసలైన వారు చాలా గర్వంతో మాట్లాడతారు. శ్రీలంక రాజకీయ నాయకులు నాపై విషాన్ని వెళ్లగక్కేవారు. దీని వల్ల చాలా వేదన అనుభవించాల్సి వచ్చేది.’’ అని డా. షఫీ అన్నారు.

గొటాబయ రాజపక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈస్టర్ బాంబు దాడుల తర్వాత మాజీ సైన్యాధ్యక్షుడు గొటాబయ రాజపక్ష తను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఇస్లామిక్ అతివాదానికి తాను అడ్డుకట్ట వేస్తానని ప్రకటించారు

‘కుటుంబ నియంత్రణ మాత్రలు’

శ్రీలంకలో మెజారిటీ బౌద్ధులపై పేచేయి సాధించేందుకు మైనారిటీ ముస్లింలు కుటుంబ నియంత్రణను ఒక ఆయుధంగా వాడుతున్నారనే ఆరోపణలు ఎప్పటికప్పుడే వినిపిస్తుంటాయి.

2018లో ఒక ముస్లిం రెస్టారెంటు యజమాని ఆహారంలో ‘కుటుంబ నియంత్రణ మాత్రలు’ కలిపి బౌద్ధ కస్టమర్లకు ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

దీని తర్వాత బౌద్ధ మూకలు ఆ రెస్టారెంట్‌తోపాటు తూర్పు శ్రీలంకలోని అంపారాలో ముస్లిం షాపులు, హోటళ్లపై దాడులు చేశారు.

షఫీ అరెస్టు తర్వాత, ప్రముఖ బౌద్ధ సన్యాసి వరకగోడ శ్రీజ్ఞానరతన.. ముస్లింలను రాళ్లతో కొట్టాలని, ముస్లింల దుకాణాల నుంచి ఏమీ కొనుగోలు చేయొద్దని కూడా చెప్పారు.

మరోవైపు ముస్లిం బట్టల దుకాణాల్లో విక్రయించే లోదుస్తుల్లో ఒక జెల్ పూస్తున్నారని, వీటిని వేసుకునే బౌద్ధ మహిళలకు ఇక పిల్లలు పుట్టరని కూడా ప్రచారం చేసేవారు.

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముస్లింల దగ్గర బట్టలు కొనొద్దని అతివాద బౌద్ధులు వీడియోలు కూడా చేసేవారు. దీంతో కొన్ని ముస్లింల దుకాణాలపై బౌద్ధులు దాడులు కూడా చేశారు.

అంపారాలో హింస తర్వాత అసలు కుటుంబ నియంత్రణ మాత్రలు లేదా జెల్స్ ఉండవని ఐక్యరాజ్యసమితి కూడా ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.

బౌద్ధులు

ఫొటో సోర్స్, Getty Images

మీడియాలో..

స్థానిక పత్రికలు, టీవీలు, వెబ్‌సైట్లలో అసత్య వార్తలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అతికొద్ది సంస్థలో శ్రీలంక యంగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎస్ఎల్‌వైజేఏ) కూడా ఒకటి.

అప్పట్లో షఫీ గురించి వాస్తవాలు చెప్పే కథనాలు ఎక్కువ ప్రచురించలేదని ఎస్ఎల్‌వైజేఏకు చెందిన థారిందు జయవర్ధన చెప్పారు.

ఈ విషయంపై కొందరు జర్నలిస్టులతో బీబీసీ మాట్లాడింది. ‘‘ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే మా కథనాలను పత్రికలు ప్రచురించలేదు.’’ అని కొందరు జర్నలిస్టులు చెప్పారు.

‘‘డా. షఫీపై విద్వేష ప్రచారాల వెనుక కొందరు బౌద్ధ సన్యాసులు ఉండేవారు. ముస్లింలను రాళ్లతో కొట్టి చంపాలని వారు అనేవారు. వారు చేసే ఆరోపణలకు వారి దగ్గర ఎలాంటి ఆధారాలూ ఉండేవి కాదు.’’ అని జయవర్ధన చెప్పారు.

‘‘షఫీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారిలో 168 మంది మాత్రమే పిల్లలను కనడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిగతావారు మాత్రం అందరితోపాటు ఆరోపణలు చేశారు. షఫీ అరెస్టు తర్వాత వీరిలో దాదాపు 120 మంది పిల్లలను కన్నట్లు రికార్డుల్లో ఉంది.’’ అని ఆయన వివరించారు.

తనపై వచ్చిన ఆరోపణలపై రుజువులు లేకపోవడంతో 2023 మే నెలలో డా. షఫీ మళ్లీ కురునెగళ టీచింగ్ హాస్పిటల్‌లో విధులు మొదలుపెట్టారు.

ఆ తర్వాత మూడేళ్ల జీతం ఒకేసారి ఆయనకు ఇచ్చారు. వీటిలో కొంత భాగాన్ని ఔషధాల కొనుగోలు కోసం ఆరోగ్య శాఖకు ఆయన ఇచ్చారు.

ఆర్థిక సంక్షోభం నడుమ మంచి అవకాశాలు వెతుక్కుంటూ చాలా మంది శ్రీలంక వైద్యులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. కానీ, తనపై ఆరోపణలు వచ్చిన అదే ఆసుపత్రిలో షఫీ పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు.

‘‘అక్కడ పని చేయొద్దని మా కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ, నేను నిర్దోషినని రుజువు చేసుకోవడానికి అదే ఆసుపత్రిలో, అదే పోస్టులో పనిచేయాలని నేను నిర్ణయించుకున్నాను.’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, జీవితంలో ఇంకెప్పుడూ ఆయనకు ఓటు వెయ్యబోమని అక్కడి ప్రజలు ఎందుకంటున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)