‘సీమా హైదర్‌ను పాకిస్తాన్‌కు పంపించాలి, లేదంటే సింధ్‌లో హిందువులపై, హిందూ ఆలయాలపై బాంబులు వేస్తాం’ - పాక్ బందిపోట్లు

సీమా హైదర్
    • రచయిత, షుమాయిలా ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్

ప్రేమికుడి కోసం పాకిస్తాన్ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన సీమా హైదర్‌ను తిరిగి పంపించాలని, లేదంటే హిందువుల ఆధ్యాత్మిక ప్రాంతాలు, నివాసాలపై దాడులు చేస్తామంటూ సింధ్ ప్రావిన్స్‌లోని బందిపోట్లు బెదిరించారు.

ఈ హెచ్చరికలతో, సింధ్ ప్రావిన్స్‌లోని ఉత్తరాది జిల్లాల్లో పోలీసులు భద్రతను పెంచారు.

హిందూ మతంతో సంబంధమున్న ప్రజలకు, ప్రాంతాలకు భద్రతను బలోపేతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తర సింధ్‌లో ఘోట్కి, కష్మోర్, కంధ్‌కోట్, జాకోబాబాద్ ప్రాంతాల్లో బందిపోటుల గ్రూప్‌లు క్రియాశీలకంగా ఉన్నాయి.

సింధు నదికి దగ్గర్లోని అటవీ ప్రాంతాల్లో ఈ గ్యాంగ్‌లు తమ బేస్‌లను ఏర్పాటు చేసుకున్నాయి.

పోలీసులు గత కొన్ని దశాబ్దాలుగా వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు వీరిని పట్టుకోలేకపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో, హిందూ కమ్యూనిటీలకు ఈ బందిపోటులు హెచ్చరికలు జారీ చేయడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

ఘోట్కిలో శ్రీకృష్ణ మందిరం

వైరల్ వీడియోలో వారు ఎలా బెదిరించారు?

సీమా హైదర్ పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు చేరుకున్నారు.

సీమా హైదర్‌ను తిరిగి పాకిస్తాన్‌కి పంపించాలని సింధ్‌లోని బందిపోటు గ్యాంగులు సోషల్ మీడియా వేదికగా భారత ప్రభుత్వాన్ని బెదిరించారు.

ఈ వీడియో మెసేజ్‌లో రానో షార్ అనే వ్యక్తి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావాల్ భుట్టో, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

సీమా హైదర్‌ను, ఆమె పిల్లల్ని తిరిగి పాకిస్తాన్‌కి పంపించాలని ఆయన ఈ వీడియోలో డిమాండ్ చేశారు.

‘‘ఈ మహిళ ఆమె నలుగురి పిల్లలతో కలిసి నేపాల్ వెళ్లారు. అక్కడే గీతాను స్వీకరించారు. సీమ హైదర్‌ను వెనక్కి తీసుకురావాలని జఖ్రాణి తెగకు చెందిన అధినేతకు విజ్ఞప్తి చేశాం.

ఒకవేళ ఆమె రాకపోతే, పిల్లల్ని తీసుకురావాలని కోరాం. ఇది మా మతానికి విరుద్ధం. ఆధ్యాత్మిక నేత రషీద్ మహమ్ముద్ సుమ్రూ ముందుకు వచ్చి, వారిని వెనక్కి తీసుకురావాలి’’ అని రానో షార్ ఆ వీడియోలో చెప్పారు.

శివుని ఆలయం

రానో షార్ బందిపోటు గ్యాంగులకు పెద్ద. ఘోట్కి అడవుల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

‘‘మీడియాలో, సోషల్ మీడియాలో సీమా హైదర్‌ భారత్‌కు వెళ్లిన వార్తను చూశాను. ఈ విషయంలో ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందని నేను అనుకున్నాను. కానీ, ఏం జరగలేదు. అందుకే నేను సోషల్ మీడియాలో ఈ మెసేజ్‌ను ఇస్తున్నాను’’ అని రానో చెప్పారు.

‘‘ఈ మహిళను వెనక్కి పంపాలని నేను కోరుతున్నాను. లేదంటే పాకిస్తాన్‌లో నివసిస్తోన్న హిందూవులు వారే తమ భద్రతకు బాధ్యత వహించుకోవాలి. మేమెలాంటి బాధ్యతను తీసుకోదలుచుకోలేదు. ఒకవేళ సీమా రాకపోతే, రహర్కి కోర్టులో మేం బాంబులు వేస్తాం.’’ అని రానో హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వీడియోలొ రానో షార్ గన్‌లతో కనిపించారు.

మరో వీడియోలో ఐదుగురు సాయుధ దొంగలు హిందూ కమ్యూనిటీలను బెదిరిస్తున్నట్లు ఉంది.

‘‘ఒకవేళ సీమాను తిరిగి వెనక్కి పంపపోతే, జకోబాబాద్, రతుదేరో, కష్మోర్, ఎక్కడైతే హిందూవులు నివసిస్తారో, ఆ ప్రాంత ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఈ ఐదుగురు సాయుధ దొంగలు బెదిరించారు.

ఈ వీడియోలో వీరు అభ్యంతరకరమైన భాషను వాడారు.

‘‘ఆ మహిళను, పిల్లల్ని వెనక్కి పంపించండి. మేం ఎవరికీ భయపడం. పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదం చేశారు.

హిందూ ఆలయం

రహర్కి దర్బార్ ఏమిటి?

సింధ్‌లోని ఉత్తర ప్రావిన్స్‌లలో నివసించే చాలా మంది హిందూ కమ్యూనిటీ ప్రజలు వ్యాపారవేత్తలు. ఆభరణాలు, వ్యవసాయం, రైలు మిల్లుల పనులను చేస్తుంటారు.

షికార్పూర్, ఘోట్కి జిల్లాల్లో చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలున్నాయి. సంత్‌లకు చెందిన సమాధులు కూడా ఉన్నాయి.

1866లో సంత్ సత్రందాస్ జన్మించిన ప్రాంతమే రహర్కి దర్బార్. ఈ సంత్ సచు సత్రం, సచా సత్రంగా ప్రాచుర్యం పొందారు.

ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో పెద్ద పండగ జరుగుతోంది.

భారత్ నుంచి కూడా భక్తులు ఈ ప్రాంతానికి వెళ్తుంటారు. విభజన సమయంలో భారత్‌కు వచ్చిన వారు కూడా ఈ పండగలో పాల్గొంటుంటారు.

విభజనకి ముందు ఉత్తర సింధ్‌లో ఆధ్యాత్మిక దాడులు జరిగినప్పుడు, ఈ కోర్టుకి చెందిన భగవత్ కున్వర్ రామ్ హత్యకు గురయ్యారు.

కున్వర్ రామ్ సమాధి కూడా ఈ ప్రాంతంలో ఉంది.

షికార్పూర్‌లో ఒక సమాధి ఆశ్రమం కూడా ఉంది. ఇది 250 ఏళ్లకు చెందిందని ఈ ఆశ్రమానికి చెందిన భగవాన్ దాస్ చెప్పారు.

ఈ దర్బార్‌ని తొలిసారి పంజాబ్‌ నుంచి వచ్చిన బాబా హర్బజన్ సింగ్ పాలించినట్లు తెలిపారు.

సింధు నది మధ్యలో సక్కర్‌లో బాబా బంఖండి మహారాజ్‌కు చెందిన దర్బార్ కూడా ఉంది.

ఈ ప్రాంతం సాధ్ బెలోగా పేరొందింది. ప్రతి ఏడాది ఇక్కడ కూడా పండుగ చేస్తారు.

సీమా హైదర్, సచిన్ మీనా

మీడియాకు దూరంగా హిందువులు, పోలీసులు ఏం చెబుతున్నారు?

ఉత్తర సింధ్‌లోని హిందూ కమ్యూనిటీ ప్రజలు మీడియాతో మాట్లాడేందుకు దూరంగా ఉన్నారు.

తాము చాలా మందితో మాట్లాడేందుకు ప్రయత్నించామని, కానీ, వారంతా ఈ వివాదంలో తలదూర్చాలనుకోవడం లేదని చెప్పినట్లు బీబీసీ ప్రతినిధి చెప్పారు.

‘‘ఈ ప్రాంతానికి పోలీసు భద్రతా బలగాలు వచ్చాయి. రేంజర్లు కూడా వచ్చారు. మేం వారికి సహకరిస్తున్నాం’’ అని ఘోట్కి ప్రాంతంలోని పీపుల్స్ పార్టీ మైనార్టీ వింగ్ చైర్మన్ కుకు రామ్ చెప్పారు.

తమ కమ్యూనిటీ వ్యాపారాన్ని ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటోందని, సింధ్‌లోని తమ సొంత సోదరులే ఇలాంటి ప్రకటనలు చేయడం తమల్ని నిరాశకు గురిచేసిందని అన్నారు.

‘‘కమ్యూనిటీ ప్రజల్లో కోపం ఉంది. ఎందుకంటే, ఇది ఇక్కడి విషయం కాదు. భారత్ మా పొరుగు దేశం. మేం అక్కడ పుట్టలేదు. అక్కడి వాళ్లం కాదు. మేం పాకిస్తాన్‌లో పుట్టాం. సింధు మట్టికి చెందిన వాళ్లం’’ అని కుకు రామ్ చెప్పారు.

‘‘వీడియో మెసేజ్‌లలో బెదిరింపులు జారీ చేసిన రానో షార్‌ను పట్టుకునేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ ఆధ్యాత్మిక సంస్థలు కూడా పాల్గొంటే, బందిపోటుల హెచ్చరికలు క్లిష్టంగా మారి, మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని సక్కర్ డీఐజీ జావేద్ జస్కాని చెప్పారు.

ఆలయాల్లో, హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భద్రతను పెంచేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తమ జిల్లాకు చెందిన ఎస్ఎస్‌పీ చూసుకుంటున్నారని జావేద్ జస్కాని తెలిపారు.

అదనపు భద్రతా బలగాలను అక్కడకు పంపించడం, పాట్రోలింగ్ చేపట్టడం, హిందూ కమ్యూనిటీలను బెదిరించిన వారిని పట్టుకునే ఆపరేషన్‌ను తీవ్రతరం చేయడం చేస్తున్నట్లు చెప్పారు.

సింధ్ ప్రావిన్స్‌లోని అన్ని ఆలయాలన్నింటికీ పోలీసులను పంపించారని, సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు సింధ్ ప్రావిన్స్‌లోని సీఎం స్పెషల్ అసిస్టెంట్ విర్జి కోహ్లి బీబీసీకి తెలిపారు.

‘‘ఒకవేళ హిందూ బాలిక అలా వెళ్తే, మేమేం చేయం. ఎందుకంటే బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్ చట్టబద్ధంగా వాలిడ్ అవుతుంది. కేవలం బాలిక వయోజనురాలు అయితే సరిపోతుంది. అలాంటి పరిస్థితిలో, ఒకవేళ ఎవరైనా మతాన్ని మార్చుకుని, పెళ్లి చేసుకుంటే, మేం ఆ వయోజన బాలికల విషయంలో కూడా ఏం మాట్లాడం’’ అని చెప్పారు.

సీమా హైదర్

సీమా వల్ల భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలు

సీమా విషయంపై భారత్, పాకిస్తాన్ మధ్యలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకు రాజకీయ సర్కిల్స్‌, ఆధ్యాత్మిక సంఘాలు దీనిపై మౌనం వహిస్తూ వచ్చాయి.

ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టాలని, ఎక్కడి నుంచి సీమాకు, ఆమె పిల్లలకు వీసాలు లభించాయో విచారించాలని జమాత్-ఏ-ఉలేమా-ఏ-ఇస్లాంకి చెందిన జనరల్ సెక్రటరీ అల్లామా రషీద్ మహమ్ముద్ సుమ్రూ చెప్పారు.

ఒక ముస్లిం మహిళ భారత్‌కు వెళ్లడం, హిందూ మతాన్ని పుచ్చుకోవడం, వెంటనే శారీ ధరించి, హిందీలో గడగడా మాట్లాడటం ఎన్నో అనుమానాలను తావిస్తుందని రషీద్ మహమ్ముద్ చెప్పారు.

దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆ మహిళను, పిల్లల్ని వెంటనే పాకిస్తాన్‌కి పంపించేలా భారత ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

హిందూవులు, సిక్కులు తమ సోదరులని చెప్పారు.

రానో షారో విడుదల చేసిన వీడియోపై రషీద్ స్పందించారు.

‘‘ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక తెగలకు చెందిన ప్రజలకు ఈ విషయం ఎంత ముఖ్యమైందో, ఎంత సున్నితమైందో మనం ఈ వీడియోను చూస్తే అర్థం చేసుకోవచ్చు’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)