ప్రేమలో విడిపోతే గుండెపోటు వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది, ఆ బాధలో గుండెకు ఏమవుతుంది?

గుండె

ఫొటో సోర్స్, Thinkstock

    • రచయిత, మోర్ పెలెడ్
    • హోదా, బీబీసీ రీల్

ప్రేమ విఫలమైనప్పుడు మీ గుండె బద్దలైనట్లు అనిపించిందా? ఆపుకోలేనంత ఏడుపు వచ్చిందా? కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు తల తిరిగిందా?

మీలో ఏదో జరిగిపోతోందని అనిపిస్తోందా? అయితే, ఒక్క నిమిషం ఆగండి.

అసలు మీ శరీరంలో ఇప్పుడు జరుగుతోందో మీరు తెలుసుకోవాలి.

గుండె

ఫొటో సోర్స్, Thinkstock

ఎందుకు అంత బాధగా అనిపిస్తుంది?

ఈ విషయంలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఒక అధ్యయనం చేపట్టింది.

ప్రేమలో ఉండేటప్పుడు శరీరంలో డోపమైన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

మన మూడ్‌ను ప్రభావితం చేయడంలో డోపమైన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెదడులో దీని స్థాయిలు ఎక్కువగా ఉంటే మన మూడ్‌ కూడా చాలా బావుంటుంది.

అయితే, మన శరీరం నొప్పిని భరించే స్థాయినీ డోపమైన్‌ ప్రభావితం చేస్తుందని ఆ అధ్యయనంలో తేలింది.

కన్నీరు

ఫొటో సోర్స్, Getty Images

అది బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్

అసలు ఎందుకు గుండె బద్దలైనట్లు అనిపిస్తుందో హృద్రోగ నిపుణురాలు డాక్టర్ జెలీనా ఘాద్రి బీబీసీతో మాట్లాడారు.

‘‘దీనికి కారణం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. దీన్నే టకసుబో సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక తీవ్రమైన గుండె జబ్బు లాంటిది. మహిళల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. ఈ సిండ్రోమ్‌తో ఆసుపత్రికి వచ్చే రోగుల్లో 90 శాతం మంది మహిళలే ఉంటారు. బహుశా మహిళల్లో భావోద్వేగాలు కాస్త ఎక్కువగా ఉండటమే దీనికి కారణం కావచ్చు’’అని ఆమె చెప్పారు.

‘‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌తో బాధపడే వారి మెదడులోని కొన్ని భాగాల్లో చర్యలు మందగిస్తాయి. దీంతో శరీరంలోని కొన్ని స్పందనలను నియంత్రించే శక్తి తగ్గిపోతుంది’’అని జెలీనా వివరించారు.

‘‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌ గురించి మొదట్లో ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ, నేడు పరిస్థితులు మారాయి’’అని ఆమె చెప్పారు.

ఏదో ఒక రోజు దీనికి చికిత్స కూడా అందుబాటులోకి రావచ్చని జెలీనా అన్నారు.

గుండె

ఫొటో సోర్స్, Alamy

అంత నొప్పి ఉంటుందా?

శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినా లేదా ఏదైనా నొప్పి వచ్చినా మన మెదడులోని ‘‘ఎంటీరియర్ సింగులేట్ రిడ్జ్‌’’గా పిలిచే భాగం క్రియాశీలం అవుతుంది. మానసిక వేదన సమయంలోనూ ఇది ఇలానే స్పందిస్తుంది.

అయితే, మానసిక వేదన అనేది శారీరక నొప్పుల కంటే ఎలా భిన్నమైనదో చార్ట్‌లలో రేటింగ్ ఇవ్వాలని అధ్యయనంలో పాల్గొన్నవారికి పరిశోధకులు సూచించారు.

బ్రేకప్ తర్వాత వచ్చే మానసిక వేదన అనేది ఎలాంటి నొప్పి నివారిణులు లేకుండా బిడ్డకు ప్రసవం ఇవ్వడంతో సమానమని అధ్యయనంలో పాల్గొన్నవారు చెప్పారు. మరికొందరు దీన్ని కీమోథెరపీ ప్రభావాలతోనూ పోల్చారు.

గుండె

ఫొటో సోర్స్, Getty Images

బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌లో ఏం జరుగుతుంది?

బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌తో బాధపడేవారిలో గుండె నిర్మాణంలో మార్పులు వస్తాయి. సాధారణంగా కంటే గుండె కాస్త ఎక్కువగా వ్యాకోచిస్తుంది.

ఈ సిండ్రోమ్‌ను మొదట 1990ల్లో జపాన్‌లో గుర్తించారు. రక్త నాళాల్లో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ గుండె పోటు వచ్చినట్లుగా అనిపిస్తోందని కొందరు రోగులు చెప్పడంతో ఈ రుగ్మతపై వైద్యులు పరిశోధన మొదలుపెట్టారు.

చాలా మంది రోగులు కొన్ని రోజులు లేదా కొన్ని వారాల్లో సాధారణ స్థితికి వచ్చేస్తుంటారు. కానీ, కొన్ని కేసుల్లో మరణం వరకూ కూడా పరిస్థితులు దిగజారొచ్చు.

హార్ట్‌బ్రేక్ సమయంలో మెదడులో చాలా మార్పులు జరుగుతుంటాయని పరిశోధనల్లో తేలిందని సైకాలజిస్టు డాక్టర్ గయ్ వించ్ చెప్పారు.

‘‘ఈ మార్పుల వల్ల శరీరంలో కొన్ని భాగాలు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అసాధారణ పరిస్థితికి మెదడు ఇప్పుడు స్పందిస్తోంది. కలిసుండేటప్పుడు తీసుకున్న ఫోటోలు, ఇతర సోషల్ మీడియా ఫీడ్‌ను చూడాలని అనిపిస్తుంది. దీని వల్ల నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. దీంతో కోలుకునేందుకు మరింత సమయం పడుతుంది. అంటే మీకు మీరే పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటున్నారు’’అని ఆయన వివరించారు.

‘‘హార్ట్‌బ్రేక్ నుంచి వచ్చే నొప్పి చాలా మంది విషయంలో చాలా బాధాకరంగా ఉంటుంది. ఇక్కడ మీరు స్వచ్ఛంగా ప్రేమించాలి అనుకున్నప్పుడే.. హార్ట్‌బ్రేక్ నుంచి వచ్చే నొప్పికి కూడా మీరు సిద్ధపడాలి. దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు’’అని ఆయన చెప్పారు.

ఎందుకంటే ప్రేమ అనేది మన మెదడుకు ఒక వ్యసనం లాంటిదని వించ్ వివరించారు. ‘‘మీరు ఒక వ్యక్తిని ఏదైనా వ్యసనానికి అలవాటు పడినట్లుగా ప్రేమించినప్పుడు మెదడు ప్రతి చిన్న విషయాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది. అంటే భవిష్యత్ హార్ట్‌బ్రేక్ ముప్పును మీరు తీసుకుంటున్నారు’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, గుండె మార్పిడి చికిత్స: ఆగిన గుండెను కొట్టుకునేలా చేసే సాధనం

మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఒక మాత్ర వేసుకుంటారు. రోజులపాటు అలానే తగ్గకపోతే వైద్యుల దగ్గరకు వెళ్తారు.

ప్రేమలో విఫలమైనప్పుడు కూడా అలానే మానసిక వైద్యుల దగ్గరకు వెళ్లాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

నొప్పి, బాధ ఈ సమయంలో తప్పనిసరని భావించండి. దీన్ని కాస్త తేలికగా చూడటానికి ప్రయత్నించండి. అప్పుడే అన్నింటిలానే దీన్ని కూడా వేగంగా దాటుకుని ముందుకు వెళ్తారు.

వీడియో క్యాప్షన్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)