'చివరి లాటరీ టికెట్‌'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా

రిక్షా వాలా గురుదేవ్ సింగ్
ఫొటో క్యాప్షన్, రిక్షా తొక్కుతున్న గురుదేవ్ సింగ్

ఇక ఇదే చివరిది అనుకొని లాటరీ టికెట్ కొన్న 89 ఏళ్ల రిక్షా కార్మికుడు సుమారు రెండున్నర కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు.

''నేను లాటరీ టికెట్లు కొంటూ ఉంటాను. డ్రా తేదీ అయిపోగానే పక్కన పడేస్తుంటాను. నాకు లాటరీ తగిలిందా? లేదా? అని ఎప్పుడూ ఏజెంట్లను అడగలేదు'' అని పంజాబ్‌లోని మోగాకి చెందిన రిక్షావాలా గురుదేవ్ సింగ్ చెప్పారు.

పేదరికంలో మగ్గిపోతున్న గురుదేవ్ సింగ్ కుటుంబం కోసం రిక్షా తొక్కుతున్నారు. కొన్నిసార్లు ఆయన చిన్న చిన్న పనులకు వెళ్లేవారు.

జీవితంలో ఇలాంటి లాటరీ తగులుతుందని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. పంజాబ్ ప్రభుత్వం నడుపుతున్న వైశాఖి బంపర్ లాటరీతో ఎప్పుడూ ఊహించని లాటరీ తగిలింది.

దాదాపు 50 ఏళ్ల నుంచి గురుదేవ్ సింగ్ లాటరీ టిక్కెట్లు కొంటున్నారు.

లాటరీ గెలుచుకున్న తర్వాత గురుదేవ్ సింగ్ బీబీసీతో మాట్లాడారు.

''నేను 40 - 50 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాను. మా ఊరి నుంచి టౌన్‌‌కు వెళ్లినప్పుడు టికెట్లు కొనేవాడిని. అయినా నేనెప్పుడూ లాటరీని ఇష్టపడలేదు. రెండు, మూడేళ్ల నుంచి లాటరీ టికెట్లు కొనడం మానేశాను'' అని ఆయన చెప్పారు.

''కొద్ది రోజుల కిందట నేను టౌన్‌‌కు వెళ్లాను. చివరిసారి లాటరీ టికెట్ కొందామని అనుకున్నా. చివరిసారి కొన్న లాటరీ టికెట్‌తో కోటీశ్వరుడినయ్యా'' అని గురుదేవ్ సింగ్ సంతోషం వ్యక్తంచేశారు.

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైనప్పటికీ, ఆ డబ్బుతో ఏదో చేయాలనే ప్లాన్లు, పెద్ద పెద్ద కలలు గురుదేవ్ సింగ్‌‌కు లేవు. పాత ఇంటి నుంచి పక్కా ఇంట్లోకి మారాలని జీవితాంతం పోరాడారు. ఇప్పుడు కూడా వారి కలలు ఇంటి చుట్టూనే తిరుగుతున్నాయి.

గురుదేవ్ సింగ్
ఫొటో క్యాప్షన్, గురుదేవ్ సింగ్

'వాళ్లకు ఇళ్లు కట్టిస్తా'

''నాకు నలుగురు కొడుకులు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. నేను వారి కోసం ఇళ్లు కట్టించాలని అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి రెండు గదుల ఇల్లు కట్టించి ఇవ్వాలనుకుంటున్నా. పక్కా ఇంటి కోసం నేను జీవితాంతం పోరాడుతూనే ఉన్నా'' అని గురుదేవ్ సింగ్ చెప్పారు.

''ఇప్పుడున్న ఇల్లు కట్టేందుకు కూడా నేను చాలా కష్టపడ్డాను'' అని ఆయన అన్నారు.

గురుదేవ్ సింగ్‌కు చెట్లంటే చాలా ప్రేమ. ఆయన తన ఇంటి చుట్టూ చాలా చెట్లను పెంచుతున్నారు.

''నేను వ్యవసాయ కూలీగా పనిచేశాను. ఇటుక రాళ్ల బట్టీలో కూడా పనిచేశా. పొలం కౌలు‌కు తీసుకుని వ్యవసాయం కూడా చేశాను. కానీ కలిసి రాలేదు. 25 - 26 ఏళ్ల నుంచి రిక్షా తొక్కుతున్నా. ఇకపై కూడా ఆపను'' అని తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఆయన చెప్పారు.

''రిక్షా తొక్కడం నా జీవితంలో భాగమైపోయింది. నాకు కోట్ల రూపాయల లాటరీ తగిలిందని తెలుసు. కానీ ఇప్పటికీ నేను నా పనిని ప్రేమిస్తున్నాను'' అని ఆయన అన్నారు.

''ఎండాకాలంలో రిక్షా తొక్కడం చాలా కష్టం. ఆ సీజన్‌లో కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే పనిచేయగలను. అందుకే నాకు చెట్లంటే ఇష్టం. వేసవిలో చెట్ల కింద చాలా చల్లగా ఉంటుంది'' అని గురుదేవ్ సింగ్ చెప్పారు.

గురుదేవ్ సింగ్

మళ్లీ లాటరీ టికెట్ కొంటారా?

గురుదేవ్ సింగ్ కొడుకుల‌కు పెళ్లిళ్లు అయిపోయాయి.

''మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం'' అని గురుదేవ్ సింగ్ కోడలు కరమ్‌జిత్ కౌర్ బీబీసీతో చెప్పారు.

''మావయ్య చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మా జీవితం మారిపోతుంది. కొంచెం హాయిగా బతకొచ్చు'' అని ఆమె అన్నారు.

మళ్లీ లాటరీ టికెట్ కొంటారా అని బీబీసీ ప్రశ్నించగా, ''లేదు, సార్. లాటరీ తగలడం సంతోషంగా ఉంది. నేను నా చివరి రోజుల్లో ఉన్నా. నేను మరో పదేళ్లో, ఇరవై ఏళ్లో బతుకొచ్చు. లేదంటే రేపే చనిపోవచ్చు. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మన గురించి ఆ దేవుడి మనసులో ఏముందో ఎవరు ఊహించగలరు'' అని చేతులు కట్టుకుని చిరునవ్వు నవ్వుతూ చెప్పారు గురుదేవ్ సింగ్.

వీడియో క్యాప్షన్, ఈ 89 ఏళ్ల రిక్షా వాలా, లాటరీపై ఆశ వదులుకుని టికెట్ కూడా పడేశాడు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)