దిల్లీ: చిన్నారి పనిమనిషిని కొట్టి, వాతలు పెట్టి తీవ్రంగా హింసించారు.. భారతదేశంలో పనిమనుషులకు రక్షణ ఎందుకు లేదు?

పనిమనిషిని కొట్టి, వాతలు పెట్టి తీవ్రంగా హింసించారు.

ఫొటో సోర్స్, DEEPIKA NARAYAN BHARADWAJ

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీ శివార్లలోని ఒక ఇంటి నుంచి గాయాలతో ఉన్న 14 ఏళ్ల అమ్మాయిని పోలీసులు, సామాజిక కార్యకర్తలు రక్షించారు. ఆ అమ్మాయి ఆ ఇంట్లో పనిమనిషి. గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అయిదు నెలలగా యజమానులు తనను హింసిస్తున్నారని ఆమె తెలిపింది.

దేశంలో చాలా చోట్ల పనిమనుషులు దోపిడీకి గురవుతున్నారని, బయటపడే మార్గాలు, చట్టపరమైన రక్షణ గురించి తెలియక చిక్కుకుపోతున్నారని నిపుణులు అంటున్నారు.

"ఆమె చాలా దయనీయమైన స్థితిలో ఉంది" అని అని జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ దీపికా నారాయణ్ భరద్వాజ్ చెప్పారు.

ఆ అమ్మాయి ఆ ఇంట్లో బాధలు పడుతోందని ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్న దీపికా నారాయణ్ పిల్లల రక్షణ సంస్థలకు సమాచారం అందించారు.

"నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఈ అమ్మాయి విషయం చెప్పారు. దిల్లీ శివార్లలోని గుర్గావ్‌లో తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఆయన ఈ అమ్మాయిని చూశారు. చెత్త పారబోయడానికి ఆ పిల్ల ఇంటి బయటకు వచ్చింది. మొహం నిండా రక్తం, గాయాలతో ఉందని గమనించి, వెంటనే నాకు ఫోన్ చేసారు" అని దీపిక నారాయణ్ చెప్పారు.

దీపిక ఆ అమ్మాయిని ఆస్పత్రిలో కలిశారు. ఆ ఇంట్లో తనెలాంటి బాధలు పడిందో ఆ అమ్మాయి వివరించి చెప్పింది.

"ఆమెను రోజూ కొట్టేవారని చెప్పింది. ఒకసారి కాదు, రోజులో చాలాసార్లు పని పూర్తిచేయలేదని కొట్టేవారని చెప్పింది" అన్నారు దీపిక.

ఆ ఇంటి యజమానులు మనీష్ ఖట్టర్, ఆయన భార్య కమల్‌జీత్ కౌర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టంలోని వివిధ సెక్షన కింద వారిపై కేసులు వేశారు.

మనీష్ ఖట్టర్, ఆయన భార్య కమల్‌జీత్ కౌర్‌

ఫొటో సోర్స్, DEEPIKA NARAYAN BHARADWAJ

ఫొటో క్యాప్షన్, మనీష్ ఖట్టర్, ఆయన భార్య కమల్‌జీత్ కౌర్‌

'బట్టలిప్పి పని చేయమనేవారు.. '

పోలీసు అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌పెస్ పత్రికతో మాట్లాడుతూ, "ఆ అమ్మాయిని వాళ్లు కనికరం లేకుండా కొట్టేవారని, ఆమె శరీరంపై కోసుకుపోయిన, కాలిన గాయాలు ఉన్నాయని, బ్లేడు లేక వేడి పటకారుతో గాయపరచి ఉంటారని అనుమానిస్తున్న’’ట్లు చెప్పారు.

"ఆ అమ్మాయి శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నాయి. ముఖంపై, భుజాలు, చేతులు, కాళ్ల నిండా గాయాలు. భుజంపై చర్మం కాలిపోయి ఉంది. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని ఆ పోలీసు అధికారి చెప్పారు.

ఆమె శరీరం, ముఖంపై గాయాల ఫొటోలను బీబీసీ చూసింది. అవి కలవరపరిచేలా ఉన్నాయి. అందుకే ఈ కథనంలో వాటిని జతచేయడంలేదు.

ఆ అమ్మాయి పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తనను ‘‘బట్టలిప్పేసి ఇంట్లో బట్టలు ఉతకమనేవారు, అలాగే ఇంట్లో పనులన్నీ చేయమనేవారు, బట్టలు లేకుండానే నేలపై పడుకోమనేవారు" చెప్పింది.

దాంతో, యజమానులపై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు చేశారు. పోక్సో చట్టం లైంగిక నేరాల నుంచి చిన్నపిల్లలను రక్షిస్తుంది.

యజమానులు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. తమపై వచ్చిన ఆరోపణలపై వారు ఇంతవరకూ స్పందించలేదు.

వాళ్ల లాయరుతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

పనిమనుషులకు రక్షణ లేదు

ఫొటో సోర్స్, DEEPIKA NARAYAN BHARADWAJ

'చెత్తబుట్టలో పారేసినది తీసుకుని తినమనేవారు.. '

మనీష్ ఖట్టర్ ప్రముఖ జీవిత బీమా కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారని, ఆయన భార్య ఒక పబ్లిక్ రిలేషన్స్ సంస్థలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లో పనిమనిషిని హింసించారన్న ఆరోపణలు రావడంతో ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు.

"వాళ్లు ఆ అమ్మాయిని బానిసలాగ చూశారు. సరిగ్గా తిండి పెట్టకుండా, చెత్తబుట్టలో పారేసినది తీసుకుని తినమనేవారు" అని శక్తి వాహిని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషి కాంత్ చెప్పారు. ఈ ఎన్జీవో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది.

"ఆ అమ్మాయిని గుర్గావ్ తీసుకొచ్చిన బంధువు ఎవరు? ఏ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ఆమెను ఈ పనిలో పెట్టింది? ఆమెకు ఇవాల్సిన జీతం ఏమైంది? మొదలైన వివరాలు తెలుసుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆమెకు ఎప్పుడూ వాళ్లు జీతం ఇవ్వలేదు" అని నిషి కాంత్ చెప్పారు.

ఈ అమ్మాయి ఉదంతం చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ, దేశంలో పనిమనుషులపై హింస కొత్త కాదని, ఇది చాలా పెద్ద సమస్య అని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, ఝార్ఖండ్: పరీక్షల్లో ఫెయిల్ చేశారంటూ.. టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

'పనిమనుషులపై హింస కొత్త కాదు..'

మన దేశంలో పేదవాళ్లు పొట్టకూటి కోసం మధ్య, ఎగువ తరగతి ఇళ్లల్లో పనులు చేయడం సర్వసాధారణమైన విషయం. మహిళలు, చిన్నపిల్లలు.. ఆడ, మగ పిల్లలు కూడా ఇళ్లల్లో పనిచేస్తుంటారు. వీళ్లపై కనబడని హింస జరుగుతుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

2013లో దిల్లీలోనే 15 ఏళ్ల అమ్మాయిని ఇంట్లో పనిమనిషిగా పెట్టుకుని వేధించి, హింసించినందుకు 50 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయికి తలపై బలమైన గాయం అయింది. శరీరంపై పళ్ల గాట్లు కనిపించాయి.

అంతకు ముందు ఏడాది, ఒక జంట తమ ఇంట్లో పనిచేస్తున్న 13 ఏళ్ల బాలికను ఇంట్లో పెట్టి తాళం వేసి సెలవులకు థాయ్‌లాండ్ వెళ్ళారు. ఆ పిల్ల బాల్కనీ నుంచి కేకలు వేయడం, ఏడవడం గమనించిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు.

పై మూడు కేసుల్లో ఒక కామన్ విషయం ఏమింటంటే, పనిమనుషులుగా వచ్చిన ముగ్గురు పిల్లలూ ఝార్ఖండ్ నుంచి వచ్చినవారే. దేశంలోని పేద రాష్ట్రాలో ఝార్ఖండ్ ఒకటి.

"పేదరికం వల్ల అమ్మాయిలు పెద్దమనిషి కాగానే స్కూలు మానేస్తారు. ఫేక్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలు వారికి డబ్బు ఆశ చూపి దిల్లీ తదితర నగరాలకు తీసుకొస్తాయి. అక్కడ ఇళ్లల్లో పనిమనుషులుగా చేరుస్తాయి. ఆ పిల్లలు హింసకు, దోపిడీకి గురవుతారు" అని శక్తి వాహిని సంస్థ ప్రతినిధి రిషి కాంత్ అన్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం, భారతదేశంలో 47.5 లక్షల మంది డొమెస్టిక్ వర్కర్లు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధికారిక గణాంకాల ప్రకారం, భారతదేశంలో 47.5 లక్షల మంది డొమెస్టిక్ వర్కర్లు ఉన్నారు.

'వాళ్లను కొట్టినా, తిట్టినా అడిగేవాళ్లు ఉండరు.. '

అధికారిక గణాంకాల ప్రకారం, భారతదేశంలో 47.5 లక్షల మంది పనివాళ్లు (డొమెస్టిక్ వర్కర్లు) ఉన్నారు. వారిలో 30 లక్షల మంది మహిళలు.

కానీ, వాస్తవంలో 2 నుంచి 8 కోట్ల మంది ఉంటారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అంచనా వేసింది.

ఇళ్లల్లో పని అంటే బండ చాకిరీ ఉంటుంది. ఎందుకంటే, మధ్య తరగతి వర్గంలో అతి తక్కువమంది ఇళ్లల్లో మాత్రమే వాషింగ్ మిషన్లు, డిష్‌వాషర్లు, వ్యాక్యూం క్లీనర్లు ఉంటాయి. అధికులు ఈ పనులన్నీ చేయడానికి పనిమనుషులను పెట్టుకుంటారు.

14 ఏళ్లు పైబడిన పిల్లలను పనిమనుషులుగా పెట్టుకోవచ్చని చట్టం చెబుతోంది. ఎందుకంటే, ఇంటి పని ప్రమాదకరం కాదని ఆ చట్టంలో పేర్కొన్నారు.

చదువులేని వారికి లేదా రెండు, మూడు క్లాసులతో చదువు ఆపేసినవారికి ఇదొక ప్రధానమైన జీవనోపాధి.

అయితే, పనిమనుషులు వివిధ రకాల దోపిడీకు గురవుతారని మీనాక్షి గుప్త జైన్ అంటున్నారు. ఆమె హెల్పర్4యూ అనే ఆన్‌లైన్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ నడుపుతున్నారు.

"పనిమనుషులతో చట్టపరమైన కాంటాక్ట్ రాసుకోరు. కనీస హామీ వేతనాలు ఉండవు. పని ప్రదేశాలలో మహిళలను రక్షించే లైంగిక వేధింపుల నిరోధక చట్టం వారికి వర్తించదు. సొంత ఊరికి దూరంగా మరో ఊర్లో పనిచేసేవారికి మంది, మార్బలం ఉండదు. ఏ రకమైన సహాయం అందదు. వాళ్లను కొట్టినా, తిట్టినా అడిగేవాళ్లు ఉండరు. ఇంట్లో పనిమనుషులకు సంబంధించి కఠినమైన చట్టాలు, జరిమానాలు తీసుకొచ్చేవరకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి" అని మీనాక్షి అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, టీచర్ కావాలనే లక్ష్యం చేరుకోవడానికి పేపర్ గర్ల్‌గా మారిన బాలిక

'యాంటీ-ట్రాఫికింగ్ బిల్ పాస్ అవ్వాలి..'

ముఖ్యంగా, పిల్లలు తట్టుకోలేని హింసకు గురవుతారని ఆమె అన్నారు.

"ఇంటి పని ప్రమాదకరం కాదని, 14 ఏళ్లు దాటిన వారు పనిమనుషులుగా చేరవచ్చని ప్రభుత్వం అంటోంది. కానీ, మూసిన తలుపుల వెనుక ఇల్లు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా మారవచ్చు" అన్నారామె.

అయితే, మన దేశంలో పనిమనుషులు, వాళ్లపై జరిగే వేధింపుల గురించి ఎవరూ మాట్లాడరు. ఇలాంటి దుర్మార్గమైన కేసులు బయటికొచ్చినప్పుడు మాత్రం వార్తలకెక్కుతాయి.

ఇంట్లో పనిమనుషులతో గౌరవంగా ప్రవర్తించడం ముఖ్యం అనే సందేశాన్ని దేశ ప్రజలకు నిరంతరం అందించే వ్యవస్థ ఉండాలని మీనాక్షి అంటారు.

"ప్రతి చిన్న విషయానికీ హైప్ వస్తూ ఉంటుంది. మరి, ఇలాంటివాటికి ఎందుకు రాదు? పనిమనుషులతో గౌరవంగా మెలగాలనే అంశానికి హైప్ ఎందుకు రాదు?" అన్నారామె.

పార్లమెంటులో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న యాంటీ-ట్రాఫికింగ్ బిల్ పాస్ అయితే తప్ప ఈ సమస్యలు కొలిక్కిరావని నిషి కాంత్ అంటున్నారు.

"పేదరికంలో ఉన్న ఆడపిల్లలను తీసుకొచ్చి, ఇళ్లల్లో పనిమనుషులుగా పెడుతున్నవారిని పట్టుకుని శిక్షించాలి" అన్నారు.

ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, పనిమనిషిని వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ జంటకు శిక్షపడడం అంత సులభం కాదని కాంత్ అన్నారు.

"ఇది పెద్ద యుద్ధమే. ఇలాంటివి చాలా చోట్ల జరుగుతాయి. చివరకు, ఏ ప్రయోజనం ఉండదు. తరచుగా బాధితుల కుటుంబాలు కొంత డబ్బు తీసుకుని కోర్టు బయట కేసు పరిష్కరించుకుంటాయి" అన్నారాయన.

2013 కేసులో ఆ 50 ఏళ్ల మహిళ నెల రోజుల తరువాత బెయిల్ మీద బయటికొచ్చారు. ఆ కేసు విచారణ నాలుగేళ్లు సాగింది. చివరకు ఆమెకు రూ. 1,000 జరిమానా విధించి వదిలిపెట్టారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)