కంగారూలు భారతదేశంలో కనిపించడమా... ఎలా సాధ్యం?

ఫొటో సోర్స్, BENGAL SAFARI PARK
- రచయిత, ఆండ్రూ క్లారెన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తూర్పు భారతదేశంలోని ఒక అటవీ ప్రాంతంలో గ్రామస్థులకు రహదారి పక్కన మూడు జంతువులు కనిపించాయి. అవి చాలా కంగారుగా, బలహీనంగా, ఆకలితో ఉన్నట్టు కనిపించాయి. వాటిని చూడనే గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.
అలాంటి వింత జంతువులను వారు మునుపెన్నడూ చూడలేదు. వెంటనే, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అటవీ అధికారులను అప్రమత్తం చేశారు.
ఆ జంతువులను కంగారూలు అంటారని, అవి ఆస్ట్రేలియాకు చెందినవని, భారత్‌లో ఉండవని అధికారులు గ్రామస్థులకు వివరించారు.
అటవీ అధికారులు ఆ మూడు కంగారూలను రక్షించి, చికిత్స నిమిత్తం వన్యప్రాణి రక్షణ కేంద్రానికి తరలించారు.
అయితే, వాటిల్లో ఒకటి చనిపోయింది. ఆ గ్రామస్థులు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. వారు అంతకు ముందు చూడని ఆ వింత జంతువు గురించి తికమకపడ్డారు. ఈలోగా, కంగారూల వీడియోలు వైరల్ అయిపోయాయి. భారత్‌లో కంగారూలు కనిపించాయన్న వార్త సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.
"పశ్చిమ బెంగాల్‌లో కంగారూలు కనిపించాయా.. అదెలా సాధ్యం!" అంటూ ఒక ట్విట్టర్ యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ దేబల్ రే బీబీసీతో మాట్లాడుతూ, వీటిని స్మగ్లింగ్ చేసుంటారని అన్నారు. తమ బృందం నిర్వహించిన యాంటీ-స్మగ్లింగ్ ఆపరేషన్ వల్ల భయంతో వీటిని ఆరుబయట వదిలేసి ఉంటారని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాష్ట్రంలోకి కొన్ని అన్యదేశ జంతువులను అక్రమంగా తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో దేబల్ రే, తన బృందాన్ని అప్రమత్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి, రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ఉన్న ప్రధాన మార్గాలలో వాహన తనిఖీలు మొదలెట్టారు.
"స్మగ్లర్లకు ఉప్పు అందుంటుంది. అందుకే కంగారూలను హైవే మీద వదిలి పారిపోయారు" అని దేబల్ రే అన్నారు.
"అవి బహుశా ఆగ్నేయాసియాలోని ప్రయివేట్ బ్రీడింగ్ (పెంపకం) ఫాంల నుంచి ఇక్కడకు వచ్చి ఉంటాయి. స్మగ్లర్లు తరచూ విదేశీ జంతువులను మియన్మార్ ద్వారా భారత్ సరిహద్దు రాష్ట్రాలకు తీసుకువస్తారు" అని ప్రాంతీయ వైల్డ్‌లైఫ్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ అగ్ని మిత్ర, బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో విదేశీ జంతువులకు పెరిగిన డిమాండ్
దేశంలో విదేశీ జంతువులకు డిమాండ్ పెరిగిందని భారత యాంటీ-స్మగ్లింగ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్' (డీఆర్ఐ) తెలిపింది.
బ్యాంకాక్, మలేసియా, "ఆగ్నేయాసియాలోని ఇతర ప్రముఖ పర్యటక ప్రాంతాల" నుంచి జంతువులను దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని, వాటిని భారతదేశంలోని వివిధ నగరాలకు తరలిస్తున్నారని డీఆర్ఐ తెలిపింది.
"ఈశాన్య సరిహద్దుల గుండా" అన్యదేశ జంతువులను దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నారని మిత్రా చెప్పారు. బంగారు రంగులో ఉండే లయన్ టామరిన్ (కోతి జాతి జంతువు) దగ్గర నుంచి లీమర్స్ వరకు పలు రకాల విదేశీ జంతువులను అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు. లయన్ టామరిన్ బ్రెజిల్‌లో అంతరించిపోతున్న జాతి.
ఈ స్మగ్లర్లను లేదా వ్యాపారులను పట్టుకోవడం, వారి మీద కేసు వెయ్యడం సాధ్యం కాదని భారత వన్యప్రాణి సంరక్షణ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే, భారతదేశంలోని వన్యప్రాణుల రక్షణ చట్టంలో స్థానికేతర, విదేశీ జంతువులను రక్షించే విధానం లేదు.
సరైన అనుమతులు లేకుంటే వన్యప్రాణులను రవాణా చేయకుండా నిరోధించే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంది. కానీ, సరిహద్దుల్లో దొంగచాటుగా, అక్రమంగా జరిగే వ్యాపారాన్ని ట్రాక్ చేయడం వారికి కష్టమైపోతోంది.
స్థానిక జంతు జాతుల వ్యాపారంపై నిషేధం ఉంది కాబట్టి, స్మగ్లర్లు "విదేశీ జంతు జాతుల వ్యాపారం మొదలుపెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన పర్యావరణ పరిణామాలకు దారితీస్తోంది" అని డీఆర్ఐ తెలిపింది.
విదేశీ జంతువులను పెంచుకోవడం ప్రతిష్టగా భావిస్తున్నారని, ఇటీవల సంవత్సరాలలో ఈ ట్రెండ్ పెరిగిందని వన్యప్రాణి సంరక్షణ యాక్టివిస్టులు అంటున్నారు.
"కొద్ది రోజుల క్రితమే, బంగ్లాదేశ్‌లో జీబ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అవి భారతదేశంలోని ఒక ప్రయివేటు జూకు అక్రమంగా రవాణా కానున్నాయి. వాటిని పట్టుకున్నారు. ప్రజలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు" అని వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ బృందానికి చెందిన శుభబ్రతా ఘోష్ అన్నారు.
భారతీయులకు విదేశీ జంతువులపై ఆసక్తి, మక్కువ...
భారతీయులకు చాలాకాలంగా అన్యదేశ జంతులపై ఆసక్తి, మక్కువ ఉన్నాయి.
2020 జూన్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ఒక పథకాన్ని ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న అన్యదేశ పెంపుడు జంతువులను స్వచ్ఛందంగా ప్రకటించాలని పిలుపునిచ్చింది.
సరైన డాక్యుమెంటేషన్ లేని పెంపుడు జంతువుల యజమానులపై విచారణ ఏమీ జరగదని స్పష్టం చేసింది. ప్రభుత్వం "విదేశీ జాతుల జాబితాను అభివృద్ధి చేయాలని", జంతువుల దిగుమతి విధానాలను క్రమబద్ధీకరించాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.
దాంతో, 2021 ప్రారంభంలో, ప్రభుత్వానికి 32,645 దరఖాస్తులు అందాయి. అంతరించిపోతున్న లీమర్, ఇగువానా, మకావ్, కంగారూల వంటి విదేశీ జంతువులను పెంచుకున్నవారంతా తమ పెంపుడు జంతువులను ప్రకటించారని డేటా విశ్లేషణ వెబ్‌సైట్ ఇండియా స్పెండ్ ఒక నివేదికలో తెలిపింది.
దేశంలోకి రవాణా అవుతున్న విదేశీ జంతువుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వాటి వాణిజ్యాన్ని పర్యవేక్షించడానికి ఇప్పటికీ సమర్థవంతమైన చట్టాలు లేవని వన్యప్రాణి అధికారులు చెబుతున్నారు.
1976లో భారతదేశం 'కన్వెషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్'(అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం - CITES)ను ఆమోదించింది. ఈ ఒప్పందాన్ని 183 దేశాలు ఆమోదించాయి. అంతరించిపోతున్న మొక్కలు, జంతువుల రక్షణ, వాణిజ్యాన్ని పర్యవేక్షించే ఒప్పందం ఇది.
అయితే, భారతదేశంలో ఈ ఒప్పందం ఇంకా అమలులోకి రాలేదు.

ఫొటో సోర్స్, SHUBHOBROTO GHOSH
'పలు జంతు ప్రదర్శన శాలలు ఈ నెట్‌వర్క్‌లో భాగం'
మరోవైపు, అధికారులు వన్యప్రాణుల రక్షణ చట్టానికి ప్రతిపాదించిన సవరణను సమీక్షిస్తున్నారు. దీని ద్వారా విదేశీ వృక్షాలు, జంతువుల సంరక్షణ స్థానిక చట్టంలో భాగమవుతుంది.
అయితే, ఈ సవరణ ప్రభావంపై ఘోష్ సందేహాలు వ్యక్తం చేశారు.
"ఉదాహరణకు నేను ఫారెస్ట్ ఆఫీసర్‌ని. మీకు, నాకు మంచి స్నేహం ఉంది. మీరు బ్రెజిల్ నుంచి తీసుకొచ్చిన జంతువులను పెంచుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు, లంచం ఇచ్చి, అనుమతి పొందడం చాలా సులువు" అని ఆయన వివరించారు.
"దురదృష్ట్టవశాత్తు చాలా జూలు ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయి. వ్యాపారులు, పెంపకందారులు కలిసి విదేశీ జంతువులను కొంటున్నారు" అని ఘోష్ చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్, అస్సాం బోర్డరులో హైవేపై వెళుతున్న ఒక ట్రక్‌లో ఎర్ర కంగారూను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మిజోరాంలో వాళ్లకు ఈ కంగారూలను అప్పగించారని, వాటిని మధ్యప్రదేశ్‌కు తోలుకుపోతున్నారని నిందితులు పోలీసులకు చెప్పారు.
"జూ నుంచి ఇచ్చిన సప్లయి ఆర్డరు బిల్లు వాళ్లు చూపించారు. ఆ జూ దాన్ని ధృవీకరించిది కూడా" అని మిత్ర చెప్పారు.
"ఈ జంతువులను బహుమతిగా పొందినట్టు" ఆ జూ క్యూరేటర్ ఒక న్యూస్ వెబ్‌సైట్‌కు చెప్పారు.
"ఇది కచ్చితంగా స్మగ్లింగ్ కేసు. సప్లయి బిల్లు మిజోరాంలోని ఒక ఫాం పేరు మీద ఉంది. ఆ ఫాం అసలు ఉనికిలోనే లేదు" అని ఘోష్ వివరించారు.
"నియామల ప్రకారం, ఈ జంతువులను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో డిక్లేర్ చేయాలి. కానీ, ప్రభుత్వ రికార్డుల్లో మిజోరాం ఫాం నుంచి కంగూరలను డిక్లేర్ చేసిన దాఖలాలు లేవు" అని మిత్రా చెప్పారు.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అటవీ అధికారులు రక్షించిన కంగారూలు.. అలెక్స్, గ్జేవియర్ బెంగాల్ సఫారీ పార్క్‌లో చికిత్స పొందుతున్నాయి. అవి మెల్లగా కోలుకుంటున్నాయి.
"వాటికి కండరాల బలహీనత సోకింది. స్మగ్లింగ్‌లో భాగంగా కంగారూలను ఇరుకైన చిన్న స్థలంలో కుక్కి పెట్టినప్పుడు వాటికి ఈ సమస్య వస్తుంది. అవి పూర్తిగా కోలుకుంటే, జూలో ప్రదర్శనకు ఉంచుతాం. కానీ, అవి ఇక జీవితాంతం జూలోనే ఉండాలి. వాటిని అడవుల్లోకి వదల్లేం. భారతదేశ వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలించవు. ఇది వాటికి సహజ నివాసం కాదు" అని దేబల్ రే చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- నగ్నంగా ఉండే బిలియనీర్.. సినిమాలు, విమానాలు అంటే విపరీతమైన పిచ్చి
- ఫ్రాంక్ గార్డెనర్: 'మళ్లీ ఇలాగే జరిగింది' - విమానంలో వీల్ చైర్ వాళ్లని ఎందుకు వదిలేస్తారు?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- ‘నేను చచ్చిపోయానని అనుకుంటామన్నారు.. కానీ ఇప్పుడు కాపుకాసి నా భర్తను చంపేశారు’
- తిరుపతికి సమీపంలో 300 అడుగుల ఎత్తు నుంచి నేలకు దూకే జలపాతం.. దట్టమైన అడవిలో నడిచి మరీ వెళ్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












