కాలర్‌వాలీ: 29 పిల్లలను కన్న ఈ ఆడపులికి ఎందుకింత గౌరవం దక్కింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శరణ్య రిషీకేశ్
- హోదా, బీబీసీ న్యూస్
భారత్‌లో ‘‘సూపర్ మామ్’’గా ప్రఖ్యాతిగాంచిన ‘‘కాలర్‌వాలీ’’ సాధారణమైన ఆడ పులి కాదు.
16 ఏళ్ల వయసులో జనవరి 15న కాలర్‌వాలీ మరణించింది. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ పులుల అభయారణ్యానికి ఈ ఆడ పులి మంచి పేరు తీసుకొచ్చింది.
రేడియో కాలర్ వేయడంతో ఈ పులిని ‘‘కాలర్‌వాలీ’’అని పిలుస్తుండేవారు. ఎనిమిది ప్రసవాల్లో ఇది 29 పిల్లలకు జన్మనిచ్చింది. ఇదొక అద్భుతమైన రికార్డని జంతు నిపుణులు చెబుతున్నారు.
బీబీసీ వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ ‘‘స్పై ఇన్ ద జంగిల్’’లో కనిపించిన తర్వాత దీని పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగాయి. రెండేళ్లలో నాలుగు పులి పిల్లల జీవితాలను ఈ డాక్యుమెంటరీలో చూపించారు.
ఆ డాక్యుమెంటరీ తరవాత, పెంచ్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ‘‘చాలా మంది కాలర్‌వాలీ, తన తల్లి ఎక్కడ?’’అని అడుగుతుండేవారని 2004 నుంచి పెంచ్ అధికారులతో కలిసి పనిచేస్తున్న జంతు ప్రేమికుడు ప్రబిర్ పాటిల్ చెప్పారు.
వయసు పైబడటంతో వచ్చే అనారోగ్యంతో కాలర్‌వాలీ మరణించింది.

ఫొటో సోర్స్, Pench Reserve
ఈ అభయారణ్యంలో తమ కళ్లముందే పెరిగిన కాలర్‌వాలీ గురించి జంతు ప్రేమికులు, అటవీ అధికారులు, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఎన్నో విశేషాలు వివరిస్తుంటారు. రుడ్యార్డ్ కిప్లింగ్ రచించిన ‘‘ద జంగిల్ బుక్’’కు ప్రేరణ ఇచ్చింది కూడా ఈ అభయారణ్యమని చెబుతుంటారు.
2005లో బడీ మాతా(బిగ్ మదర్)గా పిలుచుకునే ప్రఖ్యాత ఆడ పులికి కాలర్‌వాలీ జన్మించింది. జన్మించినప్పుడు దానికి పెట్టిన పేరు టీ-15. దీని తండ్రి పేరు టీ-1.
ఈ అభయారణ్యంలో రేడియో కాలర్ అమర్చిన తొలి పులి కాలర్‌వాలీనే. ఈ కాలర్‌తో ఏళ్లపాటు కాలర్‌వాలీపై అధ్యయనం సాగింది.
కాలర్‌వాలీని ‘‘మాతరం’’, ‘‘రెస్పెక్టెడ్ మదర్’’అని కూడా జంతు ప్రేమికులు పిలుస్తుంటారు.

ఫొటో సోర్స్, Varun Thakkar
‘‘కాలర్‌వాలీ పుట్టకముందు పెంచ్‌లో పులులు అరుదుగా కనిపించేవి. అయితే, కాలర్‌వాలీ పుట్టన తర్వాత, సందర్శకులకు ఎక్కువగా కనిపించే ఆడపులిగా ఇది మారింది’’అని పాటిల్ చెప్పారు.
కాలర్‌వాలీని పెంచ్‌కు ‘‘ముఖచిత్రం’’గా జంతు ప్రేమికుడు వివేక్ మేనన్ అభివర్ణించారు. సందర్శకులతో ఇది స్నేహపూర్వకంగా నడుచుకోవడంతో చాలా మంది ఫోటోలు తీసుకోవడానికి వచ్చేవారు.
పెంచ్ సందర్శకులకు కాలర్‌వాలీ అసంతృప్తికి గురిచేయడం చాలా అరుదని పర్యావరణ కార్యకర్త మహమ్మద్ రఫీఖ్ షేక్ చెప్పారు.
‘‘సందర్శకులతో తను స్నేహంగా మెలిగేది. ఎలాంటి భయమూ లేకుండా వాహనాలకు చాలా దగ్గర వరకు వచ్చేది’’అని మహమ్మద్ చెప్పారు. వందల మంది సందర్శకులకు ఆయన గైడ్‌గా పనిచేశారు.
ప్రపంచంలో 70 శాతం పులులకు భారత్ నిలయం. ఇదివరకు తగ్గిన వీటి సంఖ్య మళ్లీ పెరుగుతోందని తాజా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 2,976 పులులు ఉన్నాయి. ఇక్కడున్న 51 పులుల అభయారణ్యాలను చూసేందుకు వేల మంది సందర్శకులు వస్తుంటారు.

ఫొటో సోర్స్, Varun Thakkar
కాలర్‌వాలీకి చాలా ప్రత్యేకతలున్నాయి. దీని కంటూ ఒక ప్రత్యేకమైన ప్రాంతముంది. తల్లి ఉండే చోటులో కొంత భాగాన్ని తన ప్రాంతంగా కాలర్‌వాలీ మలచుకుంది. చాలా అరుదుగా ఇది ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేది. చివరగా ఆ ప్రాంతంలోనే కన్నుమూసింది.
‘‘ఇది చూడటానికి చాలా పెద్దగా కనిపించేది. దీంతో ఇతర పులులు చూసి భయపడేవి. కొన్నిసార్లు అధికారులు దీని శరీరాకృతి చూసి మగ పులి అని భ్రమపడేవారు’’అని పాటిల్ చెప్పారు.
నెమ్మదిగా ఇది 29 పిల్లలకు జన్మనిచ్చింది. వీటిలో 25 బతికే ఉన్నాయి. భారత్‌లో ఇదొక రికార్డు. బహుశా ప్రపంచంలోనే ఇది రికార్డు అయ్యుండొచ్చు.
2008లో కాలర్‌వాలీ మొదటి మూడు పిల్లలు న్యుమోనియాతో చనిపోయాయి. అయితే, ఆ తర్వాత వెంటవెంటనే పిల్లల్ని కంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. 2010లో అయితే, ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఇది చాలా అరుదని జంతు ప్రేమికులు వివరించారు.

ఫొటో సోర్స్, Varun Thakkar
చాలా ఆడ పులులు రెండేళ్ల వరకు పిల్లలను తమతోనే ఉంచుకుంటాయి. కానీ కాలర్‌వాలీ మాత్రం పిల్లలు స్వతంత్రంగా పెరిగేందుకు అవకాశమిచ్చేది. ఆహారం ఎక్కువగా దొరికే ప్రాంతాల్లో వాటిని విడిచిపెట్టేది.
‘‘తను మంచి తల్లి. కొన్నిసార్లు పిల్లలకు ఆహారం పెట్టేందుకు రోజులో రెండు జంతువులను వేటాడేది’’అని పెంచ్‌లో పశు వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ అఖిలేశ్ మిశ్ర తెలిపారు. అఖిలేశ్ చాలాసార్లు కాలర్‌వాలీకి వైద్య సేవలు అందించారు.
‘‘నేను చాలా అదృష్టవంతుణ్ని. ఇంత మంచి ఆడ పులికి వైద్యం చేసే అవకాశం నాకు దక్కింది’’అని ఆయన వివరించారు.
‘‘పెంచ్‌కు సందర్శకుల తాకిడి పెరగడానికి కాలర్‌వాలీనే కారణం. ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు తను విశేషంగా సందర్శకుల అభిమానాన్ని సంపాదించేది. దీని పిల్లలతో ఇక్కడ పులుల సంఖ్య కూడా చాలా పెరిగింది’’అని మేనన్ వివరించారు.
బీబీసీతో మాట్లాడిన ప్రతిఒక్కరూ కాలర్‌వాలీతో తమకున్న ఏదో ఒక ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. ‘‘వేటాడుతూ తమ చోటులోకి వచ్చిన ఓ లెపర్డ్‌ను కాలర్‌వాలీ, తన మూడు పిల్లలు తరిమికొట్టాయి. దెబ్బకు ఆ లెపర్డ్ చెట్టు ఎక్కింది’’అని పాటిల్ వివరించారు.
‘‘తను ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత 2011లో తీసిన ఓ ఫోటోను నేను ఎప్పటికీ మరిచిపోలేను. పెంచ్ నదీ తీరంలో ఓ గుండ్రని రాయిపై ఐదుగురు పిల్లలతో తను విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ఫోటో తీశాను’’అని ఫోటోగ్రాఫర్ వరుణ్ ఠక్కర్ వివరించారు.

ఫొటో సోర్స్, Varun Thakkar
తను గాయపడినప్పుడు కాలర్‌వాలీ సాధారణంగా బయటతిరిగేది. అటుగా వచ్చే మనుషుల సాయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా అనిపించేది.
తన మరణానికి ఒక రోజు ముందు కూడా తను అలానే కనిపించింది. తను ఆ రోజు కనీసం నడవలేని స్థితిలో కనిపించిందని ఓ సందర్శకుడు వివరించారు.
ఆదివారం కాలర్‌వాలీకి అంత్యక్రియలు నిర్వహించారు. అటవీ సిబ్బంది, స్థానిక గ్రామాల ప్రజలు, జంతు ప్రేమికులు తనకు పువ్వులతో నివాళులు అర్పించారు.
కాలర్‌వాలీకి నివాళులు అర్పిస్తూ అటవీ సిబ్బంది ఓ వీడియో కూడా సిద్ధంచేశారు. గడ్డిలో హాయిగా కూర్చున్న కాలర్‌వాలీ దృశ్యాలతో ఈ వీడియో మొదలవుతుంది. అలా ప్రజలు తనను గుర్తుచేసుకుంటున్నారు.
కాలర్‌వాలీ సాధారణమైన పులి కాదని డాక్టర్ మిశ్ర వివరించారు. ‘‘మేం తను మరణించిందని బాధపడటం లేదు. తన జీవన ప్రయాణాన్ని వేడుకగా చేసుకుంటున్నాం’’అని ఆయన చెప్పారు.
‘‘తను సంతోషంగా సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించింది. తను మరణించిన సంగతి వాస్తవమే. అయినా, మా గుండెల్లో తను ఎప్పటికీ బతికే ఉంటుంది’’అని మహమ్మద్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- స్కాచ్ విస్కీ: బ్రిటన్ – ఇండియా వాణిజ్య చర్చల్లో ఈ అంశం ఎందుకంత కీలకం
- ముంబయి కాటన్ మిల్లుల నుంచి అండర్ వరల్డ్ డాన్లు ఎలా పుట్టుకొచ్చారు?
- విడిపోతున్నాం... హీరో ధనుష్, ఐశ్వర్య ప్రకటన
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- అగ్నిపర్వతం బద్దలవడంతో బూడిదమయమైన టోంగా - అమెరికా తీరాన్ని తాకిన సునామీ అలలు
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












