గ్రీన్ గోల్డ్: ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి

అవకాడో
    • రచయిత, ఇమ్మానుయేల్ ఇగుంజా
    • హోదా, బీబీసీ న్యూస్, సెంట్రల్ కెన్యా

కెన్యాలో అవకాడో సాగు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతో వీటిని సాగుచేసే వారిని క్రిమినల్ గ్యాంగ్‌లు లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

ఇక్కడ ఒక చెట్టు నుంచి వచ్చే పండ్లతో ఒక పదో తరగతి విద్యార్థి ఏడాదిపాటు ప్రైవేటు స్కూళ్లో హాయిగా చదువు పూర్తిచేయొచ్చు. అంటే దాదాపు ఒక చెట్టు నుంచి రూ.44,550 (600 డాలర్లు) వరకు లాభం వస్తుంది.

అమెరికా, ఐరోపాలలో ఈ పండ్లకు డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో ఆఫ్రికా నుంచి వీటిని అత్యధికంగా ఎగుమతి చేసే దక్షిణాఫ్రికా స్థానాన్ని గత ఏడాది కెన్యా భర్తీ చేసింది.

‘‘పచ్చ బంగారం (గ్రీన్ గోల్డ్)’’గా పిలుస్తున్న ఈ పంటను రక్షించుకునేందుకు కొన్నిచోట్ల అవకాడో రక్షణ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.

మురంగా కౌంటీలోని ఓ పొలంలో రాత్రి అవుతూనే ఆరుగురు వ్యక్తులు రెయిన్ కోట్లు వేసుకొని చేతిలో టార్చిలైట్లు, కత్తులు పట్టుకుని తమ పనిని మొదలుపెడుతూ కనిపించారు.

విలువైన అవకాడోలు దొంగల చేతికి చిక్కకుండా కాపుకాయడమే వీరి పని.

అవకాడో

‘‘అయితే వారో, మేమో తేల్చుకోవాలి. మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మేమే చూసుకోవాలి’’అని వారిలో ఒకరు బీబీసీతో చెప్పారు. ఇటీవల ఘర్షణలో ఓ అవకాడో దొంగ మరణించాడని ఆయన వివరించారు.

ఇలా కాపుకాయకపోతే అవకాడోలు దొంగల పాలు అవుతాయని ఆ పొలం యజమాని చెప్పారు.

‘‘పొలం మొత్తానికి కంచె వేయొచ్చు. అయినా మనం దొంగల్ని ఆపలేం’’అని ఆయన అన్నారు. కంచెను దొంగలు ఎలా కత్తిరించారో ఆయన చూపించారు.

‘‘మొదట్నుంచీ కాపాడుకున్న పంటను ఒక రోజు రాత్రి కొన్ని గంటల్లోనే దొంగలు ఎత్తుకెళ్తే ఎలా?’’అని ఆయన ప్రశ్నించారు.

‘‘చాలా మంది ఇలా కంచెలను కత్తిరించి పండ్లను ఎత్తుకెళ్తుంటారు’’అని కంచెను బాగుచేస్తున్న ఓ వ్యక్తి వివరించారు.

‘‘చాలామందికి అవకాడో వ్యాపారమే ఆధారం. ఈ పంట కోసం చాలామంది పనిచేస్తారు. కొంతమంది సొంతంగా కొన్ని చెట్లను పెంచుకుంటుంటారు. ఇలా పండ్లను దొంగలు ఎత్తుకెళ్తే రైతులు ఎలా మనుగడ సాగించగలరు?’’అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘మేం నిద్రపోతే, మా అమ్మానాన్నలకు ఒక్క రూపాయి కూడా మిగలదు.’’

తెల్లవారుజామున సూర్యుడు కనిపించడంతో వీరు పని ముగించుకుని ఇంటికి వెళ్తారు.

అవకాడో

ఫొటో సోర్స్, Getty Images

అవకాడోలు కెన్యాలో ఫిబ్రవరి నుంచి అక్టోబరు మధ్యలో కోతకు వస్తాయి. అయితే, ఇదే సమయంలో దొంగతనాలు కూడా పెరుగుతుంటాయి.

బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకునేందుకు నవంబరు నుంచి జనవరి చివరి వరకు అవకాడోలను ఎగుమతి చేయకుండా అధికారులు ఇక్కడ ఆంక్షలు విధించారు.

అయితే, క్షేత్ర స్థాయిలో ఈ ఆంక్షల ప్రభావం చాలా తక్కువ. దొంగల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు మురంగ్‌లో చాలా మంది ముందుగానే అవకాడోలను కోసేస్తున్నారు.

అలా చెట్లకు ఉంచితే, దొంగల ముప్పు రోజురోజుకీ పెరుగుతుంది.

అవకాడో

ఫొటో సోర్స్, Getty Images

డ్రోన్లతో పహారా

మెరూ కౌంటీలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. యూరోపియన్ వ్యాపారులు వచ్చినప్పుడే, మేము కూడా అక్కడకు వెళ్లాం.

ఇక్కడ కినుయువా బురుగు లాంటి రైతులు ముందుగానే పంట కోసి అమ్ముకునేందుకు వీలుంది.

దీంతో ఒక్కరోజే వేలకొద్దీ ఎకరాల్లో అవకాడోలను కోసి.. ఒక్కో పండును రూ.12 (0.17 డాలర్లు) చొప్పున విక్రయించారు.

ఈ అవకాడోలు ఎలా ఉన్నాయో స్థానిక కేంద్రాల్లో పరిశీలిస్తారు. ఎందుకంటే మరీ ముందుగానే కోసెస్తే, ఇవి ఎప్పటికీ పండవు.

దొంగల నుంచి కాపాడుకునేందుకే బురుగు చాలా తొందరగా పంటను కోసేశారు.

అయితే, భవిష్యత్‌లో కంప్యూటర్ సాయంతో దొంగలకు చెక్‌పెట్టాలని ఆయన భావిస్తున్నారు. స్థానిక అవకాడో సహకార సంఘం నుంచి ఆయన కంప్యూటర్‌ను కొనుగోలు చేశారు.

కంప్యూటర్‌ను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించి తన పది ఎకరాల పొలంలో పటిష్ఠమైన పహారా వ్యవస్థ ఏర్పాటుచేయాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.

తను ఉంటున్న ఇంట్లో నుంచే టెక్నాలజీ సాయంతో ఆయన పొలాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు.

‘‘పొలం చుట్టూ డ్రోన్లు ఎగురవేస్తూ 24 గంటలు పహారా కాయాలని మా అబ్బాయి అంటున్నాడు’’అని బురుగు వివరించారు.

అవకాడో

ఫొటో సోర్స్, Getty Images

మూకదాడుల ముప్పు

మేం మాట్లాడుతుండగానే, ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మెరు నగరంలో ఓ ఇల్లును అద్దెకు తీసుకొని అవకాడో దొంగతనాలు చేస్తున్న ముఠాను పట్టుకున్నామని అవకాడో రక్షకులు ఆయనకు చెప్పారు.

దొంగతనం చేసిన అవకాడోలు ఆ ఇంటిలో చాలా కనిపించాయని భద్రతా విభాగంలో పనిచేస్తున్న జూలియస్ కినోటి తెలిపారు.

‘‘వారు పోలీసుల్ని అప్రమత్తం చేశారు. అయితే, ఈ విషయంలో అధికారులు చేయాల్సి చాలావుంది. లేదంటే వారు చట్టాలను చేతుల్లోకి తీసుకునే అవకాశముంది.’’

‘‘ఆ రోజు రాత్రి మేం దొంగలను పట్టుకున్నాం. ఆ సమయంలో ప్రజలకు ఆ విషయం తెలిస్తే.. అక్కడే మూక దాడి జరిగేది. ఎందుకంటే ప్రజలు చాలా ఆగ్రహంతో ఉంటారు.’’

కెన్యాలో అవకాడో వాణిజ్యం ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ఇప్పుడిప్పుడే చాలా మంది దీనిలో పెట్టుబడులు పెడుతున్నారు.

గత ఏడాది కెన్యా రైతులు రూ.980 కోట్లు (132 మిలియన్ డాలర్ల) విలువైన పండ్లను ఎగుమతి చేశారు. ఇక్కడ పండించిన మొత్తం పండ్లలో ఇది పది శాతం వరకు ఉంది.

‘‘నాణ్యత బాగా ఉండేలా చూసుకుంటే.. పెరూ, బ్రెజిల్ లాంటి దేశాలతో మేం పోటీపడొచ్చు’’అని బురుగు అన్నారు.

‘‘వచ్చే ఐదేళ్లలో.. చాలా మంది తేయాకు పంట నుంచి అవకాడో వైపు వచ్చేస్తారు. ఎందుకంటే వాటితోనే భవిష్యత్ ఉంది.’’

కొన్నేళ్ల క్రితమే ఆయన తేయాకు నుంచి అవకాడో సాగు వైపు వచ్చేశారు. ఈ విషయంలో ఆయన ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదు. దొంగల ముఠాల నుంచి కూడా తమ పొలాన్ని రక్షించుకోగలని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)