Urban Mining: నాణ్యమైన బంగారు గనుల్లో కంటే మిన్నగా.. టన్ను మొబైల్ వ్యర్థాల్లో 300 రెట్లు బంగారం...

ఫొటో సోర్స్, Rotor
మనం భూగ్రహం పైనుంచి ఒకే ఏడాదిలో 100 బిలియన్ టన్నుల ముడి పదార్థాలను వెలికి తీస్తున్నాం. అంటే ఇది 12 నెలల కాలంలో ఎవరెస్ట్ పర్వత ద్రవ్యరాశిని మూడింట రెండొంతుల భాగం నాశనం చేయడంతో సమానం.
మనం సేకరించే ముడిపదార్థాల్లో దాదాపు సగభాగం ప్రపంచ నిర్మాణ రంగంలోకే వెళ్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం వ్యర్థాలలో మూడో వంతు, కర్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో కనీసం 40 శాతం నిర్మాణ రంగం నుంచే వెలువడుతున్నట్లు అంచనా. విమానయానం వల్ల కలిగే 2-3 శాతం ఉద్గారాలతో పోలిస్తే దీని శాతం గణనీయంగా ఎక్కువ.
ఈ ముడి పదార్థాల వినియోగం వల్ల భారీ పరిమాణంలో వ్యర్థాలు ఏర్పడతాయి. ఈ వ్యర్థాలు వల్ల ఏర్పడిన పర్యావరణ పరిస్థితులు ఆంత్రోపోసీన్ తరహాలో ఒక కొత్త యుగం ఏర్పడటానికి దోహదపడ్డాయి. భవిష్యత్ పురాతత్వ శాస్త్రవేత్తలు, మనం ఎలా జీవించామో తెలుసుకునేందుకు ఈ రాళ్ల పొరలను తవ్వుతారు.
ఈరోజు మనం ఉత్పత్తి చేసి నాశనం చేసే ఈ వ్యర్థాల్లో కూడా మనకు ప్రయోజనం కలిగించే, మనం ఉపయోగించగలిగే పదార్థాలు ఉంటాయి.
ఒక టన్ను నాణ్యమైన బంగారు ధాతువు కంటే కూడా ఒక టన్ను మొబైల్ ఫోన్లలో 300 రెట్లు ఎక్కువ బంగారం ఉంటుందని లెక్కించారు. అలాగే గణనీయమైన పరిమాణంలో వెండి, ప్లాటినం, పల్లాడియంలు కూడా ఉంటాయని తెలుసుకున్నారు.
కానీ వీటిని పొందడం కోసం మనం భూమిని తవ్వుతున్నాం.
ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ కేబుళ్లలో విస్తారంగా ఉన్న రాగి పరిమాణం అనేది పునర్వినియోగానికి పనికి వచ్చే లోహానికి మూలం. ప్రకృతిలో కేవలం ఒక శాతంగా ఉన్న టాప్ గ్రేడ్ ధాతువు కంటే కూడా కేబుళ్లలో ఉన్న రాగి పరిమాణం ఎక్కువ.
ఇదంతా చూస్తుంటే, ముడి పదార్థాల కోసం భూమిని తవ్వడం మానేసి, ఇప్పటికే సేకరించిన పదార్థాల నుంచి వాటిని ఎందుకు సంగ్రహించకూడదు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఈ ఆలోచనే, ఇప్పటికే నిర్మాణ రంగంలో కాంక్రీటు, చెక్క, లోహాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వ్యర్థాల్లో దాగి ఉన్న భారీ శ్రేణి మెటీరియల్‌ను తిరిగి ఎలా ఉపయోగించాలో తెలుసుకునేందుకు ఆర్కిటెక్టులు, నిర్మాణ సంస్థలను ప్రోత్సహించింది.

ఫొటో సోర్స్, Folke Kobberling/Martin Kaltwasser
2005లో రోటర్‌డ్యామ్‌కు చెందిన 'సూపర్‌యూజ్' అనే నిర్మాణ సంస్థ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 'వెల్‌పెలూ' అనే విల్లాను పూర్తి చేసి నిర్మాణ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. 'వెల్‌పెలూ' అనేది ప్రపంచంలోనే తొలిసారిగా అత్యధిక భాగం నిర్మాణ రంగ వ్యర్థాలతో తయారు చేసిన ఇల్లు. పాత టెక్స్‌టైల్స్ మెషినరీ నుంచి స్టీల్‌ను, పాడైన పారిశ్రామిక కేబుల్స్ రీల్స్ నుంచి టింబర్, ఇలా 60శాతం సెకండ్ హ్యాండ్ మెటీరియల్‌ను ఉపయోగించి ఆ ఇల్లును నిర్మించారు.
2013లో యూకే ఆర్కిటెక్ట్ డంకన్ బేకర్ బ్రౌన్, సూపర్ యూజ్ రికార్డును అధిగమించారు. ఆయన 90 శాతం వ్యర్థాలను ఉపయోగించి బ్రిగ్టన్ వేస్ట్ హౌస్‌ను నిర్మించారు.
ఆయన గోడల్లో విద్యుత్ బంధనం కోసం డెనిమ్, ప్లాస్టిక్ డీవీడీ కేసులు, పాడైన టూత్ బ్రష్‌ల సమ్మేళనాలను ఉపయోగించారు. ఫ్లోర్ కోసం పాత సైకిళ్లలోని ట్యూబులని వినియోగించారు. గోడల నిర్మాణంలో దాదాపు 10 టన్నుల సుద్దపొడిని వాడారు. కార్యాలయాల్లో ఉపయోగించిన టైల్స్‌ను అలంకరణ కోసం వినియోగించారు.
''వేస్ట్ హౌస్ అనేది రీసెర్చ్ ప్రాజెక్టులకు ప్రత్యక్ష ఉదాహరణ. మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా ముగుస్తోంది? అని ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ఇది చేస్తుంది'' అని బేకర్ బ్రౌన్ అన్నారు. 2017లో రాసిన 'రీ యూజ్ అట్లాస్' అనే పుస్తకంలో ఆయన వ్యర్థాల నిర్మాణానికి కొత్త బ్లూ ప్రింట్‌ను రూపొందించారు. అందులోని సూత్రాలను బ్రిగ్‌టన్ ఆర్చిటెక్చర్ యూనివర్సిటీలో చదువుతోన్న కొత్త తరం ఆర్కిటెక్టులు, బిల్డర్లకు నేర్పిస్తున్నారు. వ్యర్థాలకు ఆయన సులువైన, శక్తిమంతమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ''తప్పుడు స్థలంలో ఉన్న ఉపయోగకరమైన వస్తువులు' అని వ్యర్థాలను వర్ణించారు.
మెటీరియల్ కోసం కొత్తగా తవ్వకాలు చేపట్టడం కంటే, ఇప్పటికే మానవ రూపకల్పనలతో వ్యర్థాలుగా మారిన వాటి నుంచి వీటిని వెలికితీయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
''మనం 'అర్బన్ మైనర్లు'గా మారాలి. గతంలో నిర్మించిన భవనాలు, నిర్మాణాల్లోని సామగ్రిని తిరిగి ఉపయోగించేలా కృషి చేయాలి'' అని 2019లో రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రిటీష్ ఆర్కిటెక్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన కార్యాచరణకు ఆయనే పిలుపునిచ్చారు.
ప్రస్తుతం బేకర్ బ్రౌన్.. యుకేలోని ససెక్స్‌లో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'గ్లైండ్‌బోర్న్ ఒపెరా' కోసం పెవిలియన్ నిర్మించే పనిలో ఉన్నారు. ఆయ్‌స్టర్ షెల్స్, షాంపెన్ కార్క్‌లు, ఇటుక బట్టీల్లో లభించిన వ్యర్థ ఉత్పత్తులతో దీన్ని నిర్మిస్తున్నారు.
'భవిష్యత్ కోసం మెటీరియల్ భద్రపరచడం' అనే కాన్సెప్ట్‌తో పని చేస్తోన్న బేకర్ ఈ నిర్మాణంలో జిగురును ఉపయోగించకుండా బోల్ట్‌లను వాడుతున్నారు. భవిష్యత్‌లో పునర్నిర్మాణాన్ని సులభతరం చేసేందుకు ఆయన ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.
పునర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా భవనాలను రూపొందించాలనే ఆలోచన 'డిజైన ఫర్ డి కన్‌స్ట్రక్షన్' అనే ప్రక్రియకు ఊతమిచ్చింది.
2012 ఒలింపిక్స్‌లో ఈ ఆలోచనలు అమల్లోకి వచ్చాయి. లండన్‌లో 17000 మంది అథ్లెట్ల కోసం తాత్కాలిక వసతులు ఏర్పాటు చేయడానికి ఈ పద్ధతిని అనుసరించారు.
ఒలింపిక్స్ తర్వాత స్థానికులు స్థిరమైన ఇళ్లుగా మార్చుకునేందుకు వీలుగా ఈ వసతి భవనాలను నిర్మించారు. ఇందులో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేలా మెట్లతో కూడిన గోడలను కూడా నిర్మించడం విశేషం.
భవిష్యత్‌లో ఉపయోగించడానికి వీలులేని, పునర్నిర్మాణానికి అనువుగా లేకుండా నిర్మించిన కట్టడాల నుంచి మెటీరియల్‌ను సంగ్రహించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే డచ్ సంస్థ 'మౌరర్ యునైటెడ్ ఆర్కిటెక్ట్స్' ఈ సవాలును స్వీకరించింది.
డచ్ పట్టణానికి చెందిన 'కెర్కేడ్ సూపర్ లోకల్ ఎస్టేట్'లోని పాత ఫ్లాట్ల నుంచి రీసైకిల్ చేసిన 90శాతం వస్తువులను ఉపయోగించి 125 కొత్త సోషల్ హౌసింగ్ యూనిట్లను మౌరర్ సంస్థ నిర్మించింది.
పాత భవనాల్లోని కాంక్రీట్ ఫ్లోర్‌ను కత్తిరించి, దాన్ని కొత్త ఇళ్ల నిర్మాణంలో ఫ్రేమ్‌వర్క్‌గా ఉపయోగించారు. మిగిలిపోయిన కాంక్రీట్‌ను పునర్వినియోగం కోసం భద్రపరిచారు. ఈ విధానాన్ని 'తెలివిగా విధ్వంసం చేయడం' అని ఆ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ మౌరర్ అన్నారు.

ఫొటో సోర్స్, Duncan Baker-Brown
'ఆంత్రోపోసీన్ మైనింగ్' విజయవంతం కావాలంటే... ఇప్పటికే అందుబాటులో ఉన్న పదార్థాలను అనేక రూపాల్లో తిరిగి ఉపయోగించుకునే మార్గాలను రూపొందించడం కీలకం.
ఇలా మెటీరియల్‌ను తిరిగి ఉపయోగించుకునే మార్గాలను కనిపెట్టడానికి జర్మనీలోని బ్రౌన్స్‌విగ్ టెక్నికల్ యూనివర్సిటీకి చెందిన ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ ఫోల్కే కోబెర్లింగ్ సంవత్సరాల పాటు కృషి చేశారు.
'పాత భవనాల నుంచి సేకరించిన మెటీరియల్‌ను ఉపయోగించడం అనేది కొత్త మెటీరియల్‌తో పనిచేయడానికి భిన్నంగా ఉంటుంది'' అని ఫోల్కే చెప్పారు.
యూకేలోని కేంబ్రిడ్జి వెలుపల ఉన్న వైసింగ్ ఆర్ట్స్ సెంటర్ వేదికగా 2008లో ఫోల్కే, ఆమె సహోద్యోగి మార్టిన్ కాల్ట్‌వాసర్ నిర్మించిన 'ఆంఫీథియేటర్' ఇందుకు ఒక మంచి ఉదాహరణ.
ఇందులో ప్రధానంగా 400 చెక్క ప్యాలెట్లను వినియోగించారు. స్థానిక నిర్మాణ ప్రాంతాల నుంచి వీటిని సేకరించారు. పాత గాజు ఇళ్ల నుంచి సేకరించిన అద్దాలతో కిటికీలు రూపొందించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ అల్మారాల నుంచి సేకరించిన టేకుతో ఫ్లోర్‌ను నిర్మించారు. రెండేళ్ల పాటు విలక్షణమైన కళలకు వేదికగా ఉండాలనే ఉద్దేశంతో కేవలం 5000 యూరోల (రూ. 4.25 లక్షలు) వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పటికీ అది దృఢంగా ఉంది.
గొర్రెల ఉన్ని, గోడల్లో అద్భుతమైన విద్యుత్ బంధనంగా, కాలుష్య నిరోధకంగా పనిచేస్తుందని ఫోల్కే కనుగొన్నారు. బెర్లిన్ మారథాన్‌లో ఉపయోగించిన వేలాది ప్లాస్టిక్ బాటిల్స్, కప్‌లను బస్టాండ్ పైకప్పు నిర్మాణంలో ప్రధాన మెటీరియల్‌గా ఉపయోగించారు.
వ్యర్థాలను, కొత్త నిర్మాణ సామగ్రిగా తిరిగి ఉపయోగించడంలో కీలకమైన అంశం ఏంటంటే... డిమాండ్ ఉన్నచోటికి వీటిని సరఫరా చేయడం.
''కొత్త వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా కాకుండా, అందుబాటులో ఉన్న మెటీరియల్‌ను సరిగ్గా నిర్వహించుకోవడం కోసం కొత్త మార్గాలను కనుగొనాలి'' అని బ్రసెల్‌కు చెందిన డిజైన్ సంస్థ 'రోటర్' సహ వ్యవస్థాపకులు మైఖేల్ గైట్ అన్నారు. వ్యర్థాల పునర్వినియోగాన్ని భవన రంగం ప్రొఫెషనల్స్ సులభంగా ఉపయోగించేలా కృషి చేస్తోన్న సంస్థల్లో రోటర్ కూడా ఒకటి.
ఈయూ నిధుల సమకూరుస్తోన్న ప్రాజెక్ట్‌లో భాగంగా ఆన్‌లైన్ డైరెక్టరీని రూపొందించడానికి రోటరీ సంస్థ యూరప్‌లోని ఇతర నిర్మాణ సంస్థలతో జతకట్టింది. ఇది ఇప్పటివరకు 1000కి పైగా సంస్థలతో చేతులు కలిపింది.
కూల్చివేయడానికి ఉద్దేశించిన భవనాల్లో ఉన్న మెటీరియల్, ఉత్పత్తుల సామర్థ్యాలను అంచనా వేయడానికి టూల్‌కిట్‌ను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది.

ఫొటో సోర్స్, Sam Panthaky/Getty Images
ఆంత్రోపోసిన్ మైనింగ్ అమల్లో ఉందనడానికి మరో ఉదాహరణ పారిస్‌కు చెందిన బెల్లాస్టాక్ అనే కంపెనీ 59 అంతస్థుల మాంట్‌పర్నాసే అనే టవర్‌ను పునర్నిర్మించడం.
ఇందులో భవనాల ఇంటీరియర్ నుంచి సేకరించిన కాంక్రీట్, గాజు, ఉక్కును కొత్త నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. 2024 పారిస్ ఒలింపిక్స్ నాటికి ఈ టవర్ నిర్మాణాన్న పూర్తిచేయనున్నారు.
''ఆచరణాత్మక అడ్డంకుల కంటే కూడా భవన రంగంలో స్థిరపడిపోయిన వైఖరుల కారణంగానే వస్తువుల పునర్వినియోగం అమలులో ఇబ్బందులను ఎదుర్కొంటుంది'' అని బెల్లాస్టాక్ టెక్నికల్ డైరెక్టర్, మాంట్‌పర్నాసే ప్రాజెక్ట్ మేనేజర్ మతిల్దే బిల్లేట్ అన్నారు.
''మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడమే అత్యంత కష్టమైన అంశం. అవగాహన కల్పించడం, శిక్షణ, సమావేశాలు నిర్వహించడం ద్వారా ఈ భయాన్ని చాలా వరకు తొలగించవచ్చు. నగరాన్ని మనం ఒక మెటీరియల్ బ్యాంకుగా ఊహించుకోవాలి. దాన్ని తిరిగి ఉపయోగించుకోవాలి. దీని కోసం గణనీయమైన మార్పులు చేయాల్సిన పని లేదు. కేవలం కొంచెం చురుకుదనం, సంకల్పం అవసరం'' అని ఆమె అన్నారు.
ఇప్పటికే ఉన్న మెటీరియల్‌ను తిరిగి వినియోగానికి సిద్ధం చేసే ప్రక్రియ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని గైట్ అభిప్రాయపడ్డారు.
''ఈ పని చాలా శ్రమతో కూడుకున్నది. మార్బుల్ స్లాబ్‌లను శుభ్రం చేయడం, టైల్స్ నుంచి సిమెంట్, మట్టిని తొలిగించడం, పాత విద్యుత్ ఉపకరణాల నుంచి వైర్‌లను సేకరించడం, సేకరించిన పదార్థాలను డాక్యుమెంట్‌గా చేయడం ఇలా చాలా పనులు చేయాల్సి ఉంటుంది'' అని గైట్ అన్నారు.
ఐదు ఈయూ దేశాలపై 2020లో క్లబ్ ఆఫ్ రోమ్ చేసిన విశ్లేషణలో... ''సర్క్యులర్ ఎకానమీకి మారడం ద్వారా కర్బన ఉద్గారాలను మూడింట రెండొంతుల వరకు తగ్గిస్తుంది. అదే సమయంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను అందిస్తుంది'' అని తేలింది.
భూమి నుంచి బిలియన్ టన్నుల కొద్ది ముడి పదార్థాన్ని వెలికితీయడం ఇంకా కొనసాగిస్తే నిజంగా మనకు అర్థిక వ్యవస్థపై పట్టింపు, పర్యావరణంపై స్పృహ లేనట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 5,500 కోట్ల పరిహారం ఇచ్చి ఆరో భార్యతో విడాకులు
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- పన్ను ఎగ్గొట్టిన లైవ్ స్ట్రీమర్‌కు రూ.1600 కోట్ల జరిమానా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- హంసా నందినికి క్యాన్సర్ : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా..
- ఒమిక్రాన్: 'జీవితం కోల్పోవడం కంటే... ఒక ఈవెంట్ రద్దు చేసుకోవడం మంచిది': డబ్ల్యూహెచ్ఓ చీఫ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













