పాకిస్తాన్‌: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు

ఆలయంలో దాడి

పాకిస్తాన్‌ సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలోని నాయారణపురా ప్రాంతంలో ఒక యువకుడు ఆలయంలో విధ్వంసం సృష్టించాడు. స్థానికులు అయన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. ముకేశ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తన భార్య జోగ్ మాయా ఆలయంలో పూజ చేయడానికి వెళ్లినపుడు, రాత్రి 7.45కు ఒక వ్యక్తి హఠాత్తుగా లోపలికి వచ్చారని, సమ్మెటతో అక్కడ ఉన్న జోగ్ మాయా విగ్రహాన్ని ముక్కలు చేయడం ప్రారంభించారని ముకేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు.

‘‘ఆ వ్యక్తి దేవతా విగ్రహాన్ని ముక్కలు చేస్తుండడంతో నా భార్య గట్టిగట్టిగా కేకలు వేశారు. ఆ కేకలు విని ఆలయం దగ్గరకు చేరుకున్న జనం విగ్రహాన్ని సమ్మెటతో కొడుతున్న వ్యక్తిని పట్టుకున్నారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనపై దైవదూషణ కేసు నమోదు చేశారు’’ అని ముకేశ్ కుమార్ చెప్పారు.

ఆలయంలో దాడి

"స్థానికులు ఆ యవకుడిని కొట్టబోయేలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు" అని పోలీసు అధికారులు చెప్పారు.

"భవనాల గోడలు కూల్చేందుకు ఉపయోగించే ఒక పెద్ద సమ్మెట తీసుకుని పోలీస్ స్టేషన్ చేరుకున్న స్థానికులు అక్కడ తమ నిరసన తెలిపారు. న్యాయం చేస్తామని పోలీసు అధికారులు వారికి చెప్పడంతో నిరసన విరమించారు" అని కరాచీలోని బీబీసీ ప్రతినిధి నిగార్ రియాజ్ సుహైల్ చెప్పారు.

ప్రస్తుతం ఆలయంలో విధ్వంసం సృష్టించిన 25 ఏళ్ల యువకుడి వీడియో కూడా బయటకొచ్చింది. అందులో జనం ఆయన్ను చుట్టుముట్టి ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తున్నారు.

ఆ యువకుడు నిరుద్యోగి అని, ఆయన మానసిక స్థితి కూడా బాగానే ఉందని పోలీసులు చెప్పారు. విగ్రహ ధ్వంసంపై ఆ యువకుడిని ప్రశ్నించగా ‘‘నేను దైవ కార్యంలో ఉన్నాను’’ అని సమాధానం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని ఆలయంపై దాడి, భయంతో తరలిపోతున్న హిందువులు

పాకిస్తాన్‌లో హిందూ ఆలయాలపై దాడులు

కరాచీలో హిందూ ఆలయంలో విధ్వంసం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్‌లోనూ కరాచీలోని లీ మార్కెట్ దగ్గర శీతల్ దాస్ ప్రాంగణంలో ఉన్న ఒక ఆలయంపై కొంతమంది దాడి చేశారు. వారిపైనా దైవదూషణ కేసు నమోదు చేశారు.

గత ఏడాది జులైలో పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీమ్‌యార్ ఖాన్‌ నగరంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అందులో ఒక గుంపు భోంగ్ ప్రాంతంలో ఉన్న ఒక ఆలయంపై దాడి చేసింది.

దుండగులు ఆ ఆలయంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. అక్కడ ప్రతిష్టించిన విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ కూడా జోక్యం చేసుకున్నారు. పోలీసులు దాదాపు 50 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు.

అలాగే ఖైబర్ ఫంఖ్తుంఖ్వా కరక్ జిల్లాలో కూడా గత ఏడాది డిసెంబర్‌లో ఒక ఆలయంపై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అక్కడున్న ఒక సమాధి, ఆలయ నిర్మాణ పనులకు వ్యతిరేకంగా కొందరు దాడులు చేశారు. పనులను కూడా అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆలయానికి తీవ్రంగా దెబ్బతింది.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌‌లోని ఏకైక చాముండ మాత దేవాలయం

ఇటీవలి ఘటనలన్నీ మైనారిటీ సమాజాల్లో భయాందోళనలకు కారణమయ్యాయని... ఇవి పాకిస్తాన్‌లోని మత సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని ఆ దేశ జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ చెలారామ్ కేవ్లానీ అన్నారు.

"ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి శిక్షలు విధించేవరకూ ఇలాంటివాటికి అడ్డుకట్ట పడదు’’ అని కేవ్లానీ ఒక ప్రకటనలో చెప్పారు.

ఆలయాల్లో విధ్వంస ఘటనలపై ముస్లిం లీగ్(నవాజ్) ఎంపీ ఖేల్ దాస్ కోహ్‌స్తానీ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.

"ఆలయాలపై దాడులు చేయడం వల్ల వాళ్లకు ఏం వస్తుందో తెలీడం లేదు. ఏ మతమూ ఇలాంటివి అనుమతించదు" అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)