పాకిస్తాన్: ఈ పక్షి మాంసం కామోద్దీపన కలిగిస్తుందా? అరబ్ షేక్‌లు దీన్ని వేటాడేందుకు పాకిస్తాన్ వస్తున్నారా, మరి నజీమ్‌ను ఎవరు చంపారు

BBC
ఫొటో క్యాప్షన్, BBC
    • రచయిత, సహర్ బలోచ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"తప్పు చేసినవారే క్షమాపణలు అడగాలి. నేను ఏ తప్పూ చేయలేదు. నాకేదైనా జరిగితే, దానికి నన్ను బెదిరిస్తున్నవారే బాధ్యులు" అంటూ పాకిస్తాన్‌కు చెందిన 27 ఏళ్ల నజీమ్ జోఖియో వీడియో రికార్డ్ చేసి తాను చనిపోవడానికి ఒక రోజు ముందు దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి కారణాలను కూడా నజీమ్ ఆ వీడియోలోనే వివరించారు.

బలూచిస్తాన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో తల్లూర్ (హూబారా బస్టర్డ్ పక్షి) వేట విషయమై అరబ్ షేక్‌ల మనుషులతో గొడవ జరిగిందని, విషయం పెద్దదై కొట్లాట వరకు వెళ్లిందని చెప్పారు.

నజీమ్‌తో గొడవపడ్డవాళ్లు ఒక అరబ్ షేక్ కాన్వాయ్‌లోని వ్యక్తులు. వీరు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రాంతీయ అసెంబ్లీ సభ్యుడు జామ్ ఒవైస్ అతిథులుగా వచ్చారు.

గొడవ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు నజీమ్ సోదరుడు అఫ్జల్ జోఖియో.. నజీమ్‌ను విదేశీ అతిథిలున్న జమీందార్ల ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు.

"నిన్ను ఒకటో రెండో చెంపదెబ్బలు కొడితే మౌనంగా భరించు. క్షమాపణలు అడుగు" అని నజీమ్‌కు నచ్చజెప్పారు.

"ఫాంహౌస్‌కు వెళ్లిన తరువాత నజీమ్‌ను అక్కడే వదిలిపెట్టి పొద్దున్న రమ్మని చెప్పి అక్కడున్నవారు నన్ను వెనక్కు పంపించేశారు. మర్నాడు ఉదయం నేను వెళ్లేసరికి మీ సోదరుడు మరణించాడని చెప్పారు. ఏం జరుగుతోందో నాకేం అర్థం కాలేదు" అన్నారు అఫ్జల్.

కొద్దిసేపటి తరువాత ఆ ఫామ్‌హౌస్‌ నుంచి నజీమ్‌ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నజీమ్ హత్య కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. సింధ్ ప్రాంతంలో ఈ హత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

అరబ్ దేశాల సంస్కృతిలో తల్లుర్ వేటకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అరబ్ దేశాల సంస్కృతిలో తల్లుర్ వేటకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

తల్లూర్ వేటకు ఎందుకంత ప్రాధాన్యం?

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో తల్లూర్ వేటకు అరబ్ రాచకుటుంబాలు వస్తుంటాయి. 1980, 90లలో ఇలా వేటకు వచ్చిన వారిపై బలూచ్ వేర్పాటువాదులు దాడులు చేసేవారు.

కానీ, తల్లూర్ వేటను పూర్తిగా నిషేధించాలని సింధ్ ప్రాంత ప్రజలు నిరసనలు దిగడం ఇదే తొలిసారి.

తల్లూర్ వేటకు వచ్చే అరబ్‌లను పాకిస్తాన్ విదేశాంగ విధానం అనుమతిస్తుంది.

గతంలో పలుమార్లు ఈ పక్షుల వేటను నిషేధించాలని డిమాండ్లు వచ్చినప్పటికీ పాకిస్తాన్ విధానంలో మార్పు రాలేదు.

నజీమ్ కుటుంబీకులు

"పాకిస్తాన్ దీన్ని ఒక క్రీడగా, అభిరుచిగా ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అయితే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే రాజకుటుంబ సభ్యులను నైట్ క్లబ్బులకు తీసుకెళతారు. అలాంటి ఏర్పాటు మాకు లేదు" అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని పాకిస్తాన్ మాజీ రాయబారి బీబీసీకి తెలిపారు.

"ఇది అరబ్ సంస్కృతిలో ఒక భాగం. అంతేకాకుండా, అరబ్ దేశాలకు, పాకిస్తాన్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగించడానికి ఇదొక మంచి మార్గం. అందుకే తల్లూర్ వేటకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు" అన్నారు.

"సింధ్, బలూచిస్తాన్‌లలో వేట కోసం ప్రత్యేకంగా మైదానాలను కేటాయించడం ఎప్పుడూ ఒక సమస్యగా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం. తమ అతిధులకు అన్ని రకాల సౌకర్యాలూ కల్పించాలని పాకిస్తాన్ ఎల్లప్పుడూ ప్రయతిస్తునే ఉంది" అని చెప్తూ తన పేరును అజ్ఞాతంగా ఉంచాలని ఆ రాయబారి కోరారు.

గల్ఫ్ దేశాలతో సంబంధాలకు పాకిస్తాన్‌తో సహా పలు దేశాలు ప్రాధాన్యం ఇస్తాయి. ఇందుకు ఉదాహరణగా జర్నలిస్ట్ స్టీవ్ కోల్ తన పుస్తకం 'ఘోస్ట్ వార్స్'లో వివరించిన ఒక ఉదంతాన్ని చెప్పుకోవచ్చు.

"1999 ఫిబ్రవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి చెందిన ఒక అరబ్ షేక్ తల్లూర్ వేట కోసం తన కాన్వాయ్‌తో సహా దక్షిణ అఫ్గానిస్తాన్ చేరుకున్నారు.

అయితే ఈ కాన్వాయ్‌లో మోస్ట్ వాంటెడ్ అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కూడా ఉన్నారని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కు సమాచారం అందింది.

క్రూయిజ్ క్షిపణులతో ఒసామా బిన్ లాడెన్‌ను చంపాలని ఏజెన్సీ ప్లాన్ చేసింది. కానీ కాన్వాయ్‌లో అరబ్ షేక్ ఉన్నందువల్ల ఈ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

అంటే దౌత్య సంబంధాలకు హాని కలగకుండా ఉండాలని అమెరికా తన మోస్ట్ వాంటెడ్ టార్గెట్‌ను కూడా వదులుకుంది. వీరి శిబిరాలపై మిసైల్ వదిలితే, అమెరికాకు గల్ఫ్ దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి"

తల్లూర్ (హౌబారా బస్టర్డ్ పక్షి)

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తల్లూర్ (హౌబారా బస్టర్డ్ పక్షి)

అరబ్ సంస్కృతిలో భాగం

అరబ్ దేశాల సంస్కృతిలో తల్లుర్ వేటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మధ్యప్రాచ్యంలోని రాచకుటుంబాలు తల్లూర్ వేటను ఒక క్రీడగా, అభిరుచిగా పరిగణిస్తాయి.

ఈ పక్షి మాంసం కామోద్దీపన కలుగజేస్తుందని వారి నమ్మకం.

ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ దేశాల నుంచి వచ్చే అరబ్ షేక్‌లకు తమ అభిరుచిని కొనసాగించేందుకు పాకిస్తాన్ ప్రతి సంవత్సరం అనుమతులు జారీ చేస్తుంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో అబుదాబీ నుంచి వచ్చిన 11 మంది రాచకుటుంబ సభ్యులకు సింధ్, పంజాబ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో తల్లూర్ వేటకు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది.

ఈ రాచకుటుంబం ప్రతి సంవత్సరం తల్లూర్ వేటకు పాకిస్తాన్ వస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అక్కడే ఉంటారు.

తల్లూర్ వేటకు తమ వెంట గద్దలను కూడా తీసుకొస్తారు. వేటకు అనువైన ఆయుధాలు ఉపయోగించి, గద్దలను ఉసిగొల్పి తల్లూర్‌లను వేటాడతారు. తల్లూర్ వేటలో గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ఈ గద్దలను వేటలో వాడేందుకు ఎంట్రీ ఫీ ఉంటుంది. ఒక్కో గద్దకు వెయ్యి డాలర్ల (సుమారు రూ. 75,000) రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అరబ్ దేశాల సంస్కృతిలో తల్లుర్ వేటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మధ్యప్రాచ్యంలోని రాచకుటుంబాలు తల్లూర్ వేటను ఒక క్రీడగా, అభిరుచిగా పరిగణిస్తాయి.

'వేట సమయంలో రాజకీయ చర్చలకు తావివ్వరు'

"గల్ఫ్‌తో సత్సంబంధాలు కొనసాగించడానికి పాకిస్తాన్‌కు ఇదొక మార్గం. మనం ఆపాలనుకున్నా దీన్ని ఆపలేం" అని వన్యప్రాణి విభాగంలోని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు అరబ్ రాచకుటుంబాలు తల్లూర్ వేటకు వస్తాయి.

ఇదే కాకుండా, జమీందార్లు, మిత్రులతో వ్యక్తిగత సంబంధాల కారణంగా వారి ఆహ్వానం మేరకు వస్తుంటారు.

అయితే, వేట కోసం వచ్చినప్పుడు రాజకీయ చర్చలు చేయరని, ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటారని బలూచిస్తాన్ మాజీ సెక్రటరీ అహ్మద్ బక్ష్ లహరి చెప్పారు.

పాకిస్తాన్‌లో తల్లూర్ వేట 1973 సంవత్సరం నుంచి మొదలైందని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.

అప్పటి నుంచి గల్ఫ్ దేశాల రాజకుటుంబీకులను, అరబ్ షేక్‌లను ఈ వేటకు ఆహ్వానించడం పరిపాటి.

నజీమ్‌ హత్యతో చాలాకాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై ప్రశ్నలు తలెత్తడం ప్రారంభమైంది.

'కేవలం పాలకుల వ్యక్తిగత సంబంధాలకు లాభం కలిగింది'

ఈ విధానం ద్వారా పాకిస్తాన్ పెద్దగా ఏమీ సాధించలేదని విదేశీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడ్డారు.

"గత 25 ఏళ్లల్లో పాకిస్తాన్, దుబాయ్‌లను పోల్చి చూస్తే.. 1994లో దుబాయ్ దగ్గర ఇసుక, నీరు తప్ప మరేమీ లేదు. అలాంటిది మెరుగైన దౌత్య సంబంధాల కారణంగా దుబాయ్ ఈ 25 ఏళ్లల్లో ఎంతో అభివృద్ధి చెందింది. పాకిస్తాన్ పరిస్థితి అంతగా మెరుగుపడలేదు.

తల్లూర్ వేటకు సంబంధించిన మొత్తం విధానాన్నే నిర్మూలించేందుకు మేం అనేకమార్లు ప్రయత్నించాం. కానీ సాధ్యపడలేదు. మంచి ఆతిధ్యం ఇచ్చినందుకు అరబ్ రాజులు దండిగా కానుకలు ఇచ్చి వెళతారు. దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడ్డాయే తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు" అని ఒక మాజీ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి చెప్పారు.

ఈ వేట పాకిస్తాన్‌లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లోనే జరుగుతుందని బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మాజీ హెడ్ హరూన్ షరీఫ్ తెలిపారు.

వాస్తవానికి ఈ వేట ద్వారా వచ్చే డబ్బులను ఆ ప్రాతాల అభివృద్ధికి ఖర్చు చేయవచ్చు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అలాంటిదేమీ చేయట్లేదని ఆయన అన్నారు.

సింధ్, పంజాబ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో నీటి సరఫరా, రోడ్లు, ఆస్పత్రులు మెరుగుపరచిన దాఖలాలు లేవు. రహీమ్ యార్ ఖాన్‌లోని షేక్ జాయెద్ విమానాశ్రయం తప్ప ఇంకే రకమైన అభివృద్ధి జరిగిన సూచనలు లేవు.

నజీమ్ సోదరుడు అప్ఝల్
ఫొటో క్యాప్షన్, నజీమ్ సోదరుడు అప్ఝల్

గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తల్లూర్ వేటకు వచ్చే అరబ్ రాజకుటుంబాలను విమర్శించారు.

2015లో పాకిస్తాన్ సుప్రీం కోర్టు తల్లుర్ వేటపై నిషేధాన్ని విధించింది. కానీ 2016లో దాన్ని ఎత్తివేశారు.

ఆ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. "తల్లుర్ వేట మన విదేశాంగ విధానానికి ఒక ప్రధాన స్థంభంగా మారిందని నేను నమ్మలేకపోతున్నాను. భారతదేశం దీనికి అనుమతించదని గుర్తు ఉంచుకోండి" అని అన్నారు.

కానీ ఇప్పుడు ఆయన పరిపాలనలోనే గల్ఫ్ దేశాల రాజులు పాకిస్తాన్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి.

"ఇజ్రాయెల్‌కు గుర్తింపు ఇవ్వాలని బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి" అని 2020 నవంబర్‌లో ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రయివేటు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే, "పాలస్తీనా సమస్య పరిష్కారం అయ్యేవరకు పాకిస్తాన్ ఇజ్రాయెల్‌ను గుర్తించదు" అని ఆ తరువాత పలుమార్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈ, అబుదాబి నుంచి రాజకుటుంబం సభ్యులు వచ్చినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావనకు తెస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, అలాంటిదేమీ జరగలేదు.

ప్రస్తుతం నజీమ్ హత్యతో అందరి దృష్టి తల్లుర్ వేట, పాకిస్తాన్ విదేశీ విధానలపై పడింది.

ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. అనేకచోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఈ విషయంలో రాజీకి రమ్మని తనపై ఒత్తిడి తెస్తున్నారని నజీమ్ సోదరుడు అఫ్జల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)