అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనలపై విమర్శలెందుకు? అసలు విషయమేంటి?

ఫొటో సోర్స్, AGICL website
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఎన్టీఆర్ అతిపెద్ద విగ్రహంతో పాటు 'తెలుగు వైభవం-తెలుగు తేజం' పేరిట స్మృతివనం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ 2026 జనవరి 8న మీడియాకు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 1,750 కోట్లు వ్యయం కానున్నట్లు తెలిపారు.
నారాయణ ప్రకటన తర్వాత, అన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఇప్పుడు అంత ఎత్తయిన విగ్రహం అవసరమా అనే వాదనలు విభిన్న వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.


ఫొటో సోర్స్, UGC
పనుల పర్యవేక్షణకు మంత్రులతో సబ్‌కమిటీ
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే, గుజరాత్‌లోని 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' తరహాలో రాజధాని అమరావతిలోని నీరుకొండ గ్రామంలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు విగ్రహం డిజైన్లు పరిశీలించి ఫైనలైజ్ చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు.
మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈక్రమంలోనే మంత్రి నారాయణ నిరుడు ఏప్రిల్‌లో అధికారులతో కలిసి గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించారు.

ఫొటో సోర్స్, AGICL website
డీపీఆర్ తయారీకి రూ.11 కోట్లు
ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)ను తయారు చేసేందుకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) 2025 మే నెలలో టెండర్లను పిలిచింది.
షీలాడియా అసోసియేట్స్ అనే సంస్థ రూ. 11 కోట్లకు కోట్ చేయడంతో ఈ డీపీఆర్ పనులను గతేడాది ఆ సంస్థకు ఏడీసీఎల్ అప్పగించినట్లు ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహం ప్రాజెక్టు బాధ్యతలు చూస్తున్న అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీఆర్ శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

సబ్ కమిటీ తొలి సమావేశం
షీలాడియా అసోసియేట్స్ సంస్థ, ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించిన కొన్ని నమూనాలను తయారు చేసిన నేపథ్యంలో వాటిని పరిశీలించేందుకు ఈ ఏడాది జనవరి 8న సచివాలయంలో క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశమైంది. ఈ నమూనా డిజైన్లను మంత్రులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ విగ్రహం ఎత్తు, వ్యయం తదితర సమాచారంతో పాటు ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.

ఫొటో సోర్స్, AGICL website
విగ్రహంతో పాటుగా తెలుగు సంస్కృతి, కళలు, సాహిత్యానికి సంబంధించిన విశేషాలతో కూడిన ఒక స్మృతివనం అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
త్వరలో ఖరారు: మంత్రి అనగాని సత్యప్రసాద్
సబ్ కమిటీ సమావేశంలో విగ్రహం డిజైన్, స్థలం, నిర్మాణ ప్రణాళికలపై వివరంగా చర్చించామని కమిటీ సభ్యుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్ బీబీసీకి వివరించారు.
నమూనా విగ్రహం కొలతలు, భంగిమ సహా విగ్రహ వివరాలపై సీఎం చంద్రబాబుతో చర్చించాక తుది డిజైన్‌ను ఖరారు చేస్తామని తెలిపారు.
ఆ తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ఎందుకంత ఖర్చు పెరిగిందంటే..
మొదట్లో నీరుకొండపై ఒక్క ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని భావించారని, ఇప్పుడు ప్రాజెక్టును మరింతగా విస్తరించారని బీబీసీతో అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) ఎండీ శ్రీనివాస్ అన్నారు.
నీరుకొండ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేయడంతో పాటు రిజర్వాయర్ చుట్టూ ఉన్న 167 ఎకరాల స్థలాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ఆయన బీబీసీకి తెలిపారు.
అందుకే ప్రాజెక్టు వ్యయం రూ.1,750 కోట్లకు పెరిగిందన్నారు.
'రిజర్వాయర్‌లో వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలు, చుట్టూ ఉన్న స్థలంలో తెలుగు భాష పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్రుల సంస్కృతి, తెలుగు వారి సొంతమైన కూచిపూడి, జానపదనృత్యాలు, తోలుబొమ్మలాటలను పునరుజ్జీవింపజేసేలా అక్కడ స్మృతివనం అభివృద్ధి చేస్తాం. మొత్తంగా ఆ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం' అని శ్రీనివాస్ తెలిపారు.
కాగా, సర్వే నెంబర్ 484లోని సుమారు 179 ఎకరాల 75సెంట్ల విస్తీర్ణంలో కొండ ఉంటుందని మంగళగిరి తహసీల్దార్ దినేష్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
‘ఎన్టీఆర్ అంటే అందరికీ గౌరవమే, కానీ...’
దివంగత ఎన్టీఆర్‌పై అందరికీ గౌరవం ఉందని, కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆయన విగ్రహం పేరిట రూ.1,750 కోట్లు ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృథా చేసినట్లేనని గుంటూరుకు చెందిన వైద్యుడు, ఆలిండియా వెనుకబడిన తరగతుల సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు.
"ఇలాంటి భారీ విగ్రహాలను ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు చేయడాన్ని సుప్రీం కోర్టు కూడా వ్యతిరేకిస్తోంది. ఇటీవల తమిళనాడులో కరుణానిధి విగ్రహ ఏర్పాటును సుప్రీం కోర్టు అడ్డుకుంది.
అంతెందుకు ఇదే చంద్రబాబు నాయుడు గతంలో గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ఏర్పాటు చేయడంపై ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబే కాదు టీడీపీ ఎంపీలు కూడా లోక్‌సభలో భారీ విగ్రహాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు" అని ఆయన అన్నారు.
డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.
"రూ. 1500 కోట్లు ఉంటే రాజధాని అమరావతికి ఖర్చు చేసుకుంటామని టీడీపీ ఎంపీలు గత లోక్‌సభ సమావేశాల్లో వ్యాఖ్యానించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా అన్ని వందల కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదు. ఆ డబ్బులతో ఎన్టీఆర్ పేరిట ప్రభుత్వ ఆస్పత్రులు కట్టొచ్చు. సేవారంగంలో ప్రజలకు ఉపయోగపడే వేరే పనులు చేయవచ్చు" అని డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Dr.Ala Venkateswarlu
'ఓ పక్క డబ్బుల్లేవంటూ అప్పులు తెస్తున్నారు'
ఓ పక్క రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ విదేశాల నుంచి రుణాలు తెస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1,750 కోట్లు ఖర్చు చేయడం సరికాదని రాజధాని అమరావతి ప్రాంత సీపీఎం కార్యదర్శి రవి అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, 'ఎన్టీఆర్‌పై మాకు వ్యతిరేకత లేదు. ఆయనంటే గౌరవమే. కానీ ఇలాంటి చర్యలతో ఎన్టీఆర్ విగ్రహం వద్దు అనే పరిస్థితిని ప్రభుత్వం తీసుకురావద్దు' అని రవి వ్యాఖ్యానించారు.
ఈ వాదనలను మంత్రి అనగాని సత్యప్రసాద్ తోసిపుచ్చారు. తెలుగు జాతి పౌరుషానికి, గౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ విగ్రహం కోసం ఎంతైనా ఖర్చు చేయొచ్చని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














