భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిది? టీడీపీదా, వైసీపీదా?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్)లో ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. దీంతో ఇప్పుడు ఈ ఎయిర్‌పోర్ట్ కథ రన్ వేలు, టెర్మినల్ భవనాలను దాటి, ఏపీ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య 'క్రెడిట్ వార్'గా మారింది.
"ఇది ఎవరి వల్ల సాధ్యమైంది?" అనే వాదనకు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా మారింది.
"ఆలోచన నుంచి ప్రాజెక్ట్ సాధ్యం చేసింది మేమే" అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, "ప్రాజెక్టు ప్రాథమిక దశ పనులన్నీ పూర్తి చేసింది మేమే" అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నాయి.
పొలిటికల్ 'క్రెడిట్ వార్'

ఫొటో సోర్స్, APCMO/FB
ట్రయల్ రన్ అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా స్పందించారు.
"విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలు రాయి. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం.
ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం తెలిపిన నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది" అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

"భూమి, పర్మిషన్లు మా హయాంలో ఇచ్చాం. రీహాబిలిటేషన్ కూడా పూర్తి చేశాం. భూ సేకరణను 2,750.78 ఎకరాలకు పక్కాగా పూర్తి చేసి, ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం ఇచ్చాం. ఇదంతా వైసీపీ ఘనతే" అని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
అలాగే 2023లో వైఎస్ జగన్ భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన విజువల్స్, ఫోటోలతో పాటు, ఆ సందర్భంలో "శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా చేస్తే, ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన ఆయన కుమారుడు వైఎస్ జగన్ చేతుల మీదుగా జరిగింది" అన్న జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు వ్యాఖ్యల వీడియోను వైసీపీ షేర్ చేస్తోంది.

ఫొటో సోర్స్, FB/TDP
టీడీపీ ఏమందంటే..
భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్ పూర్తయిన వెంటనే చంద్రబాబు శుభాకాంక్షలు తెలుపుతూ, నిర్మాణం నుంచి ట్రయల్ రన్ వరకు పనులన్నీ వేగవంతంగా చేయగలిగామంటూ ట్వీట్ చేశారు.
"2014 - 19 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ విమానాశ్రయ నిర్మాణం ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన 4 శాతం పనులు కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. 18 నెలల కాలంలో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా" అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

మరోవైపు, "భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ ఘనత తమదని చెప్పుకునేందుకు వైసీపీకి కాస్త సిగ్గుండాలి" అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
"చంద్రబాబు విజనరీ.. అప్పుడు శంషాబాద్, ఇప్పుడు భోగాపురం, త్వరలో అమరావతి" అంటూ సోషల్ మీడియాలో టీడీపీ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తోంది.

ప్రాజెక్ట్ నేపథ్యం ఏంటి?
2015 నుంచి 2026 జనవరి వరకు వివిధ సందర్భాల్లో రిపోర్టర్‌గా ఈ ప్రాంతంతో పాటు, నిర్వాసిత గ్రామాలను సందర్శించిన అనుభవం నాకు ఉంది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వివాదాలు, ఆలస్యాలు, శంకుస్థాపనలు, కోర్టు కేసులు, రాజకీయ ఆరోపణల మధ్య జరిగింది.
2026 జనవరి 3, 4 తేదీలలో ఎయిర్‌పోర్టు లోపలకు వెళ్లినప్పుడు ఇక ఇల్లు దాదాపు పూర్తై... ఫినిషింగ్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా కనిపించింది ఎయిర్‌పోర్ట్. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
ఈ నేపథ్యంలోనే, అసలు ఈ ఎయిర్‌పోర్టు ఆలోచన నుంచి ట్రయల్ రన్ వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది? ఏ ప్రభుత్వ హయాంలో ఏయే పనులు జరిగాయి? ఈ విషయాలను ఓ టైమ్‌లైన్‌లో చూద్దాం.

ఎప్పుడు ఏమైంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కొత్త మౌలిక వసతుల అవసరం పెరిగింది. విశాఖపట్నంలో ఉన్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు ఐఎన్ఎస్ డేగా నేవల్ ఎయిర్‌ఫీల్డ్ భద్రతా పరిమితుల కారణంగా అవకాశం లేకపోవడంతో, సమీపంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది. అందులో భాగంగా భోగాపురం ప్రాంతాన్ని ఎయిర్‌పోర్ట్ సైట్‌గా ఎంపిక చేశారు.
2014–2019
ప్రభుత్వం: టీడీపీ
ముఖ్యమంత్రి: నారా చంద్రబాబు నాయుడు
- ఉత్తరాంధ్రకు కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం
- భోగాపురాన్ని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ స్థలంగా గుర్తింపు
- కేంద్ర పౌర విమానయాన శాఖ, పర్యావరణ శాఖల నుంచి ప్రాథమిక క్లియరెన్సులు
- ఈ దశలో డెవలపర్ ఎంపిక జరగలేదు, ప్లానింగ్ దశ మాత్రమే పూర్తైంది
- ఎన్నికలకు 2 నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శిలాఫలకం.
- భూ సేకరణ, డిజైన్లపై ప్రక్రియలు ప్రారంభం
2019–2023
ప్రభుత్వం: వైఎస్సార్‌సీపీ
ముఖ్యమంత్రి: వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
- వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ, క్లియరెన్సులపై దృష్టి
- ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ద్వారా జరిగిన కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిడెట్ ఎంపికైంది.
- 2020 జూన్ 12న ఏపీఏడీసీఎల్, జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెట్ (జీవీఐఏఎల్) మధ్య ఒప్పందం కుదిరింది. నిర్మాణం, సుమారు 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు జీఎంఆర్‌కు అప్పగించారు.
- 2023 మే 3న సీఎం వైఎస్ జగన్ మరోసారి ఫౌండేషన్ స్టోన్ వేసి నిర్మాణ పనులు అధికారికంగా మొదలయ్యాయని ప్రకటించారు.
2024–2025
- ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు వేగవంతం, పురోగతిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్ష
- రన్ వే, ట్యాక్సీవే, ఏటీసీ టవర్, టెర్మినల్ భవనం పనుల్లో వేగం
2025–2026
- ట్రయల్ రన్ దశ
- రన్‌వే, టాక్సీవే, ఏటీసీ కీలక పనులు పూర్తి

2026 జనవరి 4న తొలి ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలి కమర్షియల్ ఫ్లైట్ భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది.
"ఎయిర్‌పోర్టుకి సంబంధించి 96 శాతం పనులు పూర్తయ్యాయి. 4 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి" అని జీఎంఆర్ గ్రూప్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఇందన ప్రభాకరరావు బీబీసీతో చెప్పారు.
"2026 జూన్‌లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం" అని రామ్మోహన్ నాయుడు బీబీసీతో చెప్పారు.

భూసేకరణ నుంచి ట్రయల్ రన్ వరకు
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణ మొదట్లోనే పెద్ద చర్చకు దారి తీసింది. ప్రారంభ దశలో సుమారు 15 వేల ఎకరాలు అవసరం అన్న ప్రతిపాదన రావడంతో స్థానిక రైతులు, విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
దీంతో ప్రభుత్వం క్రమంగా ప్రతిపాదిత భూసేకరణను తగ్గిస్తూ, చివరకు దాన్ని సుమారు 2,700 ఎకరాలకు పరిమితం చేసింది. ఈ దశ నుంచే భోగాపురం ప్రాజెక్టు రాజకీయ అంశంగా మారింది.
2019లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన తర్వాత కొన్నేళ్ల పాటు ప్రాజెక్టు స్థలంలో ఆ శిలాఫలకం మాత్రమే కనిపించేది.
జగన్ హయాంలో నిర్వాసితుల పునరావాస కాలనీల పనులు మాత్రం మొదలయ్యాయి.
భూ సేకరణలో భాగంగా మరడపాలెం, ముడసర్లపేట, బొల్లింకలపాలెం, రిల్లిపేట గ్రామాలకు చెందిన మొత్తం 376 కుటుంబాల పునరావాసం కోసం గూడెపువలస (17 ఎకరాలు), లింగాలవలస (25 ఎకరాలు) ప్రాంతాల్లో రెండు కాలనీలు ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబానికి ఐదు సెంట్ల స్థలం కేటాయించగా, 2021 అక్టోబరులో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

బీబీసీ బృందం 2022, 2023లలో ఈ కాలనీలను సందర్శించినప్పుడు, చాలాచోట్ల ఇళ్ల నిర్మాణం పునాదుల దశలోనే కనిపించింది. 2023 నాటికి కొన్ని ఇళ్లు పూర్తై, కొంతమంది నిర్వాసితులు అక్కడకు వచ్చి నివాసం ఉంటున్నారు. తమకు పరిహారం ఇవ్వలేదంటూ కూలిపోయిన ఇళ్ల వద్ద ఏడుస్తున్న కొందరు రైతులు కనిపించారు.
ఆ సమయంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని బోర్డులు, చుట్టూ ఎండిపోయిన భూములే కనిపించాయి. భూసేకరణ విషయంలో ఎదురైన సమస్యలను పరిష్కరించడానికే తమ సమయం గడిచిపోయిందని వైసీపీ నేత బొత్స బీబీసీతో అన్నారు.
2025 అక్టోబర్‌లో మరోసారి వెళ్లినప్పుడు... ఎయిర్‌పోర్ట్ పనులు చురుగ్గా సాగుతూ, భారీ నిర్మాణాలు స్పష్టంగా కనిపించాయి. ఏటీసీ టవర్, చేప ఆకారంలో టెర్మినల్ భవన నిర్మాణం, రోడ్లు, బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్నాయి. ఇక 2026 జనవరి 4న ట్రయల్ రన్ కవరేజ్ కోసం వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్టు ప్రధాన పనులు దాదాపు పూర్తైనట్లే కనిపించాయి.

ఫొటో సోర్స్, GMR Group
"ఘనత టీడీపీది కాదు, వైసీపీది కాదు"
అయితే భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ వార్ వివాదంపై బీబీసీతో పొలిటికల్ అనలిస్ట్ ఎం.యుగంధర్ రెడ్డి మాట్లాడారు.
"ఏ ప్రాజెక్టు ప్రారంభించినా అది పూర్తి చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఒక ప్రభుత్వం మొదలుపెడితే మరో ప్రభుత్వం ఆ పనులను కొనసాగిస్తుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో క్రెడిట్ పార్టీలకు కాదు, ప్రభుత్వాలకే చెందుతుంది" అని చెప్పారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉదాహరణనూ ఆయన గుర్తు చేశారు. స్థలం ఎంపిక చంద్రబాబు హయాంలో జరిగితే.. శంకుస్థాపన, ప్రారంభం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయని చెప్పారు.
"భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కీలకం. పొలిటికల్ క్రెడిట్ కోసం ఎంత ప్రయత్నించినా, ఈ ప్రాజెక్టు పూర్తై ప్రజలకు అందుబాటులోకి రావడమే అసలైన విజయం.
ఎవరు మొదలుపెట్టారన్నది రాజకీయ పార్టీల ప్రశ్న అయితే.. మరి రాష్ట్రంలో పూర్తికాని ఇతర అనేక ప్రాజెక్టుల సంగతి ఏంటనేది ఇరు పార్టీలకు ప్రజల నుంచి ప్రశ్న ఎదురవుతుంది" అని యుగంధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













