మియన్మార్: ‘అప్పట్లో ఎక్కడ చూసినా తెలుగువాళ్లే కనిపించేవారు’

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మీకు తెలుగు పాటలు వచ్చా.. తెలుగు సినిమాలు చూస్తారా..'' అని అడిగాను.
''పాడగలను కానీ..'' అంటూ ఏదో ఆలోచిస్తున్నారు కళావతి.
రెండు లైన్లు పాడండి.. అనగానే..
''చలిచలిగా ఉంటుంది.. గిలిగిలిగా ఉండింది.. నీ వైపు అయిపోతోంది మనసు..'' అంటూ కొన్ని పదాలను అటు ఇటుగా పలుకుతూ పాడటం మొదలుపెట్టారు.
''25వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మా ఆయన కోసం ఈ పాట మొదటిసారి పాడాను'' అంటూ ఎదురుగా ఉన్న తన భర్త లండా సుబ్రమణిని చూపిస్తూ సంబరపడ్డారు కళావతి. రోజూ ఆయన కోసం పాడుతుంటానని సిగ్గుపడుతూ చెప్పారామె.


తరాలు మారినా.. తెలుగు భాష మరిచిపోకుండా..
తెలుగు మూలాలున్న సుబ్రమణి, కళావతి దంపతులది మియన్మార్. వారి తాతల కాలంలోనే ఈ కుటుంబాలు మియన్మార్ (బర్మా)కు వెళ్లాయి. వీరే కాదు, ఎన్నో వేల తెలుగు కుటుంబాలు అప్పట్లో మియన్మార్‌కు వలస వెళ్లాయి.
తరాలు మారినా, వీరంతా తెలుగు భాషను మరిచిపోకుండా మాట్లాడుతున్నారు. గతంలో ఆల్ మియన్మార్ ఆంధ్రా హిందూ రెలిజియస్ సొసైటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడుగా పనిచేశారు సుబ్రమణి.
''అప్పట్లో మా పిల్లలు తెలుగు మాట్లాడకపోవడాన్ని చూసి మా నాన్న నాతో నువ్వేమో, సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నావ్.. నీ పిల్లలు మాత్రం తెలుగు మాట్లాడలేకపోతున్నారు. తెలుగును కాపాడుకోకపోతే మన ఉనికి ఉండదు అని చెప్పారు'' అని సుబ్రమణి గుర్తుచేసుకున్నారు.
''నాన్న అలా అన్న తర్వాత నా పిల్లలు తెలుగులో బాగా మాట్లాడాలని, వారిని ఆరేడేళ్ల వయసులో విశాఖపట్నం తీసుకువచ్చి వదిలేసి వెళ్లాను. ''.
''వాళ్లు తెలుగు నేర్చుకున్నారు గానీ, అప్పట్లో వారిని అంత చిన్నవయసులో వదిలి వెళ్తుంటే మాకు కన్నీళ్లు ఆగలేదు. కానీ, అది తెలుగు భాషపై ప్రేమతో చేసిన పని'' అని సుబ్రమణి బీబీసీతో చెప్పారు.

మాతృ భూమికి వచ్చిన ఆనందంలో…
మియన్మార్‌లో స్థిరపడిన తెలుగువారు కొందరు ఇటీవల హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చారు.
ఆ తర్వాత తెలుగు జాతి ట్రస్టు ట్రస్టీ డీపీ అనూరాధ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని లామాకాన్‌కు వచ్చారు. వారితో బీబీసీతో మాట్లాడింది. వారిలో చాలామంది తెలుగు నేలపై తొలిసారి అడుగు పెట్టామని చెప్పారు.

''నాన్న మాటతో తెలుగును నిలబెట్టుకుంటున్నాం''
సుమారు 150 ఏళ్ల కిందటే భారత్‌తోపాటు మియన్మార్ బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో వ్యవసాయంతోపాటు వివిధ వ్యాపారాల నిమిత్తం పెద్దసంఖ్యలో తెలుగు ప్రజలు మియన్మార్ కు వలస వెళ్లినట్టుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల వారు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారిలో గాన లక్ష్మి పూర్వీకుల కుటుంబం కూడా ఉంది.
తాను పుట్టినప్పట్నుంచి ఇప్పటి వరకు తెలుగు నేలపై అడుగు పెట్టలేదని, ఇప్పుడు రావడం ఎంతో సంతోషంగా ఉందని 67 ఏళ్ల గానలక్ష్మి బీబీసీతో చెప్పారు.
''తెలుగును అలాగే పట్టుకున్నాం. మేం మరిచిపోలేదు. ఎందుకంటే నాయన (నాన్న) చెప్పి పెట్టాడు. మనది తెలుగు భాష. ఎప్పటికీ మరిచిపోకూడదని'' అన్నారు గానలక్ష్మి.
గానలక్ష్మి తండ్రి సాంబమూర్తి గతంలో మియన్మార్‌లో పిల్లలకు తెలుగు నేర్పించేవారని ఆమె చెప్పారు.
తెలుగు నేలపై అడుగు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారామె.
''నాకు తెలుగు రాయడం, చదవటం వస్తది. శివ పురాణం, విష్ణు పురాణం, లలితా సహస్ర నామాలు చదువుతాను. దేవుడికి పూజ చేసినప్పుడు విఘ్నేశ్వరుడి శ్లోకం, సరస్వతి శ్లోకం, మహా విష్ణువు శ్లోకాలు చదువుతాను'' అని గాన లక్ష్మి బీబీసీతో చెప్పారు.

''ఇంట్లో తెలుగు.. స్కూల్లో బర్మీస్''
తమ కుటుంబం తాతల కాలంలోనే విజయవాడ నుంచి మియన్మార్ వలస వెళ్లినట్టు కళావతి చెప్పారు.
''మేమంతా మియన్మార్‌లోనే పుట్టి పెరిగాం. తాతయ్య ఆదేశం ఏమిటంటే ఇంట్లో ఎప్పుడూ తెలుగు మాట్లాడాలి అని. స్కూలుకు వెళ్తే బర్మీస్ భాష ఉండేది. ఇంటికి వస్తే తప్పకుండా తెలుగులోనే మాట్లాడించేవారు'' అని చెప్పారు.
''మేం ఖాళీ దొరికితే హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాలు చూస్తుంటాం. మియన్మార్‌లో ఉన్నప్పుడు కారులో వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా తెలుగు సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తాం'' అని కళావతి వివరించారు.
మా చిన్నప్పుడు మమ్మల్ని కోరంగివాళ్లు అని పిలిచేవారని లండా సుబ్రమణి బీబీసీతో చెప్పారు.
''అది మా జాతి అనుకునేవాళ్లం. నేను 1999లో ఆంధ్రా వచ్చినప్పుడు కోరంగి అనే ప్రాంతం ఉందని తెలిసింది. అక్కడి నుంచి వచ్చినవారిని కోరంగివాళ్లు అని మియన్మార్‌లో పిలిచేవారని ఆ తర్వాత తెలిసింది'' అని వివరించారు.

మియన్మార్‌లో తెలుగువారు ఎంతమంది ఉన్నారంటే..
మియన్మార్‌లో 2024 ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం... మొత్తం జనాభా 5,13,75,327.
జోషువా ప్రాజెక్టు లెక్కల ప్రకారం... 1.47లక్షల మంది తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది.
ది హిందూ పత్రిక 2018 నాటి కథనం ప్రకారం, సుమారు రెండు లక్షల మంది తెలుగు మాట్లాడే ప్రజలు మియన్మార్‌లో ఉన్నారని అంచనా.
ఆల్ మియన్మార్ ఆంధ్రా హిందూ రిలిజియస్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్న వివరాల ప్రకారం, ప్రస్తుతం సుమారు లక్ష మంది తెలుగు మూలాలున్న లేదా తెలుగు మాట్లాడేవారు మియన్మార్‌లో ఉంటున్నారు.
తెలుగు మాట్లాడే ప్రజలు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని మియన్మార్ ప్రభుత్వం తమ జనాభా లెక్కల్లో స్పష్టం చేయలేదు.
ఈ వివరాలేవీ బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
మియన్మార్‌లోని యాంగాన్ (గతంలో రంగూన్), మాండలే ప్రాంతాల్లో ఎక్కువగా తెలుగువారు ఉంటున్నారు.
మియన్మార్‌లో తెలుగువాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాజకీయంగా మాత్రం అక్కడి పరిస్థితులల్ల పెద్దగా అవకాశం ఉండదని లండా సుబ్రమణి బీబీసీతో చెప్పారు.
''తెలుగువాళ్ల గొప్పతనం ఏంటంటే.. అక్కడికి వచ్చిన తర్వాత చాలా పెద్ద పోజిషన్‌కు వచ్చారని చెప్పవచ్చు. తెలుగు సంఘం ఏర్పాటు చేసుకోవడం, తెలుగు లైబ్రరీ, ఆలయాలు.. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. లైబ్రరీ ఉండే సరికి తెలుగు వారంటే చదువుకున్నవారనే గౌరవం కనబరిచేవారు'' అని చెప్పారు.

1960లో వెనక్కు..
మియన్మార్ నుంచి 1960లో భారత్‌కు చాలామంది తిరిగి వచ్చారని, అంతకు ముందు వరకు మియన్మార్‌లో ఎక్కడ చూసినా తెలుగువాళ్లు కనిపించేవారని విశాఖపట్నానికి చెందిన ఎర్రానాయుడు బీబీసీతో చెప్పారు.
''ఏ వీధిలోకి వెళ్లినా తెలుగువారు కనిపించేవారు. బర్మాలో ఉన్నామా.. తెలుగు నేలపై ఉన్నామా అనిపించేది'' అని అన్నారు.
మియన్మార్‌లో 1960లో ఏర్పడిన అనిశ్చితి కారణంగా తెలుగు ప్రజలు చాలా మంది వెనక్కి వచ్చేశారని ఎర్రానాయుడు వివరించారు. అలా వచ్చిన వారిలో ఆయన కూడా ఒకరు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు.
''నేను 1950లో బర్మాలో పుట్టాను. 1966లో కాందీశీకులుగా భారత్ వచ్చేశాం. రెండో తరగతి వరకు బర్మాలో తెలుగులోనే చదివాను'' అని చెప్పారు.

ప్రస్తుత తరం తెలుగు మాట్లాడుతోందా?
ప్రస్తుత తరం తెలుగును క్రమంగా మరిచిపోతోందని ఎర్రానాయుడు చెప్పారు.మియన్మార్ నుంచి వచ్చిన ప్రస్తుత తరం ప్రతినిధులతో మాట్లాడినప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది.
గాన లక్ష్మి తెలుగులో బాగా మాట్లాడుతుండగా, ఆమె కుమారుడు వెంకటేశ్వరరావు చాలా తక్కువ పదాలే పలకగలుగుతున్నారు.
''అమ్మ, నాన్న, తాత, నీవు చూశావా.. కొంచెం కొంచెం వచ్చు..'' ఇలా కొన్ని పదాలే మాతో చెప్పగలిగారు వెంకటేశ్వరరావు.

తెలుగును బతికించే ప్రయత్నాలు
''మియన్మార్‌లో బర్మీస్ చదివితేనే ఉద్యోగాలు వస్తాయి కనుక బర్మీస్ తప్పకుండా చదువుతున్నారు. అదే సమయంలో తెలుగును మా తర్వాత తరంలో కొందరు మరచిపోతున్నారు'' అని లండా సుబ్రమణి బీబీసీతో చెప్పారు.
''మన తెలుగువాళ్లు బర్మీస్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, బర్మా అబ్బాయిలు తెలుగు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కూడా ఉంది. కానీ ఎక్కువ మంది అలా చేయడంలేదు'' అని అన్నారు.
అయితే, ఎర్రానాయుడు వంటివారు తెలుగును బతికించేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సొసైటీ ప్రతినిధులు చెప్పారు.
2011లో ఆల్ మియన్మార్ ఆంధ్రా హిందూ రిలిజియస్ సొసైటీని స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా మియన్మార్‌లో తెలుగువారు ఉత్సవాలు నిర్వహించారు.
''ఉత్సవాలకు వెళ్లినప్పుడు అక్కడి పిల్లలను చూసి తెలుగు నేర్పించాలనుకున్నా. ఆ తర్వాత కొన్నిసార్లు వేసవి సెలవుల్లో వెళ్లి తెలుగు నేర్పిస్తున్నాను. ఖర్చుతో కూడిన పని కావడంతో ఇబ్బందిగా ఉంది'' అని ఎర్రానాయుడు బీబీసీతో చెప్పారు.
ఆయన బర్మీస్ - తెలుగు డిక్షనరీని రూపొందించారు.
''గతంలో వెళ్లినప్పుడు బర్మీస్- ఇంగ్లిష్ డిక్షనరీ తీసుకువచ్చాను. దాన్నుంచి బర్మీస్ - తెలుగు డిక్షనరీ తయారు చేశాను'' అని చెప్పారు.
మియన్మార్‌లో తెలుగు మాట్లాడేవారు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, ప్రస్తుత తరం తెలుగు భాష, సంప్రదాయాలను మరిచిపోవడానికి చాలా కారణాలున్నాయని తెలుగు జాతి ట్రస్టు ట్రస్టీ డీపీ అనూరాధ బీబీసీతో చెప్పారు.
''ఇప్పుడు అక్కడ నాలుగో తరం ఉంది. ఎప్పుడో 150 ఏళ్ల క్రితం ప్రజలు అక్కడికి వలస వెళ్లడంతో కొన్ని మార్పులు వచ్చాయి. మూడో తరం వాళ్లు తెలుగు మాట్లాడేవారు. అంతకుముందు వాళ్లు తెలుగు రాసేవాళ్లు, మాట్లాడేవాళ్లు. ఇప్పుడున్న వాళ్లు కేవలం కొన్ని కొన్ని పదాలు పలుకుతున్నారు'' అని వివరించారు.
ఆలయాల్లోనూ ఇతర భాషల వారు ఉండటంతో సంప్రదాయాలు కూడా చాలావరకు మారిపోయాయని వివరించారు అనూరాధ.సినిమాలు, ఓటీటీ కంటెంట్ చూసి తెలుగు సంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయా.. అని అడుగుతున్నారని చెప్పారు.
''తెలుగు రాష్ట్రాల నుంచి టీచర్లను పంపించాలి లేదా స్పెషల్ వీసా పర్మిషన్లు ఇస్తే అక్కడి నుంచి వచ్చి చదువుకుంటామని అడుగుతున్నారు. అలాగైనా తెలుగు భాష, ఆచారాలు మియన్మార్‌లో నిలదొక్కుకునే వీలుంది'' అని అనూరాధ చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













