బగ్గా రెడ్డి: "సార్, అతను అడుగుతోంది మద్యం కాదు, ఒక బాటిల్.."

ముంబయి, అండర్‌వరల్డ్, దయానాయక్, అజీజ్ రెడ్డి

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, ఛోటా షకీల్ (ఎడమ వైపు), ఛోటా రాజన్ (కుడి వైపు)
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మీ బావను చంపెయ్, అప్పుడే నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని నమ్ముతా."

ఇదీ సాదిక్ జలావర్‌తో ఒకప్పుడు ముంబయి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుడి భుజంగా చెప్పే చోటా షకీల్ అన్న మాట.

అది వినగానే సాదిక్ కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ముఖం పాలిపోయింది. చేతులు వణకడం మొదలుపెట్టాయి.

సాదిక్‌కు తన సోదరి అంటే చాలా ఇష్టం. ఆమె భర్త పేరు జుల్ఫికర్.

జుల్ఫికర్ పైకిపోయిన తర్వాతే తనకు ఫోన్ చేయాలని సాదిక్‌కు చోటా షకీల్ స్పష్టంగా చెప్పారు.

సాదిక్ టేబుల్ మీద ఉన్న గ్లాసులో ఒక గుక్కెడు నీళ్లు తాగి, పని అయిపోతుందని షకీల్‌తో చెప్పారు.

కానీ, సాదిక్‌ను పూర్తిగా పరీక్షించాలనుకున్నారు షకీల్. ఆయనకు ఎలాంటి మినహాయింపు ఇవ్వదలచుకోలేదు.

''ఈ పని కోసం నువ్వు తుపాకీ వాడకూడదని నేను కోరుకుంటున్నా" అని సాదిక్‌తో షకీల్ అన్నారని ఎస్.హుస్సేన్ జైదీ తన పుస్తకం 'ది డేంజరస్ డజన్: హిట్‌మెన్ ఆఫ్ ముంబయి అండర్ వరల్డ్' లో రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ముంబయి, అండర్‌వరల్డ్, దయానాయక్, అజీజ్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరుణ్ గవ్లీ

బాస్ కోసం బావను చంపేసిన సాదిక్ కాలియా...

సాదిక్ అంతకుముందే అరుణ్ గవ్లీ గ్యాంగ్‌ను వదిలి బయటకు వచ్చేశారు. తన సోదరిని విధవను చేసైనా సరే, ఎంత మూల్యం చెల్లించైనా సరే చోటా షకీల్ నమ్మకాన్ని గెలవాలని నిశ్చయించుకున్నారు.

ఒకరోజు ఆయన జుల్ఫికర్‌ను ఒక చేత్తో ఆలింగనం చేసుకున్నారు, తన రెండో చేతిని వెనుక పెట్టుకున్నారు.

'భాయ్‌జాన్, నన్ను క్షమించండి' అంటూ జుల్ఫికర్‌ను సాదిక్ కత్తితో ఐదుసార్లు పొడిచారు. చివరిసారిగా తన సోదరి ఇంటి వైపు చూసి, మోటార్ సైకిల్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత షకీల్‌కు ఫోన్ చేసి పని పూర్తయిందని చెప్పారు.

షకీల్ ఆ మాట విని అవాక్కయ్యారు.

'ఈ పని నా వల్ల కాదు, నాకు వేరే ఏదైనా పని ఇవ్వండి' అని సాదిక్ అడుగుతాడని షకీల్ ఊహించారు. కానీ సాదిక్ చేసిన పనికి షకీల్ కంగుతిన్నారు.

ఆ రోజు నుంచి సాదిక్ జలావర్‌ను 'సాదిక్ కాలియా' అని పిలవడం మొదలెట్టారు.

ఈ ఘటన తర్వాత అతన్ని చోటా షకీల్ దుబయ్‌కి రమ్మని పిలిపించారు.

ముంబయి, అండర్‌వరల్డ్, దయానాయక్, అజీజ్ రెడ్డి

ఫొటో సోర్స్, Men's World

ఫొటో క్యాప్షన్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు దయానాయక్

దయానాయక్ చేతిలో ఎన్‌కౌంటర్

సాదిక్‌ను చోటా షకీల్ మరో గ్యాంగ్‌స్టర్ సలీమ్ చిక్నాకు పరిచయం చేశారు.

సలీమ్ చిక్నా మోటార్ సైకిల్ నడపడంలో ఆరితేరారు.

వీరిద్దరూ కలిసి 1990వ దశకం మధ్యలో ముంబయిలో చోటా రాజన్ గ్యాంగ్‌ను ముప్పుతిప్పలు పెట్టారు.

షకీల్ ఆదేశాలతో, వీరిద్దరూ కలిసి దాదాపు 20 మందిని చంపినట్లు ముంబయి పోలీసుల అంచనా.

అయితే, చోటా షకీల్ అప్పగించిన ఒక పనిని మాత్రం సాదిక్ పూర్తి చేయలేకపోయారు. అది తన పాత డాన్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరుణ్ గవ్లీని హత్య చేయడం.

'గవ్లీ పుణె నుంచి ముంబయికి వచ్చి ఒక బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారని సాదిక్‌కు సమాచారం అందింది. ఆ సభలోనే గవ్లీని ఆయన మద్దతుదారుల ముందే కాల్చి చంపాలని సాదిక్ ప్లాన్ చేశారు. కానీ ఈ విషయం గవ్లీకి ముందే తెలియడంతో, ఆయన ఆ సభను రద్దు చేసుకున్నారు" అని హుస్సేన్ జైదీ తన పుస్తకంలో రాశారు.

సాదిక్ కాలియా గంటల తరబడి ఎదురుచూశారు, కానీ గవ్లీ అక్కడికి రాలేదు.

సాదిక్ దెయ్యంలా మాయమైపోవడంలో సిద్ధహస్తుడు కావడంతో పోలీస్ వర్గాల్లో ఆయనకు 'భూత్' (దయ్యం) అనే పేరుండేది. పైగా, నల్లగా ఉండడంతో చీకట్లో దాక్కోవడం సులభమయ్యేది.

పోలీసులు కాలియాను నేరుగా పట్టుకోలేకపోయారు, కానీ ఏదోలా ఆయన పేజర్ నంబర్ వారికి దొరికింది.

ఆ నంబర్ సాయంతో ముంబయి పోలీసులు మొదట సలీమ్ చిక్నాను పట్టుకున్నారు. అతని ద్వారా 1997 డిసెంబర్ 12న దాదర్ పూల మార్కెట్‌లో సాదిక్ కాలియాను చుట్టుముట్టారు.

పోలీసులు కురిపించిన వందలాది బుల్లెట్ల ముందు కాలియా తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది.

తరువాత కాలంలో, పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ దయా నాయక్ 'మెన్స్ వరల్డ్' పత్రికకు చెందిన మంజుల సేన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు: "చోటా షకీల్ అత్యుత్తమ షూటర్లలో ఒకడైన సాదిక్ కాలియాను చంపడమే నా అతిపెద్ద విజయం. మేము అతన్ని దాదర్ పూల మార్కెట్‌లో చుట్టుముట్టాం. నాపై ఆరు బుల్లెట్లు కాల్చారు. నా ఎడమ తొడకు బుల్లెట్ తగిలింది, కానీ చివరికి మేం అతన్ని హతమార్చడంలో విజయవంతమయ్యాం.''

ముంబయి, అండర్‌వరల్డ్, దయానాయక్, అజీజ్ రెడ్డి

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్, బగ్గారెడ్డి అలియాస్ అజీజ్ రెడ్డి

రెడ్డికి ఇష్టమైన డ్రింక్ రక్తం...

ఇప్పుడు మరో కిరాయి హంతకుడు వెంకటేష్ బగ్గా రెడ్డి అలియాస్ బాబా రెడ్డి గురించి చెప్పుకోవాలి.

ఒకసారి బగ్గా రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత, పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ ఇచ్చినా ఆయన నోరు విప్పలేదు.

అప్పుడు ఒక కానిస్టేబుల్ బయటకు వచ్చి తన అధికారిని ఇలా అడిగారు: "సార్, తనకు ఇష్టమైన డ్రింక్ ఒక బాటిల్ ఇస్తే, మన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తానని అంటున్నారు."

అప్పుడా అధికారి విసుగ్గా, "నీకేమైనా పిచ్చా? మనం జైలులో అతనికి మద్యం ఎలా ఇవ్వగలం?" అని అరిచారు.

కానీ, కానిస్టేబుల్ చెప్పిన సమాధానం విని ఆ అధికారి నిర్ఘాంతపోయారు: "సార్, అతను అడుగుతోంది మద్యం కాదు, ఒక బాటిల్ రక్తం."

పోలీసులు వెంటనే దగ్గర్లోని కబేళా నుంచి ఒక బాటిల్ మేక రక్తాన్ని తెచ్చి ఇవ్వగానే, వారు అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పడం మొదలుపెట్టారు.

"28 ఏళ్ల వయసులో బగ్గా ముంబయి అండర్ వరల్డ్ చరిత్రలోనే అత్యంత రహస్యమైన వ్యక్తి. మరో విశేషమేమిటంటే, ఆయన కేవలం ముస్లిమేతరులను మాత్రమే టార్గెట్ చేసేవారు" అని హుస్సేన్ జైదీ రాశారు.

హైదరాబాద్‌ నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన బగ్గా తొమ్మిదో తరగతి తర్వాత చదువు మానేశారు.

ప్రియురాలి కోసం అజీజ్ రెడ్డిగా...

బగ్గా రెడ్డి ప్రేమ కథ గురించి కూడా జైదీ తన పుస్తకంలో ప్రస్తావించారు.

"హైదరాబాద్ నుంచి బగ్గా 1989లో ముంబయికి వచ్చి, ఒక బార్‌లో బౌన్సర్‌గా పనిచేయడం ప్రారంభించారు.

ఆ తర్వాత అతను చోటా రాజన్ గ్యాంగ్ కోసం పనిచేయడం మొదలుపెట్టారు.

తనలాంటి డజను మందిని ఒంటిచేత్తో కొట్టగల బగ్గా సామర్థ్యాన్ని చూసి ఆ గ్యాంగ్ సభ్యులు ముగ్ధులయ్యారు.

స్వల్ప కాలంలోనే, బగ్గా భారీ మొత్తంలో డబ్బు తీసుకుని హత్యలు చేయడం మొదలుపెట్టారు."

ఆ రోజుల్లోనే ఆయనకు రూ.30 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఇచ్చేవారు.

అదే సమయంలో బగ్గా రెడ్డి ఒక మహిళతో ప్రేమలో పడ్డారు.

"ఆమె పేరు షహనాజ్. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. అయితే, పెళ్లికి ముందే ఇస్లాం మతాన్ని స్వీకరించాలని ఆమె షరతు పెట్టారు. అప్పటివరకూ ముస్లింలంటే పడని బగ్గా, ఆ మహిళ ప్రేమలో ఎంతగా పిచ్చోడయ్యాడంటే, ఆమె షరతుకు అంగీకరించారు. తన పేరును అజీజ్ రెడ్డిగా మార్చుకున్నారు.

పెళ్లైన తర్వాత ఆయనలో క్రూరత్వం తగ్గడం మొదలైంది. 1998 జులై 26న ఒక పక్కా సమాచారంతో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు."

బెయిల్‌పై విడుదలైన తర్వాత, అజీజ్ రెడ్డి నకిలీ పాస్‌పోర్ట్‌తో మలేసియాకు పారిపోయారు. అక్కడ మళ్లీ చోటా రాజన్‌ను కలిశారు.

ముంబయి, అండర్‌వరల్డ్, దయానాయక్, అజీజ్ రెడ్డి

ఫొటో సోర్స్, Telangana Police

ఫొటో క్యాప్షన్, అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బి.ప్రసాద్‌రావు

అజీజ్ రెడ్డి కథ జూబ్లీహిల్స్‌లో ముగిసింది...

ఆ తర్వాత అజీజ్ రెడ్డి ఇండోనేషియాకు మకాం మార్చారు. అక్కడ ఒక డ్రగ్స్ తయారీ యూనిట్‌కు ఇంచార్జ్‌గా రాజన్ ఆయన్ను నియమించారు.

దావూద్ ఇబ్రహీం మనుషులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలియడంతో 2002 డిసెంబర్‌లో అజీజ్ రెడ్డి భారత్‌కు తిరిగొచ్చారు.

మొదట వారణాసిని తన అడ్డాగా చేసుకున్నా, ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

హైదరాబాద్‌లో ఆయుధాల సరఫరాదారుగా మారారు. నేరగాళ్ల ముఠాలకు అక్రమ ఆయుధాలను అందించడం మొదలుపెట్టారు.

అజీజ్ రెడ్డికి నల్గొండ జిల్లాలో 40 ఎకరాల భూమి ఉండేది.

ఆయనకు ఉన్న మరో విచిత్రమైన అలవాటు ఏమిటంటే, కిడ్నాప్ చేసినప్పుడు చెక్ రూపంలోనే డబ్బు వసూలు చేసేవారు.

2008 మే నెలలో జూబ్లీహిల్స్ వస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది.

ఆయన కోసం మాటువేసిన పోలీసులు, అక్కడ రోడ్లన్నీ ఖాళీ చేయించి, ఏ వాహనాన్నీ లోపలికి రానివ్వకుండా చేశారు.

అజీజ్ రెడ్డి కారులో అక్కడికి చేరుకోగానే చుట్టుముట్టారు.

తర్వాత, అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బి.ప్రసాద్‌రావు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇలా చెప్పారు: "బగ్గా తన ఇద్దరు సహచరులతో కలిసి జూబ్లీహిల్స్‌లో డబ్బు వసూలు చేయడానికి వస్తున్నారని మాకు తెలిసింది. మేం రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో గాలించాం. రాత్రి 11:15 గంటలకు బీఎన్ రెడ్డి నగర్‌వైపు వెళ్లే రోడ్డు నంబర్ 46 వద్ద అతని కారును అడ్డుకున్నాం.''

''పోలీసు బృందం అతని వైపు వెళ్లగానే, తప్పించుకోవడానికి ప్రయత్నించారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరిస్తే, బగ్గా రెడ్డి తన 9 ఎంఎం పిస్టల్ తీసి పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో బుల్లెట్లు తగలడంతో రెడ్డి అక్కడికక్కడే పడిపోయారు. అతని ఇద్దరు సహచరులు మాత్రం తప్పించుకున్నారు.''

ముంబయి, అండర్‌వరల్డ్, దయానాయక్, అజీజ్ రెడ్డి

ఫొటో సోర్స్, Westland

డీసీపీ కళ్లకు గంతలు కట్టి...

1994, ఆగస్టు 25వ తేదీ, ఉదయం సుమారు 10 గంటల సమయంలో, ముంబయిలోని బాంద్రాలో రద్దీగా ఉండే హిల్ రోడ్ హౌసింగ్ సొసైటీ నుంచి ఒక తెల్లటి అంబాసిడర్ కారు బయటకు వచ్చింది. అకస్మాత్తుగా ఎటు నుంచి వచ్చారో తెలియదు కానీ, ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై ఏకే-56 రైఫిళ్లతో ఆ కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

ముందు సీట్లో కూర్చున్న పోలీస్ గార్డు తన స్టెన్ గన్‌తో ఎదురుకాల్పులు జరిపినప్పటికీ, దుండగులు లక్ష్యంగా చేసుకున్న వెనుక సీట్లోని బీజేపీ నగర అధ్యక్షులు రాందాస్ నాయక్ అక్కడికక్కడే మరణించారు.

ముంబయి పోలీసులంతా ఆ హంతకుల కోసం గాలింపు మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో ముంబయి పోలీస్ డీసీపీ రాకేష్ మారియాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.

ఆ విషయాన్ని రాకేష్ మారియా తన ఆత్మకథ 'లెట్ మీ సే ఇట్ నౌ'లో ఇలా రాశారు:

"ఓ వ్యక్తి ఫోన్ చేసి, 'సార్, మీకు రామదాస్ నాయక్ హత్య కేసు గురించి సమాచారం కావాలా?' అని అడిగారు. వెంటనే 'అవును' అని చెప్పాను. దానికి అతను 'అయితే మీరు నన్ను కలవడానికి బయటకు రావాలి' అన్నారు. 'ఎక్కడికి?' అని అడగగా, 'మిమ్మల్ని తీసుకెళ్లడానికి నేను ఒక కారు పంపిస్తాను' అని చెప్పారు.''

''మొదట ఇది ఏదైనా కుట్ర ఏమోనని అనిపించింది. ఆ వ్యక్తి సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు నా ఆఫీస్ ముందు ఒక కారు వచ్చి ఆగుతుందని చెప్పారు. కొద్దిసేపటికే నల్లటి అద్దాలు ఉన్న ఒక తెల్లటి మారుతి వ్యాన్ నా ముందుకొచ్చి ఆగింది. దాని నంబర్ ప్లేట్‌కు బురద పూసి ఉంది."

"నేను కారులో కూర్చోగానే, అందులో ఉన్న వ్యక్తులు నా కళ్లకు గంతలు కట్టారు. 15 నిమిషాల ప్రయాణం తర్వాత కారు ఒక చోట ఆగింది. నేను ఒక ఎయిర్ కండిషన్డ్ గదిలోకి ప్రవేశించాను.

ఫోన్‌లో నాతో మాట్లాడిన అదే గొంతు మళ్లీ వినిపించింది. అతను 'సార్, మిమ్మల్ని ఈ విధంగా ఇక్కడికి తీసుకువచ్చినందుకు నన్ను క్షమించండి' అన్నారు. దానికి నేను 'ఫర్వాలేదు, మీకు తెలిసిన విషయమేంటో చెప్పండి' అన్నాను.

అప్పుడు అతను 'మీరు ఫిరోజ్ కొంకణి పేరు విన్నారా?' అని అడిగారు. 'లేదు, ఎవరు అతను?' అని అన్నాను. 'చాలా ధైర్యవంతుడైన కుర్రాడు, అతనే ఈ పని (రామదాస్ నాయక్ హత్య) చేశాడు' అని చెప్పారు.

ఆ తర్వాత ఆ కారు నన్ను ఎక్కడైతే పికప్ చేసుకుందో, మళ్లీ అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయింది" అని ఆయన రాశారు.

ముంబయి, అండర్‌వరల్డ్, దయానాయక్, అజీజ్ రెడ్డి

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్, ఫిరోజ్ కొంకణి

అండర్ వరల్డ్ 'డార్లింగ్' అలా దొరికిపోయాడు...

రాకేష్ మారియాకు గతంలో ఫోన్ చేసిన వ్యక్తి నుంచే 1994, అక్టోబర్ 19న మళ్లీ ఫోన్ వచ్చింది.

అవతలి వైపు నుంచి "మీకు ఫిరోజ్ కొంకణి కావాలా?" అని అడిగారు.

మారియా "కచ్చితంగా" అని సమాధానం ఇచ్చారు.

అప్పుడు అతను, "ప్రస్తుతం అతను బెంగళూరులో ఉన్నారు. అతన్ని పట్టుకోవడానికి మీరే స్వయంగా వెళ్లాలి" అని చెప్పారు.

కానీ, మారియా ఒక్కరే బెంగళూరు వెళ్లడానికి పై అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఆయన టీమ్ బెంగళూరు వెళ్లింది.

ఆ వ్యక్తి మారియాకు మళ్లీ ఫోన్ చేసి, కొంకణి ఈరోజు సినిమా చూడటానికి వెళ్తాడని, అక్కడే అరెస్ట్ చేయాలని చెప్పారు.

అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక, మళ్లీ ఫోన్ వచ్చింది, కొంకణి సినిమా ప్లాన్ మార్చుకున్నాడని, హోటల్‌లోనే ఉండి తన స్నేహితులతో కలిసి బీర్ తాగుతాడని సమాచారం ఇచ్చారు.

ఈ క్లైమాక్స్ సీన్ గురించి రాకేష్ మారియా తన పుస్తకంలో ఇలా రాశారు:

"ఆ హోటల్ పేరు 'బ్లూ డైమండ్'. ఫిరోజ్ కొంకణి రూమ్ నంబర్ 206లో ఉన్నారు. మేం హోటల్ మేనేజర్‌ను ఒప్పించాం. రాత్రి ఏడున్నర గంటలకు రూమ్ నంబర్ 206 నుంచి 'చికెన్ లాలిపాప్' కోసం ఆర్డర్ వచ్చింది. ఆహారం తీసుకువెళ్లే ట్రాలీతో గదిలోకి వెళ్లాలని మా టీమ్ నిర్ణయించుకున్నాం. సబ్-ఇన్‌స్పెక్టర్ వార్పేను వెయిటర్‌గా పంపించాం. ఆయన ట్రాలీలో తన రివాల్వర్‌ను దాచిపెట్టారు. గది లోపల ప్లేట్లు తీయడానికి వార్పే కిందకు వంగి, వెంటనే రివాల్వర్ తీసి ఫిరోజ్ కొంకణిపై గురిపెట్టారు. ఆ వెంటనే మా మిగతా టీమ్ కూడా ఆ గదిలోకి దూసుకెళ్లి కొంకణిని అరెస్ట్ చేశారు."

కొంకణిని విమానంలో ముంబయికి తీసుకువచ్చారు.

మొత్తం 21 హత్యలు చేసినట్లు కొంకణి అంగీకరించారు.

నాలుగేళ్ల తర్వాత 1998 మే 6న ఫిరోజ్ కొంకణి ముంబయి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు.

ఆయన నేపాల్ మీదుగా దుబాయ్ చేరుకున్నారు.

ఆ తర్వాత, 2003లో దావూద్ మనుషులు ఆయన్ను చంపేశారని తెలిసింది.

హుస్సేన్ జైదీ ప్రకారం, కొంకణి దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీంను తిడుతున్నప్పుడు ఎవరో ఆ సంభాషణను టేప్ చేశారు. ఆ చిన్న తప్పే ఆయనకు ప్రాణాంతకంగా మారింది.

"అండర్ వరల్డ్‌లో కొంకణిని 'డార్లింగ్' అని పిలిచేవారు. జైలు గార్డు అతని గురించి ఒక వింత విషయం చెప్పారు, అది ఎప్పటికీ మర్చిపోలేను. జైలు గదిలోకి నల్ల చీమలు వస్తే, అతను వాటిని వేళ్లతో పట్టుకుని ఒక్కొక్కటిగా వాటి కాళ్లు విరిచేసేవాడు. కాళ్లు లేని ఆ చీమల శరీరాలు నేలపై దొర్లడం చూస్తూ ఆనందించేవారు" అని రాకేష్ మారియా తన పుస్తకంలో రాశారు.

ముంబయి, అండర్‌వరల్డ్, దయానాయక్, అజీజ్ రెడ్డి

ఫొటో సోర్స్, Simon & Schuster

ఫొటో క్యాప్షన్, ది డేంజరస్ డజన్

‘ఉస్తరా’ ప్రాణం తీసిన అమ్మాయిల బలహీనత...

మొహమ్మద్ హుస్సేన్ షేక్‌ను కూడా అండర్ వరల్డ్‌లో అందరూ 'ఉస్తరా' (రేజర్ బ్లేడ్) అని పిలిచేవారు.

ఆయనకు దావూద్ ఇబ్రహీం కుడి భుజమైన చోటా షకీల్ అంటే విపరీతమైన ద్వేషం.

తుపాకీ వాడటంలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ, రేజర్ బ్లేడ్లను వాడటంలో ఆయనకున్న వేగం కారణంగా 'ఉస్తరా' అనే పేరు వచ్చింది.

అయితే, అండర్ వరల్డ్ సమాచారాన్ని పోలీసులకు చేరవేసే ఇన్ఫార్మర్ కావడంతో, పోలీసులు ఆయన జోలికి వెళ్లేవారు కాదు.

ఆయన గురించి హుస్సేన్ జైదీ ఇలా రాశారు: ''ఉస్తరా తన చొక్కా చేతిలో దాచుకున్న బ్లేడ్‌ను నాకు చూపించారు. తాను కేవలం మూడు సెకన్లలోపు పిస్టల్‌ను అసెంబుల్ చేయగలనని గొప్పలు చెప్పుకునేవారు. 1914 నాటి 'మౌజర్' ఆయనకు ఇష్టమైన ఆయుధం.''

''ఉస్తరాకు అత్యంత సన్నిహితంగా ఆరుగురు వ్యక్తులు ఉండేవారు. వారిలో ప్రతి ఒక్కరికీ శారీరకంగా ఏదో ఒక తేడా ఉండేది. ఒకరికి అదనపు వేలు ఉంటే, మరొకరికి కళ్ల రంగులు వేరువేరుగా ఉండేవి. ఇంకొకరికి ఒక చెవి పెద్దదిగా ఉండేది. శారీరక లోపాలు ఉన్నవారు తమలాంటి నేరపూరిత పనులు చేయడంలో ఆరితేరినవారని ఉస్తరా నమ్మేవారు."

మహిళల పట్ల ఆకర్షణే ఉస్తరా బలహీనత. పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ, ఆయనకు చాలామంది మహిళలతో సంబంధాలు ఉండేవి.

దావూద్ ఇబ్రహీంకు ఈ విషయం తెలుసు, అందుకే ఉస్తరా జీవితంలోకి ఒక మహిళను పంపారు.

"ఒకసారి ఆ మహిళ ఉస్తరాను బాడీగార్డులు లేకుండా ఒంటరిగా కలవమని కోరింది. ఆమెను నమ్మిన ఉస్తరా అందుకు ఒప్పుకున్నారు. 1998లో ఒకరోజు ఉదయం ఉస్తరా ఆ మహిళను కలిసి బయటకు రాగానే, చోటా షకీల్ పంపిన ఆరుగురు వ్యక్తులు ఆయన్ను చుట్టుముట్టారు.

మూడు సెకన్లలో పిస్టల్ సిద్ధం చేయగల ఉస్తరాపై ,ోటా షకీల్ మనుషులు అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం అతనికి మొత్తం 27 బుల్లెట్లు తగిలాయి" అని జైదీ తన పుస్తకంలో రాశారు.

"నేను చాలామందికి సమాధులు తవ్వాను, ఏదో ఒకరోజు ఎవరో ఒకరు నా కోసం కూడా గొయ్యి తవ్వుతారు" అని ఉస్తరా తరచుగా అనేవారు.

చివరికి ఆయన అన్న మాటలే నిజమయ్యాయని జైదీ ప్రస్తావించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)