'ఐ లవ్ ముహమ్మద్' చుట్టూ అసలు వివాదమేంటి, దేశంలోని అనేక నగరాల్లో ఎఫ్‌ఐఆర్‌లు, నిరసనలు, అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, SUMAIYYA RANA
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బారావఫాత్ (ఈద్ మిలాద్-ఉన్-నబి) సందర్భంగా 'ఐ లవ్ ముహమ్మద్' బ్యానర్ ఏర్పాటుపై వివాదం చెలరేగింది.
దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీంతో యూపీతోపాటు దేశంలోని అనేక నగరాల్లో ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేశారు.
ఈ ప్రదర్శనలపైనా కొన్నిచోట్ల కేసులు నమోదు చేసి, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో 'ఐ లవ్ ముహమ్మద్' అనే బ్యానర్‌తో నిర్వహిస్తున్న ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
కాశీపూర్ ఘటనలో 8 మందిని అరెస్ట్ చేశారు.
యూపీలోని ఉన్నావ్‌లోనూ ఇలాంటి ఊరేగింపు నిర్వహించినందుకు పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
తమ మత స్వేచ్ఛను వ్యక్తం చేసినందుకు పోలీసులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు.
అయితే, "ఐ లవ్ ముహమ్మద్" బ్యానర్ ఏర్పాటు చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కాన్పూర్ పోలీసులు చెబుతున్నారు.
ప్రదర్శనకారులు నిర్దేశిత స్థలంలో కాకుండా వేరేచోట టెంట్ ఏర్పాటు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
"మత విశ్వాసాల ఆధారంగా ఎవరినీ టార్గెట్ చేసుకోలేదు" అని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి అన్నారు.


ఫొటో సోర్స్, ABHISHEK SHARM
అసలు కాన్పూర్‌లో ఏం జరిగింది?
"ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించే సంప్రదాయ బారావఫాత్ ఊరేగింపును రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిర్వహించాల్సి ఉంది. దీని కోసం స్థానిక ముస్లింలు నిర్దేశించిన స్థలంలో కాకుండా వేరేచోట టెంట్ ఏర్పాటు చేశారు. అక్కడ "ఐ లవ్ ముహమ్మద్" అనే బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. తర్వాత రెండు వర్గాల పరస్పర అంగీకారంతో ఎప్పుడూ పెట్టే స్థలంలోనే బ్యానర్ ఏర్పాటు చేశారు" అని కాన్పూర్ వెస్ట్ డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు.
"ఐ లవ్ ముహమ్మద్" అన్న బ్యానర్ ప్రదర్శించినందుకు కేసు నమోదు చేయలేదని, ఊరేగింపు సమయంలో మరో వర్గానికి చెందిన పోస్టర్లు చించి వేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం, "ఐ లవ్ ముహమ్మద్" అని రాసి ఉన్న బ్యానర్ ప్రదర్శించడం ద్వారా ముస్లిం సమాజం కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించింది. దీనిని మరో వర్గం వ్యతిరేకించింది. ఊరేగింపు సమయంలో మోహరించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఊరేగింపు సమయంలో, ఇతర వర్గాల మతపరమైన పోస్టర్లను చించివేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
కాన్పూర్‌లోని రావత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 299 కింద కేసు నమోదైంది.
ఇందులో రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రగిలించడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి అభియోగాలను నమోదు చేశారు. ఊరేగింపు నిర్వాహకులతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు.
అయితే, ఎవరినీ అరెస్టు చేయలేదని కాన్పూర్ పోలీసులు తెలిపారు.
"సెప్టెంబర్ 4న ఐ లవ్ ముహమ్మద్ బ్యానర్‌పై వివాదం చెలరేగింది. తర్వాతి రోజు బారా వఫాత్ సందర్భంగా ఊరేగింపు జరిగింది. సెప్టెంబర్ 10 సాయంత్రం పోలీసులు కేసు పెట్టారు" అని స్థానిక జర్నలిస్ట్ అభిషేక్ శర్మ చెప్పారు.
ఈ కేసు విషయంలో కాన్పూర్ పోలీసుల్ని ట్యాగ్ చేస్తూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెప్టెంబర్ 15న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "ఐ లవ్ ముహమ్మద్, కాన్పూర్ పోలీసులారా ఇది నేరం కాదు. ఒకవేళ నేరమైతే ఏ శిక్షకైనా నేను సిద్ధం" అని అందులో రాశారు.

ఫొటో సోర్స్, facebook.com/Asaduddinowaisi
లఖ్‌నవూలో నిరసనలు, అరెస్టులు
లఖ్‌నవూలో కొంతమంది మహిళలు 'ఐ లవ్ ముహమ్మద్' అని రాసిన బ్యానర్లు పట్టుకుని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గేట్ నంబర్ 4 ఎదుట ప్రదర్శన చేశారు.
ఈ ప్రదర్శనకు సమాజ్‌వాదీ నాయకుడు మునవ్వర్ రాణా కుమార్తె సుమేయా రాణా నాయకత్వం వహించారు.
"చాలా మంది యువకులు కూడా ఈ నిరసనలో పాల్గొనాలని అనుకున్నారు, కానీ పోలీసులు వారిని దారిలో అడ్డుకున్నారు" అని సుమేయా బీబీసీతో చెప్పారు.
"మహిళలందరూ కార్లలో అసెంబ్లీకి చేరుకుని మా నిరసన తెలిపాం. పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి తరలించారు" అని ఆమె అన్నారు.
నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చిన యువకులను పోలీసులు కొన్ని గంటల పాటు అదుపులో ఉంచుకున్నారని సుమేయా చెప్పారు. అయితే, లఖ్‌నవూ పోలీసులు వారిపై ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు.
"ముస్లింలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టరు. ముస్లింలు రాజ్యాంగ పరిధిలో వారి మతపరమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తే కేసులు పెడతారు. ముస్లింల మనోభావాలను అణచివేసే ప్రయత్నాలను సహించేది లేదు" అని సుమేయా బీబీసీతో అన్నారు.
"అసెంబ్లీ దగ్గర జరిగిన నిరసనకు సంబంధించి కేసు పెట్టలేదు. నిరసనల కోసం ఎకోగార్డెన్ వద్ద ప్రత్యేక ప్రదేశం ఉంది. నిరసన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని, అప్పుడే వదిలేశాం" అని లఖ్‌నవూ డీసీపీ ఆశిష్ శ్రీ వాస్తవ చెప్పారు.
ఉన్నావ్‌లో అరెస్టులు
కాన్పూర్‌లో ముస్లింలపై కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ యూపీలోని ఉన్నావ్ పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
నిరసనకారులను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది.
ఉన్నావ్‌లోని గంగాఘాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 'ఐ లవ్ ముహమ్మద్' అని రాసి ఉన్న బ్యానర్లు పట్టుకున్న పిల్లలు, మహిళలు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
"నగరంలో సెక్షన్ 163 అమల్లో ఉంది. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ఆందోళనలు, ప్రదర్శనలు చేపట్టకూడదు. గంగాఘాట్ దగ్గర అనుమతి లేకుండా ప్రదర్శన చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది" అని ఉన్నావ్ నార్త్ ఏసీపీ అఖిలేష్ సింగ్ చెప్పారు.
ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణంగా ఉందని, పోలీసులు పహారా కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ఈ ఘటనలపై స్పందించిన యూపీ మంత్రి ధరంపాల్ సింగ్ "చట్టాన్ని ఉల్లంఘించే వారిని సహించేది లేదు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో దర్యాప్తు జరుగుతుంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Abu Bakar
కాశీపూర్‌లోనూ ఎఫ్‌ఐఆర్
ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ పట్టణంలోనూ స్థానిక ముస్లింలు ఐ లవ్ ముహమ్మద్ అని రాసి ఉన్న బ్యానర్లను పట్టుకుని ఊరేగింపు నిర్వహించారు.
పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఇందులో ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అదనపు బలగాలను మోహరించారు. సంఘటన జరిగిన రోజు సాయంత్రం చాలా మందిని అరెస్టు చేశారని స్థానిక జర్నలిస్ట్ అబూ బకర్ చెప్పారు.
"స్థానిక ముస్లింల ఊరేగింపు గురించి తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతమంది యువకులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు" అని అబూబకర్ చెప్పారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
"ఎలాంటి అనుమతి లేకుండా 400 మంది పెద్ద ఊరేగింపు చేపట్టారు. వాళ్లను అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. దాడికి పాల్పడిన నదీమ్ అక్తర్‌తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశాం. 10 మందిని అదుపులోకి తీసుకున్నాం" అని ఉదమ్‌సింగ్ నగర్ ఎస్పీ మణికాంత్ మిశ్రా చెప్పారు.
దీని వెనుక ఇంకా ఎవరున్నారనే దానిపై నదీమ్‌ను ప్రశ్నిస్తున్నామన్నారు.
కాశీపూర్ జిల్లా అధికారులతో పాటు మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ సిబ్బందిని అన్ని ప్రాంతాల్లో మోహరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
నిరసనల్లో పాల్గొన్న స్థానిక నాయకులు, వ్యక్తులను బీబీసీ సంప్రదించింది. అయితే, వారు మాట్లాడేందుకు నిరాకరించారు.

ఫొటో సోర్స్, Dakshin Shah
గోద్రా, ముంబయిలోనూ నిరసనలు, అరెస్టులు
ఐ లవ్ ముహమ్మద్ వివాదం తర్వాత గుజరాత్‌లోని గోద్రా, ముంబయిలో నిరసనలు జరిగాయి. వీటిపై కేసులు నమోదు చేయడంతో పాటు కొందరిని అరెస్టు చేశారు.
గోద్రాలో, పోలీస్ స్టేషన్ ఎదుట విధ్వంసానికి పాల్పడిన 87 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్థానిక యువకుడు జకీర్ బాబా 'ఐ లవ్ ముహమ్మద్' వివాదం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని, తర్వాత వదిలేశారని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ దక్షేష్ షా చెప్పారు
పోలీసులు విడిచిపెట్టిన అనంతరం, తనను పోలీసులు వేధించారని జకీర్ బాబా మరో పోస్ట్ పెట్టారు. పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ స్థానికులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
"అల్లరి మూకలు నాల్గో నంబర్ అవుట్‌పోస్ట్‌ను ధ్వంసం చేశాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశాం" అని పంచమహల్ జిల్లా ఎస్పీ డాక్టర్ హరేష్ దుధత్ చెప్పారు.
"జకీర్ బాబా నిరంతరం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. నవరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని అభ్యంతకరమైన పోస్టులు పెట్టవద్దని చెప్పేందుకు పోలీసులు అతనిని పిలిచారు. అయితే, పోలీసులు అతన్ని కొట్టారని తప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది" అని ఎస్పీ అన్నారు.
ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.
"సెప్టెంబర్ 21న ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలో కొంతమంది ర్యాలీ చేపట్టారు. అయితే ,అనుమతి లేకుండా ప్రదర్శన చేస్తున్న వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు" అని స్థానిక విలేఖరి అల్పేష్ కర్కరే చెప్పారు.
ఐ లవ్ ముహమ్మద్ ప్రచారానికి సంబంధించి కేసు పెట్టారని ముస్లిం సంస్థలు ఆరోపిస్తూ ఎంఐఎం కార్యకర్తలతోపాటు కొన్ని ముస్లిం సంస్థల ప్రతినిధులు బైకుల్లా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విడిచిపెట్టారు.

ఫొటో సోర్స్, FAIZUL HASAN
మెమోరాండం సమర్పించినందుకు బహ్రయిచ్‌లో కేసు
యూపీలోని బహ్రయిచ్ జిల్లాలోని కైసర్‌గంజ్ తహసీల్‌లో సబ్ కలెక్టర్‌కు మోమోరాండం సమర్పించిన యువకులపైనా కేసు నమోదైంది.
"ఐ లవ్ ముహమ్మద్ బ్యానర్ ఏర్పాటుపై కేసు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా ప్రదర్శన చేశాం. ఎలాంటి నినాదాలు చేయలేదు. చట్టాన్ని ఉల్లంఘించలేదు. మాపై కేసు పెట్టారని తెలిసింది" అని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు ఫైజుల్ హసన్ బీబీసీకి చెప్పారు.
తమపై పెట్టిన కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
"ముస్లింలు ముహమ్మద్ ప్రవక్తను ప్రేమిస్తారు. ప్రవక్త మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేసినందుకు మమ్మల్ని టార్గెట్ చేశారు" అని ఫైజుల్ అన్నారు.

ఫొటో సోర్స్, Faizul Hasan
ముస్లింలను వేధిస్తున్నారని ఆరోపణలు
చిన్న సంఘటనలను పెద్దవిగా చేసి చూపిస్తూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
"చాలాచోట్ల ముస్లింలపై పోలీసు చర్యల గురించి మాకు సమాచారం అందింది. ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని అరెస్టు చేశారనే విషయంలో ఇంకా కచ్చితంగా తెలీదు" అని 'యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్' అనే సంస్థతో కలిసి పని చేస్తున్న నదీమ్ ఖాన్ బీబీసీతో చెప్పారు.
"కాన్పూర్ సంఘటన ముస్లింలలో ఆగ్రహాన్ని పెంచింది. ఇది మొదటిసారి కాదు. రంజాన్ మాసంలో ఇంట్లో నమాజ్ చేసినందుకు మొరాదాబాద్‌లో కేసు నమోదైంది. తర్వాత ఇంటి పైకప్పు మీద నమాజ్ చేయకుండా నిరోధించారు. ఇప్పుడు, ప్రవక్త పోస్టర్ ప్రదర్శిస్తే కేసు పెట్టారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారి మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోంది" అని నదీమ్‌ఖాన్ అన్నారు.
"కాన్పూర్‌లో ఐ లవ్ ముహమ్మద్ బ్యానర్ ధ్వంసం చేశారు. దీనిపై ముస్లింలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసు పెట్టలేదు. మా ప్రతినిధులు కాన్పూర్ పోలీస్ కమిషనర్‌ను కలుస్తారు. బ్యానర్ ధ్వంసం చేసినందుకు కేసు పెట్టకపోతే రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ప్రకారం కోర్టును ఆశ్రయిస్తాం" అని ఆయన చెప్పారు.
నదీమ్ ఖాన్ ఆరోపణలపై కాన్పూర్ పోలీసులు స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
30 కోట్లమంది ముస్లింలపై కేసులు పెడతారా: ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ
ముహమ్మద్ ప్రవక్తపై ప్రేమను వ్యక్తం చేసినందుకు కేసులు పెట్టేట్లయితే దేశంలోని 30 కోట్ల మంది ముస్లింలపై కేసులు పెట్టాలని, ముస్లింలంతా ప్రవక్తను ప్రేమిస్తారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ అన్నారు.
ఆంక్షలు అమల్లో ఉన్న చోట పోలీసుల అనుమతి లేకుండా ఊరేగింపు చేయవద్దని, అలా చేస్తే చట్టపరంగా ఇబ్బందుల్లో పడతారని ఆయన సూచించారు.
"మీరు నిరసన లేదా ధర్నా చేపట్టాలంటే అనుమతి తీసుకోండి. ఆందోళనలు చేపట్టేందుకు నిర్దేశిత ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ కూర్చొని నిరసన చేపట్టవచ్చు. సోషల్ మీడియాలో కూడా నిరసనను తెలియజేసేందుకు మార్గాలున్నాయి" అని ఇమ్రాన్ అన్నారు.
బ్యానర్ వివాదంలో నమోదైన కేసులు చూస్తుంటే ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని, అందువల్ల వాళ్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదన్న బీజేపీ
ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుందన్న ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.
"ప్రభుత్వం, పోలీసులు మతం ఆధారంగా కేసులు పెట్టరు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపైనే కేసులు పెడతారు" అని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి చెప్పారు.
కాన్పూర్ సంఘటనను సమస్యగా మార్చి రాష్ట్రంలో శాంతిభద్రతలను చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
"మతపరమైన నినాదాలపై ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే అది చట్టపరమైన హద్దుల్ని దాటితే కచ్చితంగా చర్యలు ఉంటాయి. నిరసన తెలిపేందుకు నిర్దేశిత స్థలాలు ఉన్నాయి. ఆంక్షలను ఉల్లంఘిస్తే కేసులు పెడతారు. కావాలని ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు" అని రాకేష్ త్రిపాఠి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ముస్లింల ప్రతిచర్యకు కారణమేంటి?
కాన్పూర్ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ఐ లవ్ ముహమ్మద్ వివాదంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లింలు సోషల్ మీడియాలో "ఐ లవ్ ముహమ్మద్" చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు.
అనేక మంది ఆ పోస్టర్‌ను తమ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నారు.
"కేంద్ర స్థాయిలో ఒక పద్దతి ప్రకారం ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని చెప్పలేం. అయితే చిన్న సంఘటనలు, ఆ సంఘటనలపై వస్తున్న ప్రతిస్పందనను బట్టి చూస్తే, తాము ఒంటరి అవుతున్నామనే భావన మైనారిటీల్లో ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది" అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ వివేక్ కుమార్ చెప్పారు.
"ఒక సమూహం బలహీనంగా లేదా ఒంటరిగా ఉందని భావించేలా చేస్తున్నారు" అని ఆయన అన్నారు.
అయితే, ఒక సమూహం ఎఫ్‌ఐఆర్‌ను ఎందుకంత తీవ్రంగా పరిగణిస్తోందనేది అర్థం చేసుకోవడం ముఖ్యమని వివేక్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్ నమోదుతో, తమ రాజ్యాంగ హక్కులపై దాడి జరిగిందని ఆ సమూహానికి ఎందుకు అనిపిస్తోంది? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














