తల్లి అయిన తర్వాత మహిళకు శృంగార కోరిక తగ్గిపోతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఫొటో సోర్స్, Holly Hagan-Blyth
- రచయిత, ఎమిలీ హోల్ట్
- హోదా, బీబీసీ న్యూస్
మనుషుల మధ్య బంధాల్లో సెక్స్ ఒక భాగం. అయితే గర్భందాల్చడం, పిల్లలు పుట్టిన తర్వాత కోరికలు తగ్గిపోవడం సాధారణమని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
కొడుకు పుట్టిన తర్వాత తనకు ఇలాగే అనిపించిందని రియాలిటీ టీవీ స్టార్, ఫిట్‌నెస్ కోచ్ హాలో హాగన్ బ్లిత్ చెప్పారు.
"నువ్వు ఇకపై నన్ను ఎప్పుడూ తాకకపోయినా నేనేమీ పట్టించుకోను. ఎందుకంటే నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తోందని చెప్పాలనుకున్నాను" అని ఆమె సీబీబీస్ పేరెంటింగ్ హెల్ప్‌లైన్ కార్యక్రమానికి సహ వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు చెప్పారు.
పిల్లలు పుట్టిన ఆరు వారాల తర్వాత కొందరు మహిళలు మళ్లీ సెక్స్‌లో పాల్గొనాలని కోరుకుంటారని ‘సెక్స్ అండ్ రిలేషన్‌షిప్ థెరపిస్ట్’ రేచల్ గోల్డ్ చెప్పారు.
2023లో తనకు కొడుకు పుట్టిన తర్వాత తనకు సెక్స్ కోరికలు తగ్గాయని, తన భర్తను దగ్గరకు రానివ్వడం తగ్గించానని హోలీ చెప్పారు.
"నేను నా భర్తను తాకడం, కౌగిలించుకోవడం లేదా మరో రకంగా ప్రేమ చూపించినప్పుడు అది సెక్స్‌కు దారి తీస్తుందని భావించేదాన్ని. అప్పుడు నాకు అది అక్కర్లేదు" అని ఆమె చెప్పారు.
"ఆయన కోసం ఏం చేసినా అది ప్రతికూలంగా మారుతుందేమోనని అనిపించేది" ఈ విషయాన్ని తన భర్తతో బహిరంగంగా చర్చించడం తనకు సాయపడిందని హోలీ తెలిపారు.
"నేను నిన్ను కౌగిలించుకున్నప్పుడు, తాకినప్పుడు అది సెక్స్‌కు దారి తీస్తుందేమోనని అనిపిస్తోంది. సెక్స్ నాకు ఇష్టం లేదు. అలా చేయకుండా ఉండగలమా అని నేను నా భర్తతో చెప్పాను. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా అనిపించింది" అని ఆమె వివరించారు.


ఫొటో సోర్స్, iStock
అయితే ఆమె భర్త జాకబ్ మాత్రం ఆమె తనతో శృంగారపరంగా సన్నిహితంగా ఉండదని తెలిసి బాధపడ్డారు.
"దీంతో నీకు ఎలాంటి సంబంధం లేదని నువ్వు గ్రహించాలి. నాకిప్పుడు సెక్స్ చేయాలని అనిపించడం లేదు. బహుశా మరి కొన్ని నెలలు ఇలాగే అనిపించవచ్చు. ఇది నా సమస్య. నేనే అధిగమించాలి" అని ఆమె తన భర్త జాకబ్‌కు వివరించారు.
ఒకే సమస్య ఎదుర్కొంటున్న దంపతులు మరింత బహిరంగంగా వాటి గురించి చర్చించుకోగలరని హోలీ భావిస్తున్నారు.
"పిల్లలు పుట్టిన తర్వాత బంధాల్లో మార్పు వస్తుందని చెబుతుంటారు. అయితే మీరు ఆ బంధంలో ఉన్నంత సేపు అది ఎంతగా మారిందో నిజంగా మీకు తెలుస్తుందని నేను అనుకోవడం లేదు" అని అన్నారామె.
పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు సెక్స్ వద్దనుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని గైనకాలజిస్ట్ డాక్టర్ జెన్నిఫర్ లింకన్ చెప్పారు.
"పిల్లలు పుట్టిన తర్వాత కోలుకునే ప్రక్రియ మొదలవుతుంది. గర్భాశయం.. గర్భందాల్చడానికి ముందున్న దశకు చేరుకోవడానికి 6 వారాలు పడుతుంది. యోని, యోని చుట్టూ ఉండే చర్మానికి అయిన చీలికలు ఈ ఆరు వారాల కాలంలో నయం అవుతాయి" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Holly Hagan-Blyth
మగవాళ్లకూ అలాగే అనిపిస్తుందా?
ప్రసవం తర్వాత మహిళల్లో కోరికలను ప్రభావితం చేసే హార్మోనల్ మార్పులు కూడా జరుగుతాయి.
"ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు బాగా పడిపోతాయి. ఈస్ట్రోజెన్ తక్కువగా విడుదల కావడం వల్ల యోని పొడిబారడం వంటి శారీరక మార్పులు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు సెక్స్‌లో పాల్గొంటే స్త్రీలకు నొప్పిగా అనిపిస్తుంది"
"సాధారణంగా మెనోపాజ్ అనేది స్త్రీల హార్మోన్ల స్థాయిలలో తీవ్రమైన మార్పని అనుకుంటారు. కానీ ప్రసవానికి ముందు కొన్ని రోజులు హార్మోన్లలో తీవ్రమైన మార్పులు ఉంటాయి" అని డాక్టర్ జెన్నిఫర్ లింకన్ వివరించారు.
ఇది కేవలం మహిళలనే ప్రభావితం చేసే సమస్య కాదు. 3 నెలల క్రితం తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన పురుష భాగస్వామి సెక్స్‌కు దూరమయ్యారని సీబీబీస్ పేరెంటింగ్ హెల్ప్‌లైన్ కార్యక్రమాన్ని వినే ఫ్రాంకీ చెప్పారు.
"ఇప్పుడు నాకు నా శరీరం అంటే అసహ్యం. నా భాగస్వామి నుంచి కాస్త ఎక్కువ శ్రద్ధ కోరుకుంటున్నాను. అయితే అతను ఇప్పుడు నాతో సెక్స్ కూడా కోరుకోవడం లేదు. ఏదో కోల్పోయినట్లు అనిపిస్తోంది" అని ఫ్రాంకీ అన్నారు.
పురుషులు కొన్నిసార్లు తమ భావాలను బహిరంగంగా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని రేచెల్ చెప్పారు.
"తండ్రి అయిన తర్వాత మగాళ్లలో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు పుట్టిన తర్వాత పురుషులు సెక్స్‌కు దూరంగా ఉండటంలో అదొక కారణం కావచ్చు" అన్నారు రేచెల్.
ఇలాంటి భావోద్వేగాలను ఎదుర్కోవడం పురుషులకు ప్రాధాన్య అంశంగా కనిపించడం లేదని చైల్డ్ బర్త్ చారిటీ ‘ఎన్‌సీటీ’లో ప్రాక్టీషనర్ ఫ్లూర్ పార్కర్ చెప్పారు.
"మీ భాగస్వామి గురించి మీరు ఏమనుకుంటున్నారనే దాని గురించి వాళ్లతో నిజాయితీగా మాట్లాడటం మీకు సాయపడుంది. మీ మనసులో ఏముందో వాళ్లకు తెలుసని అనుకోకండి" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రసవం తర్వాత సెక్స్‌లో పాల్గొనాలనుకునే జంటలకు నిపుణుల సూచనలు
సెక్స్ ప్రారంభ దశలో నొప్పిగా అనిపిస్తే చెప్పండి. నొప్పిగా ఉన్నప్పటికీ అంతా బావుందని నటిస్తే, తర్వాతి రోజుల్లో సెక్స్‌లో పాల్గొనాలన్న ఆసక్తి పోవచ్చు.
కలయిక సున్నితంగా ఉండేలా చూడండి. పిల్లలు పుట్టిన తర్వాత హార్మోనల్ మార్పులు జరుగుతాయి. అందుకే కలయిక సౌకర్యవంతంగా ఉండేందుకు లూబ్రికెంట్లు ఉపయోగించాల్సి రావచ్చు.
విశ్రాంతి తీసుకునే సమయంలో జంటలు కలిసి ఉండాలి. అలాంటి సమయంలో ఇతర విషయాలను పక్కన పెట్టి ఒకరికొకరు సన్నిహితంగా మెలగాలి. చర్చించాలి.
అవసరమనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. పిల్లలు పుట్టిన తరవాత కూడా నొప్పిగా అనిపిస్తుంటే వైద్యులతో ఆ విషయం చెప్పడం చాలా ముఖ్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














