మగవారితో సెక్స్‌కు నో.. పిల్లలు కనడానికి నో.. ఏమిటీ 4బీ ఉద్యమం?
- అబార్షన్ హక్కులపై అమెరికాలో మహిళల ఆందోళన
- అమెరికాలో 4బీ ఉద్యమానికి మద్దతు
- పెళ్లి, పిల్లలు, డేటింగ్, సెక్స్‌కు నో
- 4బీ ఉద్యమ మూలాలు దక్షిణ కొరియాలో
- ‘మీటూ’ నుంచి 4బీ ఉద్యమం
- రచయిత, నిహారిక రామారావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
తమ హక్కులపై జరుగుతున్న దాడులను, పలు దేశాలలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షపై ఆడవాళ్ల ఆగ్రహం ఒక ఉద్యమరూపాన్ని తీసుకుంటోంది. ఈ ఉద్యమానికి దక్షిణకొరియాలో పుట్టిన 4బీ ఉద్యమం స్ఫూర్తిగా నిలుస్తోంది.
డోనల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజే 4బీ ఉద్యమం గురించి గూగూల్‌లో 2 లక్షలమంది సెర్చ్ చేశారు. అక్కడి మహిళలు కొందరు తాము కూడా 4బీ ఉద్యమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు.
అమెరికా మహిళలు ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులవడానికి కారణమేంటి, ఈ ఉద్యమ లక్ష్యాలు ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
అసలేమిటీ 4బీ ఉద్యమం?
ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న 4బీ ఉద్యమ మూలాలు దక్షిణ కొరియాలో ఉన్నాయి.
అక్కడి మీటూ ఉద్యమం నుంచి 4బీ మూవ్‌మెంట్ పుట్టుకొచ్చింది.
దక్షిణ కొరియాలో లింగ అసమానతలకు నిరసనగా ఆ దేశ ఫెమినిస్టులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
అసలింతకీ ఏమిటీ నాలుగు ‘బీ’ల అర్ధం?
బీ హాన్ (నో మేరేజ్)
బీ యెనె (నో డేటింగ్)
బీ సెక్సూ (నో సెక్స్)
బీ చుల్సన్ (నో చిల్డ్రన్)
అంటే... పెళ్లి, డేటింగ్, సెక్స్, పిల్లలు కనడం ఏదీ వద్దనేది ఈ ఉద్యమం ఉద్దేశం.
ఇంతకీ దక్షిణ కొరియా మహిళలు ఇంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకోడానికి గల కారణాలేంటి? వారిని ఈ దిశగా ప్రేరేపించిన అంశాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మహిళల భయాలేంటి?
అమెరికాలో 4బీ ఉద్యమం ఊపందుకోవడానికి ట్రంప్ ఎన్నికలలో గెలవడం ఓ కారణం. అబార్షన్ హక్కును ఫెడరల్ హోదా నుంచి తొలగిస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అంటే అబార్షన్ హక్కులను కొనసాగించడమా? లేదా రద్దు చేయడమా? అనేది ఆయా రాష్ట్రాలకు వదిలేస్తారు.
మెజారిటీ రిపబ్లికన్లు బాహాటంగానే అబార్షన్‌లను వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ గెలిచిన రాష్ట్రాల్లోనూ అబార్షన్ హక్కుపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
దీంతో ట్రంప్‌కు మద్దతుగా నిలిచి, ఆయనకు ఓటు వేసిన మగవారితో సెక్స్‌కు అంగీకరించబోమని కొందరు మహిళలు ప్రకటించారు.
తమ హక్కులను గుర్తించని మగవారితో శృంగార బంధానికి దూరంగా ఉంటామని చెబుతున్నారు. టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో ఈ ట్రెండ్ బాగా కనిపిస్తోంది.
నిక్ ఫ్యాన్టెస్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పెట్టిన ఒక సోషల్ పోస్టు దీనికి మరింత ఆజ్యం పోసింది.
' యువర్ బాడీ మై ఛాయిస్ ఫరెవర్ ' అంటే ‘‘ఎప్పటికైనా నీ శరీరం మీద అధికారం మాదే’’ అనే విధంగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ట్రంప్‌కు నిక్ గట్టి మద్దతుదారు. ట్రంప్ కోసం సోషల్ మాధ్యమాల్లో ప్రచారం కూడా చేశారు. నిక్ చేసిన ట్వీట్‌కు చాలా మంది అబ్బాయిలు మద్దతు పలికారు. ఆ పోస్ట్ 35,000 సార్లుకు పైగా రీట్వీట్ అయింది.
ట్రంప్ గెలుపు తరువాత 26 ఏళ్ల అలెక్సా ఈ ఉద్యమం గురించి అనేక వీడియోలు చేశారు. అమెరికాలోని మహిళలందరూ తమ హక్కుల కోసం ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వార్తా సంస్థ ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘‘ఈ ఉద్యమంలో జీవితాంతం పాల్గొంటారా అని ప్రశ్నించినప్పుడు, ‘‘లేదు. జీవితాంతం కాదు. మా హక్కులను ఉల్లంఘిస్తున్నందుకు మేం ఇలా నిరసన తెలపాలనుకుంటున్నాం. మాకు అబార్షన్ హక్కు లేదంటే మేం సెక్స్‌కు ఒప్పుకోం. ఈ దేశంలో ట్రంప్ గెలుపు తరవాత మేం సేఫ్‌గా ఉన్నామని ఫీలవడం లేదు’’.
‘‘అమెరికాలో మహిళల పునరుత్పత్తి హక్కులను రాజకీయం చేయడం కొత్త కాదు. అది కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ పరిణామం. అయితే మగవారితో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవడం కూడా ఒక సందేశమే. ఈ ఉద్యమం దానంతటదే పుట్టలేదు. హక్కుల ఉల్లంఘనకు ఇదొక ప్రతిస్పందన. ఇది ఆన్‌లైన్‌లో జరుగుతోంది కాబట్టి దీని ప్రభావాన్ని అంచనా వేయలేం. కానీ ఈ ఉద్యమకారులు వారి ఆగ్రహాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నారు' అని స్త్రీవాది సునీత అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
4బీ ఉద్యమం ఇలా పుట్టింది
2019లో బర్నింగ్ సన్ స్కాండల్ సౌత్ కొరియాను కుదిపేసింది. గ్యాంగ్నాంలోని ‘‘బర్నింగ్ సన్’’ అనే పబ్‌లో అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి, వారిపై అత్యాచారం చేసి చిత్రీకరించేవారని, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ హింసించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ సెక్స్ స్కాండల్‌లో అనేక మంది సౌత్ కొరియా సెలబ్రిటీల పాత్ర ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించింది.
అమ్మాయిలతో సెక్స్ చేస్తున్నపుడు, అమ్మాయిలకు తెలియకుండా వారిని ప్రైవేటుగా వీడియోలు తీయడాన్ని సౌత్ కొరియాలో ‘మొల్కా’ అంటారు.
ఇది సౌత్ కొరియా వ్యాప్తంగా చాలా తరచుగా జరిగే నేరం. చాలా మంది నేరగాళ్లు పబ్లిక్ బాత్రూమ్‌లలో హోటళ్లలో ఇలా అనేక చోట్ల సీక్రెట్ కెమెరాలను అమర్చి అమ్మాయిలకు తెలియకుండా వారిని చిత్రీకరించి ఆ వీడియోలను ఇంటర్‌నెట్‌లో పెట్టేవారు.
ఈ కుంభకోణం బయటపడినప్పుడు మొల్కా బాధిత మహిళలు మీటూ అంటూ కొన్ని వేల మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నేరాన్ని అరికట్టడానికి ఆ దేశ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది.
దక్షిణ కొరియాలో మహిళలకు వేతనాలు మగవాళ్ల కన్నా మూడోవంతు తక్కువ ఉంటాయి. వేతనాల్లో ఇంత వ్యత్యాసం ఉన్న ధనిక దేశం సౌత్ కొరియా.
ఈ అంతరాన్ని తొలగించే చర్యలు తీసుకుంటున్నా, ఆ దిశగా మార్పు చాలా మెల్లగా జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మార్పు సాధ్యమేనా?
ఎన్నికల ముందు దక్షిణ కొరియా ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సుక్ యీ ఓల్ ప్రభుత్వంలోని మహిళా కోటాను రద్దు చేయడంతోపాటు లింగ సమానత్వం కోసం ఏర్పరిచిన మంత్రిత్వ శాఖనూ ఎత్తివేస్తానని పలు సార్లు ప్రకటించారు. అంతేకాకుండా దేశంలో జననాల సంఖ్య తగ్గిపోడానికి ఫెమినిస్టులే కారణం అని ఆయన ఆరోపించారు.
అయితే తమని సంతానోత్పత్తికి యంత్రాలుగా ప్రభుత్వం పరిగణిస్తోందని 4బీ ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలు అంటున్నారు.
సౌత్ కొరియాలో ఫెమినిజం అన్నా, ఫెమినిస్టులన్నా వ్యతిరేక భావం ఉంటుంది. ఇక్కడ పితృస్వామ్య వ్యవస్థ పాతుకుపోయి ఉందని సౌత్ కొరియా బీబీసీ ప్రతినిధి రేచెల్ అన్నారు.
దేశవ్యాప్తంగా తమ పట్ల సామాజికంగా రాజకీయంగా పెరుగుతున్న ఈ ద్వేషాన్ని తమ హక్కులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ నిరసనగా మగవారితో లైంగిక సంబంధాలకు పూర్తిగా దూరంగా ఉండటమే 4బీ ఉద్యమ లక్ష్యం అని అందులో పాల్గొంటున్నమహిళలు అంటున్నారు.
4బీ ప్రధానంగా ఆన్‌లైన్ వేదికగా సాగిన ఉద్యమం. ఇంటర్‌నెట్‌లో తమ గుర్తింపును రహస్యంగా ఉంచుతూ సాగే ఉద్యమం ఇది. 2010 నుంచి 2016 వరకు దక్షిణ కొరియాలో బలంగా విస్తరించిన మీటూ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన చిన్న ఉద్యమాల్లో ఇది ఒకటి. దీనితో పాటు, ఆ దేశంలో ‘‘ఎస్కేప్ ది కోర్సెట్’’ అనే ఉద్యమం కూడా పాపులర్ అయింది. దక్షిణ కొరియా సమాజంలో మహిళలపై విధించిన కఠిన బ్యూటీ స్టాండర్డ్స్‌ను ప్రతిఘటిస్తూ ఈ ఉద్యమం మొదలైంది.
దక్షిణ కొరియాలో ఈ ఉద్యమం ప్రాముఖ్యం అంతంత మాత్రమేనని, దీని లక్ష్యం లింగ సమానత్వం సాధించడానికి తోడ్పడదని ఈ ఉద్యమ వ్యతిరేకులు అంటున్నారు. మగవారితో బంధాలను పూర్తిగా తిరస్కరించడంవల్ల మార్పు ఎలా వస్తుంది? వారితో ఉంటూనే వారిలో మార్పుని తేవడం వల్ల సమానతలు పెరుగుతాయనేది వారి వాదన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














